తైవాన్‌లో నాన్సీ పెలోసి: అమెరికా-చైనా మధ్య దౌత్య తుపానుకు కేంద్రంగా నిలిచిన రాజకీయ నేత

నాన్సీ పెలోసీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికా హౌస్ స్పీకర్‌గా ఎన్నికైన తొలి మహిళ నాన్సీ పెలోసీ సుదీర్ఘకాలంగా ఎల్జీబీటీ సపోర్టర్‌గా ఉన్నారు.

అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్ నాన్సీ పెలోసీ వివాదాస్పద తైవాన్ పర్యటన అమెరికా, చైనాల మధ్య రాజకీయ వేడికి పెంచుతోంది.

ఆమె రాజకీయ జీవితాన్ని మొదటి నుంచీ గమనించినవారికి ఇదేమీ ఆశ్చర్యం కలిగించదు.

40 ఏళ్ల రాజకీయ జీవితంలో పెలోసీ చాలాసార్లు చైనాను తీవ్రంగా విమర్శించారు.

1991లో ఆమె బీజింగ్‌లో పర్యటించారు. అప్పుడు ఆమె తియాన్‌మెన్ స్క్వేర్ హత్యాకాండ (1989) బాధితులకు మద్దతుగా ఆ ప్రదేశంలో బ్యానర్ పట్టుకున్నారు.

అది చైనా అధికారులకు ఆగ్రహం, ఆశ్చర్యం కలిగించింది. ఇవన్నీ కూడా చైనా పట్ల ఆమె వైఖరిని స్పష్టం చేస్తాయి.

ఇప్పటికీ 82 ఏళ్ల పెలోసీ చైనాలో కమ్యూనిస్ట్ పాలనను తీవ్రంగా వ్యతిరేకిస్తారు. అందులో భాగంగా, బహిష్కరణకు గురైన టిబెటన్ నాయకుడు దలైలామాతో మైత్రీ సంబంధాలు కొనసాగిస్తున్నారు.

చైనాలో వీగర్ ముస్లింలు, ఇతర ముస్లింల అణచివేతను మారణహోమంగా గుర్తించాలని గత ఏడాది అమెరికా అధికారిక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వెనుక నాన్సీ పెలోసీ పాత్ర కూడా ఉంది.

"చైనాలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా గొంతు విప్పకపోతే (వాణిజ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని), ఇంకోచోట దాని గురించి మాట్లాడే అర్హత కోల్పోతారు" అని పెలోసీ జూలై 28న పొలిటికో అనే న్యూస్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.

1997 తరువాత అమెరికాకు చెందిన ఉన్నతాధికారులెవరూ తైవాన్‌లో అడుగుపెట్టలేదు. కొన్ని దశాబ్దాల తరువాత ఆ దేశంలో పర్యటిస్తున్న తొలి అమెరికా అధికారి ఆమె.

పెలోసీ తైవాన్ పర్యటనపై చైనా విరుచుకుపడింది. ఆమె సొంత దేశం అమెరికా కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జూలై 22న చేసిన ఒక ప్రకటనలో, పెలోసీ తైవాన్ పర్యటన "సముచితం కాదని" మిలటరీ భావిస్తున్నట్టు తెలిపారు. చైనా దీన్ని రెచ్చగొట్టే చర్యగా భావించవచ్చన్న ఆందోళన వ్యక్తం చేశారు.

అయితే, పెలోసీ తన పర్యటనను నేరుగా ధ్రువీకరించనప్పటికీ.. బైడెన్ మాటలకు తీవ్రంగా స్పందించారు.

"తైవాన్‌కు మనం మద్దతు ఇవ్వడం ముఖ్యమని నేను భావిస్తున్నాను" అన్నారు.

తైవాన్ తమ దేశంలో భాగమేనని, ఎప్పటికైనా తమ భూభాగంలో కలవాల్సిందేనని చైనా వాదిస్తోంది. అమెరికా, తైవాన్‌కు అధికారికంగా మద్దతు ఇవ్వకపోయినా, సొంత రక్షణకు ఆయుధాలు సరఫరా చేస్తుంది.

