పోలవరం ప్రాజెక్టు: ప్రధాన డ్యాం పనులు మొదలయ్యేది ఎప్పుడు?

- రచయిత, బళ్ల సతీష్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టులో భాగంగా జరగాల్సిన అదనపు పనులు జరుగుతున్నాయి. కానీ, అసలైన పోలవరం డ్యాం (ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం) ప్రధాన కట్టడం నిర్మాణం ఇంకా మొదలు కాలేదు. ఆ మాటకొస్తే ఆ డ్యాం నిర్మించాలంటే తప్పనిసరిగా దాని కంటే ముందే నిర్మించాల్సిన రెండు కాఫర్ డ్యాంలూ ఇంకా పూర్తి కాలేదు.
ఒకవైపు పోలవరం ప్రాజెక్టులో భారీ ఎత్తున కాంక్రీటు వేసిన రికార్డు సృష్టిస్తే, అసలు డ్యాం పని మొదలు కాకపోవడమేంటి? అనే అనుమానం రావచ్చు. అదేంటో చూద్దాం.
ఎర్త్ కం రాక్ ఫిల్ (ఇసిఆర్ఎఫ్) డ్యాం
"గోదావరి నదిపై నీటి ప్రవాహానికి అడ్డంగా కట్ట నిర్మించి ఆ నీటిని కాలువల ద్వారా పొలాలకి మళ్లిస్తాం. నీటిని పెద్దగా నిల్వ చేసుకునే అవసరం లేకుండా నేరుగా కాలువల్లోకి మళ్లిస్తే దాన్ని బ్యారేజీ అంటారు. నదిలోనే భారీగా నీరు నిల్వ ఉండేలా పెద్ద కట్ట కట్టి జలాశయం (రిజర్వాయర్) కూడా ఏర్పాటు చేస్తే దాన్ని డ్యాం అంటారు. (ఉదా: కృష్ణా నదిపై నాగార్జున సాగర్ డ్యామ్, ప్రకాశం బ్యారేజీ, గోదావరిపై శ్రీరాంసాగర్ జలాశయం, ధవళేశ్వరం బ్యారేజీ).
ఈ డ్యాములను ఒక్కో నదీ, ఒక్కో ప్రాంతం ఆధారంగా మట్టి లేదా రాళ్లతో నిర్మిస్తారు. మట్టితో నిర్మిస్తే ఎర్త్ డ్యాం అనీ, రాళ్లతో నిర్మిస్తే రాక్ డ్యాం అనీ, రెండిటినీ కలిపి నిర్మిస్తే 'ఎర్త్ కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యాం' అని అంటారు. ఇప్పుడు పోలవరంలో ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామే నిర్మించాలి.
ప్రస్తుత పరిస్థితి
ఇప్పటి వరకూ ఈ ప్రధానమైన డ్యాం పని అసలేమీ మొదలు కాలేదు. కేవలం దీని అడుగున ఉండే డయాఫ్రం వాల్ పూర్తయింది. డయాఫ్రం వాల్ దీనికి పునాది లాంటిది అనుకోవచ్చు. అసలు ఆ డ్యాం పని మొదలు పెట్టాలంటే ముందుగా కాఫర్ డ్యాంలు పూర్తి చేయాలి.
మరి ఆ కాఫర్ డ్యాంలు ఎంత వరకొచ్చాయో చూద్దాం.

కాఫర్ డ్యాంలు:
నీటి మధ్యలో ఏదైనా నిర్మాణం చేయాలంటే, ఎగువన తాత్కాలికంగా నీటిని ఆపి నిర్మాణం పూర్తయిన తర్వాత నీటి ప్రవాహాన్ని వదిలేస్తారు.
నీటిలో వంతెనల కోసం పిల్లర్లు వేయాల్సి వచ్చినప్పుడు, పని జరుగుతున్నంత సేపూ వాటి చుట్టూ నీరు రాకుండా ఏదో ఒక అడ్డంకి పెడతారు. ఇలా ప్రధాన కట్టడం పనులకు ఆటంకం ఏర్పడకుండా ఉండేందుకు నీటిని ఆపే తాత్కాలిక నిర్మాణమే కాఫర్ డ్యాం. ఇది కూడా చూడ్డానికి డ్యాంలానే ఉంటుంది. ప్రధాన డ్యాం పూర్తయ్యాక దీన్ని కూల్చేస్తారు.
పోలవరానికి రెండు కాఫర్ డ్యాంలు అవసరం. ఒకటి, పై నుంచి అంటే భద్రాచలం వైపు నుంచి వచ్చే నీటిని ఆపడం కోసం. రెండోది కింది నుంచి వెనక్కు వచ్చే నీరు (బ్యాక్ వాటర్), అంటే రాజమండ్రి దగ్గరున్న ధవళేశ్వరం బ్యారేజి వెనుక ఉన్న నీరు ఈ డ్యాంని తాకకుండా ఆపడం కోసం. గోదావరి నది ప్రవాహాన్ని తాత్కాలికంగానైనా ఆపి ఉంచడం కోసం చేసే నిర్మాణం కాబట్టి అది కూడా బలంగానే ఉండాలి.
ప్రస్తుత పరిస్థితి
పోలవరం డ్యాంకి కావల్సిన రెండు కాఫర్ డ్యాముల పనులు జరుగుతున్నాయి. భద్రాచలం వైపు కాఫర్ డ్యాం పనులు నది ఉపరితలం ఎత్తు దాటుతుండగా, రాజమండ్రి వైపు పనులు ఈ మధ్యే మొదలయ్యాయి.

