తెలంగాణ: సహోద్యోగులు వేధిస్తున్నారంటూ బీహెచ్ఈఎల్ ఉద్యోగిని ఆత్మహత్య

"ఈ రెడ్ డేకి నిదర్శనంగా ఎర్ర పెన్నుతో ఈ లేఖను రాశాను" అంటూ నేహా లేఖ రాసి చనిపోయారు.
ఆమె అక్టోబర్ 17న హైదరాబాద్‌లోని తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నారు.
మధ్యప్రదేశ్‌కు చెందిన 33 ఏళ్ల నేహ, హైదరాబాద్‌లోని బీహెచ్ఈఎల్ ఉద్యోగి. భోపాల్ నుంచి బదిలీ కావాలని కోరి మరీ హైదరాబాద్ వచ్చారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడే ఉండేవారు.
గత కొద్ది రోజులుగా తమ సహోద్యోగులు మానసికంగా వేధిస్తున్నారంటూ తాను రాసిన లేఖలో నేహ పేర్కొన్నారు.
"నేను భోపాల్‌లో పని చేసినప్పుడు ఉన్న టీం మెంబర్స్ ఇక్కడ హైదరాబాద్‌లో పని చేస్తున్న టీం మెంబర్స్‌కి చెప్పి నన్ను వేధిస్తున్నారు. నా ఫోన్లు టాప్ చేశారు. నా గురించి దుష్ప్రచారం చేస్తున్నారు. ఆఫీస్‌లో పని చేస్తున్న కొంత మంది నాపై అత్యాచారం చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు" అంటూ ఎనిమిది మంది సహోద్యోగుల పేర్లను లేఖలో ప్రస్తావించారు నేహ.
తాను ఎన్నోసార్లు హెచ్ఆర్‌కి ఫిర్యాదు చేయాలనుకున్నా కూడా తనను వేధించేవారు అక్కడ తమ పలుకుబడిని ఉపయోగించి మరింత ఇబ్బందులు సృష్టిస్తారేమోననే అనుమానంతో ఆ ధైర్యం చేయలేకపోయినట్లు తన లేఖలో నేహ రాశారు.

సహోద్యోగులు ఇలా ఇన్ని సమస్యలు తెస్తారని అనుకోలేదు అన్నారు నేహ భర్త సునీల్.
"భోపాల్‌లో పని చేసినప్పుడు అక్కడి సహోద్యోగులు వేధించేవారు. అందుకే బదిలీ చేయించుకుని ఇక్కడకు వచ్చాం. ఇక్కడ కూడా అదే తంతు. ఎందుకు ఈ వేధింపులు అన్నది ఇవాళ్టి వరకు అర్థం కాలేదు" అన్నారు సునీల్.
అయితే, తన ఫోన్ టాప్ చేశారంటూ సైబరాబాద్ సైబర్ సెల్‌కి అక్టోబర్ 14న ఫిర్యాదు చేసినట్టు ఆ లేఖలో నేహ వెల్లడించారు. సైబర్ సెల్ సిబ్బంది తన ఫోన్‌ను పరిశీలించి, టాపింగ్ కానీ, హ్యాకింగ్ కానీ జరిగినట్లు ఆధారాలు లేవని తెలిపారని సునీల్ తెలిపారు.
దీంతో, నేహ తన ఫోన్‌ను మార్చిందని, ఆ విషయాన్ని కూడా లేఖలో రాసిందని సునీల్ అన్నారు.
అయితే, నేహ ఫోన్‌కి ఉన్న కెమెరా పైన వైట్ ప్లాస్టర్ వేసి ఉన్నట్లు గుర్తించామని అంటున్నారు పోలీసులు.
"నేహ చేసిన ఆరోపణలపై విచారణ చేస్తున్నాం. నేహ ఫోన్‌ని మరోసారి పరిశీలనకు పంపుతాం. తాను లైంగిక వేధింపులకు గురైనట్లు లేఖలో రాశారు. అందువల్ల 306 కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నాం" అని మియాపూర్ ఇన్‌స్పెక్టర్ వెంకటేష్ సామల తెలిపారు.

బీహెచ్ఈఎల్ యూనియన్ జనరల్ సెక్రటరీ దామోదర్ రెడ్డి బీబీసీ తెలుగుతో మాట్లాడారు.
"సంస్థ యాజమాన్యంతో ఈ అంశంపై మాట్లాడాం. నేహా మా యూనియన్ పరిధిలోకి రాకపోయినా మా ఉద్యోగిగా తనకు న్యాయం చేయటం ముఖ్యం. అందుకే వెంటనే విమెన్ సెల్ తరపున ఉద్యోగులందరికీ ఒక అవగాహనా సదస్సు ఏర్పాటు చేయాలని చెప్పాం. తాను ఎవరికీ చెప్పుకోలేక పోయానని నేహ లేఖలో రాసింది. అందువల్ల అందరికీ, ముఖ్యంగా తన టీంలో వారికి కౌన్సెలింగ్ ఇచ్చే ఏర్పాట్లు చేయాలని యాజమాన్యాన్ని కోరాం" అని ఆయన తెలిపారు.
బీబీసీ న్యూస్ అడిగిన ప్రశ్నలకు బీహెచ్ఈఎల్ యాజమాన్యం తరపు నుంచి ఎవరూ స్పందించలేదు.
ఇవి కూడా చదవండి.
- పదిహేడేళ్ల ఆ అమ్మాయిది ఆత్మహత్యా.. కులహంకార హత్యా
- పాకిస్తాన్‌కు 4 నెలల డెడ్‌లైన్
- ఎరిత్రియా: ఇక్కడ సిమ్ కార్డులు బంగారంతో సమానం... ఏటీఎంల గురించి వారికి తెలియదు
- ఉప్పలపాడు పక్షుల పునరావాస కేంద్రానికి విదేశీ పక్షులు వేల సంఖ్యలో ఎందుకు వస్తున్నాయి...
- బీబీసీ 100 వుమన్: ఈ జాబితాలో భారతీయులు ఎంత మంది?
- తీవ్రవాద సంస్థలకు నిధులు అందకుండా పాకిస్తాన్ అడ్డుకోగలదా...
- అయోధ్య: ఈ సుదీర్ఘ కోర్టు కేసులో తీర్పు ఎలా వచ్చే అవకాశం ఉంది? పిటిషనర్లు ఏమంటున్నారు?
- చార్లెస్ డార్విన్‌కూ అంతుచిక్కని మిస్టరీ: జీవపరిణామ సిద్ధాంతానికే ముప్పుగా పరిణమించిన 'విసుగుపుట్టించే రహస్యం'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








