క్రికెట్ ప్రపంచ కప్ 2019: భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లో గెలిచేదెవరు?

విరాట్, సర్ఫరాజ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, వినాయక్ గైక్వాడ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఈ రోజు నా లక్కీ డే. నిద్ర లేచేటప్పటికి సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. వాతావరణం పొడిగా వేడిగా ఉంది. ఉదయం వర్షం కురిసే అవకాశం లేదు.

నాకు చాలా ఆనందంగా ఆతృతగా ఉంది. ఎందుకంటే క్రికెట్ లెజెండ్లు ఇద్దరిని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. ఒకరు సుదీర్ఘ కాలంపాటు పాకిస్తాన్‌ జట్టుకు సారథ్యం వహించిన ఇంజమాముల్ హక్. ఇంకొకరు భారత 'లిటిల్ మాస్టర్' సునీల్ గవాస్కర్.

నా ఇంటర్వ్యూ వినతిని అంగీకరించారని ఉదయం 7:30 గంటల సమయంలో ఫోన్ వచ్చింది. మేం రెడీ అయ్యాం. నేరుగా మాంచెస్టర్‌లోని కాథెడ్రల్ గార్డెన్స్‌లో గల ఐసీసీ ఫ్యాన్ జోన్‌కి వెళ్లాం.

నిజం చెప్పాలంటే, భారత్ - పాక్ జట్టు మ్యాచ్‌కు ఒక రోజు ముందు ఫ్యాన్ జోన్‌లో పెద్ద హడావిడి ఉంటుందని నేను అనుకోలేదు. కానీ అది పొరపాటు. ఇంజమామ్, గవాస్కర్ వస్తున్నారని జనానికి తెలుసు. తమ స్టార్ ఆటగాళ్లను చూడటానికి భారత, పాకిస్తానీ అభిమానులు ఇక్కడ పోగయ్యారు.

సునీల్ గవాస్కర్
ఫొటో క్యాప్షన్, సునీల్ గవాస్కర్‌తో అభిమానులు

సునీల్ గవాస్కర్ జోస్యం...

ఈ మ్యాచ్ గురించి నేను గవాస్కర్‌ను అడిగాను. ''మ్యాచ్ జరగాలని నేను కోరుకుంటున్నా. కానీ వాతావరణం ఎలా ఉంటుందో మనకు తెలీదు'' అని ఆయన బదులిచ్చారు.

ఈ మ్యాచ్ గెలవటం పాకిస్తాన్‌కు చాలా కీలకమని కూడా ఆయన చెప్పారు. ఒకవేళ గెలవకపోతే వరల్డ్ కప్ టోర్నీలో ఆ జట్టు ప్రయాణం ముగుస్తుందన్నారు. ఇక భారత జట్టు మీద ఉన్న ఒత్తిడి.. తమ మీద ఉన్న అంచనాలని పేర్కొన్నారు.

వేదిక ఎంపిక గురించి, టోర్నమెంట్‌లో రిజర్వ్ డేలు లేకపోవటం గురించి కూడా నేను ఆయనను అడిగాను. రౌండ్ రాబిన్ విధానంలో రిజర్వ్ డేలు ఉండవని గవాస్కర్ తెలిపారు. ''అన్ని జట్లూ ప్రతి జట్టుతోనూ ఆడాల్సి ఉంటుంది. అందులో రిజర్వ్ డేలు పెడితే.. ఐసీసీ అన్ని మ్యాచ్‌లకూ ఎలా చోటు కల్పించగలదు?'' అని వ్యాఖ్యానించారు.

క్రికెట్ కప్

భారత జట్టు వరల్డ్ కప్ గెలిచే అవకాశాల గురించి కూడా ఆయన మాట్లాడారు. అయితే ఇంగ్లండ్ జట్టు వైపు ఆయన మొగ్గుచూపారు. ''భారత జట్టు అద్భుత ఫామ్‌లో ఉందనటంలో, పోటీలో ఈ ఆటగాళ్ళు ముందు వరుసలో ఉన్నారనటంలో సందేహం లేదు. కానీ ఇంగ్లండ్ జట్టు నా ఫేవరెట్'' అని చెప్పారు.

