ఆంధ్రప్రదేశ్: నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు... షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ Newsreel

నిమ్మగడ్డ రమేశ్ కుమార్

ఆంధ్రప్రదేశ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు షెడ్యూల్ విడుదల చేశారు.

ఫిబ్రవరి 5,9,13,17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారు.

జనవరి 23,27,31 ,ఫిబ్రవరి 4 న పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అంటే, ఎన్నికల ప్రక్రియ జనవరి 23న మొదలై, ఫిబ్రవరి 17న ముగుస్తుంది.

జనవరి 9 నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది.

ఏపీ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్
ఫొటో క్యాప్షన్, ఏపీ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్

కరోనావైరస్ కీలక మ్యుటేషన్‌ మీద ఫైజర్ వ్యాక్సీన్ పని చేస్తోందంటున్న పరిశోధకులు

కొత్తగా కనిపించిన రెండు రకాల కరోనావైరస్ వేరియంట్లలో ఉన్న కీలకమైన మ్యుటేషన్‌ను ఫైజర్, బయో ఎన్‌టెక్‌ వ్యాక్సీన్ సమర్థంగా ఎదుర్కోగలదని కొన్ని లేబొరేటరీ పరిశోధనలు సూచిస్తున్నాయి.

అయితే, కొత్తగా కరోనావైరస్‌లో కనిపించిన చాలా రకాల మ్యుటేషన్లలో ఒక రకం మీద మాత్రమే ఈ అధ్యయనం దృష్టి సారించింది.

ఫైజర్ వ్యాక్సీన్

ఫొటో సోర్స్, Getty Images

వ్యాక్సీన్ పని తీరును నిర్ధరణ చేసేందుకు ఈ అధ్యయనాన్ని పూర్తి శాస్త్రీయ నిర్థరణ అని చెప్పలేం. యూకే, సౌత్ ఆఫ్రికాలో కనిపించిన వైరస్‌లో కొత్త రకమైన మ్యుటేషన్లు కనిపించాయి.

ఈ రెండు రకాల వైరస్‌లు చాలా త్వరగా వ్యాప్తి చెందుతుండటంతో వ్యాక్సీన్లు ఏ మేరకు రక్షణ కల్పిస్తాయోననే సందేహాలు తలెత్తాయి.

వ్యాక్సీన్లు సక్రమంగా పని చేస్తాయనే చాలా మంది భావిస్తున్నారు. కానీ, దానికి తగిన ఆధారం కోసం అధ్యయనకారులు ఇంకా వెతుకుతూనే ఉన్నారు.

టెక్సస్ యూనివర్సిటీ చేస్తున్న అధ్యయనం కొత్తగా కనిపించిన ఎన్ 501వై మ్యుటేషన్ పైన దృష్టి పెట్టింది. వైరస్‌లో ఉండే ఈ భాగం ముందుగా శరీరంలోని కణాలను తాకి ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందేందుకు సహకరించడంతో దీనిపై అధ్యయనం చేయడం ముఖ్యం అని భావిస్తున్నారు.

పరిశోధనకారులు పరివర్తన చెందిన వైరస్, పరివర్తన చెందని వైరస్ అని రెండు రకాల వైరస్‌లను తీసుకుని క్లినికల్ ట్రయల్స్ చేశారు. వ్యాక్సీన్ తీసుకున్న 20 మంది రోగుల రక్త నమూనాలలో వీటిని కలిపి పరీక్షించారు.

ఈ కొత్త మ్యుటేషన్‌కి వ్యతిరేకంగా వ్యాక్సీన్ తీసుకున్న వారి రోగ నిరోధకత పోరాడగలుగుతోందని ఈ అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి.

కానీ, కొత్తగా పుట్టిన వైరస్ విభిన్న రకాలుగా మార్పు చెందుతోంది. వీటన్నిటి ప్రభావం మనిషి రోగ నిరోధక శక్తిని దాటి పని చేసే అవకాశం ఉంది.

