ట్రంప్- కిమ్ భేటీ అయినా ఈ విషయాలు మాత్రం చర్చించరు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్-ఉన్ త్వరలో ముఖాముఖి భేటీ అవుతారు.. అంతా అనుకున్నట్లుగా జరిగితే.
అయితే.. ఆ ‘చారిత్రక శిఖరాగ్ర సమావేశం’లో చర్చకు రాబోని కీలక అంశాలు కొన్ని ఉన్నాయి. అవి ఇవీ...
సంపూర్ణ ప్రభుత్వ నియంత్రణ
ఉత్తర కొరియా మిగతా ప్రపంచం నుంచి వేరుగా ఏకాంతంగా ఉంటుంది. కిమ్ కుటుంబం వారే మూడు తరాలుగా ఆ దేశాన్ని పరిపాలిస్తున్నారు. దేశ ప్రజలంతా ఆ కుటుంబానికి విధేయులై ఉండి తీరాలి. ప్రస్తుత పాలకుడికి సంపూర్ణంగా విధేయంగా ఉండాలి.
అన్నిటినీ ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. సొంత పౌరులపై నిఘా పెడుతుంది. అందుకు విస్తారమైన నిఘా వ్యవస్థలను ఉపయోగించుకుంటుంది.
ఆర్థిక వ్యవస్థను కూడా సర్కారే నియంత్రిస్తుంది. దేశంలో ఆహారం కొరత తీవ్రంగా ఉంది. కనీస వసతులు కొరవడ్డాయి. ఇంధనానికీ కటకటే. కానీ ప్రభుత్వం డబ్బంతా తీసుకెళ్లి అణ్వస్త్రాలు, క్షిపణుల తయారీకి గుమ్మరిస్తుంది.
అయితే, ఉత్తర కొరియాది నిరంకుశ ప్రభుత్వం అయినందునే ఎంతో వ్యయప్రయాసలతో కూడిన అణ్వస్త్ర కార్యక్రమాన్ని అభివృద్ధి చేయగలిగిందంటారు బ్రాడ్ ఆడమ్స్. హ్యూమన్ రైట్స్ వాచ్ (హెచ్‌ఆర్‌డబ్ల్యూ) సంస్థకు ఆయన ఆసియా డైరెక్టర్‌గా ఉన్నారు.
‘‘ఆకలితో అలమటిస్తున్న ఉత్తర కొరియా ప్రజల కడుపులు కొట్టి మరీ ఈ పని చేస్తున్నారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, KCNA
మీడియా నియంత్రణ
ప్రపంచంలో అత్యంత కఠినంగా నియంత్రణలో ఉన్న మీడియా ఏదైనా ఉందంటే.. అది ఉత్తర కొరియా మీడియానే. అందులో సందేహం లేదు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీ (వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్)లో అట్టడుగు స్థానం ఆ దేశానిదే. రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ (ఆర్ఎస్ఎఫ్) ఈ సూచీని రూపొందిస్తుంటుంది.
ఉత్తర కొరియా ప్రజలకు వార్తలైనా వినోదమైనా సమాచారమైనా.. అంతా ప్రభుత్వ మీడియా నుంచే వస్తుంది. పాలక వ్యవస్థను నిరంతరం పొగుడుతూ ఉండటమే ఆ మీడియా పని.
ఒకవేళ పౌరులు ఎవరైనా.. అంతర్జాతీయ మీడియా సంస్థలు అందించే సమాచారాన్ని వీక్షించినా చదివినా విన్నా వారు జైలు పాలు కావాల్సిందేనని ఆర్ఎస్ఎఫ్ చెప్తుంది.
జనం దగ్గర మొబైల్ ఫోన్లు ఉంటాయి. కానీ విదేశాలకు ఫోన్ చేయాలనుకుంటే ప్రాణాలకు తెగించటమేనని అంటారు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పరిశోధకుడు అర్నాల్డ్ ఫాంగ్.
‘‘ముందు బ్లాక్ మార్కెట్‌లో ఒక చైనీస్ సెల్ ఫోన్ కొనుక్కోవాలి. దానితో చైనా సరిహద్దు దగ్గరకు వెళ్లాలి. అక్కడి నుంచి విదేశాలకు ఫోన్ చేసే అవకాశం ఉంటుంది. కానీ.. సరిహద్దు వెంట గస్తీ కాసే సైనికులు, ప్రభుత్వ ఏజెంట్లు పట్టేసుకుంటారు’’ అని ఆయన బీబీసీకి వివరించారు.
