శ్రీహరికోట నుంచి 19 ఉపగ్రహాలతో నింగిలోకి విజయవంతంగా దూసుకుపోయిన పీఎస్ఎల్‌వీ-సి51: Newsreel

ఫొటో సోర్స్, isro.gov.in
ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి జరిగిన పీఎస్‌ఎల్‌వీ సీ51 ప్రయోగం విజయవంతం అయ్యింది.
షార్ మొదటి లాంచ్ పాడ్ నుంచి దీనిని ఆదివారం(ఫిబ్రవరి 28) ఉదయం 10.24కు విజయవంతంగా ప్రయోగించారు.
ఈ రాకెట్ ద్వారా బ్రెజిల్‌కు చెందిన అమెజానియా 1 ఉపగ్రహంతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన 19 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
ఇది ఈ ఏడాది ఇస్రో నుంచి జరిగిన తొలి అంతరిక్ష ప్రయోగం. పీఎస్ఎల్‌వీ డీఎల్ వెర్షన్‌లో మూడోది. భారత్ ఇప్పటివరకూ దీనిని రెండు సార్లు మాత్రమే ప్రయోగించింది.

ఫొటో సోర్స్, ISRO
ఇస్రో వెబ్ సైట్‌లోని వివరాల ప్రకారం లాంచ్ జరిగిన ఒక గంట 51 నిమిషాల 32 సెకండ్ల నుంచి గంటా 55 నిమిషాల 7 సెకండ్ల లోపు పీఎస్ఎల్‌వీ-సీ51 రాకెట్ అన్ని ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెడుతుంది.
ఇది భారత్ ప్రయోగించిన 53వ పీఎస్ఎల్‌వీ ప్రాజెక్ట్. భారత ప్రభుత్వ సంస్థ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ తొలి ప్రయోగం. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్(ఎన్ఎస్ఈఎల్), అమెరికా స్పేస్ ఫ్లైట్‌తో కలిసి దీనిని స్పాన్సర్ చేసింది.
ఇస్రో వెబ్ సైట్ వివరాల ప్రకారం 637 కిలోల అమెజానియా అనే భూమని పరిశీలించే ఉపగ్రహాన్ని ఆ దేశ అంతరిక్ష సంస్థ తయారు చేసింది. ఇది బ్రెజిల్‌లో అడవుల కొట్టివేతను పర్యవేక్షిస్తుంది. ఈ ఉపగ్రహం నాలుగేళ్ల పాటు పనిచేయనుంది.

ఫొటో సోర్స్, iSro
మిగతా ఉపగ్రహాల్లో మూడు భారత్‌లోని విద్యా సంస్థలకు చెందినవి. వీటిలో ఒక శాటిలైట్‌ను చెన్నైలోని స్పేస్ కిడ్స్ ఇండియా పంపించింది. మిగతా 14 ఉపగ్రహాలను ఎన్ఎస్ఐఎల్ తరఫున అంతరిక్షంలోకి ప్రయోగించినట్లు ఏఎన్ఐ చెప్పింది.
తమ ఉపగ్రహం ద్వారా 25 వేల మంది భారతీయుల పేర్లతో పాటూ ప్రధాని నరేంద్ర మోదీ పొటోను కూడా అంతరిక్షంలోకి పంపామని, వాటితోపాటూ భగవద్గీతను కూడా పంపించామని దానిని రూపొందించిన చెన్నైకి చెందిన స్పేస్ కిడ్స్ విద్యా సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది.

