ఒకప్పుడు అమెరికాతో భీకరంగా పోరాడిన వియత్నాం.. ఇప్పుడు ట్రంప్-కిమ్ చర్చలకు ఆతిథ్యం ఎందుకు ఇస్తోంది?

కిమ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తొలిసారి సింగపూర్‌లో కలుసుకున్నారు

1965 మార్చిలో, దక్షిణ వియత్నాంలోని దనాంగ్ నగరంలో అమెరికా బలగాలు మొదటిసారిగా అడుగు పెట్టాయి. ఆగ్నేయాసియాలో పెట్టుబడిదారీ వ్యవస్థకు, కమ్యూనిస్టులకు మధ్య సాగుతున్న యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకుంది.

మళ్లీ దాదాపు 54ఏళ్ల అనంతరం అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తన బలగంతో దనాంగ్ వెళ్లొచ్చు! అయితే ఈసారి యుద్ధానికి కాదు. ఉత్తర కొరియా, అమెరికా దేశాల మధ్య జరగనున్న రెండో సదస్సుకు దనాంగ్ నగరం ఆతిథ్యం ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మాజీ శత్రువు అమెరికాకు వియత్నాం ఆతిథ్యం ఎందుకు ఇస్తోంది?

ఫిబ్రవరి 27, 28 తేదీల్లో కిమ్ జోంగ్‌ ఉన్‌తో తన రెండో సమావేశం ఉంటుందని డోనల్డ్ ట్రంప్ ఇప్పటికే నిర్ధరించారు. ఈ సమావేశానికి దనాంగ్ లేదా హనోయ్ నగరాల్లో ఏదో ఒకటి ఆతిథ్యం ఇవ్వనుంది.

ఒకవైపు కమ్యూనిస్టు పాలన, మరోవైపు పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ కలిగిన వియత్నాం ప్రస్తుతం అమెరికా, ఉత్తర కొరియా దేశాలకు మిత్రదేశంగా వ్యవహరిస్తోంది.

వియత్నాం.. ట్రంప్-కిమ్ చర్చలకు ఓ 'తటస్థ వేదిక' అని ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్‌కు చెందిన నిపుణులు ప్రొ.కార్ల్ థాయెర్ అన్నారు.

''అత్యంత పటిష్టమైన భద్రతను కల్పించగలదన్న కారణంతోటే వియత్నాం వేదికగా ట్రంప్-కిమ్ సమావేశం జరగనుంది. ఈ చర్చలకు వియత్నాం ఒక తటస్థ వేదిక అని అన్ని పక్షాలు విశ్వసిస్తున్నాయి'' అని బీబీసీ వియత్నాంతో ప్రొ.కార్ల్ థాయెర్ అన్నారు.

2019 జనవరిలో చైనా అధ్యక్షుడు జింగ్‌పింగ్‌తో కిమ్

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, వియత్నాం, చైనా రెండూ తమకు మిత్ర దేశాలుగా కిమ్ భావిస్తున్నారు

కిమ్ జోంగ్ ఎలా అంగీకరించారు?

చైనా గగనతలం మీదుగా విమానంలో వియత్నాం చేరడం కిమ్‌కు సురక్షితం అని చెప్పొచ్చు. ఎందుకంటే, ఉత్తర కొరియాతో సాన్నిహిత్యం ఉన్న అతి తక్కువ దేశాల్లో చైనా, వియత్నాం కూడా ఉన్నాయి.

ఈ చర్చల సందర్భంగా వియత్నాంలో తన మొదటి పర్యటన వల్ల, ఉత్తర కొరియా ఏకాకి కాదు అని నిరూపించే అవకాశం కిమ్‌కు లభిస్తుందని ప్రొ.కార్ల్ అన్నారు.

ఇప్పటికే కిమ్ జోంగ్.. వియత్నాం అభివృద్ధి నమూనాను అధ్యయనం చేశారని, ఈ పర్యటన వల్ల వియత్నాంలో చోటుచేసుకున్న మార్పులను ప్రత్యక్షంగా గమనించవచ్చని ఆయన వివరించారు.

