ఆస్ట్రేలియా కార్చిచ్చు: 'నేల తల్లి బాగుండాలంటే పొదలు కాలిపోవాల్సిందే' అంటున్న ఆదివాసీలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గారీ నన్
- హోదా, సిడ్నీ
ఆస్ట్రేలియాలో ఆదివాసీలు వేల ఏళ్ల పాటు అక్కడ నేలకు నిప్పు పెట్టారు.
యూరప్ వాసులు ఆస్ట్రేలియాను ఆక్రమించటానికి చాలా కాలం ముందే.. అక్కడ ''సాంస్కృతిక దహనాల'' పేరుతో నిప్పును నియంత్రించేవారు.
ఆ భూభాగమంతటా మోకాలి ఎత్తున మంటలు నిరంతరం కొనసాగేలా వాటికి రూపకల్పన చేసేవారు.
ఆ మంటలు.. రాలిన ఆకులు, ఎండు పుల్లలను కాల్చివేస్తాయి. అంటే.. సహజంగా పుట్టే కార్చిచ్చులు ఉవ్వెత్తున మండటానికి పెద్దగా అవకాశం ఉండదు.
ఆస్ట్రేలియాలో గత ఏడాది కార్చిచ్చు సంక్షోభం మొదలైనప్పటి నుంచీ.. ఈ పరిజ్ఞానాన్ని మళ్లీ ప్రవేశపెట్టాలన్న వాదనలు బలపడుతున్నాయి. అయితే.. ఇది ఇంకా ముందే జరిగి ఉండాల్సిందని ఆదివాసీ విజ్ఞాన నిపుణుడు ఒకరు చెప్తున్నారు.
''పొద కాలిపోవాల్సిన అవసరముంది'' అంటారు షానన్ ఫాస్టర్.
ఆమె ధరావాల్ ప్రజల విజ్ఞాన సంరక్షకురాలు. తమ పూర్వీకులు అందించిన సమాచారాన్ని తర్వాతి తరాలకు అందిస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ సిడ్నీ (యూటీఎస్)లో ఒక ఆదివాసీ విజ్ఞాన అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు.
తమ పూర్వీకుల నుంచి తనకు అందిన సమాచారంలో అధిక భాగం పొదలకు సంబంధించినదేనని షానన్ చెప్తారు.
''ఇది నేలను నిర్వహించే విధానం. ఆదివాసీ ప్రజలుగా మేం చేసే ప్రతి దానికీ ఇదే కేంద్ర బిందువు. కేవలం నేల నుంచి మనం ఏమి తీసుకుంటాం అనేది మాత్రమే కాదు.. మనం తిరిగి ఏం ఇవ్వగలం అనే దానికి సంబంధించినది'' అని వివరించారు.

ఫొటో సోర్స్, CATHERINE MCLACHLAN
నేటి పరిజ్ఞానాలు నిష్ఫలం
ఆదివాసీ సంస్కృతిలో నేలను తల్లిలా పరిగణిస్తారు. ''నేల మన తల్లి. ఇది మనని సజీవంగా ఉంచుతుంది'' అంటారు షానన్. ఈ సంబంధం.. ముందు జాగ్రత్త దహనాల చుట్టూ ఉండే ప్రాధాన్యాలను మారుస్తుంది.
''ఆధునిక ప్రభుత్వాలు.. ప్రాణాలు, ఆస్తులను రక్షించటానికి ప్రాధాన్యమిస్తూ విపత్తును తగ్గించే దహనాలు నిర్వహిస్తాయి కానీ అవి ఫలించటం లేదని స్పష్టమవుతోంది'' అని ఆమె పేర్కొన్నారు.
''ప్రస్తుతం చేపట్టే నియంత్రిత దహనాలు ప్రతి దానినీ ధ్వంసం చేస్తాయి. ఇది నిప్పును నియంత్రించటం తెలియని విధానం. ఈ నేల గురించి చాలా బాగా తెలిసిన ఆదివాసీ ప్రజల మాటను ప్రభుత్వాలు వినటం లేదు'' అన్నారామె.
''సాంస్కృతిక దహనం అనేది పర్యావరణాన్ని సమగ్రంగా పరిరక్షిస్తుంది. మా ఆస్తులు, సొత్తుల కన్నా నేలను కాపాడుకోవటానికి మేం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాం. మనం ఆస్తులను తినలేం. తాగలేం. శ్వాసించలేం. నేల లేనిదే మనకు ఏమీ లేదు'' అని చెప్పారు.
ఆదివాసీ సాంస్కృతిక దహనాలు పర్యావరణ లయలకు లోబడి పనిచేస్తాయి. ఆదివాసీ జనం వేటాడగల జంతువులను మాత్రమే ఆకర్షిస్తారు.

