రఫేల్ ఒప్పందం: ప్రధాని మోదీ రూ. 30 వేల కోట్లు దొంగిలించారన్న రాహుల్... ఆ ఆరోపణల్లో అర్థం లేదన్న నిర్మలా సీతారామన్

ఫొటో సోర్స్, InC/Youtube
రఫేల్ ఒప్పందంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ.30 వేల కోట్లు దొంగిలించారని, ఆ మొత్తాన్ని తన స్నేహితుడు అనిల్ అంబానీకి ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు.
దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాహుల్ మాట్లాడారు.
రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన బేరసారాల చర్చల్లో ప్రధానమంత్రి కార్యాలయం జోక్యం చేసుకోవడాన్ని రక్షణ శాఖ తీవ్రంగా నిరసించిందంటూ 'ది హిందూ' పత్రిక శుక్రవారం నాడు ప్రత్యేక కథనాన్ని ప్రచురించిన నేపథ్యంలో రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
‘ప్రధానమంత్రి ఒక 'దొంగ'’
రూ. 60,000 కోట్ల విలువైన రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో రక్షణ శాఖకు సమాంతరంగా ప్రధానమంత్రే స్వయంగా బేరసారాలు చేశారని తేటతెల్లమైందని రాహుల్ గాంధీ అన్నారు.
దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ ఒప్పందానికి సంబంధించి ప్రధానమంత్రి, రక్షణ మంత్రి అబద్దాలు ఆడుతున్నారని, వారు సుప్రీం కోర్టుకు కూడా తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించిన రాహుల్ గాంధీ, ఏకంగా ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పే ప్రశ్నార్థకమైందని అన్నారు.
"నాకు నిజానికి పరుషమైన మాటలు అనడం ఇష్టం ఉండదు. కానీ, నిజాలు చెప్పాల్సి వచ్చినప్పుడు తప్పడం లేదు. ప్రధానమంత్రి ఒక 'దొంగ' అని చెప్పడం ఇప్పుడు నా బాధ్యత అని రాహుల్ అన్నారు.

ఫొటో సోర్స్, The Hindu
ది హిందూ కథనంలో ఏముంది?
రఫేల్ విమానాల కొనుగోలు విషయంలో ప్రధానమంత్రి కార్యాలయం "సమాంతర బేరసారాలు" జరపడాన్ని రక్షణ శాఖ తీవ్రంగా ఆక్షేపించిందని ది హిందూ కథనం తెలిపింది. ప్రధాని కార్యాలయం స్వయంగా బేరసారాలకు దిగడంతో ప్రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు నిక్కచ్చిగా వ్యవహరించలేక బలహీన పడే పరిస్థితి వచ్చిందని, ఆ విషయాన్ని అప్పటి రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ దృష్టికి తెచ్చేందుకు అధికారులు 2015 నవంబర్ 24న ఒక లేఖను పంపించారని ఆ కథనంలో పేర్కొన్నారు.
రక్షణ శాఖ కార్యదర్శి మంత్రికి రాసిన ఆ లేఖను కూడా ఈ పత్రిక ప్రచురించింది.
‘రాబర్ట్ వాద్రా మీద విచారణ చేయండి.. అలాగే రఫేల్‌పై కూడా’
రఫేల్ ఒప్పందం మీద సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చే నాటికి ఈ పత్రాలు అందుబాటులో లేవు కాబట్టి, ఆ తీర్పు ఇప్పుడు ప్రశ్నార్థకమైందని రాహుల్ అన్నారు. వారు కోర్టుకు అబద్ధాలు చెప్పారు. ఈ పత్రాలు కనుక అందుబాటులో ఉంటే సుప్రీం కోర్టు ఇందులో అక్రమాలు ఏమీ జరగలేదని తీర్పు ఇచ్చేదా అని రాహుల్ ప్రశ్నించారు.
రక్షణ మంత్రి అసత్యాలు చెబుతున్నారని చెప్పిన రాహుల్, "ప్రధాని మోదీ స్వయంగా చెప్పడం వల్లే అనిల్ అంబానీని ఎంచుకున్నామని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండ్ స్పష్టంగా ఒప్పుకున్నారు. ఇప్పుడు రక్షణ మంత్రిత్వ శాఖే ఆయనను దొంగ అంటోంది " అని అన్నారు.
'రాబర్ట్ వాద్రా మీద చిదంబరం మీద మీరు చట్టాన్ని ప్రయోగిస్తున్నారు. మరేం ఫర్వాలేదు. కానీ, రఫేల్ విషయంలో కూడా విచారణ చేయండి' అని రాహుల్ డిమాండ్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
రక్షణ మంత్రి ప్రతిస్పందన
రఫేల్ ఒప్పందం విషయంలో ఫ్రెంచి అధికారులతో ప్రధానమంత్రి కార్యాలయం 'సమాంతర చర్చలు' జరిపిందంటూ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఆమె విలేఖరులతో మాట్లాడుతూ, "ప్రధాని కార్యాలయం రఫేల్ ఒప్పందం పురోగతి గురించి తెలుసుకునేందుకే మాట్లాడింది. అంతేకానీ, ధరల గురించి, ఇంకా ఇతర అంశాల గురించి కాదు" అని చెప్పారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది..
