వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్: ఫైనల్లో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా చరిత్రాత్మక విజయం

ఫొటో సోర్స్, Getty Images
అంతర్జాతీయ క్రికెట్‌లో దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాను ఓడించి ప్రపంచ టెస్ట్ చాంపియన్‌గా నిలిచింది. దక్షిణాఫ్రికా ఒక ఐసీసీ కప్ సాధించడం ఇదే తొలిసారి.
ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఐదు వికెట్ల తేడాతో ఓడించడం ద్వారా దక్షిణాఫ్రికా ఈ ఘనతను సాధించింది.
ఐడెన్ మార్క్‌రమ్ దక్షిణాఫ్రికా జట్టులో అందరికన్నా ఎక్కువ పరుగులు (136 ) చేశాడు. కెప్టెన్ టెంబా బవుమా 66 పరుగులు చేశాడు.
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ అందరికన్నా ఎక్కువగా మూడు వికెట్లు తీశాడు.


ఫొటో సోర్స్, Getty Images
ఫైనల్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకుని, ఆస్ట్రేలియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 212 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 138 పరుగులు మాత్రమే చేయగలిగింది.
రెండో ఇన్నింగ్స్‌లో మెరుగ్గా రాణించిన దక్షిణాఫ్రికా బౌలర్లు ఆస్ట్రేలియాను 207 పరుగులకు కట్టడిచేశారు.
ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్‌లో 58 పరుగులు చేసిన మిచెల్ స్టార్క్‌దే ఎక్కువ స్కోరు.
దక్షిణాఫ్రికా బౌలర్ కగిసో రబాడా నాలుగు వికెట్లు తీశాడు.
ఆస్ట్రేలియా ఇచ్చిన 282 పరుగుల లక్ష్యాన్ని ఐదు వికెట్లు మిగిలి ఉండగానే దక్షిణాఫ్రికా ఛేదించింది.
ఆస్ట్రేలియా 2023లో, న్యూజీలాండ్ 2021లో ఐసీసీ టెస్ట్ చాంపియన్‌షిప్ గెలుచుకున్నాయి. ఆ రెండు జట్లు ఫైనల్‌లో భారత్‌ను ఓడించి టైటిల్ గెలుపొందాయి.

ఫొటో సోర్స్, Getty Images
విజయం తర్వాత, కెప్టెన్ టెంబా బవుమా మాట్లాడుతూ, ఈ మ్యాచ్‌లో తమ జట్టు ఆటతీరు చాలా బాగుందని అన్నాడు.
‘‘మ్యాచ్ సమయంలో కొన్నిరోజులు చాలా ప్రత్యేకంగా గడిచాయి. ఒక్కోసారి మేం సౌతాఫ్రికాలోనే ఉన్నామా అనిపించింది. కష్టపడి పనిచేశాం. ఆత్మవిశ్వాసంతో వచ్చాం. చాలాసార్లు మేం విజయం దగ్గరికి వచ్చి ఆగిపోయాం. ఈ గెలుపు రాబోయే అనేక విజయాల్లో ఒకటి అవుతుందని ఆశిస్తున్నాను" అని బవుమా అన్నాడు. ఈ మ్యాచ్ ఇంగ్లండ్‌లోని లార్డ్స్ మైదానంలో జరిగింది.
కగిసో రబాడా, ఐడెన్ మార్క్‌రమ్ ఈ సందర్భంగా బవుమా మెచ్చుకున్నాడు.
"రబాడ గొప్ప ఆటగాడు. కొన్నిరోజుల కిందట నేను హాల్ ఆఫ్ ఫేమ్ ఇండక్టీస్‌కు వెళ్లాను, కొన్నేళ్లలో రబాడ కూడా అక్కడ స్థానం సంపాదించుకుంటాడని అనుకుంటున్నా. ఐడెన్ మార్క్‌రమ్ అద్భుతమైన వ్యక్తి. తనదైన శైలిలో ఆడాడు. ఈ విజయం మా మీద ఉన్న అన్ని సందేహాలకు ముగింపు " అని బవుమా అన్నాడు.
మ్యాచ్‌లో మార్క్‌రమ్ సెంచరీ సాధించడంతోపాటు, రెండు వికెట్లు కూడా తీశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














