రిషి సునక్: సామర్థ్యం ఉన్నా ప్రధాని కావడానికి ఆయన ఒంటి రంగు కూడా అడ్డంకిగా మారిందా?

బ్రిటన్ మాజీ ఆర్థికశాఖ మంత్రి రిషి సునక్

ఫొటో సోర్స్, Twitter/Rishi Sunak

    • రచయిత, జుబైర్ అహ్మద్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బ్రిటన్ ప్రధాని పదవి కోసం జరిగిన రేసులో రిషి సునక్ ఓటమి దాదాపుగా ఊహించినదే. బోరిస్ జాన్సన్ మంత్రివర్గంలో బ్రిటన్ ఆర్థికమంత్రిగా తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నప్పటికీ అది ఆయన్ను విజయతీరాలకు చేర్చలేక పోయింది.

రిషి సునక్ ప్రత్యర్థి లిజ్ ట్రస్, 81,326 ఓట్లతో కన్జర్వేటివ్ పార్టీ నాయకురాలిగా ఎన్నికయ్యారు. 57 శాతం ఓట్లను ఆమె గెలుచుకున్నారు.

రిషి సునక్‌కు వచ్చిన ఓట్లు 60,399.

ఈ రేసులో గెలిచి ఉంటే రిషి సునక్ చరిత్ర సృష్టించి ఉండేవారు. బ్రిటన్‌కు ప్రధాని అయిన తొలి నాన్-వైట్ వ్యక్తిగా నిలిచి ఉండేవారు. అంతేకాదు భారత సంతతికి చెందిన తొలి వ్యక్తి కూడా గుర్తింపు పొందేవారు.

అమెరికా అధ్యక్షుడైన తొలి నల్లజాతీయునిగా 2008లో బరాక్ ఒబామా చరిత్ర సృష్టించారు. ఒకవేళ గెలిచి ఉంటే రిషి సునక్ విజయం కూడా బ్రిటన్‌లో ఇటువంటి చరిత్రనే లిఖించి ఉండేది.

రిషి సునక్‌ కంటే ముందు నుంచే అనేక మంది దక్షిణాసియా సంతతికి చెందిన వారు బ్రిటన్‌లో మేయర్లుగా మంత్రులుగా పదవులు చేపట్టారు. ప్రీతి పటేల్, సాజిద్ జావిద్, సాదిఖ్ ఖాన్ వంటి వారు ఈ జాబితాలో ఉన్నారు. కానీ ఇంతవరకు ఎవరూ బ్రిటన్ ప్రధాని పదవి కోసం పోటీపడలేదు. ఆ దేశంలోని మైనార్టీల నుంచి ఇంత వరకు ఎవరూ ప్రధాని పదవి వైపు చూడలేదు.

ఆ చరిత్రను తిరగరాశారు రిషి సునక్. 2020లో అత్యంత కీలకమైన బ్రిటన్ ఆర్థికశాఖ మంత్రి పదవిని చేపట్టడమే కాకుండా ఆ దేశ ప్రధాని రేసులోను నిలబడ్డారు.

బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న లిజ్ ట్రస్

ఫొటో సోర్స్, Twitter/Liz Truss

ఫొటో క్యాప్షన్, బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న లిజ్ ట్రస్

'భారత్‌తో పోలిస్తే మతపరమైన, జాతి పరమైన మైనార్టీలకు బ్రిటన్‌ పార్లమెంటులోనే ఎక్కువ ప్రాతినిధ్యం ఉంది. ఆయనకున్న ప్రత్యేకమైన జాతి గుర్తింపు వల్ల రిషి సునక్ ఎన్నిక చరిత్ర సృష్టించి ఉండేది' అని మిడిల్‌సెక్స్ యూనివర్సిటీలో పని చేస్తున్న డాక్టర్ నీలిమ రైనా అన్నారు.

