రేవంత్ రెడ్డి వేషధారణలో వినాయకుడు, తొలగించాలంటూ పోలీసులకు రాజాసింగ్ ఫిర్యాదు

- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేషధారణలో వినాయకుడిని ప్రతిష్ఠించడంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్.
హైదరాబాద్‌లోని ఆఘాపురాలో తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో ఈ వినాయక మండపాన్ని ఏర్పాటు చేశారు.
దీనిపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, తమ ఇష్టప్రకారం విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నామని సాయి కుమార్ చెబుతున్నారు.


'తెలంగాణ రైజింగ్' అంశంతో మండపం
ఈ వినాయక మండపంపై రాష్ట్ర ప్రభుత్వ నినాదం 'తెలంగాణ రైజింగ్' అని రాసి ఉంది. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బొమ్మ, మరోవైపు '1' అంకె వేసి తెలంగాణ మ్యాప్ వేసి కనిపిస్తోంది.
ఇందులో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం ప్యాంటు, షర్టు, కాళ్లకు బూట్లు, మెడలో కండువా వేసుకుని కనిపిస్తుంది. బయట మండపంపై ఉన్న రేవంత్ రెడ్డి చిత్రం కూడా అదే తరహాలో ఉంటుంది.

మండపం తొలగించాలి: రాజాసింగ్
రేవంత్ రెడ్డి వేషధారణలో విగ్రహంపై సోషల్ మీడియాలో వివాదం రేగింది.
ఈ విషయంపై గోషామహల్ ఎమ్మెల్యే టి.రాజాసింగ్, హైదరాబాద్ పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.
‘‘రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి. కానీ ఆయన మాకు దేవుడు కాదు. ఇలాంటి తప్పుడు ప్రాతినిధ్యం హిందూ సమాజం మనోభావాలను దెబ్బతీస్తోంది'' అని పేర్కొన్నారు.
పోలీసు శాఖ వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మత విశ్వాసాలపై గౌరవాన్ని నిలబెట్టడానికి, సామరస్యాన్ని కాపాడుకోవడానికి మండపం తొలగించాలని కోరారు.
దీనిపై మండపం నిర్వాహకుడు మెట్టు సాయి కుమార్ బీబీసీతో మాట్లాడారు.
''తెలంగాణ రైజింగ్ నినాదంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎంకు ఎదురయ్యే విఘ్నాలు తొలగిపోవాలనే ఉద్దేశంతో ఆ విధంగా వినాయకుడిని ఏర్పాటు చేశాను'' అని చెప్పారు.
గతంలో కొందరు పవన్ కల్యాణ్, ఆర్ఆర్ఆర్ సినిమా థీమ్ లతో మండపాలు, వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేశారని, ఇప్పుడు రేవంత్ రెడ్డిపై అభిమానంతో ఇలా చేశామని చెప్పారు సాయి కుమార్.
రాజాసింగ్ ఫిర్యాదు నేపథ్యంలో వినాయక మండప నిర్వాహకులకు సమాచారం ఇచ్చామని హబీబ్ నగర్ ఇన్‌స్పెక్టర్ పురుషోత్తమ రావు బీబీసీకి తెలిపారు. అయితే, ఆ మండపం బహిరంగ ప్రదేశంలో లేదని, సాయికుమార్ తన ఇంటి ఆవరణలో ఏర్పాటుచేశారు కాబట్టి, అది ఆయన వ్యక్తిగత వ్యవహారం కిందకు వస్తుందని పురుషోత్తమ రావు అన్నారు.
సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు
దీనిపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
''ఇది మంచిది కాదు'' అని వినయ్ అనే యూజర్ ఎక్స్ వేదికగా వార్తా సంస్థ ఏఎన్ఐ పెట్టిన మండపం వీడియోపై కామెంట్ చేశారు.
''ఇది సనాతన ధర్మాన్ని అవమానించడమే'' అని నందిని అనే మరో యూజర్ కామెంట్ చేశారు.
''ఆంధ్ర ప్రదేశ్‌లో పవన్ కల్యాణ్, గబ్బర్ సింగ్ సినిమా వినాయకుడు బొమ్మలు పెట్టారు'' అని కృష్ణారావు అనే యూజర్ 'ఎక్స్'లో పోస్టు పెట్టారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














