బ్రెగ్జిట్: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు ఎదురుదెబ్బ

ఫొటో సోర్స్, UK Parliament/Jessica Taylor
బ్రెగ్జిట్‌ను మళ్లీ జాప్యం చేయటానికి అనుకూలంగా బ్రిటన్ పార్లమెంటు సభ్యులు ఓటువేశారు. ఈ పరిణామం.. తన బ్రెగ్జిట్ ఒప్పందాన్ని ఆమోదిస్తూ ఓటువేయాలని కోరుకున్న బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కు పెద్ద ఎదురుదెబ్బ.
యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగే ప్రక్రియను మరింత ఆలస్యం చేసే సూత్రానికి పార్లమెంటు సభ్యులు మద్దతు తెలిపారు. అయితే.. ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ తాను ఏమాత్రం వెనుకడుగు వేయబోనని.. తన బ్రెగ్జిట్ వ్యూహంతో ముందుకు సాగుతానని చెప్పారు.
ఈయూతో తన బ్రెగ్జిట్ ఒప్పందాన్ని అమలు చేయటానికి అవసరమైన చట్టాన్ని వచ్చే వారంలో పార్లమెంటులో ప్రవేశపెడతానని ప్రతినబూనారు.
కానీ.. ఒప్పందం లేని బ్రెగ్జిట్‌కు తావులేకుండా చేయటానికి ఉద్దేశించిన తీర్మానానికి 322 మంది ఎంపీలు మద్దతు తెలిపిన నేపథ్యంలో.. అక్టోబర్ 31 తర్వాతి వరకూ గడువు పొడిగించాల్సిందిగా ఆయన ఈయూను కోరాల్సి ఉంటుంది. ఆ తీర్మానానికి వ్యతిరేకంగా 306 మంది ఎంపీలు ఓటువేశారు.
బ్రిటన్ 'తన తదుపరి చర్యల గురించి సమాచారం ఇవ్వటం'' ఆ దేశ అభీష్టమని ఈయూ వ్యాఖ్యానించింది.

ఫొటో సోర్స్, UK Parliament/Jessica Taylor
ఎంపీలు శనివారం ఎందుకు సమావేశమయ్యారు?
బ్రిటన్ పార్లమెంటు శనివారం రోజున సమావేశం కావటం గత 37 సంవత్సరాల్లో ఇదే మొదటిసారి.
ఈయూతో తాను కుదుర్చుకున్న బ్రెగ్జిట్ ఒప్పందం మీద పార్లమెంటు సభ్యులు ఈ సమావేశంలో చర్చించి ఓటు వేస్తారని ప్రధాని బోరిస్ జాన్సన్ ఆశించారు. కానీ.. స్వతంత్ర సభ్యుడు సర్ ఆలివర్ లెట్విన్ ప్రవేశపెట్టిన తీర్మానం మీద ఎంపీలు చర్చించి ఓటు వేశారు.
బోరిస్ జాన్సన్ ఒప్పందానికి ''ఆమోదాన్ని నిలిపివుంచటాని''కి ఉద్దేశించిన తీర్మానం అది. ఆ ఒప్పందాన్ని ఆమోదించటానికి అవసరమైన చట్టాన్ని ఆమోదించే వరకూ దానికి ఆమోదం నిలిపివేయాలన్నది ఎంపీల అభిమతం.
ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబరు నెలాఖరులోగా ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగుతుందని పదే పదే ఉద్ఘాటించిన ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కి ఈ ఓటమి బలమైన ఎదురు దెబ్బ.