స్పిల్ వే:
రిజర్వాయర్‌లో అదనంగా ఉన్న నీటిని నదీ ప్రవాహంలోకి వదిలేయడానికి గేట్లు ఉండే నిర్మాణం అవసరం. అవసరమైనప్పుడు ఆ గేట్లను ఎత్తితే నీరు దిగువకు వెళ్లిపోతుంది. ఆ గేట్లు ఉండే నిర్మాణాన్నే స్పిల్ వే అంటారు. మనం వీడియోలలో చూసే నది నుంచి నీరు వదిలే దృశ్యాలన్నీ ఈ స్పిల్ వేలే. కొన్ని డ్యాంలకు స్పిల్ వే ప్రధాన డ్యాంతో కలిపి లేదా అనుకుని ఉంటుంది. కొన్నింటికి వేరుగా ఉంటుంది. పోలవరానికి స్పిల్ వే ప్రధాన డ్యాం నుంచి వేరుగా ఉంటుంది.
ప్రస్తుత పరిస్థితి
పోలవరం ప్రాజెక్టు వద్దకు వెళ్తున్న సందర్శకుల్లో చాలామంది చూసేది ఈ స్పిల్ వే నిర్మాణాన్నే. మీడియాలో విస్తృతంగా కనిపిస్తోన్న ఫోటోలు ఈ స్పిల్ వే నిర్మాణానికి సంబంధించినవే. దీని పనులు ఇంకా జరుగుతున్నాయి.
డిసెంబరు 24న గేట్ల నిర్మాణం ప్రారంభం కాగా, జనవరి 12 నాటికి ఒక్క గేట్ మాత్రమే బిగించారు. ఇప్పటి వరకూ మిగిలిన గేట్లను బిగించలేదు, కేవలం గేట్లు పెట్టడానికి అవసరమైన సివిల్ పనులు జరుగుతున్నాయి. ఇంకా 47 గేట్లు బిగించాల్సి ఉంది. ఇక స్పిల్ వే నీరు ప్రవహించే ప్రాంతంలో కాంక్రీటు పనులు కూడా జరుగుతున్నాయి.

కాలువలు, ఇతర పనులు
పోలవరం కాలువలు 2014కి ముందే పూర్తయ్యాయి. రిజర్వాయర్ నీటిని కాలువల్లోకి మళ్లించడానికి కావల్సిన నిర్మాణాలు (టన్నెల్స్, ఛానల్స్) తాజాగా పూర్తయ్యాయి.
డయాఫ్రం వాల్
నదిలో నీటి కింద ఇసుక ఉంటుంది. డ్యాం ద్వారా నీటిని ఆపిన తరువాత కూడా, డ్యాం కింద ఉండే ఇసుకలోంచి నీరు లీక్ అయ్యే అవకాశం ఉంది. దాన్ని ఆపడానికి నది అట్టడుగున ఉన్న నేల నుంచి పైన నీటి ఉపరితలం వరకూ ఒక గోడలాంటి నిర్మాణం చేస్తారు. దాన్నే డయాఫ్రం వాల్ అంటారు. ప్రతీ డ్యాంకీ అలాంటి నిర్మాణం అవసరం.
ప్రస్తుత పరిస్థితి
ప్రధాన డ్యాం, కాఫర్ డ్యాంల కింద ఉండే ఈ మూడు డయాఫ్రం వాల్ పనులు పూర్తయ్యాయి. జర్మన్ సాంకేతిక పరిజ్ఞానంతో పూర్తి చేశామని ప్రభుత్వం చెబుతున్నది వీటి గురించే.