ఇంటర్నెట్ అంటే.. రాజధాని ప్యాంగ్యాంగ్‌లో ఉండే ఉన్నతస్థాయిలోని కొందరికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. మామూలు జనంతో పోలిస్తే వీరి జీవితాలు కొంత సౌకర్యవంతంగా ఉంటాయి. ఇంకొందరికి కొన్ని పరిమితులతో ఇంటర్నెట్ వసతి లభిస్తుంది.
మొత్తంగా దేశంలో సొంతంగా చాలా ప్రాథమిక స్థాయిలోని ఇంటర్నెట్ మాత్రమే ఉంది. కానీ.. ఉత్తర కొరియా జనం చాలా మంది ఎన్నడూ ఆన్‌లైన్‌లోకి వెళ్లనే వెళ్లరు.

ఫొటో సోర్స్, Getty Images
మత స్వేచ్ఛ
ఉత్తర కొరియా రాజ్యాంగం ‘‘విశ్వాస హక్కు’’ను హామీగా ఇస్తోంది. దేశంలో బౌద్ధులు, షామానిస్టులు ఉన్నారు. ఉత్తర కొరియా స్థానిక మతమైన చోండోయిజాన్ని అనుసరించేవారు కూడా ఉన్నారు. ప్రభుత్వ నియంత్రణలో నడిచే చర్చీలు కూడా ఉన్నాయి.
కానీ ఇదంతా వట్టి ప్రదర్శనకేనని ఫాంగ్ అంటారు.
‘‘వాస్తవంలో అసలు మత స్వేచ్ఛ లేదు. అందరూ కిమ్ కుటుంబాన్నే ఆరాధించేలా తయారు చేశారు’’ అని ఆయన చెప్తారు.
క్రైస్తవులు ప్రభుత్వ నియంత్రణలోని చర్చిలకు వెలుపల మతాన్ని ఆచరిస్తే.. వారికి ‘‘వివక్షాపూరిత వేధింపులు, తీవ్ర శిక్షలు’’ ఎదురవుతాయి అని 2014 నాటి ఐక్యరాజ్యసమితి నివేదిక ఒకటి పేర్కొంది.
విదేశీ మతసంస్థల విషయంలో కూడా ఉత్తర కొరియా చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. కొరియన్-అమెరికన్ ఎవాంజెలిస్ట్ అయిన కెన్నెత్ బే.. ఉత్తర కొరియాకు క్రైస్తవ పర్యటనలు నిర్వహించేవారు.
ఆయన ‘ప్రభుత్వ వ్యతిరేక’ నేరాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఉత్తర కొరియా 2013లో ఆయనకు 15 ఏళ్లు జైలు శిక్ష విధించింది. అయితే అనారోగ్య కారణాల వల్ల ఆయనను 2014లో విడుదల చేసింది.

ఫొటో సోర్స్, 016 DIGITALGLOBE INC
జైలు శిబిరాలు, స్థితిగతులు
‘‘ఉత్తర కొరియా అంటే ప్రపంచంలో అతి పెద్ద బహిరంగ జైలు శిబిరం అనంటారు’’ అని ఆడమ్స్ పేర్కొన్నారు. ‘‘అలా అనటం అన్యాయమని నేనుకోను’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
అమెరికా విదేశాంగ శాఖ నివేదిక ప్రకారం.. ఉత్తర కొరియాలో 80,000 నుంచి 1,20,000 మంది వరకూ ప్రజలు జైళ్లలో ఉన్నారు.
అక్కడ ఏ సాకుతోనైనా ప్రజలని జైళ్లలో పెట్టేయవచ్చునని ఉద్యమకారులు చెప్తారు. ఏదైనా దక్షిణ కొరియా డీవీడీని వీక్షించటం మొదలుకుని.. దేశం నుంచి ఫిరాయించటం వరకూ.. నేరాల చిట్టా చాలా పెద్దదే ఉంటుంది.
రాజకీయ నేరాల్లో శిక్ష పడ్డ వారిని కిరాతకమైన కార్మిక శిబిరాలకు పంపిస్తారు. గనుల తవ్వకం, చెట్లు, దుంగలు నరకటం వంటి శారీరక శ్రమ చేయిస్తారు.
ఈ జైలు శిబిరం ‘‘తట్టుకోలేనంత కఠోరమైనది’’ అని ఆమ్నెస్టీ అభివర్ణించింది. అక్కడ ఖైదీలను గార్డులు కొడుతూ హింసిస్తారు. మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు నిత్యకృత్యంగా ఉంటాయి.
