'యూట్యూబ్' వంటకాల సంచలనం మస్తానమ్మ కన్నుమూత

మస్తానమ్మ

ఫొటో సోర్స్, Country Foods

తన చేతి వంటతో 'యూట్యూబ్‌'లో సంచలనం సృష్టించి, దేశ విదేశాల్లో లక్షల మంది అభిమానం చూరగొన్న వృద్ధ మహిళ కర్రె మస్తానమ్మ కన్నుమూశారు.

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని గుడివాడలో ఈ నెల 2న మస్తానమ్మ చనిపోయారు. ఆమె వయసు 107 ఏళ్లని చెబుతారు.

మస్తానమ్మ వృద్ధాప్యం కారణంగా కన్నుమూసినట్టు ఆమె మనవడు కర్రె నాగభూషణం బీబీసీకి తెలిపారు.

మస్తానమ్మ ఆరుబయట.. పొలం గట్ల వద్ద.. కట్టెల పొయ్యిపై పూర్తిగా సంప్రదాయ పద్ధతిలో చేసే వంటలు నెటిజన్లను నోరూరిస్తాయి. మిక్సర్, ఇతర అధునాతన సామగ్రి ఏదీ వాడకుండా మస్తానమ్మ వంట చేసే విధానాన్ని ఆమెకు వరుసకు మనవడైన కె.లక్ష్మణ్, ఆయన స్నేహితుడు శ్రీనాథ్ రెడ్డి వీడియో తీసి వారు 2016లో ప్రారంభించిన యూట్యూబ్ ఛానల్ 'కంట్రీ ఫుడ్స్'లో పెట్టేవారు.

ఆరుబయట వండుతున్న మస్తానమ్మ

ఫొటో సోర్స్, Getty Images

దాదాపు ఏడాది క్రితం అప్‌లోడ్ చేసిన 'వాటర్‌మిలన్ చికెన్' వీడియోకు కోటీ 10 లక్షల వ్యూస్ వచ్చాయి. మస్తానమ్మ వంటకాల్లో అత్యంత ప్రసిద్ధ వంటకం ఇది.

టొమాటోలో ఆమ్లెట్, ఎగ్ దోశ, చికెన్ బిర్యానీ, ఈము పక్షి మాంసం కూర తదితర వంటకాల వీడియోలను కనీసం 30 లక్షల నుంచి 80 లక్షల మంది చూశారు.

'గ్రానీ మస్తానమ్మ' శాకాహారం, మాంసాహారం - రెండు రకాల వంటలూ చేస్తారు. ఏ వంటలో ఏ పదార్థం ఎంతుండాలనేది ఆమె ఉజ్జాయింపుగా వేస్తారు.

మీ అభిమానులకు మీరిచ్చే సందేశం ఏమిటని బీబీసీ నిరుడు ఒక ఇంటర్వ్యూలో మస్తానమ్మను అడగ్గా- ''బాగా కూరలు వండుకొని, సుబ్బరంగా తినండి'' అని పెద్దగా నవ్వుతూ చెప్పారు.

మస్తానమ్మ

ఫొటో సోర్స్, Getty Images

మస్తానమ్మ 11 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయారని 'ద హిందూ' ఒక కథనంలో తెలిపింది. ''మస్తానమ్మ అసలు పేరు మార్తమ్మ. ఆమె తండ్రి చనిపోయిన తర్వాత ఆమెను ఒక ముస్లిం కుటుంబం దత్తత తీసుకొంది. ఆమె పేరును మస్తానమ్మగా మార్చింది. మస్తానమ్మకు 22 ఏళ్ల వయసులో భర్త చనిపోయారు. ఆమె ఐదుగురి సంతానంలో నలుగురు మరణించారు. ఆమె సంతానంలో ఇప్పుడు ఒక్క కుమారుడు మాత్రమే ఉన్నారు. ఆయన ఇంటిని ఆనుకొని ఉన్న మరో ఇంట్లో మస్తానమ్మ విడిగా ఉండేవారు'' అని వివరించింది.

మస్తానమ్మ

ఫొటో సోర్స్, Getty Images

చిన్నతనం నుంచే వంటలకు ప్రసిద్ధి

మస్తానమ్మ పుట్టిన గ్రామం తెనాలి మండలంలోనే ఉన్న కోపల్లె గ్రామం. చిన్నతనం నుంచి రుచికరమైన వంటలకు ఆమె ప్రసిద్ధి. మెట్టినింటికి వెళ్లిన తర్వాత గుడివాడ గ్రామంలో పలు ఇళ్లలో శుభకార్యాల సందర్భంగా తన చేతి వంటల రుచి చూపించేవారు. సుమారు ఐదు వేల జనాభా ఉన్న గుడివాడలో దాదాపుగా అందరికీ మస్తానమ్మ చేతివంట బాగా తెలుసు.

ఈ విషయం గ్రహించిన లక్ష్మణ్, స్నేహితుడితో కలిసి యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి, గుడివాడలోనే వంటల వీడియోలు రికార్డ్ చేసేవారు. వాటిని అప్‌లోడ్ చేయగానే తొలుత వేలల్లో, తర్వాత లక్షల్లో వ్యూస్ రావడం వారికి ఉత్సాహాన్నిచ్చింది. చాక్లెట్ కేక్, పిజ్జాల నుంచి ఎండు చేపలపులుసు వరకు పలు గ్రామీణ వంటలను ఆమె చేతుల మీదుగా తయారు చేయించి, వీడియోలు పోస్ట్ చేశారు.

మస్తానమ్మ

ఫొటో సోర్స్, Facebook/CountryFoods

గడిచిన ఆరు నెలలుగా మస్తానమ్మ ఆరోగ్యం క్రమంగా క్షీణించడంతో వీడియోలకు అవకాశం లేకుండా పోయింది. ఆమె చివరిసారిగా చేసిన యూట్యూబ్ వంటకం- ములక్కాయ, కోడిగుడ్డు కర్రీ.

యూట్యూబ్ ద్వారా తమ నాన్నమ్మకు ఆదరణ లభించడం తమకు ఆనందాన్నిచ్చిందని నాగభూషణం చెప్పారు. సీఫుడ్ వంటల్లో ఆమెకు ప్రావీణ్యం ఉందన్నారు. నానమ్మ మరణం తమ కుటుంబంలో పెద్దలోటు అని చెప్పుకొచ్చారు.

మస్తానమ్మ

ఫొటో సోర్స్, Facebook/CountryFoods

ఫొటో క్యాప్షన్, మస్తానమ్మ
మస్తానమ్మ

ఫొటో సోర్స్, Facebook/Countryfoods

ఫొటో క్యాప్షన్, మస్తానమ్మ
మస్తానమ్మ

ఫొటో సోర్స్, Facebook/CountryFoods

ఫొటో క్యాప్షన్, మస్తానమ్మ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)