ఫొటో సోర్స్, UTS
''శీతల దహనం.. నేలలో మళ్లీ జీవం నింపుతుంది. జీవవైవిధ్యాన్ని పెంచుతుంది. బూడిద ఎరువుగా మారుతుంది. పొటాషియం పుష్పించటాన్ని పెంపొందిస్తుంది. ఇది సాంస్కృతిక, ఆధ్యాత్మిక, శాస్త్రీయ విజ్ఞానం ప్రాతిపదికగా గల ఒక సంక్లిష్ట వలయం'' అని వివరించారు షానన్.
అవి ఒక జీవావరణ వర్ణపటాన్ని కూడా సృష్టిస్తాయని.. దీనివల్ల ప్రయోజనకరమైన సూక్ష్మ వాతావరణాలు ఏర్పడతాయని ఆమె చెప్తారు.
''మృదు దహనం వర్షాలకు తోడ్పడుతుంది. వాతావరణాన్ని ఒక నిర్దిష్ట స్థాయికి వెచ్చబరుస్తుంది. ఈ వెచ్చదనం - చల్లదనం కలిసినపుడు ద్రవీకరణం చెంది - వర్షం పడుతుంది. అది మంటలను ఆర్పటానికి సాయపడుతుంది'' అని పేర్కొన్నారు.
సిడ్నీలోని ఆమె ఆదివాసీ పెద్దలు.. విపరీతంగా పెరిగిన పొదలను, బాగా ఎండిపోయిన రాలిన ఆకులు, పుల్లల విషయాన్ని కొంత కాలంగా గమనిస్తూ.. భారీ మంటలు చెలరేగబోతున్నాయని హెచ్చరిస్తూనే ఉన్నారు. ''చింపిరి జుట్టుతో ఉన్న పిల్లవాడితో పోల్చుతూ.. దానికి పోషణ అవసరమని చెప్పారు'' అని షానన్ తెలపారు.
కానీ.. సాంస్కృతిక దహనాలకు అనుమతి ఇవ్వాలని వారు అడిగినపుడు స్థానిక అధికార యంత్రాంగాలు.. వారు ఆ పనిచేయటానికి వీలులేదని నిషేధించాయి.

ఫొటో సోర్స్, Getty Images
సాంస్కృతిక దహనాలు జరిగిన చోట...
ఆస్ట్రేలియా భౌగోళిక స్వరూపం చాలా విభిన్నమైనది. ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి పొంతన ఉండదు. కాబట్టి అన్ని ప్రాంతాలకూ సరిపడేలా ఒకే తరహా ముందు జాగ్రత్త దహనాలు ఫలించవు.
అయితే.. కొన్ని రాష్ట్రాలు ఈ సాంస్కృతిక దహనాలను, ఇతర వ్యూహాలతో మిళితం చేసి అమలు చేస్తున్నాయని బుష్‌ఫైర్ అండ్ నాచురల్ హాజార్డ్స్ కోఆపరేటివ్ రీసెర్చ్ సెంటర్ సీఈఓ డాక్టర్ రిచర్డ్ థార్నటన్ చెప్పారు.
''ఉత్తర ఆస్ట్రేలియాలో స్పష్టమైన తేడా ఉంది. ఇక్కడ ఆదివాసీ సాంస్కృతిక దహనాలు గణనీయంగా జరుగుతుంటాయి. దక్షిణ రాష్ట్రాల్లో స్థానికుల అవసరాలు, అభీష్టాల ప్రకారం ఇది జరుగుతుంటుంది'' అని పేర్కొన్నారు.
ఆస్ట్రేలియాను 1788లో వలసలు ఆక్రమించినప్పటి నుంచీ.. సాంస్కృతిక దహనాలను నెమ్మదిగా నిర్మూలించారు. అయితే.. ఇటీవలి సంవత్సరాల్లో ఆ ప్రక్రియను మళ్లీ చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మెల్‌బోర్న్‌లోని కొన్ని ప్రాంతాల్లో సాంస్కృతిక దహనాలను ఇప్పటికీ పాటిస్తున్నారని.. కానీ ఆగ్నేయ ఆస్ట్రేలియాలో ప్రమాదకర ప్రాంతాల్లో మొక్కలు పెరిగిపోయినందున అక్కడ శీతల దహనాలు ఫలించవు కాబట్టి ఆ ప్రాంతాల్లో వాటిని నిలిపివేశారని నేషనల్ పార్క్స్ మాజీ రేంజర్, జేమ్స్ కుక్ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ నోల్ ప్రీస్ చెప్పారు.
