హాంగ్‌కాంగ్ నిరసనలు: పార్లమెంటులోకి చొరబడి విధ్వంసానికి పాల్పడ్డ ఆందోళనకారులు

హాంకాంగ్, నిరసనలు

ఫొటో సోర్స్, EPA

హాంకాంగ్‌లో వివాదాస్పద నేరస్థుల అప్పగింత చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. అక్కడి పార్లమెంటులోకి నిరసనకారులు చొరబడి విధ్వంసానికి పాల్పడ్డారు.

లెజిస్లేటివ్ కౌన్సిల్ భవనంలో కొన్ని గంటలపాటు తిష్ఠవేశారు.

సోమవారం అర్ధరాత్రి నిరసనకారులను పార్లమెంటు నుంచి పోలీసులు బయటకు వెళ్లగొట్టారు. వారిపై టియర్ గ్యాస్ కూడా ప్రయోగించారు.

బ్రిటన్ నుంచి చైనాకు హాంకాంగ్‌‌పై అధికార మార్పిడి జరిగిన దినం (జులై 1) సందర్భంగా చోటుచేసుకున్న ఆందోళన ప్రదర్శన ఈ పరిణామాలకు దారితీసింది.

అనుమానిత నేరగాళ్లను చైనాకు అప్పగించే ప్రతిపాదిత చట్టానికి వ్యతిరేకంగా కొన్ని వారాలుగా హాంకాంగ్‌లో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. రాజకీయంగా విభేదించేవారిని చైనాకు అప్పగించేందుకే ఈ చట్టమని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

హాంకాంగ్, నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

ఈ చట్టానికి వ్యతిరేకంగా సోమవారం కూడా తొలుత శాంతియుతంగా భారీ ర్యాలీ జరిగింది. వేల మంది ఇందులో పాల్గొన్నారు.

జూన్ 12న ఆందోళనకారులపై పోలీసులు జరిపిన హింసపై స్వతంత్ర విచారణ జరగాలని కూడా నిరసనకారులు డిమాండ్ చేశారు.

మరోవైపు అధికార మార్పిడి దినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం అధికారిక సంబరాలను నిర్వహించింది.

మధ్యాహ్నం సమయంలో ర్యాలీ నుంచి పదుల సంఖ్యలో నిరసనకారులు వేరుపడి పార్లమెంటు వైపు వెళ్లారు. భవనాన్ని చుట్టుముట్టారు. గాజు గోడలను పగులగొట్టుకుని లోపలకు వెళ్లారు.

ఘటన స్థలంలోనే ఉన్న ప్రజాస్వామ్య అనుకూల (ప్రొ డెమోక్రసీ) ఎంపీలు నిరసనకారులను నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. పార్లమెంటులోకి వెళ్తే తీవ్రమైన కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

నిరసనకారులు తమ మాట వినలేదని, తాము పర్యవసానాలకు సిద్ధపడే ఉన్నామని సమాధానం ఇచ్చారని ల్యూంగ్ యూ చంగ్ అనే ఎంపీ అన్నారు.

హాంకాంగ్, నిరసనలు

ఫొటో సోర్స్, Reuters

నిరసనకారులను పోలీసులు కూడా హెచ్చరించారు. అయితే వారితో ఘర్షణకు దిగకుండా, కాసేపటికి పోలీసులు వెనక్కతగ్గి భవనాన్ని వీడారు. ఆ తర్వాత భవనంలోకి వందల మంది నిరసనకారులు చొరబడ్డారు. వీరంతా హెల్మెట్లు, ముఖాలకు మాస్కులు, గొడుగులతో వచ్చారు.

పార్లమెంటు లోపలికి చొరబడ్డాక, సెంట్రల్ చాంబర్‌లో ఉన్న అధికార చిహ్నానికి నిరసనకారులు రంగు పూశారు. బ్రిటీష్ వలసపాలన నాటి జెండాను ఎగురవేశారు. గోడలపై రంగులతో నినాదాలు రాశారు. ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు.

అర్ధరాత్రి సమయంలో నిరసనకారులను పోలీసులు చెదరగొట్టి, బయటకుపంపారు. భవనాన్ని వీడేందుకు మొండికేస్తున్న కొందరిని సాటి ఆందోళనకారులే లాక్కెళ్లే ప్రయత్నం చేశారు.

ప్రజాస్వామ్య అనుకూల ఎంపీలు కొందరు భవనాన్ని వదిలేందుకు నిరసనకారులకు సమయం ఇవ్వాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

ఒక గంట సమయంలోనే పార్లమెంటు వీధులన్నీ ఖాళీ అయ్యాయి. మీడియా, పోలీసులు తప్ప అక్కడ ఎవరూ మిగల్లేదు.

భవనం లోపలే నిరసనకారులు ఇంకా ఎవరైనా ఉన్నారా అని పోలీసులు గాలించారు. ఎవరినీ అరెస్టు చేసినట్లైతే సమాచారం రాలేదు.

హాంకాంగ్, నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

హాంకాంగ్ సీఈఓ (ప్రభుత్వాధినేత) కేరీ ల్యామ్ నిరసనకారుల తీరును తప్పబట్టారు. ఈ ‘తీవ్రమైన హింస’ను ఖండిస్తున్నానని ఆమె అన్నారు.

మంగళవారం ఉదయం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆమె తాజా ఘటనల గురించి మట్లాడారు.

ఈ పరిణామాలు చాలా మందికి బాధ కలిగించాయని, ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారని ఆమె అన్నారు.

''ఆ హింసాత్మక ఘటనలను చూసిన ప్రజలు మాతో ఏకీభవిస్తారని అనుకుంటున్నా. వీటిని ఖండించడమే సరైన చర్య. మళ్లీ సమాజం సాధారణ స్థితికి వస్తుందని ఆశిస్తున్నా'' అని వ్యాఖ్యానించారు.

చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడినందుకు నిరసనకారులు కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)