Ind vs NZ: ప్రపంచకప్ నుంచి భారత్ అవుట్.. ఫైనల్‌కు చేరుకున్న న్యూజీలాండ్

ఫొటో సోర్స్, AFP
ప్రపంచకప్ క్రికెట్‌లో టీమిండియా ఫైనల్ ముందు చతికిలపడింది. లీగ్ దశలో అగ్రగామిగా నిలిచి సెమీఫైనల్‌కు దూసుకొచ్చిన భారత జట్టు ఫైనల్‌కు ఒక్క అడుగు దూరంలో నిరాశపర్చింది.
ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో సెమీఫైనల్‌లో న్యూజీలాండ్ చేతిలో ఓటమి పాలైంది.
న్యూజీలాండ్ ఇచ్చిన 240 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన భారత్ 49.3 ఓవర్లలో 221 పరుగులకే ఆలౌటై ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది.
ఆద్యంతం ఉత్కంఠగా సాగిన సెమీఫైనల్‌లో భారత్‌పై సాధించిన విజయంతో న్యూజీలాండ్ ఫైనల్‌కు చేరుకుంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
టీమిండియా నిరాశపరిచింది కానీ, ఆ పోరాట స్ఫూర్తి నచ్చింది: ప్రధాని నరేంద్ర మోదీ
క్రికెట్ ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలవడంపై అభిమానులు నిరాశపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఫలితం నిరాశపరిచిందంటూ ట్వీట్ చేశారు.
అయితే, విజయం కోసం చివరి వరకు టీమిండియా చేసిన పోరాటం తనకు నచ్చిందన్నారు.
టోర్నీ యావత్తూ భారత్ బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగులో రాణించడం గర్వకారణమన్నారు.
గెలుపు ఓటములు జీవితంలో భాగమంటూ.. భవిష్యత్ మ్యాచ్‌లకు శుభాకాంక్షలు తెలిపారు.

ఫొటో సోర్స్, Twitter/cricketworldcup
న్యూజీలాండ్‌కు రెండో ఫైనల్... ఎనిమిదో సెమీ ఫైనల్
న్యూజిలాండ్ ప్రపంచ కప్ క్రికెట్‌లో ఫైనల్ చేరడం ఇది రెండోసారి. గత ప్రపంచ కప్2లోనూ న్యూజిలాండ్ ఫైనల్‌కు చేరి అక్కడ ఓటమి పాలైంది.
1975, 79, 92, 99, 2007, 2011 ప్రపంచకప్‌లలో సెమీఫైనల్ వరకు వచ్చినా ఫైనల్‌కు చేరలేకపోయింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఆరంభం నుంచీ తడబాటే
న్యూజీలాండ్ ఇచ్చిన 240 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన భారత జట్టు ఆరంభం నుంచే కష్టాల్లో చిక్కుకుంది.
జట్టు స్కోరు 4 పరుగుల వద్ద ఉన్నప్పుడే రోహిత్ శర్మ అవుటయ్యాడు. హెన్రీ బౌలింగ్‌లో లత్హామ్‌కు క్యాచ్ ఇచ్చి రోహిత్ పెవిలియన్‌కు చేరుకున్న తరువాత వెంటవెంటనే మరో రెండు వికెట్లు పడ్డాయి.
రోహిత్ తరువాత బ్యాటింగ్‌కు వచ్చిన విరాట్ కోహ్లీ కూడా ఒకే ఒక్క పరుగు చేసి వెనుదిరిగాడు. బోల్ట్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ఆ వెంటనే కేఎల్ రాహుల్ హెన్రీ బౌలింగ్‌లో లత్హామ్‌కు క్యాచ్ ఇచ్చాడు. దాంతో జట్టు స్కోరు 5 పరుగులకు చేరేటప్పటికి భారత్ 3 వికెట్లు కోల్పోయింది.
అనంతరం దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్ వికెట్లు కాపాడుకుంటూ కాసేపు ఆడినా ఆ భాగస్వామ్యం కూడా ఎంతోసేపు నిలవలేదు. పదో ఓవర్ చివరి బంతికి దినేశ్ కార్తీక్ అవుటయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 24 పరుగులే.
24 పరుగులకే నాలుగు ప్రధాన వికెట్లు కోల్పోవడంతో టీమిండియా తీవ్ర ఒత్తిడికి లోనయింది.