నిజానికి.. ఆ జైళ్లలో ఉండేవారిలో అందరూ నేరాలు చేయలేదు. ఉత్తర కొరియా ‘సామూహిక శిక్ష’ విధానాన్ని అమలు చేస్తుంది. ఒక కుటుంబంలో ఒకరిని దోషిగా నిర్ధారిస్తే.. ఆ కుటుంబం మొత్తానికీ శిక్ష విధించవచ్చు.
ఇక మరణశిక్షలను ఉత్తర కొరియా ఎక్కువగా విధిస్తుంటుంది. మరణశిక్షలను బహిరంగంగా అమలు చేయటానికి ఆ దేశం పెట్టింది పేరు.

ఫొటో సోర్స్, Reuters
విదేశీయుల నిర్బంధాలు
ఉత్తర కొరియాలో విదేశీయులను తరచుగా అరెస్ట్ చేయటం.. దీర్ఘ కాలం పాటు నిర్బంధించటం కూడా ఎక్కువే. రాజకీయ కారణాల రీత్యా వీరిని ఖైదీలుగా ఉంచుకుంటూ.. అవకాశం వచ్చినపుడు దౌత్యంలో పావులుగా ఉపయోగించుకుంటుంది.
అదే తరహాలో గతంలో ముగ్గురు అమెరికా పౌరులను దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణపై అరెస్ట్ చేసి కార్మిక శిబిరాలకు పంపింది. ట్రంప్‌తో కిమ్ భేటీ నేపథ్యంలో సుహృద్భావ సూచికగా ఆ ముగ్గురినీ మే నెల మొదట్లో విడుదల చేసింది.
కానీ.. ఒక ప్రచార బోర్డును దొంగిలించాడన్న ఆరోపణపై 2016లో అమెరికా విద్యార్థి ఒటో వాంబీర్‌ను ఉత్తర కొరియా అరెస్ట్ చేసింది. అతడిని 17 నెలల తర్వాత అనారోగ్య కారణాలతో విడుదల చేయగా.. ఇంటికి చేరిన ఆ యువకుడు కొద్ది రోజులకే చనిపోయాడు.
దక్షిణ కొరియాకు చెందిన ఆరుగురు ఖైదీలు ఇంకా ఉత్తర కొరియా నిర్బంధంలోనే ఉన్నారని భావిస్తున్నారు.
1970ల్లో జపాన్ పౌరులు 13 మందిని కిడ్నాప్ చేసినట్లు కూడా ఉత్తర కొరియా అంగీకరించింది. జపాన్ భాష, ఆచారవ్యవహారాల్లో తమ గూఢచారులకు శిక్షణనివ్వటానికి వారిని ఉపయోగించుకుంది.
ఇలాంటి కిడ్నాప్‌లు చాలానే ఉన్నాయి. 1970 ల్లోనే దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ నటి, ఆమె మాజీ భర్త అయిన సినీ దర్శకుడిని ఉత్తర కొరియా అపహరించింది. తమ ప్రభుత్వం కోసం వారితో సినిమాలు తీయించింది. కానీ వారు ఆ తర్వాత తప్పించుకోగలిగారు.

ఫొటో సోర్స్, Getty Images
బలవంతపు శ్రమ
ఉత్తర కొరియా ప్రజల్లో అత్యధికులు తమ జీవితాల్లో ఏదో ఒక దశలో వేతనం లేకుండా శ్రమించాల్సి ఉంటుందని హెచ్ఆర్‌డబ్ల్యూ నివేదిక చెప్తోంది.
పాఠశాలల స్థాయిలోనే ఏడాదిలో రెండు సార్లు పొలాల్లో పనిచేయిస్తారని.. దున్నేటపుడు నెల రోజులు, కోతల సమయంలో నెల రోజుల చొప్పున పని చేయాల్సి ఉటుందని ఉత్తర కొరియా నుంచి ఫిరాయించిన మాజీ విద్యార్థులు కొందరు హెచ్‌ఆర్‌డబ్ల్యూకి తెలిపారు.
అలాగే.. వేలాది మంది ప్రజలను విదేశాల్లో తక్కువ కూలీ కార్మికులుగా పనిచేయటానికి ఉత్తర కొరియా పంపిస్తుంది. వారిలో చాలా మంది బానిస తరహా పరిస్థితుల్లో పనిచేస్తుంటారు.
