థెరెసా మే: బ్రెగ్జిట్ వివాదం... విశ్వాస పరీక్షలో నెగ్గిన బ్రిటన్ ప్రధాని

ఫొటో సోర్స్, AFP
బ్రిటన్ ప్రధాన మంత్రి థెరెసా మే కన్సర్వేటివ్ పార్టీ నేతగా విశ్వాస పరీక్షలో నెగ్గారు.
బుధవారం జరిగిన ఓటింగ్‌లో థెరెసాకు 200 ఓట్లు వచ్చాయి. ప్రత్యర్థులకు 117 ఓట్లు లభించాయి.
విశ్వాస పరీక్షలో థెరెసా 63 శాతం ఓట్లతో విజయం సాధించారు. దీంతో, ఇక పార్టీలో ఆమె నాయకత్వాన్ని మరో ఏడాది పాటు ప్రశ్నించే వీలు లేదు.
"ప్రజలు ఆమోదించిన" బ్రెగ్జిట్‌ను అమలు చేసేందుకు తాను కట్టుబడి ఉన్నానని, అయినప్పటికీ తనను వ్యతిరేకిస్తున్న ఎంపీల ఆందోళనలను కూడా పరిగణనలోకి తీసుకున్నానని థెరెసా అన్నారు.
ఎంపీలు అందరూ ఇక థెరెసాకు మద్దతుగా ముందుకు రావాలని ఆమె మద్దతుదారులు పార్టీకి విజ్ఞప్తి చేశారు. కానీ, ముూడింట ఒక వంతు మంది ఎంపీలు ఆమెను వ్యతిరేకించడం "తీవ్రమైన" విషయమని విమర్శకులు వ్యాఖ్యానించారు.
ఎంపీలు నాయకత్వ మార్పు కోరుకుని ఉంటే థెరెసా మే తప్పనిసరి పరిస్థితుల్లో తన పదవిని వదులుకోవాల్సి వచ్చేది.
మే బ్రెగ్జిట్ విధానంపై ఆగ్రహంతో ఉన్న ఆమె పార్టీలోని 48 మంది ఎంపీలు అవిశ్వాసం పెట్టారు.
2016లో జరిగిన రెఫరెండం ఫలితాలకు విరుద్ధంగా థెరెసా మే బ్రెగ్జిట్ విధానం ఉందని ఈ ఎంపీలు ఆరోపిస్తున్నారు.
ఏది ఏమైనా, ఆమె పట్ల వ్యక్తమవుతున్న వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందని, అది ఆమెకు "ఎదురుదెబ్బే"నని బీబీసీకి చెందిన లారా కుయెన్స్‌బర్గ్ అన్నారు.
ఆగ్రహం ఎందుకు
బ్రిటన్‌లో బ్రెగ్జిట్ అంశంపై 2016 జూన్ 23న రెఫరెండం నిర్వహించారు.
ఇందులో బ్రిటన్ ఓటర్లు యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోవాలనే నిర్ణయానికి అనుకూలంగా ఓట్లు వేశారు.
థెరిసా మే ఈ రెఫరెండం జరిగిన కొన్ని నెలల తర్వాత ప్రధాన మంత్రి అయ్యారు. 2017 మార్చి 29న ఆమె బ్రెగ్జిట్ ప్రక్రియ ప్రారంభించారు.
కానీ ఆమె బ్రెగ్జిట్ విధానం పార్టీలోపల తీవ్ర విమర్శలకు కారణమైంది.
యూరోపియన్ యూనియన్ చట్టాల ప్రకారం బ్రిటన్ సరిగ్గా రెండేళ్ల తర్వాత అంటే 2019 మార్చి 29న ఈయీ నుంచి విడిపోవాల్సి ఉంటుంది.
అయితే యూరోపియన్ యూనియన్‌లోని మొత్తం 28 సభ్య దేశాలు సమ్మతిస్తే ఆ తేదీని పొడిగించే అవకాశం ఉంది.