ఫొటో సోర్స్, UK Parliament
''చలించేది లేదు''
కానీ.. ఈ పరిణామంతో తాను చలించేది కానీ, నిస్పృహకు లోనయ్యేది కానీ లేదని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. తాను కుదుర్చుకున్న ''అద్భుతమైన ఒప్పందం'' ప్రాతిపదికగా ఈ నెలాఖరులో ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగటం ఉత్తమమని తాను ఇంకా విశ్వసిస్తున్నట్లు చెప్పారు.
''ఇంకా ఆలస్యం చేయాలని నేను ఈయూతో చర్చించను. అలా చేయాలని చట్టం నన్ను ఒత్తిడి చేయదు'' అని స్పష్టంచేశారు.
మరింత జాప్యం చేయటానికి ఈయూ సుముఖంగా ఉంటుందని తాను అనుకోనని.. తన విధానంలో మార్పు లేదని జాన్సన్ చెప్పారు.
కానీ.. ఈ ఓటమికి అర్థం.. ప్రధానమంత్రి వ్యూహాన్ని తీవ్రంగా వ్యతిరేకించటమేనని లేబర్ పార్టీ నాయకుడు జెరిమీ కోర్బిన్ అభివర్ణించారు. కాబట్టి ఆయన బ్రెగ్జిట్‌ను మరింత ఆలస్యం చేయాలన్న చట్టానికి కట్టుబడి తీరాలన్నారు.
ఈ జాప్యం వల్ల ప్రధానమంత్రి ఒప్పందాన్ని మరింత క్షుణ్నంగా పరిశీలించటానికి వీలు కల్పిస్తుందని.. లెట్విన్ సవరణకు మద్దతు తెలిపిన డెమొక్రటిక్ యూనియనిస్టులు పేర్కొన్నారు. బ్రిటన్ ''రాజ్యాంగ, ఆర్థిక'' సమగ్రతను పరిరక్షించటం మీద తమ మద్దతు ఆధారపడి ఉంటుందని ఉద్ఘాటించారు.
ఈ పరిణామం వల్ల.. అక్టోబర్ 31వ తేదీన బ్రిటన్ ఈయూ నుంచి ఏ ఒప్పందం లేకుండా ''కూలిపోకుండా'' ఉంటుందని సర్ ఆలివర్ లెట్విన్ పేర్కొన్నారు.
గత నెలలో ఆమోదించిన బెన్ చట్టం ప్రకారం.. పార్లమెంటు ఏదైనా ఒప్పందాన్ని ఆమోదించనట్లయితే మరింత జాప్యం కోసం ఈయూను గడువు కోరాల్సిన చట్టబద్ధమైన బాధ్యత ప్రధానమంత్రి మీద ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
పార్లమెంటు వెలుపల సంబరాలు
ఇదిలావుంటే.. రెండో ప్రజాభిప్రాయ సేకరణ కోరుతున్న 'పీపుల్స్ ఓట్' మద్దతుదారులు పార్లమెంటు వెలుపల ప్రదర్శన నిర్వహించారు. కొత్త ఒప్పందం మీద 'తుది నిర్ణయం' తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఎంపీలు చర్చిస్తుండగా.. సెంట్రల్ లండన్ వీధుల్లో నిరసనకారులు ప్రదర్శన నిర్వహించి, పార్లమెంటు వెలుపల గుమిగూడారు.
దాదాపు పది లక్షల మంది ఈ నిరసనలో పాల్గొన్నారని నిర్వాహకులు చెప్పారు.
లెట్విన్ సవరణను కామన్స్ సభలో ఆమోదించిన తర్వాత పార్లమెంటు స్క్వేర్‌లోని నిరసన ప్రదర్శనలో పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
ఇవి కూడా చదవండి:
- నింజా టెక్నిక్: వ్యాసం రాయమంటే 'ఖాళీ' పేపర్ ఇచ్చిన అమ్మాయికి అత్యధిక మార్కులు.. ఎలా?
- #100WOMEN: కృత్రిమ గర్భసంచితో నెలలు నిండని శిశువులకు ప్రాణదానం
- జపాన్ ఎందుకంత క్లీన్‌గా ఉంటుంది... ఏమిటా రహస్యం?
- కంట్లో ప్రతిబింబించిన చిత్రంతో పాప్‌సింగర్ ఇల్లు కనిపెట్టి వేధించిన యువకుడు
- అయోధ్య: ఈ సుదీర్ఘ కోర్టు కేసులో తీర్పు ఎలా వచ్చే అవకాశం ఉంది? పిటిషనర్లు ఏమంటున్నారు?
- ఆంధ్రప్రదేశ్‌లో మద్య నిషేధంతో లాభమా, నష్టమా... అసలు వైఎస్ జగన్ హామీ అమలు సాధ్యమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








