బ్రిటన్ పార్లమెంట్‌ను ప్రోరోగ్ చేయడం చట్టవిరుద్ధమన్న ఆ దేశ సుప్రీం కోర్టు

బోరిస్ జాన్సన్

ఫొటో సోర్స్, Reuters

బ్రిటన్ పార్లమెంట్‌ను ఐదు వారాల పాటు రద్దు చేయాలన్న బోరిస్ జాన్సన్ నిర్ణయం చట్టవిరుద్ధమని ఆ దేశ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.

పార్లమెంటును ఐదు వారాలపాటు సస్పెండ్ చేస్తూ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఈ నెల మొదట్లో నిర్ణయం తీసుకున్నారు.

కానీ, బ్రెగ్జిట్ కాలపరిమితి అక్టోబర్ 31 సమీపిస్తోందని పార్లమెంట్ తన విధులు నిర్వహించకుండా అడ్డుకోవడం తప్పని కోర్టు వ్యాఖ్యానించింది.

కోర్టు తీర్పును విశ్లేషిస్తున్నామని ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది.

సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి లేడీ హేల్ తీర్పు వెలువరిస్తూ ''ప్రభుత్వ నిర్ణయంతో ప్రజాస్వామ్య మౌలిక అంశాలపై తీవ్ర ప్రభావం పడుతుంది'' అని పేర్కొన్నారు.

''పార్లమెంట్‌ను వాయదా వేయడం చట్టవిరుద్ధం ఎందుకంటే ఇలా చేస్తే పార్లమెంట్ తన రాజ్యాంగ విధులను నిర్వహించకుండా అడ్డుకున్నట్లు అవుతుంది'' అని తెలిపారు.

పార్లమెంటును వాయిదా వేయడం సరికాదని 11 మంది న్యాయమూర్తులు బృందం ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు లేడీ హేల్ అన్నారు. తమ తీర్పు తర్వాత ఏం చేయాలన్నది కామన్స్, లార్డ్స్ స్పీకర్లు నిర్ణయిస్తారని చెప్పారు.

కామన్స్ స్పీకర్ ఈ తీర్పును ఆహ్వానించారు. ఆలస్యం లేకుండా పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభించాలని అన్నారు.

అత్యవసర విషయంగా దీన్ని పరిగణిస్తూ పార్టీ నేతలను ఈ అంశంపై సంప్రదిస్తానని చెప్పారు.

సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి లేడీ హేల్

ఫొటో సోర్స్, EUROPEAN PHOTOPRESS AGENCY

ఫొటో క్యాప్షన్, సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి లేడీ హేల్

'నష్టం జరిగిపోయింది'

సుప్రీం తీర్పును బీబీసీ న్యాయ వ్యవహారాల నిపుణులు క్లైవ్ కోల్మెన్ విశ్లేషిస్తూ, ''ఈ తీర్పు చట్టపరమైంది, రాజ్యాంగబద్దమైంది. రాజకీయంగా పెనుప్రకంపనలు సృష్టించేది'' అని వ్యాఖ్యానించారు.

''దేశం సంక్షోభంలో ఉన్న సమయంలో, మన రాజ్యాంగంలో భాగంగా ఉన్న సార్వభౌమ సంస్థ (పార్లమెంట్) ను మూసివేయడంలో ఇంగ్లండ్ ప్రధానమంత్రి చట్టవిరుద్ధంగా వ్యవహరించినట్లు అత్యున్నత న్యాయస్థానం పేర్కొనడం ఊరటనిచ్చే విషయం'' అని పేర్కొన్నారు.

''పార్లమెంట్‌ను ప్రోరోగ్ చేసే విషయంలో బోరిస్ జాన్సన్‌లో అనుచిత ఉద్దేశం ఉందని కోర్టు తప్పుపట్టి ఉండవచ్చు. ఆయన చట్టవిరుద్ధంగా వ్యవహరించారని, ఎటువంటి చట్టపరమైన సమర్థన లేకుండా పార్లమెంటు తన పనిని తాను చేయకుండా ఆపేశారని కోర్టు వ్యాఖ్యానించింది. కానీ, జరగాల్సిన నష్టం జరిగింది'' అని ఆయన అభిప్రాయపడ్డారు.

బ్రిటన్ పార్లమెంట్

ఫొటో సోర్స్, EPA

ఈ కేసులో ప్రమేయం ఉన్నవాళ్ల స్పందన ఏమిటి?

ఈ తీర్పుపై కోర్టు వెలుపల మిల్లర్ మాట్లాడుతూ, ''అత్యున్నత న్యాయస్థానం ఈ ఒక్క తీర్పుతో ఎంతో చెప్పింది''అని పేర్కొన్నారు.

''ప్రధానమంత్రి రేపు కచ్చితంగా పార్లమెంట్ తలుపులు తెరవాలి. యోగ్యతలేని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంపీలు ధైర్యంతో నిలబడాలి'' అని చెప్పారు.

స్కాటిష్ కేసును నడిపిస్తున్న ఎస్‌ఎన్‌పీకి చెందిన జొన్నా చెర్రీ స్పందిస్తూ ''ప్రధాన మంత్రి జాన్సన్ తన పదివికి రాజీనామా చేయాలి'' అని డిమాండ్ చేశారు.

ఇతర ఎంపీల మాటేమిటి?

పార్లమెంట్‌ను ఐదు వారాల పాటు రద్దు చేయడంపై విమర్శలు చేసిన మాజీ అటార్నీ జనరల్ డొమినిక్ గ్రీవ్ మాట్లాడుతూ, ''ఈ తీర్పు నన్ను ఆశ్చర్యానికి గురిచేయలేదు. ఎందకంటే, ప్రధానమంత్రి తన అధికారాలను దుర్వినియోగపరిచారనే విషయం తెలిసిందే'' అని పేర్కొన్నారు.

''రాజ్యాంగ విరుద్దమైన చర్యను కోర్టు ఆపింది. ఈ తీర్పు నాకు సంతోషాన్ని కలిగించింది'' అని ఆయన బీబీసీకి తెలిపారు.

టోరీ ఎంపీ అండ్రెవ్ బ్రిడ్గెన్ ఈ తీర్పును వ్యతిరేకించారు. ''మన ప్రజాస్వామ్యానికి సంబంధించి ఇది సరైన తీర్పు కాదు. పూర్తిగా అవమానకరం'' అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)