కానీ బ్రిటన్ 2019 మార్చి 29న యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోతుందని ఇప్పుడు అన్ని పార్టీలూ భావిస్తున్నాయి.
బుధవారం రాత్రి జరిగిన ఓటింగ్
అవిశ్వాసానికి ముందు దీనిపై థెరెసా మే మాట్లాడారు.
డౌనింగ్ స్ట్రీట్‌లో ఇచ్చిన ఒక ప్రకటనలో తను "ఈ పోటీలో గెలిచేందుకు సర్వశక్తులూ ఒడ్డుతానని" ఆమె చెప్పారు.
మార్చి 29న ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగడానికి ఆర్టికల్ 50ని కొత్త ప్రధాని కొట్టివేయడం లేదా పొడిగిస్తారని ఆమె అన్నారు.
కన్సర్వేటివ్ ఎంపీలు బ్రిటన్ కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 6.00 నుంచి రాత్రి 8.00 మధ్య తమ ఓట్లు వేశారు.
కన్సర్వేటివ్ నేతను మార్చడం వల్ల "దేశ భవిష్యత్తును ప్రమాదంలో పడుతుందని, అనిశ్చితిని ఏర్పడుతుందని, దాన్ని ఇప్పుడు భరించలేమని" అంతకు ముందు మే అన్నారు.

ఫొటో సోర్స్, AFP
విజయంతో గట్టునపడ్డ థెరెసా
ఈ అవిశ్వాస పరీక్ష సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో జరిగింది.
ఒకవేళ, థెరిసా మే అవిశ్వాసంలో ఓడిపోయుంటే, తర్వాత కొత్త నేతను ఎన్నుకోడానికి జరిగే ఎన్నికలలో ఆమె పోటీ చేయడానికి వీలయ్యుండేది కాదు.
భారీ మెజారిటీతో గెలవకపోయినా, పార్టీ నేత పదవి నుంచి తనే తప్పుకోవాలని థెరిసా మే నిర్ణయించుకుని ఉండచ్చు.
హౌస్ ఆఫ్ కామన్స్‌లోని అతిపెద్ద పార్టీ కన్సర్వేటివ్ కావడంతో ఆ పార్టీ నేతగా ఉన్నవారే ప్రధాని అవుతారు.
ఒక వేళ థెరిసాను కన్సర్వేటివ్ నేతగా తొలగించి ఉంటే, పార్టీ కొత్త నేతను ఎన్నుకునేవరకూ ఆమె ఆపద్ధర్మ ప్రధానిగా ఉండేవారు. ఆ ప్రక్రియకు ఆరు వారాలు పట్టేది.
అభ్యర్థులు ఒకరికి మించి ఉంటే, ఎంపీలు తమ ఓట్ల ద్వారా ఇద్దరిని ఎన్నుకుని వారిని ఓటింగ్‌కు పంపాల్సి వస్తుంది.

ప్రపంచం కళ్లన్నీ బ్రిటన్ పైనే
అవిశ్వాసానికి ముందు ఆ ఏర్పాట్లు చూసుకున్న గ్రాహం బ్రాడీ దాని గురించి చెప్పారు.
పార్టీ నాయకత్వం కోసం చూస్తున్నామని, ఓటింగ్ వ్యవహారాలు చూసుకుంటున్నసర్ గ్రాహమ్ బ్రాడీ, బాక్ బెంచ్ టోరీస్ ఛైర్మన్ తెలిపారు. వారసుడు వచ్చే వరకూ థెరిసా ప్రధాని పదవిలో ఉంటారని అన్నారు.
అవిశ్వాసం ఎదుర్కోవాల్సి ఉంటుందని మంగళవారం సాయంత్రమే ప్రధానికి స్పష్టం చేసినట్టు గ్రాహమ్ తెలిపారు. వీలైనంత త్వరగా దీనికి పరిష్కారం లభిస్తుందని ఆమె ఆసక్తిగా ఉన్నారన్నారు.
