గాజా సంక్షోభం: కాల్పుల విరమణ వార్తలతో ఆగిన దాడులు

ఫొటో సోర్స్, Getty Images
గాజా భూభాగంలో ఇజ్రాయెల్, పాలస్తీనా మిలిటెంట్ల మధ్య రెండు రోజుల తీవ్ర ఘర్షణ అనంతరం ఉద్రిక్తతలు సద్దుమణిగాయి.
ఈజిప్ట్ మధ్యవర్తిత్వంతో ఇరుపక్షాలు కాల్పుల విరమణ పాటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
తాజా ఘర్షణలో కనీసం నలుగురు ఇజ్రాయెల్ పౌరులు, 23 మంది పాలస్తీనావాసులు మృత్యువాతపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
2014 ఆగస్టు అనంతరం ఘర్షణ ఇంత తీవ్ర స్థాయికి చేరుకోవడం ఇదే మొదటిసారి.
కాల్పుల విరమణపై అంగీకారం గురించి గాజాను నియంత్రిస్తున్న పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్‌కు చెందిన ఓ టీవీ కేంద్రం తెలిపింది.
ఈ అంశం గురించి ఇజ్రాయెల్ ఇంతవరకూ స్పందించలేదు.
ఐక్య రాజ్య సమితి సహా అంతర్జాతీయ సమాజం సంయమనం పాటించాలని ఇరువర్గాలకూ పిలుపునిచ్చింది.

ఫొటో సోర్స్, EPA
శనివారం నుంచి తమ భూభాగంలోకి 600కు పైగా రాకెట్లు దూసుకువచ్చాయని, వాటిలో 150కుపైగా రాకెట్లను తమ రక్షణ వ్యవస్థ కూల్చివేసిందని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. బదులుగా 320 లక్ష్యాలపై దాడులు చేసినట్లు పేర్కొంది.
ఐరాస, ఖతార్, ఈజిప్ట్ కాల్పుల విరమణ కోసం ప్రయత్నిస్తున్నట్లు ఆదివారం రాత్రి వార్తలు వచ్చాయి. అంగీకారం కుదిరినట్లు సోమవారం ఉదయం పాలస్తీనా అధికారులు వెల్లడించారు. హమాస్ వర్గాలు, ఈజిప్ట్ అధికారి ఒకరు కూడా ఈ విషయాన్ని ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు తెలిపారు.
'గాజాలోని ఉగ్రవాద మూకలపై భారీ దాడులు కొనసాగించాల'ని తమ సైన్యాన్ని ఆదేశించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదివారం అన్నారు. గాజా ప్రాంతం చుట్టూ ట్యాంకులు, బలగాల మోహరింపును పెంచుతామని ఆయన చెప్పారు.
ఇజ్రాయెల్ సంపూర్ణంగా కాల్పుల విరమణకు కట్టుబడితే పరిస్థితులు సద్దుమణిగే అవకాశం ఉందని హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియా ఓ ప్రకటనలో తెలిపారు.

23 మంది పాలస్తీనియన్లు మృతి
పాలస్తీనాలో ప్రాణాలు కోల్పోయిన 23 మందిలో ఇద్దరు గర్భిణులు, 12 ఏళ్ల బాలుడు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. మృతుల్లో తమ సంస్థ సభ్యులు ఏడుగురు ఉన్నట్లు హమాస్ పేర్కొంది.
ఓ మహిళ, ఆమె కుటుంబానికి చెందిన 14 నెలల చిన్నారి కూడా మరణించినట్లు పాలస్తీనా వర్గాలు చెబుతున్నా.. ఇజ్రాయెల్ ఈ ఆరోపణను తిరస్కరించింది. పాలస్తీనా రాకెట్ లక్ష్యాన్ని చేరుకోకముందే పేలడం వల్ల వారిద్దరూ చనిపోయారని పేర్కొంది.
హమాస్ కమాండర్ హమీద్ హమ్దన్ అల్ ఖొదారీని హతమొందించినట్లు కూడా ఇజ్రాయెల్ ఆదివారం ప్రకటించింది.
గాజాలో హమాస్ నిఘా కార్యాలయం ఉన్న ఓ బహుళ అంతస్తుల భవనాన్ని కూల్చినట్లు తెలిపింది.
సదరు భవనంలో తమ ప్రభుత్వ వార్తా సంస్థ కార్యాలయం ఉన్నట్లు టర్కీ పేర్కొంది. ఇజ్రాయెల్ చర్యలను 'మానవాళిపై దాడి'గా వర్ణించింది.

ఫొటో సోర్స్, AFP
తాజా హింసకు కారణం...
గాజాలో దాదాపు 20 లక్షల మంది పాలస్తీనియన్లు నివసిస్తున్నారు. ఇజ్రాయెల్ ఆ నగరాన్ని దిగ్బంధించడం, విదేశీ సాయంలో ఇటీవల కోతలు విధించడం వల్ల వారు ఆర్థికంగా చాలా కష్టాలు పడుతున్నారు.
మిలిటెంట్లకు ఆయుధాలు అందకుండా ఉండటానికి ఈ చర్య అవసరమని ఇజ్రాయెల్ అంటోంది.
దిగ్బంధానికి వ్యతిరేకంగా శుక్రవారం గాజాలో భారీ నిరసనలు జరిగినప్పడు తాజా హింస మొదలైంది.

ఫొటో సోర్స్, Reuters
సరిహద్దు కంచె వద్ద పాలస్తీనా గన్‌మన్ కాల్పులు జరపడంతో ఇజ్రాయెల్ సైనికుడు ఒకరు చనిపోయారు.
ప్రతిగా ఇజ్రాయెల్ వైమానిక దాడి చేయటంతో ఇద్దరు హమాస్ మిలిటెంట్లు మృతిచెందారు.
శనివారం ఉదయం గాజా నుంచి రాకెట్ల దాడి మొదలైంది.
ఇజ్రాయెల్ ఏర్పాటు చేసుకున్న ఐరన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థ డజన్ల కొద్దీ రాకెట్లను కూల్చివేసింది. కానీ ఇజ్రాయెల్‌లోని అనేక పట్టణాలు, గ్రామాలను అవి తాకాయి.
బదులుగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది.
ఇవి కూడా చదవండి:
- మాస్కో విమాన ప్రమాదం: ఎయిరోఫ్లాట్ జెట్ మంటల్లో 41 మంది మృతి
- భారతదేశమే భూగోళం మీద అత్యంత వేడి ప్రాంతమా...
- శ్రీలంక పేలుళ్లు: ఐఎస్ ప్రకటనలు నిజమేనా? ఐఎస్ గతంలో చర్చిలపై దాడులు చెయ్యలేదా?
- సోషల్ మీడియాలో వలవేసి.. ఇండియాలో అమ్మేస్తున్నారు
- శిల్పినే కబళించబోయిన ఆల్చిప్పల ఆడమ్ శిల్పం
- స్కూలు నుంచి ఇంటికెళ్లాలంటే.. రెండు విమానాలు మారాలి, 5 రోజులు కొండలు ఎక్కాలి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