''అమెరికాకు వ్యతిరేకంగా వియత్నాం సాగించిన యుద్ధాల చరిత్ర, తర్వాత అమెరికాతో రాజకీయ సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావడం, వాణిజ్య సుంకాలు లేని ఒప్పందాలు చేసుకోవడం.. లాంటి పరిణామాలు ఉత్తర కొరియాకు అత్యంత ఆసక్తిని కలిగించే అంశాలు'' అని ప్రొ.కార్ల్ అభిప్రాయపడ్డారు.

సింగపూర్‌లోని ఐఎస్ఈఏఎస్-యూసఫ్ ఇషాక్ ఇన్స్టిట్యూట్‌కు చెందిన నిపుణులు లీ హాంగ్‌ హీప్ ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో మాట్లాడుతూ...

''వియత్నాం పరిణామాలను తన కళ్లారా చూడటానికి కిమ్ సుముఖంగా ఉన్నట్లున్నారు. వియత్నాం కథ కిమ్‌లో స్ఫూర్తి నింపి, ఉత్తర కొరియాను కూడా అభివృద్ధి పథంలో నడిపించాలన్న ఆలోచన కలిగించవచ్చు'' అన్నారు.

హనోయ్‌లోని ఒక రద్దీ ప్రాంతం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆసియాలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా వియత్నాం అవతరించింది

ట్రంప్ ఎందుకు ఒప్పుకున్నారు?

ఒకవేళ వియత్నాం ఆర్థికరంగ విజయాలను చూసి కిమ్ స్ఫూర్తి పొందితే, అది అమెరికాకు సానుకూల అంశమే. సామ్యవాద నేపథ్యం ఉన్న ఆర్థిక వ్యవస్థ స్థాపనే లక్ష్యంగా 1986లో వియత్నాంలో 'దోయ్ మోయ్' లాంటి ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు.

ఈ సంస్కరణలతో ఆసియాలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా వియత్నాం అవతరించింది.

గతేడాది వియత్నాం పర్యటనలో భాగంగా అమెరికా సెక్రెటరీ మైక్ పాంపేయో మాట్లాడుతూ, ‘‘కిమ్ తలచుకుంటే.. వియత్నాంలో జరిగిన మేజిక్‌ను ఉత్తర కొరియాలో కూడా చేయొచ్చు'' అన్నారు.

2017లో జరిగిన 'ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార శిఖరాగ్ర సమావేశం''లో భాగంగా డోనల్డ్ ట్రంప్ వియత్నాంలో పర్యటించారు.

''మానవాళి వినాశనానికి పురిగొల్పే ఆయుధాల నియంత్రణకు వియత్నాం చాలాకాలంగా మద్దతు తెలుపుతోంది. మరోవైపు ఉత్తర కొరియాపై ఐక్యరాజ్య సమితి ఆంక్షలకు వియత్నాం మద్దతు తెలిపింది. ఈ అంశాల్లో వియత్నాం వైఖరిని అమెరికా గుర్తించింది'' అని ప్రొ.కార్ల్ థాయెర్ అన్నారు.

దనాంగ్ నగరం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వియత్నాం ఒక తటస్థ వేదిక అని ట్రంప్, కిమ్ భావిస్తున్నారు

వియత్నాం.. తన సామర్థ్యాన్ని ప్రదర్శించి, ప్రపంచ దేశాల దృష్టిని, పెట్టుబడులను ఆకర్షించాలన్న ఉత్సాహంలో ఉంది. ఈ సందర్భంలోనే చరిత్రాత్మకమైన ట్రంప్-కిమ్ సమావేశం జరగనుంది.

ట్రంప్-కిమ్ చర్చలకు వియత్నాం పేరు తెరమీదకురాగానే, కిమ్ జోంగ్ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది.

''ఒకప్పుడు వియత్నాం అమెరికాకు వ్యతిరేకంగా కత్తి దూసింది. కానీ ఇప్పుడు ఆ రెండూ మిత్రదేశాలుగా మారాయి. సరికొత్త అధ్యాయాన్ని రచించడానికి అమెరికా-ఉత్తర కొరియా చర్చలకు వియత్నాం సరైన వేదిక..'' అని ఉత్తర కొరియా అధికారిక ప్రతినిధి కిమ్ యూ-క్యోమ్ అభిప్రాయపడ్డారంటూ యోనాప్ వార్తాసంస్థ పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)