స్టాక్ మార్కెట్: ద్రవ్యోల్బణం, ధరలు, మాంద్యం భయాలే ఈ పతనానికి కారణమా

ఫొటో సోర్స్, Getty Images
ధరల పెరుగుదల, ఆర్థిక వ్యవస్థల మందగమనానికి సంబంధించిన భయాలు వ్యాపించడంతో అమెరికా, ఆసియాలోని యూరోపియన్ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి.
ప్రారంభ ట్రేడింగ్‌లో ఎఫ్‌టీఎస్ఈ 100 ఇండెక్స్ 1.5 శాతం పడిపోయింది. ఫ్రాన్స్, జర్మనీలోని ప్రధాన మార్కెట్లు కూడా నేలచూపులు చూశాయి.
2020లో కరోనా మహమ్మారి తొలిరోజుల నాటి నుంచి బుధవారం ఒక్క రోజే అమెరికా షేర్లు భారీ పతనాన్ని నమోదు చేశాయి.
అమెరికా ప్రధాన రిటైలర్ల స్టాక్స్ అమ్మకాలతో మార్కెట్లు పతనమయ్యాయి.
ద్రవ్యోల్బణంలో పెరుగుదల కారణంగా దేశాలు వణికిపోతున్నాయి. ఏప్రిల్‌లో యూకే ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ఠానికి చేరి 9 శాతంగా నమోదైంది. ధరల పెరుగుదలను నియంత్రించే ప్రయత్నాల్లో భాగంగా వడ్డీ రేట్లను పెంచడంతో కొన్ని దేశాల ఆర్థికవ్యవస్థలు మందగించాయనే ఆందోళనలు ఉన్నాయి.
''ఆర్థిక వ్యవస్థలు మాంద్యం దిశగా వెళ్తాయనే భయాందోళనలు పెట్టుబడిదారుల్లో పెరిగిపోవడంతో ఆర్థిక మార్కెట్ల పరిస్థితి గందరగోళంగా తయారైంది'' అని హర్గ్రీవ్స్ లాన్స్‌డౌన్ సీనియర్ ఇన్వెస్ట్‌మెంట్, మార్కెట్స్ అనలిస్ట్ సుశాంత్ స్ట్రీటర్ అన్నారు.
గురువారం ఉదయం స్థిరంగా పడిపోయిన ఎఫ్‌టీఎస్‌ఈ 100 ఇండెక్స్ 185.81 పాయింట్లు పడిపోయి 7252.28 వద్ద నిలిచింది. ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ-40 ఇండెక్స్, జర్మనీకి చెందిన డాక్స్ వరుసగా 2.2 శాతం, 2.1 శాతం తగ్గుదలను నమోదు చేశాయి.
ఆసియాలో జపాన్ బెంచ్‌మార్క్ నిక్కీ ఇండెక్స్ 1.9% క్షీణించగా, హాంకాంగ్ యొక్క హ్యాంగ్ సెంగ్ 2.5% పడిపోయింది.
అమెరికాలోని అతిపెద్ద కంపెనీల షేర్లను ట్రాక్ చేసే ఎస్ అండ్ పీ 500 ఇండెక్స్ బుధవారం రోజు 4 శాతానికి పైగా, డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 3.5 శాతానికి పడిపోయిన తర్వాత ఆసియా మార్కెట్ల కూడా పతనం బాట పట్టాయి.
నాస్‌డాక్ 4.7 శాతం కుప్పకూలింది.
ఊహించని విధంగా ఇంధనం, సరకు రవాణా ఖర్చులు పెరగడంతో లాభాల్లో కోత పడిందని, గతేడాదితో పోలిస్తే లాభాలు సగానికి తగ్గిపోయాయని అమెరికా రిటైల్ దిగ్గజం టార్గెట్ చెప్పడంతో యూఎస్ మార్కెట్లు వేగంగా పతనమయ్యాయి.
ధరలు పెరిగేకొద్దీ దుకాణదారులు నిత్యావసరాలపై ఎక్కువగా ఖర్చు చేస్తున్నారని... టెలివిజన్ సెట్లు, దుస్తులు వంటి వస్తువులను తగ్గించుకుంటున్నారని కూడా పేర్కొంది.
ఈ వారం ప్రారంభంలో వాల్‌మార్ట్ కూడా ఇదే విధమైన అప్‌డేట్‌ను అందించింది.
"వినియోగదారుల సెంటిమెంట్ చాలా ఏళ్ల కనిష్టానికి చేరుకుంది. ఇది ద్రవ్యోల్బణంతో ముడిపడి ఉంది. కాబట్టి ప్రజలు ద్రవ్యోల్బణం నియంత్రణ సంకేతాల కోసం చూస్తున్నారు'' అని న్యూయార్క్‌లోని గ్రేట్ హిల్ క్యాపిటల్ చైర్మన్ థామస్ హేస్ అన్నారు.
టార్గెట్ షేర్లు 25 శాతం పడిపోయాయి. మూడు దశాబ్దాలలో దానికి ఇదే అతిపెద్ద క్షీణత.
అమెరికా ప్రభుత్వ అధికారిక డేటా ప్రకారం ఏప్రిల్‌లో రిటైల్ అమ్మకాలు 0.9% పెరిగాయి. అయితే ఈ గణాంకాలు మందగమన సంకేతాలను తక్కువ చేసి చూపిస్తున్నాయేమోనని కొంతమంది విశ్లేషకులు హెచ్చరించారు.
ఈ సంవత్సరం తొలి మూడు నెలల్లో ఆన్‌లైన్ విక్రయాలలో ఆశ్చర్యకరమైన తగ్గుదల నమోదైందని ఆమెజాన్ పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- జెర్సీ: తెలుగులో నాని నటిస్తే హిట్ అయింది, హిందీలో షాహిద్ కపూర్‌తో తీస్తే ప్రేక్షకులకు ఎందుకు నచ్చలేదు
- ‘వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు ఇచ్చేప్పుడు జాగ్రత్త.. ఉత్తర కొరియా వాళ్లు జాబ్‌లు కొట్టేస్తున్నారు’ - ఐటీ సంస్థలకు అమెరికా హెచ్చరిక
- చేతనా రాజ్: ప్లాస్టిక్ సర్జరీ తర్వాత మరణించిన కన్నడ నటి, అసలేం జరిగింది?
- రాజ్యసభకు వైసీపీ అభ్యర్థుల ప్రకటన.. చిరంజీవి ఆచార్య నిర్మాతకు, ఇద్దరు తెలంగాణ వారికి ఎంపీ పదవులు ఎందుకు ఇచ్చారంటే..
- వంటింట్లో మనకు తెలియకుండానే మనం చేసే 9 తప్పులు.. ఇవి చాలా ప్రమాదకరం అంటున్న నిపుణులు
- ఆన్‌లైన్ గేమ్సా... జూద క్రీడలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