భారత సంతతికి చెందిన వారు కొన్ని దేశాలకు ప్రధానులు, అధ్యక్షులు అయ్యారు. మారిషస్, గుయానా, ఐర్లాండ్, పోర్చుగల్, ఫీజీ వంటి దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. కన్జర్వేటివ్ పార్టీ నాయకునిగా గెలిచి ఉంటే 42 ఏళ్ల రిషి సునక్ పేరు కూడా ఈ జాబితాలో చేరి ఉండేది.

భారత సంతతికి చెందిన వారు సుమారు 30 దేశాల్లో అత్యున్నత పదవులు చేపట్టే స్థాయికి ఎదిగారు. ఈ విషయంలో ప్రపంచంలో మరొక దేశం భారత్ దరిదాపుల్లో కూడా లేదు.

బ్రెగ్జిట్, ఆ తరువాత కరోనా సంక్షోభంతో బ్రిటన్ ఆర్థికవ్యవస్థ గడ్డుకాలం ఎదుర్కొంటున్న సమయంలో ఆ దేశ ఆర్థికశాఖ పగ్గాలు చేపట్టారు రిషి సునక్. ఆ సమయంలో ఆయన పనితీరుకు ప్రశంసలు దక్కాయి.

భిన్నత్వానికి బ్రిటన్ సమాజం ఒక చక్కని ఉదాహరణ అని చెబుతుంటారు. రిషి సునక్ గెలిచి ఉంటే ఆ ఇమేజ్ మరింత పెరిగి ఉండేది.

భార్య అక్షత మూర్తితో రిషి సునక్

ఫొటో సోర్స్, Twitter/Rishi Sunak

ఫొటో క్యాప్షన్, భార్య అక్షత మూర్తితో రిషి సునక్

తాను హిందువునని రిషి సునక్ ప్రకటించారు. బయట కూడా ఆయన తన మత సంప్రదాయాలను, విశ్వాసాలను ఆచరిస్తూ కనిపిస్తారు. 2015లో తొలిసారి బ్రిటన్ పార్లమెంట్‌కు ఎన్నికైనప్పుడు భగవద్గీత మీద ఆయన ప్రమాణం చేశారు. ఆయన గెలుపు కోసం బ్రిటన్‌లోని భారత సంతతి ప్రజలు పూజలు సైతం చేశారు.

అలా పూజలు చేసిన వారిలో 75 ఏళ్ల నరేశ్ సొంచట్ల ఒకరు. రిషి సునక్ స్వస్థలమైన సౌతంప్టన్‌కు చెందిన నరేశ్, తనకు రిషి చిన్నతనం నుంచి తెలుసని చెబుతున్నారు. 'రిషి ప్రధాని మంత్రి అవుతాడని అనుకుంటున్నా. కానీ ఆయన కాలేడు. ఆయన ఒంటి రంగే అందుకు కారణం' అని నరేశ్ అన్నారు.

కొద్ది రోజుల కిందట బీబీసీ ఇండియా బృందం బ్రిటన్‌లో పర్యటిస్తున్నప్పుడు నరేశ్ వంటి ఆసియా సంతతి ప్రజల్లో ఒకరకమైన ఆందోళన కనిపించింది. రిషి సునక్ ఒంటి రంగు ఆయన ప్రధాని కావడానికి అవరోధం కావొచ్చని వారు భయపడ్డారు.

కన్జర్వేటివ్ పార్టీలోని సభ్యుల సామాజిక నేపథ్యమే ఈ భయానికి కారణం. కన్జర్వేటివ్ పార్టీలో లక్షా 60వేల మందికి పైగా సభ్యులు(పెయిడ్) ఉన్నారు. వీరిలో 97శాతం మంది తెల్లవారు. అందులోనూ 50శాతానికి పైగా ఉన్న మగవారే. మొత్తం సభ్యుల్లో 44శాతం మంది వయసు 65 ఏళ్ల పైనే.