థెరిసా మే స్థానంలో కొత్తవారు రావడానికి జనవరి, లేదా ఫిబ్రవరి వరకూ పట్టవచ్చని, బ్రెగ్జిట్‌పై చర్చలు జరిపేందుకు ఈయూను మరింత సమయం కోరాల్సి ఉంటుందని జస్టిస్ సెక్రటరీ డేవిడ్ గౌకె బీబీసీతో అన్నారు.
"మే ఈరాత్రి అవిశ్వాసంలో ఓటమి పాలైతే, ప్రధానిగా ఎవరుంటారో వారు ఆర్టికల్ 50ని ఆలస్యం చేయాల్సి ఉంటుంది. మార్చి 29న మేం ఎలా బయటపడగలమో మాకు తెలీడం లేదు" అన్నారు.
అవిశ్వాసంపై 48 లేఖలు రావడంపై తను నిరాశ చెందినట్లు గౌకే అన్నారు. రాత్రి జరిగే అవిశ్వాస ఓటింగ్‌లో ప్రధాని భారీ మెజారిటీతో గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
సీక్రెట్ బ్యాలెట్‌గా అవిశ్వాసం
ప్రధాని అవిశ్వాసం ఎదుర్కుంటున్న సమయంలో "బ్రెగ్జిట్ ఆలస్యం కావడం చాలా కీలకం" అని థెరిసా మే మద్దతుదారులు చెబుతున్నట్లు బీబీసీ పొలిటకల్ ఎడిటర్ లారా కునెస్‌బెర్గ్ అన్నారు.
"ప్రధానికి మద్దతు ఇవ్వాలని మంత్రులు ట్వీట్స్ చేస్తున్నారు. కానీ అది సీక్రెట్ బ్యాలెట్ కావడంతో వాళ్లు ఆమెకు ఓటు వేసి మద్దతిచ్చారనడానికి అక్కడ ఎలాంటి సంకేతం కనిపించదు" అని బీబీసీ ప్రతినిధి తెలిపారు.
ఈయూ నుంచి వైదొలిగే ఒప్పందానికి మార్పులు చేయడంలో భాగంగా బుధవారం తర్వాత ప్రధాని మే ఐరిష్ ప్రీమియర్ లియో వారడ్కర్‌ను డబ్లిన్‌లో కలవాల్సి ఉంది.
అవిశ్వాసం ఓటింగ్‌లో తన నాయకత్వం కోసం పోరాడేందుకు ఆ సమావేశాన్ని రద్దు చేసుకున్నట్లు థెరీసా మే తెలిపారు.
మంగళవారం థెరిసా మే మిగతా ఈయూ నేతలతో కూడా చర్చలు జరిపారు. ఒప్పందంపై మళ్లీ చర్చలు జరపలేమని వారు ఆమెకు చెప్పారు.
ఇవి కూడా చదవండి
- కేసీఆర్ ప్రెస్ మీట్ LIVE: ‘కఠినంగా ఉండకపోతే కోఠిలో అమ్మేస్తారు నన్ను.. అప్రజాస్వామికం అన్నా నేను బాధపడను’
- తెలంగాణ ఎన్నికలు పూర్తి.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రేపు
- తెలంగాణ ఎన్నికలు: 'ఎన్టీఆర్‌పై ఎలా గెలిచానంటే'
- మధుమేహం అంటే ఏమిటి? రాకుండా జాగ్రత్తపడడం ఎలా?
- నెహ్రూ కాలర్ పట్టుకుని నిలదీసిన మహిళ
- జాతీయవాదం పేరిట వ్యాప్తి చెందుతున్న ఫేక్ న్యూస్
- కేంద్ర మంత్రి అనంత్‌కుమార్‌కు సిగరెట్లు, మద్యం అలవాటు లేదు.. మరి ఆయనకు లంగ్ క్యాన్సర్ ఎలా వచ్చింది?
- నమ్మకాలు-నిజాలు: పత్యం అంటే ఏమిటీ? చేయకపోతే ఏమవుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








