ట్రంప్ డాక్యుమెంటరీ ఎడిట్: బీబీసీ డైరెక్టర్ జనరల్, న్యూస్ సీఈఓ రాజీనామా

- రచయిత, అలెక్స్ ఫిలిప్స్, హెలెన్ బుష్బీ
- హోదా, కల్చర్ రిపోర్టర్
డోనల్డ్ ట్రంప్ ప్రసంగాన్ని తప్పుదోవ పట్టించేలా ఎడిట్ చేశారంటూ పనోరమా డాక్యుమెంటరీపై విమర్శలు రావడంతో బీబీసీ డైరెక్టర్ జనరల్ టిమ్ డేవీ, న్యూస్ హెడ్ డెబోరా టర్నెస్‌లు రాజీనామా చేశారు.
టిమ్ డేవీ ఐదేళ్లుగా బీబీసీ డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు. ఈ సమయంలో బీబీసీపై పలు వివాదాలు, పక్షపాత ధోరణి కనబరుస్తోందన్న ఆరోపణలతో ఆయన ఒత్తిడిని ఎదుర్కొన్నారు. ఈ ఆరోపణలతో పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ అయిన సంస్థ విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తాయి.
లీకైన బీబీసీ ఇంటర్నల్ మెమోలోని వివరాలను టెలిగ్రాఫ్ సోమవారం ప్రచురించింది.
ఆ మెమోలో పనోరమా ప్రోగ్రామ్‌లో అమెరికా అధ్యక్షుడి ప్రసంగానికి చెందిన రెండు వేర్వేరు భాగాలను కలిపి ఎడిట్ చేయడంతో.. 2021 జనవరిలో జరిగిన క్యాపిటల్ హిల్ అల్లర్లను ట్రంప్ ప్రోత్సహించినట్లుగా చూపించారన్న ఆరోపణలు వచ్చాయి.
ఈ రాజీనామాలు బీబీసీలో మార్పుకు దారితీస్తాయని యూకే రాజకీయ నేతలు ఆశాభావం వ్యక్తం చేయగా.. ట్రంప్ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు.
ఒకేరోజు బీబీసీ డైరెక్టర్ జనరల్, బీబీసీ న్యూస్ హెడ్ రాజీనామా చేయడం ఇప్పటివరకూ ఎన్నడూ జరగలేదు.

ఆదివారం సాయంత్రం టిమ్ డేవీ తన రాజీనామాను ప్రకటిస్తూ, "అన్ని ప్రభుత్వ సంస్థల మాదిరిగానే బీబీసీ కూడా పరిపూర్ణమైనది కాదు. మనం ఎల్లప్పుడూ పారదర్శకంగా, జవాబుదారీగా ఉండాలి'' అని అన్నారు.
''రాజీనామాకు ఇదొక్కటే కారణం కాకపోయినప్పటికీ, బీబీసీ న్యూస్ చుట్టూ ప్రస్తుతం నెలకొన్న వివాదం కూడా నా నిర్ణయంపై ప్రభావం చూపింది'' అని చెప్పారు.
''మొత్తంగా బీబీసీ ఉత్తమ సేవలందిస్తోంది. కానీ, కొన్ని తప్పులు జరిగాయి. డైరెక్టర్ జనరల్‌గా అంతిమ బాధ్యత నాదే'' అని తెలిపారు.
బీబీసీకి నష్టం కలిగించే దశకు పనోరమా వివాదం చేరుకుందని ఆదివారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో టర్నెస్ పేర్కొన్నారు. దీనికి తుది బాధ్యత తనదేనని తెలిపారు.
'' ప్రజా జీవితంలోని నేతలు పూర్తి జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే, నేను పదవి నుంచి తప్పుకుంటున్నాను. తప్పులు జరిగాయి. కానీ, బీబీసీ న్యూస్ సంస్థాగతంగా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని వచ్చిన ఆరోపణలు పూర్తిగా తప్పని మాత్రం స్పష్టం చేయాలనుకుంటున్నా'' అని టర్నెస్ పేర్కొన్నారు.
టర్నెస్ గత మూడేళ్లుగా బీబీసీ న్యూస్, కరెంట్ అఫైర్స్ సీఈఓగా ఉన్నారు.
టెలిగ్రాఫ్ ప్రచురించిన బీబీసీ ఇంటర్నల్ మెమోలో, ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి సంబంధించి బీబీసీ అరబిక్ చేసిన కవరేజీలో ''వ్యవస్థీకృత పక్షపాతం'' ఉందని, వాటిని పరిష్కరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై కూడా ఆందోళన వ్యక్తం చేసింది.

