హాంకాంగ్ నిరసనలు: విమానాశ్రయంలో బైఠాయించిన వేలాది ఆందోళనకారులు... సరిహద్దుల్లో దళాలను మోహరించిన చైనా

ఫొటో సోర్స్, EPA
హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం తీవ్ర నిరసనలతో అట్టుడుకుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనకారులు వరుసగా రెండో రోజూ ఎయిర్‌పోర్ట్ కార్యకలాపాలు సాగకుండా చేశారు. మంగళవారం రాత్రి ఆందోళనకారులు, పోలీసుల మీద దాడులకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
అయితే, ఆ తరువాత తమ కార్యకలాపాలను పునః ప్రారంభించామని విమానాశ్రయ అధికారులు తెలిపారు. చాలా విమాన సేవలు రద్దయినప్పటికీ, బుధవారం తెల్లవారుజాము నుంచి విమానాల రాకపోకలు నిర్దేశిత వేళల ప్రకారం సాగుతున్నట్లు తెలుస్తోంది.
విమానాశ్రయంలో కొన్ని ప్రదేశాల్లోకి నిరసనకారులు ప్రవేశించడాన్ని రద్దు చేస్తూ తాత్కాలిక ఆదేశాలు తెచ్చుకున్నట్లు ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు.

ఫొటో సోర్స్, Reuters
ఎయిర్‌పోర్టులో ఆందోళనకారులు
అంతకు ముందు టెర్మినల్ బిల్డింగ్స్‌లోకి వేల సంఖ్యలో ఆందోళకారులు ప్రవేశించి, అక్కడే బైఠాయించారు.
దాంతో, విమాన సర్వీసులన్నీ నిలిచిపోయాయి. శుక్రవారం నుంచి హాంకాంగ్ విమానాశ్రయం వద్ద నిరసనలు చోటుచేసుకుంటున్నాయి.
మంగళవారం విమానాశ్రయంలో నిరసనకారులు కనీసం ముగ్గురిపై దాడి చేశారు. దాడికి గురైనవారి వద్ద చైనా పోలీసు అధికారులన్న ఐడీ కార్డులు ఉన్నట్లు సమాచారం.
ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లోకి మఫ్టీలో పోలీసులను పంపిస్తున్నట్లు హాంకాంగ్ పోలీసు శాఖ ఇదివరకే అంగీకరించింది.
అయితే, దాడికి గురైనవారిలో తమ విలేకరి ఉన్నట్లు చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్ టైమ్స్ ఎడిటర్ తెలిపారు.
మంగళవారం రాత్రి అల్లర్లు నియంత్రించే పోలీసు దళాలు కూడా విమానాశ్రయంలోకి వచ్చాయి.

ఫొటో సోర్స్, Reuters
ఖాళీ చేయించేందుకు కోర్టు అనుమతి
ప్రపంచంలోనే అత్యంత రద్దీ ఉండే విమానాశ్రయాల్లో హాంకాంగ్ ఎయిర్‌పోర్ట్ కూడా ఒకటి.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా హాంకాంగ్‌లో పది వారాలుగా నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అవి నగర విమానాశ్రయానికి వ్యాపించాయి.
నిరసనకారులను ఖాళీ చేయించేందుకు విమానాశ్రయ నిర్వహణ సంస్థకు కోర్టు ఆదేశం ఇచ్చినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక పేర్కొంది. అయితే, ఈ ఆదేశాన్ని ఎలా అమలు చేస్తారన్నదానిపై స్పష్టత లేదు.
ప్రయాణికులకు కలిగించిన అసౌకర్యానికి క్షమాపణలు చెబుతున్న ప్లకార్డులను కూడా నిరసనకారులు ప్రదర్శించారు.
విమానాశ్రయం బయట పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణలు జరిగాయి.
గాయపడ్డ ఓ వ్యక్తిని విమానాశ్రయం నుంచి తీసుకువెళ్లేందుకు కొందరు పోలీసులు విమానాశ్రయంలో ఓ సందర్భంలో లోపలికి వచ్చారు. దీంతో వారికి, నిరసనకారులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సమయంలో పోలీసులు పెప్పర్ స్ప్రే ప్రయోగించారు. ఈ ఘటనలకు సంబంధించిన కొన్ని దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి.

