స్కూటర్లకు జీపీఎస్ పరికరం పెట్టి పట్టపగలే ఇంట్లో దోపిడీ, ఈ ముఠా ఎలా దొరికిందంటే..

కోయంబత్తూరులో కొత్త తరహా దొంగతనం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, స్కూటర్లకు జీపీఎస్ పరికరం అమర్చిన దోపిడీ దొంగలు
    • రచయిత, జేవియర్ సెల్వకుమార్
    • హోదా, బీబీసీ తమిళ్

తమిళనాడులోని కోయంబత్తూరులో హైటెక్ టెక్నాలజీని ఉపయోగించి పట్టపగలు ఇంట్లో దోపిడీ చేసిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు.

దొంగతనానికి ప్లాన్‌ చేసిన ఇంట్లోని వ్యక్తులు నడిపే స్కూటర్లకు జీపీఎస్‌ పరికరాన్ని అమర్చి వారి కదలికలను ట్రాక్ చేస్తూ ఈ దోపిడీకి పాల్పడ్డారు.

ఎవరూ లేని ఇంట్లో జరిగిన దోపిడీ గురించి పోలీసులకు క్లూ ఎలా దొరికింది? దోపిడీ ముఠాను ఎలా పట్టుకున్నారు?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పట్టపగలే దోపిడీకి పాల్పడ్డ దొంగలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జీపీఎస్ సాయంతో ఇంట్లోవారి కదలికలపై నిఘా పెట్టారు ( ప్రతీకాత్మక చిత్రం)

దోపిడీ ఎలా జరిగింది?

కోయంబత్తూరు నగరం పరిధిలోని ఆర్‌ఎస్ పురం పోలీస్ స్టేషన్‌లో అక్టోబర్ 21న దొంగతనం కేసు (కేసు నెం: 352/2024) నమోదైంది. స్థానికంగా ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న కుమార్ అనే వ్యక్తి ఈ ఫిర్యాదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో దోపిడీకి సంబంధించిన వివరాలు పొందుపరిచారు.

ఆర్‌ఎస్ పురం వీకేవీ రోడ్డులో కుమార్‌కు కిరాణా దుకాణం, రెస్టరెంట్ ఉన్నాయి. తమ ఇద్దరు పిల్లలను ఉదయం పాఠశాలకు పంపి ఇంటికి తాళం వేసి భార్యతో కలిసి కుమార్ ఉదయం పదిన్నర గంటలకు దుకాణానికి వెళ్లేవారు. అదే ఇంట్లో కింది అంతస్తులో ఓనర్ సెల్వరాజ్ నివసిస్తున్నారు.

అక్టోబరు 21న మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో కుమార్‌కు ఫోన్ చేసిన సెల్వరాజ్ వెంటనే ఇంటికి రమ్మని పిలిచారు. కుమార్ అక్కడికి వెళ్లి చూడగా ఆయన ఇంటి తాళం పగులగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా రెండు బీరువాలు పగులగొట్టి ఉన్నాయి. దొంగలు 60 సవర్ల నగలు, రూ.14 వేల నగదు దోచుకెళ్లారు.

జీపీఎస్, యాప్, మొబైల్

ఫొటో సోర్స్, Amazon

ఫొటో క్యాప్షన్, కార్లలో, టూ వీలర్లలో ఇలాంటి జీపీఎస్ పరికరాలను ఇన్‌స్టాల్ చేస్తారు

కారులో హెల్మెట్ పెట్టుకుని వచ్చిన దొంగలు

పై అంతస్తు నుంచి ఇద్దరు వ్యక్తులు హెల్మెట్‌తో కిందకు వస్తుండడం చూసిన ఇంటి యజమాని సెల్వరాజ్ మీరెవరు? అని అడిగారు. వారిద్దరూ ఆగకుండా పరుగెత్తుకుంటూ వెళ్లి బయట పార్క్ చేసి ఉన్న కారు ఎక్కి పూల మార్కెట్ వైపు దూసుకెళ్లారు. సెల్వరాజ్‌తో పాటు పక్కనే దుకాణం నడుపుతున్న ఓ మహిళ కేకలు వేసినా వారు కారు ఆపలేదు.

ఆ తర్వాత సెల్వరాజ్ పైకి వెళ్లి చూడగా ఇంటి తాళం పగులగొట్టి ఉంది. వెంటనే కుమార్‌కు సమాచారమిచ్చారు.

పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఈ సమాచారం అంతా ఉంది. కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆ ఇంట్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. దొంగలిద్దరూ హెల్మెట్ ధరించి ఉండడంతో వారిని గుర్తించలేకపోయారు.

అయితే, ఏడు రోజుల్లోనే వారిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని కేరళకు చెందిన జహీర్ హుస్సేన్, మోనిజ్‌లుగా గుర్తించారు. ప్రస్తుతం ఇద్దరూ కోయంబత్తూరు సెంట్రల్ జైలులో ఉన్నారు.

ఈ దొంగలు తమను తాము రక్షించుకోవడానికి ఉపయోగించిన అధునాతన సాంకేతికతల గురించి, వారిని అరెస్టు చేయడానికి ఉపయోగించిన దర్యాప్తు పద్ధతులను ఆర్‌ఎస్ పురం పోలీసులు బీబీసీకి వివరించారు.

వాహనంలో మాగ్నెటిక్ GPS పరికరం

‘‘దోపిడీ జరిగిన ఇంట్లోని సీసీటీవీ ఫుటేజీలో వ్యక్తులను గుర్తించలేకపోయాం. ఆ తర్వాత వారు ఉపయోగించిన కారు నంబర్‌తో వెతికాం. ఆ కారుపై కేరళ కోడ్‌తో ఉన్న రిజిస్ట్రేషన్ నంబర్ నకిలీదని తేలింది. అదే రంగులో ఉన్న కారు ఆ ప్రాంతంలో ఎక్కడో ఉన్నట్టు మరో సీసీటీవీ ఫుటేజీలో గుర్తించాం. కారు ఒరిజినల్ నంబర్‌ తెలిసిన తర్వాత, ఆ దిశగా దర్యాప్తు చేశాం. చేరన్ పట్టణంలోని ఓ ప్రాంతంలో రోజుకు రూ.1,750 చెల్లించి కారును అద్దెకు తీసుకున్నట్టు తేలింది. కారును అద్దెకు తీసుకున్నప్పుడు, మెసేజ్ ద్వారా తమ నెంబర్‌ను నిర్ధరిస్తారు. ఆ నంబర్‌ ఆధారంగా దర్యాప్తు జరపగా, ఆ మొబైల్ ఫోన్‌ను ఏ టవర్ల పరిధిలో, ఏ రోజు, ఏ సమయంలో ఉపయోగించారో, వారు కారును ఎక్కడ పార్క్ చేశారో.. అన్నీ తెలిశాయి’’ అని పోలీసులు వివరించారు.

వారు శుక్రవార్‌పేట్‌లోని ఓ దుకాణం వద్ద ఆగి తాళం పగులగొట్టే పనిముట్లను కొన్నారు. అక్కడున్న సీసీటీవీలో వారి ముఖాలు స్పష్టంగా కనిపించాయని పోలీసులు తెలిపారు.

‘‘వారిద్దరిలో జహీర్‌ హుస్సేన్‌పై ఇప్పటికే కోవిల్‌పాళయం, మెట్టుపాల్యం సహా కొన్ని పోలీస్‌స్టేషన్లలో కార్ల దొంగతనం కేసులు ఉన్నాయి. అన్నూర్‌లో జహీర్ హుస్సేన్‌పై మర్డర్ కేసు ఉంది’’ అని ఆర్‌ఎస్ పురం పోలీసులు తెలిపారు.

వారిని అరెస్టు చేసి విచారించారు. కుమార్, ఆయన భార్య రోజులో చాలా సేపు ఇంట్లో ఉండరన్న విషయం గమనించి వారింట్లో పెద్ద మొత్తంలో నగదు, నగలు ఉన్నాయన్న అంచనాతో దోపిడీకి పాల్పడ్టామని వారు పోలీసులకు చెప్పారు.

దొంగతనానికి ముందు కుమార్, ఆయన భార్య కదలికలపై నిఘా పెట్టేందుకు దొంగలు అనుసరించిన వ్యూహం గతంలో ఎప్పుడూ చూడలేదని ఆర్‌ఎస్ పురం పోలీసులు తెలిపారు.

