French elections: ఫ్రాన్స్ పార్లమెంటు ఎన్నికల్లో ‘లెఫ్ట్ - రైట్’ ఘన విజయాలు.. మెజారిటీ కోల్పోయిన మధ్యేవాద అధ్యక్షుడు మాక్రాన్

ఫొటో సోర్స్, Reuters
ఫ్రాన్స్ అధ్యక్షుడిగా వరుసగా రెండోసారి ఎన్నికై రెండు నెలలు కూడా గడవకముందే.. ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ ఫ్రాన్స్ జాతీయ అసెంబ్లీపై పట్టు కోల్పోయారు.
జాతీయ అసెంబ్లీకి తాజాగా జరిగిన ఎన్నికల్లో వామపక్ష కూటమి, మితవాద పార్టీలు బలం పుంజుకున్నాయి. దీంతో మాక్రాన్ మధ్యేవాద సంకీర్ణం మెజారిటీ కోల్పోయింది.
తమకు పటిష్టమైన మెజారిటీ అందివ్వాలంటూ మాక్రాన్ ఓటర్లకు ఇచ్చిన పిలుపు ఫలించలేదు. ఆయన సంకీర్ణం డజన్ల సంఖ్యలో సీట్లు కోల్పోయింది.
మాక్రాన్ ఇటీవలే నియమించిన ప్రధానమంత్రి ఎలిసబెత్ బోర్న్.. ఇది అనూహ్య పరిస్థితి అని అభివర్ణించారు.

ఫొటో సోర్స్, Reuters
అధ్యక్ష భవనం ఎలిసీ ప్యాలస్‌లో మాక్రాన్‌తో సుదీర్ఘ భేటీ అనంతరం ఆమె తన అధికారిక నివాసానికి చేరుకుంటుండగా.. పారిస్ నగరాన్ని ఓ తుపాను తాకింది.
ఆధునిక ఫ్రాన్స్‌లో ఇటువంటి నేషనల్ అసెంబ్లీ ఎన్నడూ ఏర్పడలేదని ఎలిసబెత్ చెప్పారు.
''జాతీయంగా, అంతర్జాతీయంగా మనం ఎదుర్కొంటున్న ప్రమాదాల నేపథ్యంలో.. (జాతీయ అసెంబ్లీలో) ఈ పరిస్థితి మన దేశానికి ముప్పు ఉందని చెప్తోంది'' అని పేర్కొన్నారు.
''సాధ్యమైన మెజారిటీని నిర్మించటానికి రేపటి నుంచి పనిచేస్తాం'' అని చెప్పారు.
అయితే.. జాతీయ అసెంబ్లీలో మిగతా రెండు పెద్ద బృందాలకు అధికార కూటమితో కలిసిపని చేసే ఆసక్తి ఏమాత్రం లేదు.

