యునైటెడ్ ఇండియా ర్యాలీ: కోల్‌కతాలో ఐక్యత చూపించాలనే విపక్షాల ప్రయత్నంలో ఎన్నో బీటలు

ఫొటో సోర్స్, AFP
- రచయిత, రాజేష్ ప్రియదర్శి
- హోదా, ఎడిటర్, బీబీసీ హిందీ
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. అది కోల్‌కతాలో శనివారం జరిగిన యునైటెడ్ ఇండియా ర్యాలీలో మరోసారి కనిపించింది.
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ ఆహ్వానంతో ఏకమైన విపక్ష నేతలు ఒకే స్వరం వినిపించారు. "మోదీ నుంచి దేశాన్ని కాపాడ్డానికే ఒక్కటయ్యాం" అని చెప్పారు. కానీ కాస్త పరిశీలనగా చూస్తే ఇది కూటమి కాదు, వేరే ఏదో అని అర్థమవుతుంది.
ఇది కూటమి ఎందుకు కాదు అంటే, చాలా రాష్ట్రాల్లో ఈ పార్టీలు కలిసి పోటీ చేయడం లేదు. కానీ దీనికి మహాకూటమి అనే పేరు పెట్టారు. ఇది నిజానికి ఒక ప్రాంతీయ పార్టీల సమూహం. 2019లో బీజేపీకి ఆధిక్యం రాని స్థితిలో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇవి సిద్ధమవుతున్నాయి. అంటే ఏదైనా పొత్తంటూ పెట్టుకుంటే అది ఎన్నికల ఫలితాలు వచ్చాకే జరుగుతుంది.
ఎవరికి ఎన్ని ఎక్కువ స్థానాలు వస్తే, ప్రభుత్వంలో అంత భాగస్వామ్యం అన్నట్లు.. 2019 సాధారణ ఎన్నికల ఫలితాలు వచ్చాక ఇవన్నీ బీజేపీ వ్యతిరేక ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తాయి. అలాంటప్పుడు కలిసి పోటీ చేయాడానికి వీటి మధ్య సీట్ల పంపకం ఎలా సాధ్యం అవుతుంది? మహాకూటమిలో ఏ ఒక్క పార్టీ కూడా తక్కువ స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధంగా లేదు.
భారత రాజకీయాల్లో ఎన్నో విచిత్రమైన పొత్తులు చూశాం. కానీ ఇది ఒక హైబ్రిడ్ అలయన్స్. దీనిని నడిపించేవారు ఎవరనేది పక్కనపెడితే మహాకూటమికి కనీసం కన్వీనర్ కూడా లేరు. కలిసి ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంలో కింగ్ లేదా కింగ్ మేకర్ అవుతామనే ఆశతో వీరందరూ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఇక్కడ అసలు సిసలు రాజకీయాలు ఇంకా మొదలవలేదు.
వేదికపై చేతులు చేతులు పట్టుకున్న బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలు, తమ ఐక్యత చూపిస్తూ ఫొటోలు దిగే ప్రయత్నం చేశారు. కానీ వారి మధ్య పరస్పర గొడవలు, వివాదాలు, రాజకీయ వైరం కథలు దాచినా దాగేవి కావు.