ఆయన కేంద్రీయ ఆస్ట్రేలియన్ పార్క్ రిజర్వుల కోసం మొట్టమొదటి అగ్ని కరదీపిక రచించారు. ''అయినప్పటికీ.. మండించాల్సిన అవసరమున్న పాడైన నేలకు సంబంధించి ఆదివాసీ ప్రజలకు అద్భుతమైన విజ్ఞానం ఉంది'' అని ఆయన పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రాచీన మంటల పరిమితులు
సాంస్కృతిక దహనం ద్వారా నేల మీద ఇంధనం పది టన్నుల నుంచి ఒక టన్నుకు తగ్గిపోగలదని ప్రొఫెసర్ ప్రీస్ చెప్తున్నారు. కానీ అది ఒక స్థాయి మంటలకు మాత్రమే సమర్థవంతమైన రక్షణగా పనిచేస్తుందన్నారు. కాబట్టి ప్రమాదాలను తగ్గించే దహనాలతో కలిపి సాంస్కృతిక దహనాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
అప్పటికీ.. అది కేవలం ప్రమాదాలను తగ్గిస్తుంది: ''ఉక్క, భారీ గాలుల వంటి ఇటీవలి విపత్కర పరిస్థితుల్లో ఈ మంటలను ఏవీ నిలువరించలేవు'' అని విశ్లేషించారు.
''ఆదివాసీ ప్రజలను వారి నేల నుంచి దూరం చేశారు. అందువల్ల పునరభ్యసన ప్రక్రియ జరుగుతోంది. ఇది చాలా ఉపయోగకరం.. ముఖ్యమైనది కూడా. కానీ ఇది ఇంకా తొలి దశలోనే ఉంది.. సరిపోదు'' అంటారాయన.
సాంస్కృతిక దహనాలకు పరిమితులు ఉన్నాయని నిపుణులు అంగీకరిస్తారు. అందుకు పాక్షిక కారణం.. వలస ఆక్రమణ అనేది అభివృద్ధికి, మానవ కల్పిత వాతావరణ మార్పుకు దారితీసి.. వందల ఏళ్ల కిందటికన్నా భిన్నమైన భౌగోళిక స్వరూపాన్ని తయారుచేసింది.
చెట్ల మీద పై వరకూ పాకివున్న మందమైన తీగలను కాల్చటానికి శీతల దహనం సరిపోదని.. పెద్ద మంటలు అవసరమని ప్రొఫెసర్ ప్రీస్ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, AFP PHOTO / KELLY-ANN OOSTERBEEK
ప్రస్తుతం కొనసాగుతున్న కార్చిచ్చు సంక్షోభానికి సంబంధించి సమగ్రమైన దర్యాప్తు చేపడతామని ప్రధానమంత్రి స్కాట్ మారిసన్ హామీ ఇచ్చారు.
ఈ కార్చిచ్చు 27 మంది ప్రాణాలను బలితీసుకుంది. కోటి హెక్టార్లకు పైగా భూమిని దగ్ధం చేసింది.
కార్చిచ్చు మీద విచారణ జరిపేటపుడు.. వివిధ ప్రాంతాల ఆదివాసీ పెద్దలతో చర్చలు జరిపి, వారు చెప్పేది వినాల్సిన అవసరం ఉందని డాక్టర్ థార్నటన్ గట్టిగా చెప్తున్నారు.
కానీ.. తన నిర్వహణలోని నేషనల్ బుష్‌ఫైర్ రీసెర్చ్ సెంటర్ బోర్డులో ఆదివాసీ వ్యక్తి ఒక్కరు కూడా లేరని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వ సంస్థలతో కలిసి పనిచేయాలని షానన్ ఫాస్టర్ చాలా ఆసక్తిగా ఉన్నారు. కానీ అభివృద్ధి విస్తరణ మీద ఆమె ఆందోళన చెందుతున్నారు.
''ఆదివాసీ ప్రజలు ఈ నేలను ఎంతో కాలంగా సంరక్షించుకున్నారు. ఇప్పుడిది ధ్వంసమవుతోంది. ఎందుకంటే.. ఈ నేల బాగోగులు చూసుకోవటానికి మమ్మల్ని ఎవరూ అనుమతించలేదు'' అని ఆమె చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- బ్రిటన్ రాజవంశం: ప్రిన్స్ హ్యారీ, మేగన్ల ఆస్తుల విలువ ఎంత? వారికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
- అల వైకుంఠపురములో సినిమా రివ్యూ:
- మేగన్ మార్కెల్ను అందుకే డయానాతో పోల్చుతున్నారు
- ఆమె శరీరంలో ఇరవైకి పైగా తూటాలు... సిరియా శాంతిదూత హెవ్రిన్ ఖలాఫ్ను చంపింది ఎవరు?
- పొగాకు వదిలి తీపి పంట వైపు మళ్లిన రైతులు.. లాభాల దిశగా పయనం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