ఫొటో సోర్స్, BBC/Patrick Olner
2021 జనవరి 6న వాషింగ్టన్ డీసీలోని ట్రంప్ ప్రసంగంలో.. ''మేం క్యాపిటల్ వైపుకు నడుచుకుంటూ వెళ్తాం. ధైర్యవంతులైన మా సెనేటర్లను, కాంగ్రెస్‌లోని పురుషులు, మహిళా సభ్యులను ఉత్సాహపరుస్తాం' అని అన్నారు.
అయితే, ఎడిట్ చేసిన పనోరమా ప్రోగ్రామ్‌లో, ''మేం క్యాపిటల్ వైపుకు నడుచుకుంటూ వెళ్తాం. నేను అక్కడ మీతో ఉంటా. మనం పోరాడదాం. భీకరంగా పోరాడదాం'' అని చూపించారు.
కలిపి చూపించిన ఈ రెండు వేర్వేరు భాగాల మధ్య, ట్రంప్ అసలు ప్రసంగంలో 50 నిమిషాల కంటే ఎక్కువ సమయం ఉంది.
ఇంటర్నల్ మెమో తర్వాత బీబీసీపై పెద్దయెత్తున విమర్శలు వచ్చాయి. సంస్థను "100 శాతం ఫేక్ న్యూస్"గా వైట్‌హౌస్ అభివర్ణించింది.
బీబీసీ డైరెక్టర్ జనరల్, న్యూస్ హెడ్ రాజీనామాలపై స్పందించిన ట్రంప్, ''జనవరి 6న నేనిచ్చిన చాలా మంచి (పర్ఫెక్ట్!) ప్రసంగాన్ని వక్రీకరించి చూపించి దొరికిపోవడంతోనే బీబీసీకి చెందిన ఉన్నత స్థాయి వ్యక్తులు వైదొలిగారు లేదా వారిని తొలగించారు'' అని అన్నారు.
'' అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించిన నిజాయితీ లేని వ్యక్తులు వీరు'' అని ఆయన రాశారు. ''ప్రజాస్వామ్యానికి ఇదెంత ప్రమాదకరమైన విషయం!'' అని వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Jeff Overs / BBC
ఈ వ్యవహారంపై బీబీసీ చైర్మన్ సమీర్ షా పార్లమెంటరీ కమిటీకి సోమవారం రాతపూర్వక నివేదిక అందించనున్నారు. దీనికి ముందే వీరిద్దరూ రాజీనామాలు చేశారు.
రాజీనామాలపై స్పందించిన సమీర్ షా, "బీబీసీకి ఇది దుర్దినం. టిమ్ డేవీకి తన పదవీ కాలంలో నా నుంచి, బీబీసీ బోర్డు నుంచి సంపూర్ణ మద్దతు ఉంది" అన్నారు.
''ఏదేమైనా.. ఆయనపై వ్యక్తిగతంగా, వృత్తిపరంగా కొనసాగిన ఒత్తిడిని నేను అర్థం చేసుకోగలను. అదే ఈ నిర్ణయానికి దారితీసింది. బీబీసీ బోర్డు ఆయన నిర్ణయాన్ని, దాని వెనకున్న కారణాలను గౌరవిస్తుంది.''
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














