ఆంధ్రప్రదేశ్‌లో ఒకే రోజు 4 లక్షల గృహప్రవేశాలు

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నిర్మించిన ఇళ్లు

ఫొటో సోర్స్, APTIDCO

ఫొటో క్యాప్షన్, పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నిర్మించిన ఇళ్లు

ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో ఒకేసారి 4 లక్షల గృహప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

గతంలో రెండు విడతల్లో 3.7 లక్షల సామూహిక గృహప్రవేశాలు చేపట్టగా మూడోవిడతలో శనివారం(09.02.2019) ఒకేసారి సుమారు 4 లక్షల ఇళ్లను పేదలకు అప్పగిస్తున్నామని ఏపీ గృహనిర్మాణ మంత్రి కాలవ శ్రీనివాసులు తెలిపారు.

ఈ నాలుగు లక్షల ఇళ్లలో 3,02,247 గృహనిర్మాణ శాఖ పరిధిలోని ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మించగా 97,124 ఇళ్లను 'ప్రధాన మంత్రి ఆవాస్ యోజన' రాష్ట్ర నోడల్ ఏజెన్సీగా ఆంధ్రప్రదేశ్ టౌన్‌షిప్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీ టిడ్కో) నిర్మించింది.

పురపాలక శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఏపీ టిడ్కో ఈ ఇళ్లలో కొన్ని బహుళ అంతస్తుల్లో నిర్మించింది.

గృహనిర్మాణ శాఖ ప్రస్తుతం ప్రారంభిస్తున్న మూడు లక్షల ఇళ్ల నిర్మాణానికి రూ. 3,574 కోట్లు ఖర్చు చేసినట్లు కాలవ శ్రీనివాసులు వెల్లడించారు.

ప్రస్తుతం ప్రారంభానికి నోచుకుంటున్న ఇళ్లలో ఎన్టీఆర్‌ హౌసింగ్‌, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-ఎన్టీఆర్‌ పథకాల కింద నిర్మిస్తున్నవి ఇండిపెండెంట్ హౌస్‌లు కాగా.. ఎన్టీఆర్‌ నగర్‌‌ల పేరుతో ఏపీ టిడ్కో నిర్మిస్తున్న ఇళ్లన్నీ బహుళ అంతస్తులు.

గృహ నిర్మాణం పథకంలో నిర్మించుకున్న ఇల్లు

ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం ఏ జిల్లాలో ఎన్ని ఇళ్లు నిర్మించారంటే..

కొత్తగా నిర్మించిన ఇళ్లు

ఫొటో సోర్స్, kalava Srinivasulu

కేంద్రం నుంచి సహకారం లేదు.. 20,18,390 ఇళ్లు మంజూరు చేశాం: మంత్రి కాలవ

కేంద్రం సహాయం లేకపోయినా, కొత్త రాష్ట్రంగా ఆర్థిక ఇబ్బందులున్నా పేదలందరికీ సొంత గూడు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలు చేపట్టిందని ఏపీ గృహ నిర్మాణ మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు.

టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 2014 జూన్ నుంచి 2018 నవంబరు వరకు 20,18,390 ఇళ్లు మంజూరయ్యాయని మంత్రి చెప్పారు. అందులో ఇప్పటికే 13,51,998 గృహాలను లబ్ధిదారులకు కేటాయించగా 7,53,697 గృహాల నిర్మాణం పూర్తయిందని కాలవ శ్రీనివాసులు చెప్పారు.

ఇంకా 4,12,461 గృహాలు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని ఆయన తెలిపారు.

2014కి ముందు మంజూరై పూర్తికాకుండా మిగిలిపోయిన ఇళ్ల కోసం రూ. 25వేలు చొప్పున కేటాయించామని.. దీనివల్ల 1.12 లక్షల ఇళ్లు పూర్తయ్యాయని అన్నారు.

మండల కేంద్రాల్లో ప్రైవేట్ స్థలాలు కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించేందుకు గాను బడ్జెట్‌లో రూ. 500కోట్లు కేటాయించినట్లు చెప్పారు.

కేంద్రం నుంచి సహకారం లేదని.. రాష్ట్రానికి 15 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరగా 4.45 లక్షలు మంజూరు చేసి 2.14 లక్షల గృహాలకే అనుమతి నిధులను మంజూరు చేసిందని మంత్రి కాలవ శాసనసభలోనూ చెప్పారు.

రమాదేవి

రూ. 4 లక్షలతో ఇల్లు పూర్తయింది

-పి రమాదేవి, కాకినాడ

కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ పథకంలో ఇల్లు కట్టుకుంటున్నాం. రెండేళ్ల కిందట లోన్ వచ్చింది.

బ్యాంక్ లోన్, రాయితీ పోను మేం రూ. 4 లక్షలు ఖర్చు చేశాం. ఇన్నేళ్లకు సొంత ఇల్లు పక్కాగా నిర్మించుకుని గృహ ప్రవేశం చేస్తున్నాం.

ప్రసన్న లక్ష్మి

14 ఏళ్లుగా అద్దెంట్లో ఉన్నాం.. ఇన్నాళ్లకు సొంతింటి కల నెరవేరింది

- డి.ప్రసన్న లక్ష్మి, మండపేట

మాది మండపేట. పెళ్లయిన తరువాత 14ఏళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్నాం. ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ పథకానికి మూడేళ్ల కిందట దరఖాస్తు చేసుకున్నాం. అంతకుముందు చాలా సార్లు అప్లికేషను పెట్టినా ఫలితం దక్కలేదు. ఇన్నేళ్లకు కలనెరవేరింది. లక్ష రూపాయలు కట్టాం. ఇంటికి ఇంకా కొంత ఖర్చు అవుతుంది.

Presentational grey line
Presentational grey line

అత్యధికం కేంద్రం కేటాయించినవే: బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం సుమారు 9 లక్షలకు పైగా ఇళ్లు కేటాయించిందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు.

చంద్రబాబు ప్రభుత్వం కట్టిస్తున్న ఇళ్లలో గాలి, వెలుతురు సరిగా రావడం లేదని.. టెక్నాలజీ పేరుతో చంద్రబాబు ఈ ఇళ్ల పథకాల్లోనూ అవినీతికి పాల్పడుతున్నారని మాధవ్ ఆరోపించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)