నీరవ్ మోదీ బెయిల్ పిటిషన్ తిరస్కరణ.. ఏప్రిల్ 26న తదుపరి విచారణ

ఫొటో సోర్స్, facebook/niravmodi
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను 13 వేల కోట్ల రూపాయల మేర మోసం చేశారన్న అభియోగాలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ బెయిల్ పిటిషన్‌ను లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. తదుపరి విచారణ ఏప్రిల్ 26 ఉంటుందని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలో పాల్గొనాలని కోర్టు ఆదేశించింది.
కోర్టు ఆవరణలో ఇంగ్లండ్‌లోని భారత హై కమిషన్ అధికారి ఎ.ఎస్.రాజన్‌ను బీబీసీ ప్రతినిధి గగ్గన్ సబర్వాల్ కలిశారు. తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందని సబర్వాల్ ఎ.ఎస్.రాజన్‌ను ప్రశ్నించగా..
‘‘అది కోర్టు వ్యవహారాలపై ఆధారపడి ఉంటుంది. ఈరోజు జరిగిన విచారణ ఫలితాలతో మేం సంతృప్తిగా ఉన్నాం. వెయిట్ అండ్ సీ..’’ అని రాజన్ అన్నారు.
నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను మోసం చేశాడాన్న విషయంలో తగిన ఆధారాలతో ఈడీ, సీబీఐ అధికారుల బృందం మార్చి 28న లండన్‌కు చేరుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఆ ఆధారాలన్నిటినీ అక్కడి న్యాయస్థానం ముందుంచింది. నీరవ్ మోదీ అక్కడి ప్రత్యక్ష సాక్షిని భయపెట్టారని.. లంచం ఇచ్చేందుకు కూడా ప్రయత్నించారని భారత్ తరఫున వాదనలు వినిపించిన క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ న్యాయవాది కోర్టుకు విన్నవించారు.
రెండు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం అతని బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో లండన్‌లో పోలీసులకు చిక్కిన నీరవ్ మోదీ బెయిల్ పిటిషన్ రెండు సార్లు తిరస్కరణకు గురయింది.
దీంతో ఆయన మళ్లీ కస్టడీలోకి వెళ్లనున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
నీరవ్ మోదీ ఎవరు?
నీరవ్ మోదీ ఒక వజ్రాల వ్యాపారి. ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు అతనిపై అభియోగాలు ఉన్నాయి.
2018లో పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత అతను భారత్ నుంచి లండన్ వెళ్లారు.
నీరవ్ మోదీని తమకు అప్పగించాలని గతంలో భారత్ బ్రిటన్‌కు విజ్ఞప్తి చేసింది.
ఇటీవల ది టెలిగ్రాఫ్ పత్రిక జర్నలిస్టులు లండన్ వీధుల్లో నీరవ్ మోదీని ఇంటర్వ్యూ చేశారు.
లండన్‌లో సుమారు 73కోట్ల ఖరీదైన త్రీ బెడ్‌రూం అపార్టుమెంట్‌లో ఉంటున్నారని, మళ్లీ కొత్తగా వజ్రాల వ్యాపారం చేస్తున్నారని ది టెలిగ్రాఫ్ కథనం వెల్లడించింది.
ఈ నేపథ్యంలో నీరవ్ మోదీని రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని భారత ప్రభుత్వం తెలిపింది. దీనిపై బ్రిటన్ ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వెల్లడించింది.
ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ఆయన్ను త్వరలోనే బ్రిటన్ పోలీసులు అరెస్ట్ చేస్తారని ఈడీ సమాచారం ఇచ్చినట్టు పీటీఐ సహా ప్రముఖ వార్తా సంస్థలు వెల్లడించాయి. ఆ తరువాత పరిణామాల్లో భాగంగా బుధవారం ఆయన్ను అరెస్టు చేసినట్టు బ్రిటన్ పోలీసులు వెల్లడించారు. అనంతరం నీరవ్ మోదీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా తిరస్కరణకు గురైంది.
మార్చి 29 వరకు పోలీసు కస్టడీకి తరలించారు. తాజాగా మరోసారి బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురికావడతో కస్టడీ పొడిగించనున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పీఎన్‌బీ కుంభకోణం ఎలా జరిగింది?
సీబీఐ చెబుతున్న వివరాల ప్రకారం.. నీరవ్ మోదీ ముంబయిలోని PNB బ్యాంకును సంప్రదించారు.
ముడి వజ్రాల దిగుమతి కోసం రుణం కావాలని అడిగారు. విదేశాల్లో చెల్లింపుల కోసం బ్యాంకు ఆయనకు లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్ - LOU ఇచ్చింది. అంటే విదేశాల్లో ముడి వజ్రాలు సరఫరా చేసే వారికి డబ్బులు చెల్లించేందుకు బ్యాంకు అంగీకరించింది.
కానీ PNB అధికారులు నకిలీ LOUలు జారీ చేశారు. విదేశాల్లో ఉన్న భారతీయ బ్యాంకులకు అనుమానం రాలేదు. దాంతో నిధులు విడుదల చేశాయి. ఆ తర్వాత PNB అధికారులు ఇంటర్ బ్యాంకింగ్ మెసెజింగ్ వ్యవస్థను దుర్వినియోగం చేశారు.
దీన్ని గుర్తించకుండా విదేశాల్లో ఉన్న భారతీయ బ్యాంకులు PNBకి రుణం ఇచ్చేశాయి. ఆ తర్వాత ముడి వజ్రాలు సరఫరా చేసిన వారి అకౌంట్లలోకి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేశారు. దాంతో నీరవ్ మోదీ ముడి వజ్రాలు పొందారు.
పాత రుణాలకు కూడా కొందరు PNB అధికారులు కొత్తగా LOUలు ఇచ్చారు. కానీ ఏళ్లు గడుస్తున్న నీరవ్ మోదీ రుణాలు చెల్లించలేదు. కొత్తగా వచ్చిన అధికారులు భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఈ కుంభకోణం 2011 నుంచి 2018 మధ్య కాలంలో జరిగింది.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