ఫొటో సోర్స్, AFP
బీజేపీకి వ్యతిరేకంగా నిజంగా ఏకం కావాలి అంటే, ఆ పార్టీకి వ్యతిరేకంగా దేశంలో ప్రతి ఎంపీ స్థానానికి ఉమ్మడి అభ్యర్థిని దించడానికి ఈ పార్టీలు సాహసిక నిర్ణయం తీసుకుని ఉండేవి.
మనం అపూర్వ కలయికగా వర్ణిస్తున్న ఈ యునైటెడ్ ఇండియా ర్యాలీ జరిగిన రాష్ట్రం నుంచే చూడడం మొదలెడదాం. ఇది మోదీ వ్యతిరేక ఐక్యత ఎలా అవుతుంది? ఈ ర్యాలీలో వామపక్షాలు లేవు, బెంగాల్‌లో దశాబ్దాల వరకూ కమ్యూనిస్టుల పాలన నడిచింది. కానీ వారు తమ ప్రధాన రాజకీయ ప్రత్యర్థి తృణమూల్ కాంగ్రెసా, లేక బీజేపీనా అనేది ఇప్పటికీ తేల్చుకోలేకపోతున్నారు. ర్యాలీలో వామపక్షాలు పాల్గొనకపోవడానికి కారణం అదే.
42 ఎంపీ స్థానాలున్న పశ్చిమ బంగలో అడుగు పెట్టాలని బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇక్కడ పోటీ నేరుగా ఉండదు అనేది సుస్పష్టం. ఎందుకంటే ఇక్కడ చతుర్ముఖ పోటీ ఉంటుంది. అంటే కాంగ్రెస్, వామపక్షాలు లేదా టీఎంసీ, కాంగ్రెస్ మధ్య బహుశా ఎలాంటి పొత్తు అయినా సంభవమే. కానీ ఇక్కడ అలాంటి దాఖలాలేవీ కనిపించడం లేదు.
అలాగే కేరళలో కాంగ్రెస్, వామపక్షాల మధ్య కూడా ఎలాంటి పొత్తూ కుదిరేలా కనిపించడం లేదు. రెండు పార్టీల మధ్యా ఎప్పుడూ ముఖాముఖి పోటీ ఉంటోంది. ఇప్పుడు అక్కడ బీజేపీ కూడా అడుగుపెట్టాలని ప్రయత్నిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
మమతా బెనర్జీ ఈ ర్యాలీని ఏర్పాటు చేయడంతో ప్రధాన మంత్రి పదవికి ఆమె అభ్యర్థిగా నిలబడతారేమో అని అంతా అనుకుంటున్నారు. కానీ, చేతులు కలిపి దిగిన ఈ ర్యాలీ ఫొటోలో రెండు ముఖాలు కనిపించలేదు. మాయావతి, రాహుల్ గాంధీ. ఎందుకంటే బీజేపీ వ్యతిరేక కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థితిలో నిలబడితే ప్రధాని పదవిపై ఈ ఇద్దరూ ఆశలు పెట్టుకుని ఉన్నారు.
కాంగ్రెస్, బీఎస్పీ తమ ప్రతినిధులను మాత్రం పంపించాయి, కానీ ఈ ఇద్దరు అగ్ర నేతల గైర్హాజరీ వెనుక రాజకీయ ప్రాధాన్యం ఉంది.
కర్ణాటకలో హెచ్‌డీ కుమారస్వామి ప్రమాణ స్వీకార వేడుకలో విపక్షాలు అద్భుతమైన ఐక్యత చూపించాయి.

ఫొటో సోర్స్, Getty Images
మాయావతి, సోనియా చేతులు చేతులు కలిపి ఫొటోలు దిగారు. కానీ ఉత్తర్ ప్రదేశ్‌లో సీట్ల పంపకం విషయానికి వస్తే ఆ ఐక్యత కనిపించలేదు. ఎస్పీ-బీఎస్పీ పొత్తులో కాంగ్రెస్ ఊసే లేకుండా పోయింది.
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ యునైటెడ్ ఇండియా వేదికపై కనిపించారు. దానికి రెండు రోజుల ముందే కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య ఏదైనా పొత్తు ఉండచ్చనే అవకాశాలకు తెరపడింది. రెండు పార్టీలూ దానికి నిరాకరించాయి. పంజాబ్, హరియాణాల్లో కూడా అలాగే ఉంది. అక్కడ కూడా కాంగ్రెస్, ఆప్ చేతులు కలపచ్చు, కానీ కలపడం లేదు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మొత్తం 42 ఎంపీ స్థానాలు ఉన్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం (టీడీపీ) కలిసి పోటీ చేశాయి. ఘోరంగా ఓటమి పాలయ్యాయి. కానీ లోక్‌సభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య సీట్ల పంపకం జరిగే సంకేతాలు అయితే కనిపించడం లేదు.