వైట్ హౌస్ పిక్నిక్‌లో బైడెన్, పెలోసీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బైడెన్, పెలోసీ ఒకే కూటమికి చెందినవారైనా, పెలోసీ తైవాన్ పర్యటనపై బైడెన్ అసంతృప్తి వ్యక్తం చేశారు .

రాజకీయాల్లోకి అడుగులు..

1940లో జన్మించిన నాన్సీ పెలోసీ, బాల్టిమోర్ మాజీ మేయర్ థామస్ డి'అలెసాండ్రో జూనియర్ కుమార్తె. 12 ఏళ్ల వయసులో ఆమె మొదటిసారి డెమొక్రాటిక్ పార్టీ సదస్సుకు హాజరయ్యారు. 20 ఏళ్ల వయసులో, అమెరికా అధ్యక్షుడు జాన్ కెనడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు.

తొలి రోజుల్లో ఆమె రాజకీయల్లో తెర వెనుక పనిచేసేవారు. కాలిఫోర్నియా రాష్ట్రంలో డెమొక్రాట్‌ల తరపున ప్రచారాల్లో, నిధుల సేకరణలో పాలుపంచుకునేవారు.

47 ఏళ్ల వయసులో ఆమె నేరుగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అప్పటికి ఆమె అయిదుగు పిల్లలు యూనివర్సిటీ చదువులకు వెళ్లిపోయారు. శాన్‌ఫ్రాన్సిస్కో కాంగ్రెస్ మహిళ సాలా బర్టన్ తన వారసురాలిగా ఉండమని అభ్యర్థించడంతో పెలోసీ ఆ పదవికి పోటీ చేశారు.

1987లో పెలోసీ ఆ సీటు గెలుచుకున్నారు. అప్పటి నుంచి కాంగ్రెస్‌లో శాన్‌ఫ్రాన్సిస్కో జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

అమెరికా హౌస్ ఆఫ్ స్పీకరుగా ఎన్నికైన తొలి మహిళ నాన్సీ పెలోసీ. హౌస్ ఆఫ్ స్పీకరుగా ఆమెకు ఇది మూడవ పదవీకాలం. అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు తరువాత మూడవ అత్యున్నత పదవి ఆమెదే.

అయితే, ఆమె రాజకీయ జీవితం పూర్తిగా చైనా పట్ల విమర్శతోనే నిండిపోలేదు.

1987లో నాన్సీ పెలోసీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1987లో పెలోసీ తొలిసారిగా కాంగ్రెస్‌ మహిళగా ఎన్నికయ్యారు.

పెలోసీ 2003 ఇరాక్ యుద్ధాన్ని బహిరంగంగా వ్యతిరేకించారు. 1980, 90లలో ఎల్జీబీటీ హక్కుల న్యాయవాదిగా వ్యవహరించారు. ఆ సమయంలో ఇలాంటి అంశాలను అమెరికా రాజకీయల్లోకి తీసుకురావడం చాలా అరుదు.

ఈ ఏడాది జూన్‌లో అబార్షన్లకు వ్యతిరేకంగా అమెరికా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఆమె తీవ్రంగా విమర్శించారు.

"నేడు అమెరికాలో పౌరులకు తమ తల్లుల తరాల కంటే తక్కువ స్వేచ్ఛ ఉంది" అని ఆ తీర్పు వెలువడిన తరువాత ఆమె అన్నారు.

"ఆ తీర్పు ముఖంపై చెంపదెబ్బ" అని అన్నారు.

అయితే, పెలోసీ కెరీర్, చైనాలో కమ్యూనిస్ట్ పాలనను వ్యతిరేకించడానికి పర్యాయపదంగా మారింది. ప్రస్తుత తైవాన్ పర్యటనతో ఆ అభిప్రాయం మరింత పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)