అందుకు కారణాలు కూడా ఆయన తెలిపారు. ఈ పరిస్థితులు ఇంగ్లండ్‌కు బాగా తెలుసు. ఇండియా, పాకిస్తాన్, లేదా ఉపఖండంలోని ఇతర జట్లు ఎండలో ఆడటానికి ఇష్టపడతాయి. ఇంగ్లండ్ వాతావరణంలో ఆడటం మీద వారికి పట్టులేదు. కానీ ఇంగ్లండ్‌కి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎలా ఆడాలి, తమ బలాలకు ఎలా పదును పెట్టుకోవాలి అన్నది వారికి కచ్చితంగా తెలుసు. ఇంగ్లండ్, భారత జట్లు ఫైనల్‌ చేరితే.. కప్ గెలిచే అవకాశాలు ఇంగ్లండ్‌కే ఎక్కువ ఉన్నాయని గవాస్కర్ జోస్యం చెప్పారు.

ఇంజమాముల్ హక్
ఫొటో క్యాప్షన్, ఇంజమాముల్ హక్‌తో అభిమానులు

ఇంజమాముల్ హక్ ఏమన్నారు?

ఇవే ప్రశ్నలతో పాకిస్తాన్ జట్టు మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్‌ను కూడా నేను కలిశాను. ముందుగా పాక్-ఇండియా మ్యాచ్ గురించి అడిగాను. ఆయన ఒక్క క్షణం కూడా తటపటాయించలేదు. ''ప్రపంచ కప్‌లో భారత జట్టును పాకిస్తాన్ ఎన్నడూ ఓడించలేదని మనకు తెలుసు. అది నిజం. ఈసారి కూడా పాకిస్తాన్ జట్టు కన్నా ఇండియా జట్టే మెరుగుగా ఉందని నాకు అనిపిస్తోంది'' అని బదులిచ్చారు.

ఇండియన్ బ్యాటింగ్, పాకిస్తాన్ బౌలింగ్ మధ్య పోటీ అని అభివర్ణించారు. ఇరు పక్షాలూ పూర్తిగా సమతూకంతో ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. ఆ రోజు ఎవరు ఉత్తమంగా ఆడతారు అనే దాని మీద మ్యాచ్ ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడ్డారు.

ముఖ్యంగా ప్రపంచమంతటా ఉన్న అభిమానులు, ప్రేక్షకులకు ఇంజమామ్ ఒక సందేశం ఇచ్చారు. పుల్వామా, బాలాకోట్ పరిణామాల అనంతరం జరుగుతున్న ఈ మ్యాచ్ చాలా ఉద్విగ్నతను కలుగజేస్తోంది కదా అని నేను అడిగాను. అసలు ఈ మ్యాచ్‌ను రద్దు చేయాలన్న మాటలు కూడా వినిపించిన విషయాన్ని ప్రస్తావించాను. ఒక క్రికెటర్‌గా ఈ అంశాన్ని ఎలా చూస్తారని ప్రశ్నించాను.

''ఇది కేవలం ఆట... క్రికెట్. ఎవరో ఒకరు గెలవాలి. మరొకరు ఓడిపోవాలి. ఇదేదో యుద్ధం లాంటిది కాదు. రెండు దేశాలనూ కలిపే ఆట ఇది. ఆ క్రీడాస్ఫూర్తితోనే మనం ఈ ఆట ఆడాలి. ఆటగాళ్ల మధ్య శత్రుత్వం అనేదే లేదు. కాబట్టి ఆటను వీక్షిస్తున్న వారు కూడా ప్రశాంతంగా కూర్చుని ఆటను, దాని అసలు స్ఫూర్తిని ఆస్వాదించాలి'' అని సమాధానం చెప్పారు.

క్రికెట్ అభిమానులు

విరాట్ కోహ్లీ ఎలా చూస్తున్నారు?

భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా నేడు విలేకరుల సమావేశంలో సరిగ్గా ఇవే మాటలు చెప్పాడు. ''మాకు ప్రతి మ్యాచ్ ముఖ్యమైనదే. అన్ని మ్యాచ్‌లూ సమానమైనవే. మా దేశానికి ప్రాతినిధ్యం వహించటానికి మమ్మల్ని ఎంపిక చేశారు.

కాబట్టి ఏ రెండు మ్యాచ్‌ల మధ్యా మేం తేడా చూడం. కొన్ని మ్యాచ్‌లు ఉద్విగ్నభరితంగా ఉంటాయన్నది నిజం. భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ అటువంటిదే. కానీ మేం మాత్రం ఇతర వరల్డ్ కప్ మ్యాచ్‌లాగానే దీనిని పరిగణిస్తాం. గెలవటానికి శాయశక్తులా ప్రయత్నిస్తాం'' అని ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)