జూన్ నుంచి కాలువల ద్వారా నీరు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ నుంచే పోలవరం కాలువల ద్వారా నీరు ఇస్తామనీ తరచూ చెబుతూ వచ్చింది. ప్రధాన డ్యాం పూర్తి కాకుండా అదెలా సాధ్యం? అన్న ప్రశ్న రావచ్చు. ప్రధాన డ్యాం కోసం నిర్మిస్తోన్న కాఫర్ డ్యాంలు కూడా నీటిని ఆపుతాయి కాబట్టి ఆ నీటిని కాలువల్లోకి మళ్లించి నీరివ్వాలనేది ప్రభుత్వ ప్రణాళిక.
పోలవరం ఎప్పుడు పూర్తవుతుంది?
ఈ ప్రశ్నకు ప్రభుత్వం ఒక రకంగా, నిపుణులు మరో రకంగా సమాధానం చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వర్షాకాలం వచ్చేలోపు ఎగువ కాఫర్ డ్యాం పనులు పూర్తి చేస్తామని ప్రభుత్వం అంటోంది. వానా కాలంలోపు ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు కాఫర్ డ్యాములనూ పూర్తి చేయగలమని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇంజినీర్లు. అది పూర్తయ్యాకే ప్రధాన డ్యాం నిర్మాణం మొదలు కావాల్సి ఉంది.
అనుకున్న సమయానికి అది పూర్తి కాకపోతే ఇప్పటికే జరిగిన పనులకు వరద నీటి వల్ల నష్టం జరిగే ప్రమాదం ఉంది. కానీ, అటువంటి పరిస్థితి రాదని పోలవరం ఇంజినీర్లు ధీమాతో ఉన్నారు.
ఈ కాఫర్ డ్యాములు పూర్తయ్యాక అంటే, వానా కాలం తరువాతే ప్రధాన డ్యాం పని మొదలు కావాలి. ఆ కట్టడం పూర్తి కావడానికి కనీసం ఏడాది సమయం పడుతుందని అంచనా. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం 2019 చివరి నాటికి మొత్తం పోలవరం పని పూర్తయిపోతుందని చెబుతోంది.

ఫొటో సోర్స్, NALLE SIVAKUMAR
గిన్నీస్ రికార్డుల సంగతేంటి?
పోలవరం స్పిల్ వే నదిపై కాకుండా కాస్త పక్కగా ఉంటుంది. నీటిని స్పిల్ వే లోంచి వదిలినప్పుడు తిరిగి గోదావరిలో కలవడం కోసం భారీ కాలువ ఉంది. రెండున్నర కిలోమీటర్ల పొడవు, ఒక కిలోమీటరు వెడల్పుండే ఈ కాలువ దాదాపు నదిలా కనిపిస్తుంది.
నీరు వదిలినప్పుడు అక్కడ మట్టికొట్టుకుపోకుండా కింద మొత్తం కాంక్రీటు వేస్తున్నారు. ఈ కాంక్రీటు వేయడంలోనే జనవరి రెండో వారంలో గిన్నీసు రికార్డు సాధించారు. ఆ కాలువ వెడల్పు, పొడవు దృష్ట్యా అక్కడ ఇంకా చాలా కాంక్రీటు వేసే అవకాశం ఉంది. ఆ క్రమంలోనే మరింత ఎక్కువ కాంక్రీటు పోసి తమ రికార్డును తామే అధిగమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, జనవరి 7వ తేదీన పోలవరం కాంట్రాక్టర్లకు సూచించారు.

శిలాఫలకాలు, స్థూపాలు
సాధారణంగా ఏదైనా ప్రభుత్వ పథకాల ప్రారంభాలకూ, నిర్మాణాల శంకుస్థాపనలూ, ప్రారంభోత్సవాలకూ భారీ స్థూపాలు లేదా పైలాన్లు నిర్మిస్తారు. కానీ, పోలవరం ప్రత్యేకత ఏంటంటే, ప్రాజెక్టు ప్రతీ దశలోనూ ఒక్కో పైలాన్ ఆవిష్కరించారు.
- స్పిల్ వే కింద గ్యాలరీ నిర్మించినప్పుడు ఒకటి
- స్పిల్ వే గేట్ల నిర్మాణం పనులు మొదలైనప్పుడు ఒకటి
- డయాఫ్రం వాల్ పూర్తయినప్పుడు ఒకటి
- గిన్నీస్ రికార్డు వచ్చినప్పుడు ఒకటి
ఇలా శంకుస్థాపన కాకుండా, అదనంగా చాలా స్థూపాలున్నాయి.
ఇవి కూడా చదవండి:
- కాళేశ్వరం: ఈ ప్రాజెక్టు తెలంగాణను మాగాణం చేస్తుందా?
- బీజేపీ మేనిఫెస్టో 2019: 'ఆరు కోట్ల మంది ప్రజల అభిప్రాయాలతో హామీ పత్రం'
- ‘వార్’సత్వం: వీళ్లకిది ఫస్ట్ టైం..
- Reality Check: నరేంద్ర మోదీ హామీలు నిలబెట్టుకున్నారా?
- ‘లేపాక్షి’తో ఎకరం 3 లక్షల నుంచి 30 లక్షలకు పెరిగింది కానీ
- ఆంధ్రప్రదేశ్: రాజధాని అమరావతి నగర నిర్మాణం ఎంతవరకు వచ్చింది...
- జనసేన, వైసీపీ, టీడీపీ మేనిఫెస్టోలు ఏ వర్గాలకు ఏ హామీలిచ్చాయి...
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: కట్టలు తెంచుకున్న కరెన్సీ.... ఏరులై పారుతున్న లిక్కర్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