కన్జర్వేటివ్ పార్టీలోని యువ నేతలు రిషి సునక్‌ వైపు మొగ్గినట్లు కనిపించగా సీనియర్లు మాత్రం తమ మద్దతును లిజ్ ట్రస్‌కే ఇచ్చారు. కొద్ది రోజుల కిందట బీబీసీ ఇండియాతో మాట్లాడిన కన్జర్వేటివ్ పార్టీ సీనియర్ నేతలు, 'మాకు రిషి సునక్ అంటే ఇష్టం. కానీ మా ఓటు మాత్రం లిజ్ ట్రస్‌కే' అని తేల్చి చెప్పారు.

విశ్లేషకుల ప్రకారం లిజ్ ట్రస్ గెలుపు ఒక విషయాన్ని స్పష్టం చేసింది. శ్వేతజాతీయులు కాని వ్యక్తులను బ్రిటన్ ప్రధాని పదవిలో చూసేందుకు కన్జర్వేటివ్ పార్టీ ఇంకా సిద్ధమవ్వలేదు అనే విషయం తేటతెల్లమైంది.

బ్రిటన్ మాజీ ఆర్థికశాఖ మంత్రి రిషి సునక్

ఫొటో సోర్స్, Twitter/Rishi Sunak

రిషి సునక్ ఓటమికి ఆయన ఒంటి రంగు మాత్రమే కారణం కాదని, ఆయన పాలసీలు కూడా కావొచ్చని బార్కలేస్ బ్యాంక్‌కు చెందిన సంజయ్ సక్సేనా అంటున్నారు.

'ఇద్దరు నేతల ఆర్థిక విధానాలు, కార్యక్రమాలను చూసిన తరువాతే కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు ఓటు వేసి ఉంటారు.

నేను 20 ఏళ్లుగా ఈ దేశంలో ఉంటున్నా. ఈ దేశంలో భిన్నత్వాన్ని చూశాను. భారత సంతతి ప్రజలు ఇక్కడ ఉన్నత స్థానాలకు ఎదగడాన్ని చూశాను. ఆయన ఒంటి రంగు వల్లే రిషి సునక్ ఓడి పోయారని నేను అనుకోవడం లేదు' అని సంజయ్ సక్సేనా చెప్పారు.

ప్రధాని కాగానే పన్నులు తగ్గిస్తానని లిజ్ ట్రస్ హామీ ఇచ్చారు. ఇది కన్జర్వేటివ్ పార్టీ ఓటర్లతోపాటు ఇతర ప్రజానీకాన్ని బాగా ఆకట్టుకుంది. కన్జర్వేటివ్ పార్టీకి మధ్యతరగతి ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.

నేషనల్ ఇన్సూరెన్స్ తగ్గించడం వంటి లిజ్ ట్రస్ హామీలు కూడా ప్రజలను ఆకర్షిస్తున్నాయని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. ఆర్థికశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఏడాది ఏప్రిల్‌లో నేషనల్ ఇన్సూరెన్స్ పెంచారు.

త్వరలో కార్పొరేట్ ట్యాక్స్ పెంచనున్నారు. ఈ నిర్ణయాన్ని రద్దు చేస్తానని లిజ్ ట్రస్ హామీ ఇచ్చారు. అధిక పన్నులు ఆర్థికవ్యవస్థ ప్రగతికి అవరోధమనేది ఆమె వాదన.

అయితే తాత్కాలిక ఉపశమనం ఇవ్వడం కంటే ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టడమే తన తొలి ప్రాధాన్యమని రిషి సునక్ చెబుతూ వచ్చారు. అందువల్ల పన్నులను వెంటనే తగ్గించడం సాధ్యం కాదని తెలిపారు. అబద్ధపు హామీలు ఇచ్చి తాను ప్రజలను మోసం చేయలేనని ఆయన అన్నారు. తాను ఓటమినినైనా అంగీకరిస్తా కానీ ప్రజలకు అబద్ధాలు చెప్పలేనని అంటూ ఉండేవారు.