ఫొటో సోర్స్, Getty Images
ఆ దశలో రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యాలు ఆచితూచి ఆడుతూ స్కోరును ముందుకు నడిపించారు. పాండ్యా తన సహజశైలికి భిన్నంగా ఆచితూచి ఆడడంతో జట్టు స్కోరు కూడా నెమ్మదిగానే ముందుకు సాగింది.
సాంట్నర్ వేసిన ఇన్నింగ్స్ 23వ ఓవర్లో రిషబ్ పంత్ గ్రాండ్‌హామ్‌కు క్యాచ్ ఇవ్వడంతో ఆ జోడీకి బ్రేక్ పడింది.
పంత్ తరువాత 31వ ఓవర్లో పాండ్యా కూడా సాంట్నర్ బౌలింగ్2లోనే విలియమ్సన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికి జట్టు స్కోరు 92 పరుగులు.

ఫొటో సోర్స్, Getty Images
పంత్, పాండ్యాలు అవుట్ కావడంతో క్రీజులోకి వచ్చిన ధోనీ, రవీంద్ర జడేజాలు మంచి భాగస్వామ్యం అందించారు.
ఏడో వికెట్‌కు వారిద్దరూ 116 పరుగులు జోడించిన తరువాత 48వ ఓవర్లో బోల్ట్ బౌలింగులో జడేజా భారీ స్కోరుకు యత్నించి విలియమ్సన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

ఫొటో సోర్స్, Twitter/cricketworldcup
ఆశలు రేపిన జడేజా
జడేజా క్రీజులో ఉన్నంతసేపు స్కోరు పరుగెత్తించడంతో టీమిండియా అభిమానుల్లో గెలుపు ఆశలు కలిగాయి. 59 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో రవీంద్ర జడేజా 77 పరుగులు చేశాడు.
జడేజా అవుటయ్యేటప్పటికి భారత్ 13 బంతుల్లో 32 పరుగులు చేయాల్సిన పరిస్థితి.
మ్యాచ్ ఫినిషర్‌గా పేరున్న ధోనీ క్రీజులో ఉండడంతో అభిమానుల్లో ఆశలు మిణుకుమిణుకుమన్నాయి. కానీ.. జట్టు స్కోరు 216 పరుగుల వద్ద ధోనీ రనవుట్ అయ్యాడు.
72 బంతులాడిన ధోనీ ఒక ఫోర్, ఒక సిక్సర్‌తో 50 పరుగులు చేశాడు.
అనంరం వచ్చిన భువనేశ్వర్ కుమార్, యజువేంద్రచాహల్ వెంటవెంటనే అవుట్ కావడంతో 49.3 ఓవర్లకు భారత్ 221 పరుగులు చేసి ఆలవుట్ అయింది.

ఫొటో సోర్స్, Getty Images
టాప్ ఆర్డర్‌ను కూల్చిన హెన్రీ
న్యూజిలాండ్ బౌలర్లలో ఎంజే హెన్రీ కీలక వికెట్లు తీసుకుని భారత్ టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఇద్దరూ హెన్రీ బౌలింగులోనే అవుటయ్యారు. దినేశ్ కార్తీక్ వికెట్ కూడా హెన్రీ ఖాతాలోనే పడింది.
బోల్డ్, సాంట్నర్‌లు రెండేసి వికెట్లు... ఫెర్గూసన్, నీషమ్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు.
ఆరంభంలో విరాట్ కోహ్లీని, అనంతరం ప్రమాదకరంగా మారుతున్న రవీంద్రజడేజాను బోల్డ్ అవుట్ చేశాడు.
సాంట్నర్ కూడా రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యాలను పెవిలియన్‌కు పంపి న్యూజిలాండ్ విజయానికి బాటలు వేశాడు.