యూకేలో కనిపించిన 8 రకాల మ్యుటేషన్లలో కేవలం ఒక్క రకాన్ని మాత్రమే ఈ అధ్యయనంలో పరిశీలించారు. "కేవలం ఒక్క మ్యుటేషన్ మీద చేసిన పరిశీలన సరైన ఫలితాన్ని ఇస్తుందని చెప్పలేం" అని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రవి గుప్త చెప్పారు.

ఏమైనా వ్యతిరేక ఫలితం వస్తే అది చాలా విచారానికి గురి చేసి ఉండేదని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ ప్రొఫెసర్ స్టీఫెన్ ఇవాన్స్ అన్నారు.

"ఇది శుభ వార్తే. కానీ, ఇది ఫైజర్ లాంటి వ్యాక్సీన్లు వైరస్ నుంచి రక్షణను కల్పిస్తాయనే భరోసాను మాత్రం ఇంకా పూర్తిగా ఇవ్వలేదు" అని ఆయన అన్నారు.

అబూ బకర్ బషీర్

ఫొటో సోర్స్, Getty Images

202 మంది మృతికి కారణమైన బాంబు దాడి సూత్రధారిని విడుదల చేసిన ఇండోనేసియా

ఇండోనేసియాలోని బాలీలో 2002లో జరిగిన బాంబు దాడి వెనుక ప్రధాన సూత్రధారి అబూబకర్ బాషీర్‌ను శిక్షకాలం పూర్తి కాకుండానే జైలు నుంచి విడుదల చేశారు.

రాడికల్ ముస్లిం మతాధికారి అయిన 82 ఏళ్ల అబూ బకర్ ఇండోనేసియా రాజధాని జకార్తా శివార్లలో ఉన్న జైలు నుంచి విడుదలై తమ కుటుంబ సభ్యులను కలుసుకున్నట్లు సమాచారం.

అల్-ఖైదా అడుగుజాడల్లో నడిచే జెమా ఇస్లామియా బృందానికి అబూ బకర్ గతంలో కమాండర్‌గా ఉన్నారు.

అంత‌ర్జాతీయ ప‌ర్య‌ట‌కులతో కిట‌కిట‌లాడే బాలీలోని కూటా నైట్‌క్ల‌బ్‌ల‌పై 2002 అక్టోబ‌రు 12న జరిగిన దాడిలో 21 దేశాలకు చెందిన 202 మంది చనిపోయారు.

ఇది ఇండోనేసియా చరిత్రలోనే అత్యంత హేయమైన ఉగ్రవాద దాడి.

ఈ బాంబు దాడిలో అరెస్ట్ అయిన అబూ బకర్ శిక్షాకాలం తగ్గడంతో జైలునుంచి త్వరగా విడుదల అయ్యారు.

అబూ బకర్ విడుదలపై ఇండోనేసియాలో, ఆస్ట్రేలియాలో మిశ్రమ స్పందనలు వచ్చాయి.

అత్యంత దారుణమైన బాంబు దాడికి పాల్పడినవారిని జైలు నుంచి త్వరగా విడుదల చేయడం సముచితం కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు.

అబూ బకర్ తిరిగి ఉగ్రవాదంవైపు మళ్లొచ్చని వీరి వాదన.

బాలీలో ఈ బాంబు దాడి తరువాత జెమా ఇస్లామియా సంస్థను అదుపు చేసేందుకు ఆస్ట్రేలియా, అమెరికాల సహాయంతో ఇండోనేసియాలో యంటీ-టెర్రరిస్ట్ యూనిట్ ఏర్పాటైంది.

అబూ బకర్ జైలునుంచీ త్వరగా విడుదల కావడం ఇండోనేషియాలో ఉగ్రవాదం, హింసపై పెద్దగా ప్రభావం చూపుతుందని తాను భావించట్లేదని జకార్తా ఇన్స్టిట్యూట్ ఫర్ పాలసీ అనాలసిస్ ఆఫ్ కాంఫ్లిక్ట్ డైరెక్టర్ సిడ్నీ జోన్స్ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)