ఫొటో సోర్స్, Getty Images
బలగాలను మోహరిస్తున్న చైనా
హాంకాంగ్ సరిహద్దు పట్టణం షెంజెన్‌లో సైనిక వాహన శ్రేణి ఉన్న ఫొటోలను చైనా ప్రభుత్వ మీడియా ప్రచురించింది.
ఆందోళనలు ప్రమాదకర స్థాయిని చేరుకున్నాయని, ఇలాగే కొనసాగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హాంకాంగ్ సీఈఓ క్యారీ లామ్ నిరసనకారులను మరోసారి హెచ్చరించారు.
హాంకాంగ్ సరిహద్దుల్లో చైనా బలగాలను మోహరిస్తున్నట్లు తమకు సమాచారం అందిందని, అందరూ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నామని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. సమస్య శాంతియుతంగా పరిష్కారం అవ్వాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.
ఆందోళనకారుల విషయంలో ప్రభుత్వం సంయమనం పాటించాలని ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ మిషెల్ బాషెలెట్ అభ్యర్థించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆ చట్టమే కారణం..
హాంకాంగ్ ఒకప్పుడు బ్రిటిష్ వలస ప్రాంతంగా ఉండేది. 1997లో చైనా పాలన కిందకు వచ్చింది. కానీ.. 'ఒక దేశం - రెండు వ్యవస్థ'ల సూత్రం కింద హాంకాంగ్ పాక్షిక స్వయం ప్రతిపత్తి గల ప్రాంతంగా కొనసాగుతోంది.
ఈ నగరానికి సొంత చట్టాలు ఉన్నాయి. చైనా పౌరులకు లేని పౌర స్వాతంత్ర్యం, స్వేచ్ఛ హాంకాంగ్ వాసులకు ఉంది.
అయితే, 'నిందితులను' చైనాకు అప్పగించేందుకు వీలుగా ఓ చట్టం చేసేందుకు హాంకాంగ్‌లోని చైనా అనుకూల ప్రభుత్వం ప్రయత్నించింది. దీనికి వ్యతిరేకంగా జూన్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు మొదలయ్యాయి.
ఈ చట్టం వస్తే హాంకాంగ్ న్యాయవ్యవస్థను స్వతంత్రతను చైనా దెబ్బతీస్తుందని, ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అనుమానితుల పేరుతో హంకాంగ్ పౌరులను చైనా ఏకపక్షంగా నిర్బంధించి, వేధింపులకు గురి చేయొచ్చని విమర్శకులు అంటున్నారు.
ఈ చట్టం పట్ల ప్రజల్లో చాలా విస్తృతంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీల్లో లక్షల మంది పాల్గొంటున్నారు.
జులైలో నిరసనకారులు హాంకాంగ్ పార్లమెంటు భవనంలోకి కూడా చొరబడ్డారు.
ఇవి కూడా చదవండి:
- పార్లమెంటులోకి చొరబడి విధ్వంసానికి పాల్పడ్డారు... ఎందుకంటే...
- కశ్మీరీ యువతి డైరీలో ఆ అయిదు రోజులు
- మెట్రో స్టేషన్లో మూకదాడి.. 45 మందికి తీవ్ర గాయాలు
- ‘హత్తుకొని పడుకునే ఆ పిల్లలు... అలాగే ప్రాణాలొదిలారు’
- శత్రువులపై రక్తసిక్త పోరుకైనా చైనా రెడీ: షీ జిన్‌పింగ్
- కశ్మీర్: 'భారత్ మాతాకీ జై' అనే నినాదాలతో ఉన్న ఈ వీడియో ఎక్కడిది?- Fact Check
- 124 డిగ్రీల ఉష్ణోగ్రతలో పనిచేయడం ఎంత కష్టమో వీరి కళ్లలోకి చూస్తే తెలుస్తుంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








