బ్రెగ్జిట్: ప్రతినిధుల సభలో తిరస్కరణ.. 58 ఓట్లతో వీగిన బిల్లు

ఫొటో సోర్స్, EPA
ఈయూ నుంచి బ్రిటన్ బయటకు వచ్చేయాలన్న బ్రెగ్జిట్ ఒప్పందం బిల్లు 58 ఓట్ల తేడాతో వీగిపోయింది.
బ్రిటన్ పార్లమెంటులో ఈ బిల్లును వ్యతిరేకిస్తూ 344 మంది ఓటేయగా 286 మంది అనుకూలంగా ఓటేశారు. దీంతో బ్రిటన్ బ్రెగ్జిట్ ప్రణాళికలు మరింత గందరగోళంలో పడ్డాయి.
తాజా పరిణామాల ప్రభావం తీవ్రంగా ఉంటుందని.. బ్రెగ్జిట్ ఒప్పందం ప్రకారం ఏప్రిల్ 12న బ్రిటన్ ఈయూ నుంచి వైదొలగాల్సి ఉందని బ్రిటన్ ప్రధాని థెరెసా మే అన్నారు.
బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా చట్టం తేవడానికి కూడా సమయం లేదన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
థెరెసా మే రాజీనామాకు డిమాండ్
కాగా తాజా పరిణామాల అనంతరం లేబర్ పార్టీ నేత జెరెమె కార్బిన్... ప్రధాని మే రాజీనామా చేయాలని, దేశంలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు ఈ ఓటింగ్‌పై యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు డోనల్డ్ టస్క్ ట్విటర్ వేదికగా స్పందించారు.
''ప్రతినిధుల సభ ఈ ఒప్పందాన్ని తిరస్కరించడంతో తరువాత ఏప్రిల్ 10న యూరోపియన్ కౌన్సిల్ నిర్వహణకు నిర్ణయించాను'' అని ట్వీట్ చేశారు.
ఈ ఓటింగ్ ఫలితంగా ఈయూ నుంచి బయటకు వెళ్లేందుకు మే 22 వరకు గడువు పొందే అవకాశం కోల్పోయింది.
కాగా జనవరిలో పార్లమెంటులో ఓటింగ్ కోసం ఈ ఒప్పందాన్ని ప్రవేశ పెట్టినప్పుడు కూడా అది 230 ఓట్ల తేడాతో తిరస్కరణకు గురైంది. ఆ తరువాత మార్చి 13న ముసాయిదా ఒప్పందాన్ని ఎంపీలు తిరస్కరించారు. తాజాగా మరోసారి సభలో బిల్లు తిరస్కరణకు గురైంది.

ఒప్పందంలో ఏముంది?
బ్రెగ్జిట్ అనంతరం పౌరుల హక్కుల గురించిన ప్రస్తావన ఆ ఒప్పందంలో ఉంది. దాని ప్రకారం, ప్రస్తుతం ప్రజలు ఎక్కడ ఉంటున్నారో, అక్కడే చదువుకోవడానికి, ఉద్యోగం చేసుకోవడానికి, కుటుంబ సభ్యులతో కలిసి స్థిరపడటానికి అవకాశం ఉంటుంది.
ఈయూ నుంచి యూకే వైదొలిగిన అనంతరం పూర్తి స్థాయిలో సంబంధాలు తెంచుకోవడానికి అనువుగా 21నెలల పరివర్తనా కాలాన్ని ఆ ఒప్పందం కేటాయించింది.
విడిపోయే సమయంలో యురోపియన్ యూనియన్‌కు యూకే చెల్లించాల్సిన 39బిలియన్ పౌండ్ల (దాదాపు 3.6లక్షల కోట్లు)కు సంబంధించిన ప్రస్తావన కూడా ఒప్పందంలో ఉంది. దీనినే 'విడాకుల బిల్లు' అని పిలుస్తున్నారు.
ఉత్తర ఐర్లాండ్‌కు, ఐర్లాండ్‌కు మధ్య సరిహద్దు ఏర్పాటు చేయకూడదనే నిర్ణయానికి కూడా ఈ ఒప్పందం కట్టుబడి ఉంది.
ఇవి కూడా చదవండి:
- సిత్రాలు సూడరో: డీకే అరుణ, జయ సుధల.. కండువా మారింది, స్వరం మారింది
- నీరవ్ మోదీ: భారత్‌కు ఎలా రప్పిస్తారు? రూ.11,360 కోట్ల సంగతేంటి?
- 1996లో నల్లగొండ లోక్‌సభకు 480 మంది పోటీ
- ఎన్టీఆర్ ఫొటో ఎంత పని చేసిందంటే...
- ఒంగోలు గిత్తల కథ: ఇక్కడ అరుదై పోయాయి.. బ్రెజిల్లో వెలిగిపోతున్నాయి
- టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల తుది జాబితా ఇదే
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు: వైసీపీ అభ్యర్థుల పూర్తి జాబితా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








