సుప్రీం కోర్టు: రైతుల ఆందోళనల విషయంలో జోక్యం చేసుకోలేం, శాంతియుతంగా కొనసాగించొచ్చు - Newsreel

రైతుల నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న నిరసనల్లో జోక్యం చేసుకోబోమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

ఈ నిరసనలను ఎలాంటి ఆటంకం లేకుండా, రైతులు గానీ, పోలీసులు గానీ శాంతి భద్రతలకు భంగం కలిగించకుండా కొనసాగించవచ్చని భావిస్తున్నామని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది.

ఆందోళన చేస్తున్న రైతులను అక్కడి నుంచి పంపించేయాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణను శీతాకాలపు సెలవుల తర్వాతకు వాయిదా వేసింది. తిరిగి జనవరి 4న కోర్టు కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.

ప్రస్తుతం రైతులు, ప్రభుత్వం మధ్య నెలకొన్న ప్రతిష్టంభనకు అర్థవంతమైన పరిష్కారం రావాలంటే స్వతంత్ర, నిష్పాక్షిక వ్యక్తులు, వ్యవసాయ నిపుణులతో కూడిన ఓ కమిటీని వేయాలని సీజేఐ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది.

అన్ని వర్గాల వారి వాదనలు, అభిప్రాయాలు వినకుండా పరిష్కారం సాధ్యం కాదు. అన్ని వర్గాలూ తమ వాదనలతో సుప్రీం ముందుకు వచ్చే లోపు, ఈ కమిటీకి సంబంధించి అన్ని పార్టీల నుంచి సలహాలు సూచనలు సేకరించి, తదుపరి విచారణ నాటికి తమకు సమర్పించవచ్చని సూచించింది.

"ప్రస్తుతం నిరసనల్లో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోదు. నిరసన వ్యక్తం చేయడం పౌరుల ప్రాథమిక హక్కుల్లో భాగం. నిరసనలు చట్టబద్ధంగా అహింసాయుతంగా సాగుతున్నంత వరకు, ఎవరి ప్రాణాలకు, ఆస్తులకు హాని తలపెట్టనంత వరకు పౌరుల ఈ హక్కులకు ఎలాంటి ఆటంకం కలిగించడానికి లేదు" అని ధర్మాసనం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.

"నిరసన ఒక లక్ష్యాన్ని సాధించడానికే అయితే, చర్చలు ప్రారంభించాల్సి ఉంటుంది. శాంతియుతంగా జరిగే నిరసనల్లో బలప్రయోగం జరగకుండా పోలీసులు చూసుకోవాలి" అని సుప్రీంకోర్టు సూచించింది.

వ్యవసాయ చట్టాల అమలును నిలిపివేసే అవకాశాన్ని పరిశీలించండి.. సుప్రీంకోర్టు సూచన; సాధ్యం కాదన్న ప్రభుత్వం

రైతుల నిరసనలపై దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. రైతు సంఘాల ప్రతినిధులెవరూ ఇప్పుడు కోర్టులో లేరు కాబట్టి ఈ పిటిషన్లపై వెకేషన్ బెంచ్ విచారణ జరుపుతుందని చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే అన్నారు. అందువల్ల ఇప్పుడు ఎలాంటి ఆదేశాలు ఇవ్వడం లేదని చెప్పారు.

వ్యవసాయ చట్టాల అమలును కొద్దికాలం పాటు నిలిపివేసే అవకాశాన్ని పరిశీలించాలని ఈ సందర్భంగా సీజేఐ బాబ్డే కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. అయితే అది సాధ్యం కాదని ప్రభుత్వం తెలిపింది. ముందుగానే ఓ నిర్ణయానికి రావద్దు, మా సూచనలను పరిగణనలోకి తీసుకోండి అని జస్టిస్ బాబ్డే అన్నారు. ఈ లోపు రైతు సంఘాలకు నోటీసులు జారీచేయమని సూచించారు.

దీనిపై తదుపరి విచారణ వచ్చేవారంలో జరిగే అవకాశం ఉంది. వెకేషన్ బెంచ్‌ను ఆశ్రయించేందుకు పిటిషనర్లను కోర్టు అనుమతించింది.

ఇమ్మానుయేల్ మేక్రాన్‌

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ఇమ్మానుయేల్ మేక్రాన్‌

ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌కు కరోనా పాజిటవ్

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్‌కు కోవిడ్ పాజిటివ్ అని నిర్థరణైందని ఆయన కార్యాలయం ప్రకటించింది. ఆయన వయసు 42 సంవత్సరాలు.

కోవిడ్ లక్షణాలు కనిపించడంతో మేక్రాన్‌ పరీక్ష చేయించుకున్నట్లు తెలిసింది. ఆయనిప్పుడు 7 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంటారని ఎలైసీ ప్యాలెస్ ఓ ప్రకటనలో తెలిపింది.

మేక్రాన్ ఐసొలేషన్‌లో ఉంటూనే దేశాధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తారని ఒక అధికారి తెలిపారు. మేక్రాన్‌కు వైరస్ ఎలా సోకిందనేది ఇంకా తెలియలేదు. ఆయనతో సమీపంగా మెలిగిన వారిని గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు.

మేక్రాన్ భార్య ఆరోగ్య పరిస్థితిపై ప్రస్తుతం ఎలాంటి సమాచారం వెల్లడి కాలేదు.

ఫ్రాన్స్‌లో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ఈవారం నుంచి రాత్రి పూట కర్ఫ్యూను విధించింది.

కోవిడ్ మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఫ్రాన్స్‌లో 20 లక్షల కేసులు నమోదు కాగా 59,400 మంది మరణించారని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ డేటా చెబుతోంది.

