బుధవారం పనిచేయడంపై నిషేధం విధించిన కంపెనీ.. 46 శాతం ఆదాయం పెరిగింది

ఫొటో సోర్స్, Getty Images
శని, ఆదివారాలతో... వారం మధ్యలో ప్రతి బుధవారమూ ఆఫీసులో సెలవు ఇస్తే ఎలా ఉంటుంది? ఆస్ట్రేలియాకు చెందిన డిజిటల్ మార్కెటింగ్ సంస్థ వెర్సా అదే విధానాన్ని అమలు చేస్తోంది. బుధవారం పనిని ఆ సంస్థ పూర్తిగా నిషేధించింది.
గతేడాది జులై నుంచి ఈ విధానాన్ని అమలులోకి తెచ్చింది. తర్వాత సంస్థ ఆదాయం ఏకంగా 46 శాతం పెరిగింది, లాభం మూడింతలైందని స్వయంగా ఆ కంపెనీ సీఈవో క్యాథ్ బ్లాక్‌చామ్ చెప్పారు.
యువ ఉద్యోగులు పనిచేసే సంస్థల్లో వినూత్నమైన విధానాలను తీసుకొస్తే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని బ్లాక్‌చామ్ అంటున్నారు.
"నాలుగు రోజుల పని విధానం అమలులోకి వచ్చిన తర్వాత ఉద్యోగులు అనారోగ్య కారణాలతో పెట్టే సెలవులు తగ్గిపోయాయి. వారిలో సంతృప్తి పెరిగింది" అని ఆమె వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
సోమవారం, మంగళవారం కార్యాలయానికి వస్తారు. బుధవారం నాడు ఆఫీసుకు సంబంధించి ఎలాంటి షెడ్యూల్ ఉండదు. అయితే, వ్యాపార భాగస్వామి (క్లయింట్)కి ఏదైనా అవసరం పడితే స్పందించేందుకు మాత్రం ఉద్యోగులు ఫోన్‌లో అందుబాటులో ఉంటారు.
గురు, శుక్రవారం ఆఫీసుకు వెళ్తారు. ఆ తర్వాత శని, ఆదివారాలు సెలవే.
అయితే, నాలుగు రోజుల పని విధానం వల్లే సంస్థకు లాభాలు పెరిగాయని అంగీకరించేందుకు సీఈవో క్యాథ్ బ్లాక్‌చామ్ విముఖత వ్యక్తం చేశారు. కానీ, ఉద్యోగులంతా నిబద్ధతతో కలిసి పనిచేయడం ద్వారా వ్యాపార భాగస్వాములను బాగా మెప్పించే అవకాశం ఉంటుందని ఆమె అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బుధవారమే ఎందుకు?
వారంలో వరుసగా నాలుగైదు రోజులు పని చేయించకుండా దాన్ని సగానికి తగ్గిస్తే ప్రతి రెండు రోజుల తర్వాత సెలువు వస్తుంది. దాంతో, ఆ రెండు రోజులు ఉద్యోగులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారన్న ఆలోచనతో ఈ సంస్థ బుధవారం సెలవు ఇవ్వాలని నిర్ణయించింది.
బుధవారం సెలవు ఇస్తే ఉద్యోగులు చాలా ఉత్సాహంగా పనిచేస్తారన్న విషయం తన అధ్యయనంలో తేలిందని న్యూజీలాండ్‌లోని ఆక్లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన మానవ వనరుల నిర్వహణ విభాగం ప్రొఫెసర్ జార్రోడ్ హార్ అన్నారు.
బుధవారం సెలవు తర్వాత ఉద్యోగులు గురువారం చాలా ప్రశాంతంగా ఎంతో సమర్థవంతంగా పనిచేస్తారని ఆయన చెబుతున్నారు.
వారంలో నాలుగు పనిదినాల విధానంతో ఉత్పత్తిపై ఎలాంటి ప్రభావం పడటంలేదని న్యూజిలాండ్‌కు చెందిన పర్పెక్చువల్ గార్డియన్ అనే సంస్థ కూడా నిరూపించింది. ఆ సంస్థ కూడా గతేడాది నుంచి ఆ విధానాన్ని అమలు చేస్తోంది. సిక్ లీవులు తగ్గడంతో పాటు, ఉద్యోగుల ఆరోగ్య ప్రమాణాలు మెరుపడ్డాయని ఆ సంస్థ తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
ఇతర దేశాల్లో
ఇలాంటి వారంలో నాలుగు రోజుల పని విధానాన్ని అమలు చేసే దిశగా బ్రిటన్, ఐర్లాండ్ దేశాల్లోనూ సమాలోచనలు జరుగుతున్నాయి. స్వీడన్‌లో ఈ విధానాన్ని గతంలో పరీక్షించగా, మిశ్రమ ఫలితాలు వచ్చాయి.
అమెరికాలోనూ కొన్ని స్టార్టప్ కంపెనీలు నాలుగు రోజుల విధానాన్ని ప్రారంభించాయి కానీ, ఆశించిన మేరకు ఫలితాలు రాక పోటీ మార్కెట్‌లో వెనుకబడిపోయే అవకాశం ఉందని తిరిగి 5 రోజుల విధానానికి మారాయి. అదే అమెరికాకు చెందిన ఫాస్ట్‌ఫుడ్ సంస్థ షేక్ షాక్ కూడా ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు ఇటీవల ప్రకటించింది.
ఇవి కూడా చదవండి
- ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఏం జరుగుతోంది...
- ‘అరుణోదయ’ రామారావు కన్నుమూత
- రోహిత్ శర్మ లాంగ్ ఇన్నింగ్స్ రహస్యమేంటి?
- బీరు తాగితే చల్లదనం వస్తుందా?
- 99 మార్కులు వస్తే 0 వేశారు.. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఎందుకిన్ని పొరపాట్లు
- నమ్మకాలు-నిజాలు: పీరియడ్స్ ఆపే మాత్రలు వేసుకోవడం మంచిదా, కాదా
- కిమ్-పుతిన్: తొలిసారిగా భేటీ కానున్న ఉత్తర కొరియా, రష్యా నాయకులు
- శ్రీలంక పేలుళ్లు న్యూజిలాండ్ మసీదుల్లో దాడులకు ప్రతీకారంగా జరిగినవా?
- బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఇచ్చిన రాజీవ్ గాంధీని చంపించిన ఎల్టీటీఈ ప్రభాకరన్
- సచిన్ టెండూల్కర్ ‘లిటిల్ మాస్టర్’ ఎలా అయ్యారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