బ్రిటన్ మాజీ ఆర్థికశాఖ మంత్రి రిషి సునక్

ఫొటో సోర్స్, Twitter/Rishi Sunak

రిషి సునక్ అత్యంత సంపన్నుడని, ఆయనకు సాధారణ ప్రజల కష్టాలు అర్థం కావు అనేది బ్రిటన్ ప్రజల్లో ఉన్న ఒక నమ్మకం. ఇటీవల విడుదల చేసిన ఒక సర్వే ప్రకారం బ్రిటన్‌లోని 250 సంపన్న కుటుంబాల్లో రిషి సునక్ కుటుంబం ఒకటి.

కానీ, పుట్టుకతోనే రిషి సునక్ శ్రీమంతుడు కాదు. సౌతంప్టన్‌లోని ఒక మధ్యతరగతి కుటుంబంలో ఆయన జన్మించారు. చిన్నప్పుడు తరచూ రిషి సునక్ దేవాలయానికి వెళ్తూ ఉండేవారు. నాడు రిషిని చూసిన వారు... ఆయన చాలా సాధారణ వ్యక్తి అని, చాలా కష్టపడి ఈ స్థాయికి చేరారని బీబీసీకి చెప్పారు.

'నేను మంచి స్కూల్‌కు వెళ్లడానికి నా తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేశారు. వించెస్టర్ కాలేజ్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలలో చదువుకునే గొప్ప అవకాశం నాకు లభించింది' అని రిషి సునక్ తన వెబ్‌సైట్‌లో రాసుకున్నారు.

ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కూతురు అక్షత మూర్తిని రిషి సునక్ పెళ్లి చేసుకున్నారు. 2009లో బెంగళూరులో వారి వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు. అక్షత మూర్తి సంపద సుమారు రూ.7 వేల కోట్లు.

అమెరికాలోని సిలికాన్ వ్యాలీ నుంచి బెంగళూరు వరకు అనేక కంపెనీల్లో అక్షత మూర్తితో కలిసి రిషి సునక్ ప్రారంభించిన ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ పెట్టుబడులు పెట్టింది.

బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో రిషి సునక్

ఫొటో సోర్స్, No.10

ఫొటో క్యాప్షన్, బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో రిషి సునక్

బోరిస్ జాన్సన్‌ను వెన్నుపోటు పొడిచారంటూ కొందరు కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు రిషి సునక్ మీద కోపంగా ఉన్నారు. ఈ ఏడాది జులైలో తన మంత్రి పదవికి రిషి సునక్ రాజీనామా చేసిన తరువాతనే చాలా మంది బోరిస్ జాన్సన్ మంత్రి మండలి నుంచి వైదొలిగారు. చివరకు బోరిస్ కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. రాజకీయంగా రిషి సునక్ ఎదగడానికి సాయం చేసిన బోరిస్‌కే ఆయన చేటు చేశారని కొందరు భావిస్తున్నారు. రిషి వైఖరి మీద బోరిస్ చాలా కోపంగా ఉన్నట్లు కూడా చెబుతున్నారు.

నాన్-వైట్ ప్రధానిని చూసేందుకు కన్జర్వేటివ్ పార్టీ సిద్ధంగా లేకపోయినా బ్రిటన్ ప్రజలు సిద్ధంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. లిజ్ ట్రస్‌తో పోలిస్తే ప్రజల్లో రిషి సునక్‌కు ఉన్న పాపులారిటీనే ఎక్కువ.

సాధారణ ఎన్నికలు అయి ఉంటే రిషి సునక్ గెలిచి ఉండేవారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆ రకంగా చూస్తే 2024 వరకు ఆయన ఆగాల్సి ఉంటుంది.

వీడియో క్యాప్షన్, 25 కింగ్ కోబ్రా పిల్లలను రక్షించిన ఈస్టర్న్ ఘాట్ వైల్డ్ లైఫ్ సొసైటీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)