ఫొటో సోర్స్, Getty Images
న్యూజీలాండ్‌దీ పేలవమైన ఆరంభమే.. టేలర్ రాణించడంతో గౌరవప్రదమైన స్కోర్
మంగళవారం మొదలైన సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మూడో ఓవర్ అయిదో బంతి వరకు న్యూజీలాండ్ ఖాతా తెరవలేకపోయింది. ఆ తరువాత ఓవర్లో తొలి వికెట్ కోల్పోయింది.
అనంతరం ఓపెనర్ నికోలస్, విలియమ్సన్‌లు మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. 19వ ఓవర్లో నికోలస్ అవుటయ్యాడు. ఆ తరువాత వచ్చిన బ్యాట్స్‌మన్లలో రాస్ టేలర్ మినహా ఇంకెవరూ రాణించలేదు.
న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్లలో రాస్ టేలర్ అత్యధికంగా 74 పరుగులు(94 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్) సాధించాడు. విలియమ్సన్ 67, నికోలస్ 28 పరుగులు చేశారు.
మంగళవారం 46.1 ఓవర్ల వద్ద వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది.
అప్పటికి న్యూజీలాండ్ 46.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది.
మ్యాచ్ నిలిచిపోయేటప్పటికి టేలర్ 67, లత్హామ్ 3 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బుధవారం కొనసాగిన ఆట
బుధవారం ఆట కొనసాగించిన న్యూజీలాండ్ వెంటవెంటనే మరో మూడు వికెట్లు కోల్పోయింది.
50 ఓవర్లు ముగిసేటప్పటికి 8 వికెట్లు కోల్పోయి 239 పరుగులు చేసి భారత్‌కు 240 పరుగుల లక్ష్యం ఇచ్చింది.
బుధవారం ఆట పున:ప్రారంభమైన కొద్దిసేపటికే రాస్ టేలర్ అవుటయ్యాడు. ఆ తరువాత 49 ఓవర్ తొలి బంతికి న్యూజీలాండ్ లత్హామ్ రూపంలో ఏడో వికెట్ కోల్పోయింది. అదే ఓవర్ చివరి బంతికి హెన్రీ కూడా అవుటవడంతో న్యూజీలాండ్ 8 వికెట్లు కోల్పోయింది.

ఫొటో సోర్స్, Getty Images
భువనేశ్వర్‌కు మూడు వికెట్లు
భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు తీశాడు. 10 ఓవర్లో 43 పరుగులు ఇచ్చిన ఆయన తొలి రోజు ఒక వికెట్.. రెండో రోజు మరో రెండు వికెట్లు తీశాడు.
బుమ్రా 10 ఓవర్లలో 39 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, యజువేంద్ర చాహల్ కూడా తలో వికెట్ తీశారు.
రవీంద్ర జడేజా 10 ఓవర్లలో 34 పరుగులు మాత్రమే ఇచ్చి పొదుపుగా బౌలింగ్ చేశాడు.

ఫొటో సోర్స్, TWITTER/CWC
సెంటిమెంటును తిరగరాయలేకపోయిన టీమిండియా
ప్రపంచ కప్‌లో ఇప్పటివరకు ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో మొత్తం ఐదు మ్యాచులు జరగ్గా, ఐదింటిలోనూ మొదట బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది.
ఇక్కడ భారత్ రెండు మ్యాచులు, న్యూజీలాండ్ ఒక మ్యాచ్ ఆడాయి. భారత్ తన రెండు మ్యాచుల్లోనూ, న్యూజీలాండ్ తన ఏకైక మ్యాచ్‌లోనూ మొదట బ్యాటింగ్ చేశాయి.
తాజా మ్యాచ్‌లోనూ తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజీలాండ్‌నే విజయం వరించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో భారత్‌కు రెండు విజయాలు.. ఒక ఓటమి
ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జూన్ 16 నాటి మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకొంది. భారత్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 89 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
భారత్ ఐదు వికెట్ల నష్టానికి 336 పరుగులు చేయగా, 140 పరుగులతో ఓపెనర్ రోహిత్ శర్మ, 77 పరుగులతో కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టులో టాప్ స్కోరర్లుగా నిలిచారు. విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా, కుల్‌దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీశారు.
జూన్ 27 నాటి మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొంది. వెస్టిండీస్‌పై 128 పరుగుల ఆధిక్యంతో మరో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
భారత్ ఏడు వికెట్ల నష్టానికి 268 పరుగులు చేయగా, 72 పరుగులతో కోహ్లీ, 48 పరుగులతో ఓపెనర్ కేఎల్ రాహుల్ టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో మొహమ్మద్ షమీ అత్యధికంగా నాలుగు వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా, యజ్వేంద్ర చాహల్ రెండేసి వికెట్లు పడగొట్టారు.
తాజా మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది.