ఫ్రాన్స్‌ను పరిపాలించటం అసాధ్యమేమీ కాదని ఆర్థికశాఖ మంత్రి బ్రూనో లె మేరీ వ్యాఖ్యానించారు. కానీ అందుకు చాలా సృజనాత్మకత అవసరమన్నారు.
అతివాద వామపక్ష నేత జీన్-లూక్ మెలెంకాన్.. వామపక్ష ప్రధానస్రవంతి పార్టీలను ఏకం చేసి కమ్యూనిస్టులు, గ్రీన్‌లతో కలిపి 'నూపెస్' పేరుతో కూటమి కట్టి సాధించిన విజయాన్ని ఆస్వాదిస్తున్నారు.
అధ్యక్ష పార్టీ పూర్తిగా మట్టికరిచిందని, ఇప్పుడు తమ చేతుల్లో ప్రతి అవకాశమూ ఉందని ఆయన తన మద్దతుదారులతో పేర్కొన్నారు.
మరోవైపు, మారీన్ లె పెన్, ఆమె సారథ్యంలోని సంప్రదాయవాద నేషనలిస్ట్ పార్టీ బలం 8 సీట్ల నుంచి 89 సీట్లకు పెరగటంతో ఆనందోత్సాహాల్లో ఉన్నారు. ''జనం తీర్పు చెప్పారు. ఎమ్యాన్యుయెల్ మాక్రాన్ సాహసయాత్ర ముగిసింది. ఆయన మైనారిటీ ప్రభుత్వానికి దిగజారారు'' అని ఆమె పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Reuters
ఇక మితవాద రిపబ్లికన్ పార్టీతో కలిసి వర్కింగ్ మెజారిటీ నిర్మించవచ్చునని ప్రధానమంత్రి ఆశిస్తున్నట్లయితే.. వారి సందేశం అంత ప్రోత్సాహకరంగా లేదు. ఇది అధ్యక్షుడి ఘోర వైఫల్యమని ఆ పార్టీ చైర్మన్ క్రిస్టియన్ జాకబ్ అభివర్ణించారు.
''మాక్రాన్‌కు ఈ ఐదేళ్లూ చర్చలు, పార్లమెంటులో రాజీపడటమే ఉంటుంది'' అని ఫ్రాన్స్ రాజ్యాంగ చట్టం ప్రొఫెసర్ డొమినిక్ రూసో ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో చెప్పారు.
మాక్రాన్ ఏప్రిల్ నెలలో మారీన్ లె పెన్‌ను ఓడించి రెండో విడత అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అప్పుడు ఆయనకు పార్లమెంటులో 300కు పైగా సీట్లు ఉన్నాయి. తన సంపూర్ణ ఆధిక్యం కొనసాగించాలంటే 289 సీట్లు అవసరం. అవి ఈ ఎన్నికల్లో 245కు పడిపోయాయి.
ఈ ఎన్నికలకు సగం మందికి పైగా ఓటర్లు దూరంగా ఉన్నారు. కేవలం 46.23 శాతం పోలింగ్ మాత్రమే జరిగింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
సంస్కరణలు సాగుతాయా?
జీవన వ్యయం పెరిగిపోతున్న సంక్షోభాన్ని పరిష్కరిస్తానని అధ్యక్షుడు మాక్రాన్ హామీ ఇచ్చారు. కానీ ఈ విషయంలో ఆయన ప్రత్యర్థుల ఆలోచనలు చాలా భిన్నంగా ఉన్నాయి.
ప్రయోజనాలను సంస్కరించటం, పన్నులు తగ్గించటం, పదవీ విరమణ వయసును 62 ఏళ్ల నుంచి క్రమంగా 65 ఏళ్లకు పెంచటం ఆయన చేసిన భారీ ప్రతిపాదనలు.
ముఖ్యంగా.. పెన్షన్ వయసుకు సంబంధించిన సంస్కరణకు రిపబ్లికన్ల నుంచి మద్దతు లభించినప్పటికీ పార్లమెంటు ఆమోదం పొందటం కష్టం.
ఆపైన కార్బన్ న్యూట్రాలిటీ, సంపూర్ణ ఉద్యోగిత ప్రతిపాదనలు ఉన్నాయి. పౌర సమాజం పాత్ర మరింత ఎక్కువగా ఉండే విధంగా పరిపాలన సాగించే 'కొత్త విధానా'న్ని మాక్రాన్ ఇటీవల ప్రతిపాదించారు.
ఫ్రాన్స్‌ను మరింతగా ప్రాజస్వామికీకరించటం లక్ష్యంగా.. స్థానిక ప్రజలతో 'నేషనల్ కౌన్సిల్ ఫర్ రీఫౌండేషన్'ను ఏర్పాటు చేయాలన్నారు.
ఇవి కూడా చదవండి:
- మనుషులు సెక్స్ ఎందుకు కోరుకుంటారు... లైంగిక సంబంధాల్లో విప్లవం రాబోతోందా?
- ఈ కుక్కలను కొనొద్దని పశు వైద్యులు ఎందుకు చెబుతున్నారు
- సెక్స్ కోసం మహిళను మగాడు బలవంతం చేస్తే అది రేప్... మరి అదే పని ఒక మహిళ చేస్తే
- ఇంటర్నెట్ ద్వారా ఆదాయం.. ఎంత సేపు బ్రౌజ్ చేస్తే అంత సంపాదించగలిగితే ఎలా ఉంటుంది?
- బ్లడ్ గ్రూప్స్ గురించి మీకేం తెలుసు... వాటిలో చాలా అరుదుగా దొరికే రక్తం రకాలు ఏంటి?
- ఇళ్లలోనే పుట్టగొడుగుల పెంపకంతో మహిళల జీవితాలు ఎలా మారుతున్నాయంటే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