“కుమార్‌కు, ఆయన భార్యకు వేర్వేరు టూ వీలర్స్ ఉన్నాయి. వారి షాపుకు ఆ దొంగలు తరచూ వచ్చేవారు. ఆ క్రమంలో కుమార్, ఆయన భార్యలకు తెలియకుండా వారి టూ వీలర్స్‌కు 'మాగ్నెటిక్ జీపీఎస్' పరికరాన్ని అమర్చారు. దాని ఆధారంగా భార్యాభర్తలిద్దరూ షాపులో ఉన్నారని నిర్ధరించుకుని వారి ఇంట్లోకి వెళ్లి పట్టపగలు చోరీకి పాల్పడ్డారు’’ అని పోలీసులు వివరించారు.

జీపీఎస్, కార్లు, భద్రత

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పిల్లల భద్రత కోసం కార్లలో జీపీఎస్ పరికరాలు ఏర్పాటు చేస్తుంటారు

పిల్లల భద్రతకు...

‘‘మా ద్విచక్ర వాహనాల్లో జీపీఎస్ పరికరాన్ని అమర్చారన్న సంగతి నాకు తెలియదు. దొంగలు నా బండిలో పెట్టామని చెప్పిన తర్వాత, మాగ్నెటిక్ జీపీఎస్‌ పరికరాన్ని పోలీసులు నా బండి నుంచి బయటకు తీశారు. వారు దీన్ని ఎప్పుడు ఇన్‌స్టాల్ చేశారో, ఎలా చేశారో నేను గుర్తించలేను. వాళ్లు చాలా కాలంగా మమ్మల్ని గమనిస్తున్నట్టున్నారు’’ అని కుమార్ చెప్పారు.

‘‘అత్యాధునిక మాగ్నెటిక్ జీపీఎస్‌ పరికరాన్ని కార్లు, ద్విచక్ర వాహనాల్లో అమర్చవచ్చు. ఇవి ఆన్‌లైన్‌లో రూ.1,400కి అందుబాటులో ఉన్నాయి’’ అని అటవీశాఖలో జీపీఎస్ వర్క్ చేస్తున్న పరిశోధకులు మోహన్ చెప్పారు.

అలాగే, “వాయిస్ రికార్డ్ చేసే జీపీఎస్ పరికరాలు రూ.3,000 ధరకు అందుబాటులో ఉన్నాయి. ఇవి వాహనంలో ఒక భాగం లాంటివి. అత్యంత శక్తివంతమైన అయస్కాంతంతో వాహనంలోని లోహ భాగానికి దీన్ని అతికిస్తే, ఎవరూ సులభంగా గుర్తించలేరు. వాహనం గురించి కాస్త ఎక్కువగా తెలిసిన వారు మాత్రమే దానిని గుర్తించగలరు” అని ఆయన చెప్పారు.

“ఇలాంటి జీపీఎస్ పనిచేయడానికి బ్యాటరీ అవసరం. ఇంతకు ముందు వీటిని కార్లలోని బ్యాటరీలకు కనెక్ట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు మొబైల్ ఫోన్‌లలో వాడే లిథియం బ్యాటరీతో నడిచే హ్యాండ్‌హెల్డ్ 'GPS' పరికరాలు వచ్చాయి’’ అని కారు వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్న మెకానికల్ ఇంజనీర్ జయకుమార్ బీబీసీతో చెప్పారు.

“కార్లలో మరమ్మతులను సెన్సార్ ద్వారా స్కాన్ చేయడానికి సహాయపడే డయాగ్నస్టిక్ ట్రబుల్ కోడ్ కప్లర్ ఉంటుంది. దీనికి జీపీఎస్ అమర్చితే బ్యాటరీ అవసరం లేదు. మొబైల్‌లో యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకుని, కనెక్ట్ చేసుకుంటే మొబైల్‌లోనే వాహనం కదలికను గమనించవచ్చు. పిల్లల భద్రత కోసం చాలా మంది తమ కార్లలో వీటిని అమర్చుకుంటారు’’ అని ఆయన వివరించారు.

“ఈ పరికరాన్ని వాహనానికి అమరిస్తే.. ఆ వాహనం ఎక్కడి నుంచి వస్తోంది, ఎంత వేగంగా నడుస్తోంది అనే విషయాలను ట్రాక్ చేయగలదు. వాహనదారులు అప్రమత్తంగా ఉండటం తప్ప మరో మార్గం లేదు’’ అని పరిశోధకులు మోహన్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)