ఐక్యరాజ్యసమితి ఆంక్షలను పాటిస్తూ చాలా దేశాలు ఉత్తర కొరియా కార్మికుల ఉద్యోగ వీసాలను రెన్యువల్ చేయటం నిలిపివేసినప్పటికీ.. చైనా, కువైట్, కతార్ వంటి దేశాలకు తన కార్మికులను పంపిస్తుంది ఉత్తర కొరియా. అయితే.. ఆంక్షలు ఉన్నప్పటికీ ఉత్తర కొరియా కార్మికులు ఇంకా కొన్ని దేశాల్లో పనిచేస్తున్నారని నివేదికలు బయటకు వచ్చాయి.
‘‘విదేశాల్లో పనిచేసే ఉత్తర కొరియా కార్మికులు చాలా మంది నిరంతర పర్యవేక్షణ గల డార్మిటరీల్లో ఉంటుంటారు. వారికి స్వేచ్ఛగా సంచరించే అవకాశం ఉండదు. దాదాపు ఖైదీలుగానే బతుకుతుంటారు’’ అని ఆడమ్స్ వివరించారు.
ఆ కార్మికుల వేతనాల్లో సింహ భాగాన్ని సాధారణంగా ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంటుంది. ఆ దేశపు ప్రధాన ఆదాయ వనరుల్లో ఇది ఒకటి.

ఫొటో సోర్స్, Getty Images
మహిళల హక్కులు
దేశంలో మహిళల పట్ల వివక్ష చాలా తీవ్రంగానే ఉంటుంది. కానీ ‘‘అసమానతలను లెక్కించటానికి.. పురుషులకు, మహిళలకు మధ్య వేతన వ్యత్యాసాలను లెక్కించేటటువంటి మార్గమేదీ లేదు’’ అని ఫాంగ్ చెప్తారు.
ఉత్తర కొరియా తనను తాను సమానత్వమున్న సమాజంగా చెప్పుకుంటుంది. కానీ.. అక్కడ మహిళలకు విద్య, ఉద్యోగావకాశాలు లేవని అంటారు.
‘‘మహిళల పరిస్థితి నిజంగా ప్రమాదకరంగానే ఉంది. లైంగిక హింస ఉంది. ఎవరైనా తమపై లైంగిక దాడికి పాల్పడినా బాధితులు ఫిర్యాదు చేయటానికి ఎవరూ లేరు’’ అని ఆడమ్స్ పేర్కొన్నారు.
నిర్బంధంలోని మహిళలు హింస, అత్యాచారం, ఇతర లైంగిక దాడులను ఎదుర్కొంటున్నట్లు, సైన్యంలో లైంగిక వేధింపులు విస్తృతంగా ఉన్నట్లు తరచుగా వార్తలు వస్తుంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
చిన్నారులు.. పౌషకాహార లోపం
ఉత్తర కొరియాలో చిన్నారులకు విద్య అందుతుంది. అయితే.. కొంత మంది చిన్నారులు తమ కుటుంబాలు ఆర్థికంగా మనగలగటం కోసం చిన్నప్పుడే స్కూలు మానేయాల్సి వస్తుందని ఫాంగ్ తెలిపారు.
స్కూలు పాఠ్యాంశాల్లో ‘‘వారి జ్ఞానాన్ని చాలా చిన్నప్పటి నుంచే పరిమితం చేస్తూ.. దేశ రాజకీయ అజెండానే ప్రధానం చేస్తారు’’ అని ఆయన చెప్పారు.
ఉత్తర కొరియా చిన్నారులు రెండు లక్షల మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని.. వారిలో 60,000 మంది తీవ్ర పోషకాహార లోపానికి గురయ్యారని యూనిసెఫ్ పేర్కొంది.
హక్కుల విషయంలో వచ్చే ఈ ఆరోపణలను ఉత్తర కొరియా ఎప్పటికప్పుడు తిరస్కరిస్తూ ఉంటుంది. ‘‘ప్రపంచంలో అత్యంత సానుకూలమైన మానవ హక్కుల వ్యవస్థ ఉన్నందున మా పౌరులు గర్విస్తుంటారు’’ అని చెప్తుంది. ఇతర దేశాల్లో లోపాలను వేలెత్తి చూపుతుంది.
ఉత్తర కొరియాలో మానవ హక్కుల విషయం అనేది ‘‘అంతులేని బావి’’ వంటిదని హెచ్‌ఆర్‌డబ్ల్యూ ప్రతినిధి ఆడమ్స్ అభివర్ణిస్తారు.
ట్రంప్ - కిమ్ శిఖరాగ్ర భేటీ జరిగినప్పటికీ.. ‘‘అందరూ తమ తమ స్వప్రయోజనాలనే చూసుకుంటున్నారు. ఉత్తర కొరియా ప్రజల ప్రయోజనాల గురించి ఎవరూ పట్టించుకోవటం లేదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