ఫ్రాన్స్ ప్రధాని జీన్ కాస్టెక్స్ కూడా సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం అమలు చేయనున్న కోవిడ్ వ్యాక్సినేషన్ పాలసీని ఆయన గురువారం సెనేట్లో ప్రవేశపెట్టవలసి ఉంది. ఆయన బదులు ఫ్రాన్స్ వైద్య శాఖ మంత్రి ఒలీవియర్ వీరన్ దీన్ని ప్రవేశపెడుతున్నారు.

షటర్ స్టాక్

ఫొటో సోర్స్, SHUTTERSTOCK

చంద్రుడి మీద నుంచి మట్టి, రాళ్లు భూమికి తెచ్చిన చైనా 'చాంగ్ ఇ-5'

చైనా ప్రయోగించిన స్పేస్ కాప్స్యూల్ 'చాంగ్ ఇ-5' భూమికి తిరిగి వచ్చింది.

చంద్రుడి ఉపరితలం నుంచి నుంచి రాళ్లు, మట్టి నమూనాలను భూమికి తీసుకొచ్చింది.

చైనా స్పేస్ క్రాఫ్ట్ 'చాంగ్ ఇ-5' స్థానిక కాలమానం ప్రకారం అది గురువారం సుమారు 1.30 గంటలకు మంగోలియాలో దిగింది.

మూన్

'చాంగ్ ఇ-5'ను ఒక అంతరిక్ష నౌక ద్వారా నవంబర్ 24న దక్షిణ చైనాలోని వెన్‌చాంగ్ స్టేషన్ నుంచి ప్రయోగించారు.

ఇది చంద్రుడి మీద నుంచి సుమారు 2 కిలోల బరువున్న నమూనాలను తీసుకొచ్చింది.

దాదాపు 40 ఏళ్ల తర్వాత ఇలాంటి ప్రయోగం ద్వారా చంద్రుడిపై నమూనాలను భూమికి తీసుకొచ్చేందుకు ప్రయత్నం జరిగింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఇంతకు ముందు రష్యాకు చెందిన లూనా-24 మిషన్ 1976లో చంద్రుడిపై దిగింది. అప్పుడు లూనా తనతో దాదాపు 200 గ్రాముల మట్టిని తీసుకొచ్చింది.

అంతకంటే ముందు అమెరికా అపోలో అంతరిక్ష నౌక చంద్రుడి ఉపరితలం నుంచి రాళ్లు, మట్టి నమూనాలు తీసుకుని భూమికి తిరిగొచ్చింది.

line

దిల్లీ కాల్ సెంటర్ స్కాం: విదేశీయులను మోసం చేస్తున్న 54 మంది అరెస్ట్

దిల్లీ కాల్ సెంటర్ స్కాం

ఫొటో సోర్స్, DELHI POLICE CYBER-CRIME UNIT

అంతర్జాతీయ కాల్ సెంటర్ కుంభకోణంలో దిల్లీ పోలీసులు 54 మందిని అరెస్ట్ చేశారు. అమెరికా, ఇతర దేశాల్లోని 4,500 మందికి పైగా వీరిచేతిలో మోసపోయారని చెప్పారు.

దిల్లీలోని ఈ కాల్ సెంటర్ ద్వారా నిందితులు 14 మిలియన్ డాలర్లు(రూ.100 కోట్లకు పైగా) వసూలు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

నిందితులు విదేశీయులకు ఫోన్ చేసి అంతర్జాతీయ డ్రగ్ ముఠాలకు చెల్లింపులు జరిపేందుకు మీ వివరాలు ఉపయోగిస్తున్నాయని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని బెదిరించారని ఆరోపించారు.

పోన్లు చేసి పోలీసులమని, అరెస్ట్ చేస్తామని చెప్పేసరికి బాధితులు భయపడి వీరికి అడిగినంత డబ్బులు చెల్లించారని తెలిపారు.

దిల్లీ కాల్ సెంటర్ స్కాం

ఫొటో సోర్స్, DELHI POLICE CYBER-CRIME UNIT

"టార్గెట్ చేసిన వారికి పోన్ చేసి, నేరం జరిగిన ప్రాంతంలో మీ వివరాలు దొరికాయని, మీ బ్యాంక్ అకౌంట్లు, ఆస్తులు ఫ్రీజ్ చేస్తామని నిందితులు బెదిరించేవాళ్లు" అని దిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ అన్యేష్ రాయ్ హిందుస్తాన్ టైమ్స్‌కు చెప్పారు.

తమ పేరుతో ఉన్న బ్యాంక్ అకౌంట్ల నుంచి మెక్సికో, కొలంబియాలోని డ్రగ్ ముఠాలకు అక్రమ లావాదేవీలు జరిగాయని కూడా బెదిరించారని కొందరు బాధితులు చెప్పారు.

‘మీ ఆస్తులు కాపాడుకోవాలంటే బిట్ కాయిన్స్ లేదా గిఫ్ట్ కార్డుల ద్వారా అడిగినంత మొత్తాన్ని భారత్‌లోని ఈ-వాలెట్లకు బదిలీ చేయాల’ని నిందితులు బెదిరించేవారు.

ఈ కుంభకోణానికి సూత్రధారిగా భావిస్తున్న అనుమానితుడు దుబాయ్ నుంచి దీనిని నడిపిస్తున్నాడని పోలీసులు తెలిపారు.

దిల్లీ సైబర్ క్రైమ్ విభాగాలు ఈ ఏడాది ఇప్పటివరకూ 25కు పైగా నకిలీ కాల్ సెంటర్ల గుట్టు బయటపెట్టాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)