రాహుల్ గాంధీ ఇప్పుడేం చేయాలి?... ప్రధాని అభ్యర్థిగా చాటుకోవాలా? ప్రాంతీయ పార్టీలను ఏకం చేయాలా?

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, రషీద్ కిద్వాయ్
    • హోదా, బీబీసీ కోసం

రాబోయే పార్లమెంటు ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావించిన అయిదు రాష్ట్రాల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహాన్నిచ్చాయి. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఆ పార్టీ తన ప్రభుత్వాలను ఏర్పాటు చేయబోతోంది.

అయితే, మరో ఆరు నెలల్లో జరగాల్సిన సార్వత్రిక ఎన్నికల కోసం సిద్ధం చేయాల్సిన మహాకూటమి విషయంలో ఈ ఎన్నికలు ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీని తదుపరి దశకు తీసుకువచ్చాయి.

తెలంగాణ ఎన్నికల్లో కూటమి వైఫల్యం వల్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిష్ఠ కొంత తగ్గినప్పటికీ, నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంకీర్ణ కూటమిని ఏర్పాటు చేసే ప్రక్రియను ముందుకు నడిపిస్తున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు.

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఏడాది కాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ ఏడాది కాలంలో కాంగ్రెస్ లోపలా, బయటా ఆయన పట్ల నమ్మకం ఎంతో పెరిగింది.

మోదీ-షాల నేతృత్వంలో ఎదురులేదన్నట్లుగా ఉన్న బీజేపీ 2014 ఎన్నికల తరువాత ఇప్పుడు రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ చేతిలో ఓటమి పాలైంది.

రాహుల్ గాంధీ ఇప్పుడు తనను తాను ప్రధానమంత్రి అభ్యర్థిగా చాటుకునే ప్రయత్నం చేయాలా లేక ప్రాంతీయ పార్టీలను ఒక్క తాటి మీదకు తీసుకురావడం మీద దృష్టి కేంద్రీకరించాలా? ఆయన ముందు ఇప్పుడు ఈ రెండు మార్గాలున్నాయి. కానీ, ఈ రెండు మార్గాల్లోనూ విభిన్నమైన సమస్యలున్నాయి.

ఇప్పుడు అందరి దృష్టీ సహజంగానే బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి మీదకు మళ్ళుతుంది.

ఆమె రెండోసారి రాహుల్ గాంధీతో చేయి కలపడానికి సిద్ధంగా ఉంటారా? మాయావతి అసంగ్ధిత వైఖరి కాంగ్రెస్‌కు కొత్తేమీ కాదు.

అయితే, కాంగ్రెస్ విజయాలతో బీఎస్‌పీ ధోరణిలో మార్పు కనిపిస్తోంది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

మాయావతి

ఫొటో సోర్స్, Getty Images

మాయావతి ఏ వైపు వెళ్తారు

మాయావతి మూడ్ స్వయంగా ఎలా ఉంటుందంటే, ఆమె ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ పనితీరుపై సమ్మతి తెలియజేయవచ్చు.

మరో వైపు ఉత్తర ప్రదేశ్‌ బీజేపీలో మాయావతి రాజకీయ ఆకాంక్షలను చేర్చుకోడానికి ఎలాంటి స్థానం లేదు.

70 మంది ఎంపీలు, 320 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఏదైనా కూటమిలో చేరి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని సీట్లు వదులుకోవడం అనేది మాయావతికి భయంకరమైన అనుభవం కావచ్చు.

దాని వల్ల అసలుకే మోసం రావచ్చు.

జమ్ము కశ్మీర్, పంజాబ్, హరియాణా, దిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, బిహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్ మొత్తం హిందీ బెల్టులో లోక్‌సభకు 273 మంది ఎంపీలు ఎన్నికవుతారు.

వాటిలో... 200 స్థానాలు ప్రస్తుత లోక్‌సభలో బీజేపీ దగ్గర ఉన్నాయి.

మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ఫలితాలు, ఉత్తర ప్రదేశ్‌లో బీఎస్పీ, ఎస్పీలు కలిసే అవకాశాలను చూస్తే బీజేపీ 2019లో సాధారణ ఎన్నికల్లో 80 నుంచి 100 స్థానాలు కోల్పోబోతోంది.

తెలంగాణలో పొత్తుతో, ఈశాన్య భారత్, పశ్చిమ బెంగాల్ లేదా తమిళనాడులో సీట్లు పెరుగుతాయనే ఆశతో ఈ స్థానాల్లో నాలుగో భాగం కంటే ఎక్కువ ఆశించలేరు.

ఛత్తీస్‌గఢ్‌లో బలమైన నేత లేకపోయినా అక్కడ కాంగ్రెస్ స్పష్టమైన విజయాన్ని అందుకుంది.

కాంగ్రెస్ పార్టీ జెండా

ఫొటో సోర్స్, Getty Images

కాంగ్రెస్ ముందు సవాళ్లు

బియ్యం బాబా అనే ఫేమ్, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నక్సల్స్ హింసకు వ్యతిరేకతతో ఉన్న రమణ్ సింగ్‌ను స్పష్టమైన విజేతగా చూపించారు.

కానీ ఛత్తీస్‌గఢ్ ఓటర్లు దీన్ని ఒప్పుకోలేదు. వాళ్లు రమణ్ సింగ్ ప్రభుత్వాన్ని తిరస్కరించారు.

దేశంలోని మిగతా ప్రజలు ఛత్తీస్‌గఢ్ ఓటర్లు అనుకున్నట్టే తమ ఓట్లు వేస్తే ఏం జరుగుతుందో అంచనా వేయండి.

బహుశా వాళ్లు కొన్ని విషయాలను కచ్చితంగా గమనిస్తారు. వారు పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్నవారైనా లేదా వ్యక్తి పాపులారిటీపై ఎన్నికల వైతరిణిని దాటగలిగిన అభ్యర్థులైనా.. జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.

అంశాలు ఇంకా ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది.

మహాకూటమికి సమీకరణాలు రూపొదించాల్సిన అవసరం ఉంది.

నోట్ల రద్దు, జీఎస్టీ రెండూ బీజేపీ ప్రభుత్వాల పతనాన్ని శాసించాయా?

వ్యవసాయ సమస్యలు, రైతుల కష్టాలు ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టేవిగా మారాయా?

ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌లో సవరణ హిందీ బెల్ట్ అగ్రకులాలను బీజేపీకి దూరం చేసిందా?

ఇక అత్యంత ముఖ్యమైన ప్రశ్న- బీజేపీకి అత్యధిక ఓట్లు తెచ్చిపెట్టే నరేంద్ర మోదీ ఇమేజ్ తగ్గుతూ వస్తోందా?

17వ లోక్‌సభలో ప్రధానమంత్రి బలం తగ్గిందని ఎన్డీయేతర పక్షాలు అనుకోవడానికి ఇప్పుడు తగిన కారణాలు ఉన్నాయి.

మోదీకి వ్యతిరేకంగా ఒక సమర్థమైన కూటమి ఏర్పడడం అవసరం. యూపీ, బిహార్, బెంగాల్, ఆంధ్రా, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో ఎన్డీయేతర పార్టీలు-కాంగ్రెస్ మధ్య సరైన సంతులనం ఉండాలి.

కానీ మోదీ వ్యతిరేకులైన బలమైన నేతల్లో సరైన సమన్వయంతో, తెలివి లేకపోవడం వల్ల పార్లమెంటు ఎన్నికల్లో మోదీని అధికారానికి దూరం చేయడంలో విఫలం అవుతున్నారనేది నిరూపితమవుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)