రఫేల్ వివాదానికి సంబంధించి అన్ని సందేహాలకు సమాధానాలిచ్చామని చెప్పిన రక్షణ మంత్రి, "ది హిందూ పత్రిక, రాహుల్ గాంధీలు చచ్చిన గుర్రాన్ని లేపే ప్రయత్నం చేస్తున్నాయి" అని అన్నారు.
"అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఆ నోట్‌కు బదులిచ్చారు. 'ప్రశాంతంగా ఉండండి, ఆందోళన చెందాల్సిన పని లేదు. అంతా సరిగ్గానే జరుగుతోంది' అని ఆ నోట్ మీదే రాశారు. రక్షణ శాఖ కార్యదర్శి రాసిన లేఖను ప్రచురించిన ఆ దినపత్రిక, జర్నలిజంలో నైతిక విలువల ప్రకారం ఆ లేఖ మీద రక్షణ మంత్రి స్పందనను కూడా ప్రచురించాలి కదా?" అని నిర్మలా సీతారామన్ అన్నారు. ఇలాంటి 'సెలెక్టివ్ జర్నలిజం' సరైనది కాదని ఆమె విమర్శించారు.
ఒప్పందం ఎంతవరకు వచ్చిందని తెలుసుకోవడానికి పీఎంఓ మాట్లాడితే 'సమాంతర చర్చలు' అంటున్నారు, నేషనల్ అడ్వయిజరీ కమిటీ పేరుతో సోనియా గాంధీ గతంలో ప్రధానమంత్రి కార్యాలయంలో జోక్యం చేసుకోవడాన్ని ఏమంటారని ఆమె ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, Getty Images
హిందూ గ్రూప్ చైర్మన్ రామ్ ఏమన్నారు?
సెలెక్టివ్ జర్నలిజం అనే ఆరోపణల గురించి హిందూ గ్రూప్ చైర్మన్ ఎన్. రామ్ వద్ద ఏఎన్ఐ ప్రస్తావించినప్పుడు, "మా కథనం పరిపూర్ణంగా ఉంది. ఎందుకంటే, మేం అప్పటి రక్షణ మంత్రి పాత్ర గురించి రాయలేదు. అది విచారణలో తేలాలి. దీనికి 'మరో వైపు' అంటూ ఏమీ లేదు" అని బదులిచ్చారు.
నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఎన్. రామ్, "వాళ్ళు ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. ఏవో కవరప్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సీతారామన్‌కు నా సలహా ఏమిటంటే, ఈ లావాదేవీలతో తనకు ప్రమేయంలేదు కాబట్టి ఆమె మౌనంగా ఉండడం మంచిది. ఏ తప్పూ జరగలేదని సమర్థించాల్సిన బాధ్యతను ఆమె ఎందుకు తలకెత్తుకుంటున్నారు" అని ప్రశ్నించారు.
జర్నలిజంలో నైతిక విలువల గురించి ఆమె తనకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా రామ్ అన్నారు.
లోక్‌సభలో వాద వివాదాలు
ఈ అంశం మీద పార్లమెంటులో తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. రఫేల్ ఒప్పందం మీద సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేఏసీ) విచారణ జరిపించాలని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు డిమాండ్ చేశాయి.
మోదీ-షా జంట దేశానికి వెన్నెముక వంటి రక్షణ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తోందని తృణమూల్ ఎంపీ సౌగతా రాయ్ విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే కూడా, రాహుల్ కోరినట్లు దీని మీద జేఏసీ వేయాలన్నారు. "అప్పుడే అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఇప్పుడు మాకు మీ నుంచి ఎలాంటి వివరణలూ వద్దు. ప్రధాని నుంచి ఇప్పటికే చాలా విన్నాం" అని ఖర్గే అన్నారు.
ఇవి కూడా చదవండి:
- రఫేల్ విమానాల విషయంలో ఎవరి మాటల్లో నిజముంది?
- రఫేల్ డీల్ ఆడియో టేపు లీక్.. మొత్తం సంభాషణ ఇదే..
- అభిప్రాయం: రాజీవ్‌కు బోఫోర్స్.. మోదీకి రఫేల్?
- మోదీపై రాహుల్ వేస్తున్న నిందలు సరే... నిజాలెక్కడ
- 'రఫేల్ డీల్‌ను ప్రశంసించాలి' : బీబీసీ ప్రత్యేక ఇంటర్వ్యూలో నిర్మలా సీతారామన్
- రఫేల్ కేసులో సుప్రీం తీర్పు: "ఒప్పందంపై కోర్టు జోక్యం అవసరం లేదు..."
- రఫేల్ డీల్: విమానం ధర ఎంతో చెప్పాలన్న సుప్రీంకోర్టు, కుదరదన్న కేంద్రం
- రఫేల్ డీల్: అంబానీ సంస్థను.. ‘భారత ప్రభుత్వమే ప్రతిపాదించింది. మాకు ఇచ్చిన వారిని తీసుకున్నాం’
- సీబీఐ వర్సెస్ సీబీఐ: డైరెక్టర్ అలోక్ వర్మ తొలగింపునకు.. రఫేల్ విచారణకు సంబంధముందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








