తెలంగాణ బంద్: ఆర్టీసీ ఉద్యోగుల ధర్నాలు... పోలీసుల అదుపులో పలువురు నాయకులు

తెలంగాణ బంద్

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులకు సంఘీభావంగా అఖిల పక్షం చేపట్టిన బంద్ కొనసాగుతోంది. ఉదయం నుంచీ ఆర్టీసీ డిపోల వద్ద కార్మిక సంఘాలతో పాటూ, అఖిలపక్షాలకు చెందిన వారు ఆందోళనలు, బైఠాయింపులు చేశారు.

ఆర్టీసీ అధికారులు తాత్కాలిక ఏర్పాట్లతో తిరుగుతోన్న బస్సులు కూడా ఈరోజు నిలిచిపోయాయి. దీంతో ఆర్టీసీపై సమ్మె , బంద్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఎక్కడో ఒకటి రెండూ బస్సులు మాత్రం రోడ్లపై కనిపించాయి.

తెలంగాణ బంద్

అటు ఆర్టీసీ తరపున నడుపుతోన్న ప్రైవేటు, అద్దె బస్సులు కూడా ఈరోజు పెద్దగా తిరగలేదు. దీంతో హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్ పలు డిపోలు ఖాళీగా కనిపించాయి. అన్ని బస్ డిపోలు, బస్ స్టాండ్ల దగ్గర పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు.

అయితే, శనివారం కావడంతో చాలా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు ఈరోజు సెలవు ఉంది. విద్యాసంస్థలకు కూడా ఈరోజు సెలవే.

తెల
ఫొటో క్యాప్షన్, తెలంగాణ బంద్

సెట్విన్ బస్సులు, ఆటోలు, ప్రైవేటు టాక్సీలు, క్యాబ్‌లు మాత్రం హైదరాబాద్‌లో తిరుగుతున్నాయి. నిజానికి తమ డిమాండ్ల సాధన కోసం ఓలా, ఉబర్ క్యాబ్ డ్రైవర్లు కూడా ఈరోజు నుంచి సమ్మె చేస్తామని ప్రకటించినప్పటికీ, చాలా క్యాబ్‌లునడుస్తున్నాయి. రోడ్లపై ట్రాఫిక్ యదావిధిగా ఉంది.

తెలంగాణ బంద్

పలువురు నాయకుల అరెస్టు

ఈ బంద్‌కు రాజకీయ పక్షాలతో పాటూ పలు కార్మిక, ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటించాయి. కొందరు సంఘీభావంగా తమ పద్ధతిలో నిరసనలు తెలిపారు.

జేబీఎస్ బస్టాండ్ దగ్గర ఆందోళన చేపట్టిన ప్రొఫెసర్ కోదండరాం, తెలుగుదేశం నేత రమణ, ఇతర నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు ఉదయం నుంచే పలు చోట్ల ఆర్టీసీ కార్మిక సంఘాల వారినీ, ఆందోళనల్లో చురుగ్గా పాల్గొంటారని అనుమానం ఉన్న వారిని పలు చోట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పెద్దగా ఆందోళన కార్యక్రమాలు కనపడకుండా చేశారు.

అయినప్పటికీ చాలా డిపోల ముందు కార్మిక సంఘాలు బైఠాయింపులు చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం దగ్గర ఆందోళన చేపట్టిన కొందరు విద్యార్థి సంఘాల వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తెలంగాణ బంద్

వామపక్షాల ర్యాలీలో ఉద్రిక్తత

ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, విమలక్కలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

ఈ సమయంలో నిరసన వ్యక్తం చేస్తున్న సీపీఐఎంఎల్ నేత పోటు రంగారావు చేతి బొటనవేలు తెగి పోయింది. పోలీసులు వ్యాన్‌లో ఎక్కించే క్రమంలో రెండు తలుపుల మధ్య తన వేలు పెట్టి నొక్కి కట్ చేశారని ఆయన ఆరోపించారు. ‘‘నన్ను కేసీఆర్ చంపమన్నాడా? తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు, ఇప్పుడు కార్మికుల పక్షాన నిలబడి పోరాడినందుకు ఇది నాకు బహుమానమా?" అని ఆయన పోలీసులను ప్రశ్నించారు.

తెలంగాణ బంద్

ఎటూ తేలని సమ్మె

సమ్మెపై నిన్న విచారించిన హైకోర్టు ఈరోజు ఉదయం 10.30 గంటలకు చర్చలు ప్రారంభించాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశించింది. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తారని అంతా భావించారు కానీ సమీక్ష జరగలేదు.

దీంతో ఈరోజు ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం హైకోర్టు ఆదేశాలపై ఏం చేయాలనే విషయంపై చర్చించి, సమీక్షించి ఒక నిర్ణయానికి రావచ్చని భావిస్తున్నారు. అప్పటి వరకూ ఆర్టీసీ సమ్మె విషయంలో ఎటువంటి పురోగతీ లేనట్టే.

విద్యాసంస్థలకు 19వ తేదీ వరకూ సెలవు ప్రకటించారు. ఆ సెలవును పొడిగిస్తారా లేక సోమవారం నుంచి బడులు తెరుస్తారా అనేది కూడా తేలాల్సి ఉంది.

ఇంకా చర్చలకు పిలవలేదు: కె రాజి రెడ్డి, జేఏసీ కో కన్వీనర్

తమను ఇప్పటి వరకు ఎవరూ చర్చలకు పిలవలేదని ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ కె రాజిరెడ్డి చెప్పారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ, ‘‘ప్రభుత్వం పరిష్కరించగలిగిన వాటిని కూడా పరిష్కరించడం లేదు. టిఆర్ఎస్ లో కూడా ముఖ్యమంత్రి, మంత్రి చేస్తోంది తప్పు అని చెప్పి మాకు మద్దతిచ్చే వారు ఉన్నారు. పాండవులు అప్పట్లో ఐదుగురికి ఐదూళ్లు ఇచ్చినా చాలని అడిగారు. దానికి కృష్ణుడు రాయబారం వహించాడు. ఇప్పుడు వీళ్లకు కృష్ణుడు దొరకడం లేదనుకుంటా’’ అని పేర్కొన్నారు.

‘‘పువ్వాడ అజయ్ కమ్యూనిస్టు కుటంబంలో పుట్టి పెరిగారు. అతని నియోజకవర్గంలో కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పటికైనా ఆయన రాజీనామా చేస్తే, కనీసం వచ్చే ఎన్నికల్లో గెలుస్తారు. మేం జేఏసీ తరపున సాయంత్రం సమావేశం అయి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం. ఆర్టీసీ ఉద్యోగాలకు వెళ్లవద్దని మేం నిరుద్యోగులను కోరుతున్నాం. మీకు ఉద్యోగాలు రావాలనే, ఆర్టీసీలోని 6 వేల ఖాళీలూ పర్మినెంటు ఉద్యోగాలతో భర్తీ చేయాలని మేం డిమాండు చేస్తున్నాం. ప్రభుత్వం ఇంకా రాష్ట్రంలో ఖాళీ ఉన్న 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. మీరు తొందరపడి ఆర్టీసీ తాత్కాలిక ఉద్యోగాల వైపు రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)