ఫొటో సోర్స్, TWITTER/AITC OFFICIAL
మమతా బెనర్జీ వేదికపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉన్నారు, కానీ విపక్షాల ఐక్యతే ఎజెండాగా మమతతో ఇప్పటికే చాలాసార్లు భేటీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) అధ్యక్షుడు చంద్రశేఖర రావు ఈ ర్యాలీకి దూరంగానే ఉండిపోయారు.
విపక్షాల ఐక్యత విషయానికి వస్తే అంతా గాల్లోనే కనిపిస్తోంది. దీన్ని మనం 20 ఎంపీ స్థానాలు మాత్రమే ఉన్న ఒడిషాలో కూడా చూడచ్చు. అక్కడ కాంగ్రెస్, బిజూ జనతాదళ్ (బీజేడీ) విడివిడిగా ఎన్నికల్లో పోటీ చేస్తాయి.
బీజేపీ ఆ రాష్ట్రంలో బలం కూడగడుతోంది. ఈ పార్టీని నిజంగా అడ్డుకోవాలంటే ఇక్కడ కాంగ్రెస్-బీజేడీ పొత్తు పెట్టుకోవచ్చు. కానీ అలా జరగడం లేదు.

ఫొటో సోర్స్, Getty Images
బీజేపీ కూటమి పరిస్థితి
అయినా ఎన్డీయే పరిస్థితి కూడా అలాగే ఉంది. టీడీపీ స్పెషల్ స్టేటస్ పేరుతో కూటమిని వదిలింది. ఇప్పుడు ప్రతిపక్ష కూటమిగా వర్ణిస్తున్న దానిలో భాగం అయిపోయింది.
పౌరసత్వ చట్టం వల్ల తలెత్తిన గందరగోళంతో అసోం గణ పరిషత్ (ఏజీపీ) బీజేపీతో తెగతెంపులు చేసుకుంది.
కూటమిలో భాగస్వామి జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) కూడా ఈ చట్టానికి వ్యతిరేకంగా ఓటు వేయడంతోపాటు బీజేపీ వ్యతిరేక ప్రదర్శనల్లో భాగమయ్యేందుకు ఆ పార్టీ తమ ప్రతినిధులను కూడా పంపుతోంది.

ఫొటో సోర్స్, TWITTER/SHIVSENA
శివసేన ఉద్ధవ్ ఠాక్రే, సంజయ్ రౌత్ ప్రతిరోజూ మోదీ, అమిత్ షాలకు వ్యతిరేకంగా విపక్షాల కంటే ఘోరంగా విమర్శిస్తూ వస్తున్నారు.
అలాగే ఉత్తర్ ప్రదేశ్‌లో చిన్న పార్టీలు కూడా బీజేపీపై తమ కోపాన్ని దాచుకోవడం లేదు. ఆ పార్టీపై బహిరంగంగా తమ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.
అంటే ఇక్కడ రాజకీయాల్లో ఎవరూ శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరు అనేది నిజమే అయినా.. ఇక్కడ అసలు విషయం రాజకీయ ప్రయోజనాలు లేదా రాజకీయ నష్టాలే. దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రతి నేతా అడుగు ముందుకు వేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- 'ఫిమేల్ వయాగ్రా'ను అనుమతించిన తొలి అరబ్ దేశం ఈజిప్టు
- బరువు తగ్గారా... అయితే, కొత్త పాస్‌పోర్ట్ తీసుకోవాల్సిందే
- #10YearChallenge: ఈ సోషల్ మీడియా చాలెంజ్‌లో ఫొటోలు పెడుతున్నారా... జాగ్రత్త
- అభిప్రాయం: 'ప్రపంచ కప్ జట్టులో ధోనీ 'బెర్త్'పై ఇక ఎలాంటి డౌట్ లేదు'
- ఒక్క వంటపాత్ర లేకుండానే నోరూరించే బిర్యానీ రెడీ
- చైనా - తైవాన్ దేశాలు ఎందుకు విడిపోయాయి...
- బెజవాడ అంటే ఆటోనగరే కాదు, అది పుస్తకానికి మరో పేరు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