ఫొటో సోర్స్, Getty Images
భారత్ Vs న్యూజీలాండ్ - గతంలో ఏం జరిగింది?
ఇప్పటికే లీగ్ దశలో భారత్ - న్యూజీలాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దాంతో టోర్నీలో ఓ రకంగా ఎవరిపైనా ఎవరికీ పై చేయి లేదు. భారత్ ఇప్పటి దాకా ఆరు ప్రపంచ కప్ సెమీఫైనళ్లలో తలపడింది. అందులో మూడింట్లో గెలిస్తే, మరో మూడింట్లో ఓడిపోయింది. అయితే ఈ ఆరు మ్యాచుల్లో ఒక్కసారి కూడా న్యూజీలాండ్‌తో పోటీ పడలేదు.
మరో పక్క న్యూజీలాండ్ ఇప్పటిదాకా 7 ప్రపంచకప్ సెమీఫైనల్స్ ఆడితే, అందులో ఒకేఒక్క మ్యాచ్‌లో గెలిచింది.
ఇక మొత్తంగా ప్రపంచ కప్ మ్యాచ్‌లను చూస్తే భారత్-న్యూజీలాండ్ 8 సార్లు తలపడ్డాయి. వీటిలో న్యూజీలాండ్‌దే పై చేయి. న్యూజీలాండ్ 4 మ్యాచ్‌లు గెలిస్తే, భారత్ 3 గెలిచింది. ఒకటి రద్దయింది.
మరో విషయం ఏంటంటే.. భారత్ ఇప్పటిదాకా ఇంగ్లండ్‌లో జరిగిన ఏ ప్రపంచ కప్ మ్యాచ్‌లోనూ న్యూజీలాండ్‌పై గెలవలేదు. మూడు మ్యాచ్‌లు ఆడితే, మూడింట్లోనూ ఓడింది.
భారత్ న్యూజీలాండ్ మధ్య ఇప్పటిదాకా 106 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. వాటిలో 55 మ్యాచుల్లో భారత్ గెలిస్తే, 45 మ్యాచుల్లో న్యూజీలాండ్ గెలిచింది. మరో ఐదు మ్యాచుల్లో ఫలితం తేలలేదు. ఒకటి టై అయింది.
ఇవి కూడా చదవండి:
- విరాట్ కోహ్లీ: "ఇదేం మైదానం, బౌండరీ అంత దగ్గరా..."
- ముస్లిం కుటుంబాల నుంచి పిల్లలను మేం వేరు చేయడం లేదు: చైనా
- యునెస్కో వారసత్వ ప్రదేశాల జాబితాలో జైపూర్
- ప్రపంచ కప్ 2019: సెమీస్ ఆడకుండానే టీమిండియా ఫైనల్ చేరుకోవచ్చా
- అనంతపురం కాలేజీ వైరల్ వీడియో వెనుక అసలు కథ
- నాయకుడెవరూ లేకపోయినా.. యాప్స్ ద్వారా భారీ ఉద్యమం ఎలా సాధ్యమైంది?
- క్రికెట్ వరల్డ్‌కప్ కోసం ఐసీసీ ఇంగ్లాండ్‌నే ఎందుకు ఎంచుకుంది...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