జాన్సన్ అండ్ జాన్సన్ చేసిన సింగిల్ డోస్ వ్యాక్సీన్‌కు అమెరికా ఆమోదం

ఫొటో సోర్స్, Getty Images
ఒకే డోసుతో వేసుకునే జాన్సన్ అండ్ జాన్సన్ కోవిడ్ టీకాకు అమెరికా ఔషధ నియంత్రణ అధికారులు అధికారిక అనుమతులు ఇచ్చారు. ఇది అమెరికాలో ఆమోదం పొందిన మూడో టీకా.
ఫైజర్, మోడర్నా వ్యాక్సీన్లతో పోలిస్తే దీని ధర తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. దీనిని ఫ్రీజర్‌కు బదులు రిఫ్రిజిరేటర్‌లో కూడా నిల్వ చేయవచ్చు.
కరోనా వల్ల కలిగే తీవ్ర అనారోగ్యాన్ని ఈ టీకా అడ్డుకుంటున్నట్లు ట్రయల్స్‌లో గుర్తించారు. అయితే, మధ్యరకంగా ఉన్న కేసులను కూడా చేర్చినపుడు ఇది ఓవరాల్‌గా 66 శాతం ప్రభావవంతంగా పనిచేసింది.
ఈ వ్యాక్సీన్‌ను బెల్జియం సంస్థ జానెస్సెన్ తయారు చేసింది. జూన్ చివరికల్లా అమెరికాకు 10 కోట్ల డోసులు అందించడానికి ఈ సంస్థ అంగీకరించింది. మొదటి దశ డోసులు వచ్చే వారం ప్రారంభానికి అమెరికాలో ప్రజలకు అందుబాటులో ఉండచ్చు.
బ్రిటన్, ఈయూ, కెనడా కూడా జాన్సన్ అండ్ జాన్సన్ కోవిడ్ వ్యాక్సీన్ డోసులకు ఆర్డర్ ఇచ్చాయి.
కోవాక్స్ పథకం ద్వారా పేద దేశాలకు ఈ టీకాను సరఫరా చేయడానికి సంస్థకు 50 కోట్ల డోసుల ఆర్డర్ కూడా అందింది.
"అమెరికా ప్రజలందరికీ ఇది ఉత్తేజకరమైన వార్త. ప్రోత్సాహకరమైన అభివృద్ధి, కానీ, పోరాటం అప్పుడే అంతం కాదు" అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు.
"ఈ వార్తతో మనం ఈ రోజు సంబరాలు చేసుకుంటున్నప్పటికీ, మీ చేతులు కడుక్కుంటూనే ఉండాలని, సామాజిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని నేను అమెరికా ప్రజలందరినీ కోరుతున్నాను" అని ఆయన ఒక ప్రకటనలో చెప్పారు.
"నేను చాలా సార్లు చెప్పినట్టు.. కొత్త వేరియంట్స్ వ్యాపిస్తుండడం వల్ల పరిస్థితి ఇంకా అధ్వాన్నంగా మారే అవకాశం ఉంది. ఇప్పుడు మెరుగ్గా ఉన్నది, రివర్స్ కావచ్చు" అన్నారు.
నిపుణుల కమిటీ శుక్రవారం జాన్సన్ అండ్ జాన్సన్ టీకాకు ఏకగ్రీవంగా తమ మద్దతు తెలపడంతో అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ దీనిని అధికారికంగా ఆమోదించింది.

ఇవి కూడా చదవండి:
- చైనా సైన్యం 'కెప్టెన్ అమెరికా', 'ఐరన్ మ్యాన్' లాంటి సూపర్ హీరోలను సృష్టిస్తోందా
- సైన్యంలో చేరాలని రెండు సార్లు ఫెయిలైన వ్యక్తి ఇప్పుడు దేశాన్నే గుప్పిట్లో పెట్టుకున్నాడు
- బుమ్రా, షమీ, ఉమేశ్, ఇషాంత్... ఇంగ్లండ్‌ను భయపెడుతున్న భారత పేసర్లు
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు.. చరిత్రలో అక్కడ జరిగిన రాజకీయ కుట్రలెన్ని.. తెగిపడిన తలలెన్ని
- దీప్ సిద్ధూ ఎవరు? ఎర్రకోట ఘటన తరువాత చర్చల్లోకి ఎందుకొచ్చారు?
- ‘18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు...
- బడ్జెట్ 2021-22: సామాన్యులకు ఈ బడ్జెట్‌తో చేకూరే ప్రయోజనాలు ఇవే..
- పాకిస్తాన్ గురించి నేపాల్ ప్రజలు ఏమనుకుంటారు?
- తీరా కామత్: రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఈ పాపాయిని కాపాడుతుందా?
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- సెక్స్‌కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








