డోనల్డ్ ట్రంప్: 'నేను మందు తాగితే మామూలుగా ఉండదు'

ఫొటో సోర్స్, Getty Images
‘‘నేను మందు తాగను. నా జీవితంలో ఎప్పుడూ ఒక్క బీరు కూడా తాగలేదని నేను నిజాయితీగా చెప్పగలను’’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఒక మీడియా సమావేశంలో చెప్పారు.
‘‘నా మంచి లక్షణాల్లో అదొకటి. నేను తాగను. ఏదైనా మంచి లక్షణం చెప్పండని అడిగినప్పుడల్లా.. నేను ఎన్నడూ ఒక్క గ్లాసు మద్యం కూడా తాగలేదని చెప్తాను. నేను ఎప్పుడూ మద్యం తాగలేదు’’ అని ఆయన ఉద్ఘాటించారు.
‘‘ఒకవేళ నేను మందు తాగితే ఎంత దారుణంగా ఉంటానో ఊహించగలరా? ప్రపంచంలో అత్యంత దారుణమైన తాగుబోతులా ఉంటాను...’’ అని కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఇంతకీ ట్రంప్ ఈ మాట ఎందుకన్నారు?
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నామినేట్ చేయటానికి తాను ఎంపిక చేసిన జడ్జి బ్రెట్ కావెనా కాలేజీ రోజుల్లో అతిగా మద్యం సేవించేవాడని పలువురు చేసిన ఆరోపణల మీద స్పందిస్తూ.. ట్రంప్ తన గురించి కూడా చెప్పుకొచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
జడ్జి కావెనా తన మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి సెనేట్ కమిటీ ఎదుట వాంగ్మూలమిస్తూ తాను ఎన్నడూ స్పృహలో లేనంతగా తాగలేదని చెప్పిన మాటలు పూర్తిగా నిజం కాదని నార్త్ కరోలినా స్టేట్ యూనివర్సిటీలో పనిచేస్తున్న ప్రొఫెసర్ చార్లెస్ లుడింగ్టన్ ఇటీవల వ్యాఖ్యానించారు.
యేల్ యూనివర్సిటీలో కావెనా, లుడింగ్టన్‌లు సహాధ్యాయులు. యూనివర్సిటీలో కావెనా తప్పతాగి తూలుతుండటం తాను చూశానని ప్రొఫెసర్ చెప్పారు. అయితే, ఆయన తాగి స్పృహతప్పటం చూడలేదు. కానీ, అతిగా తాగటం చూశానని చెప్పారు.
జాతీయ టీవీ చానల్ ప్రసారంలో ప్రమాణం చేసి కావెనా అబద్ధం చెప్పారని, అది ఆందోళన కరమైన విషయమని వ్యాఖ్యానించారు.
ప్రొఫెసర్ లుడింగ్టన్ ప్రకటనను అధ్యక్ష భవనం ఖండించింది. కావెనా సహాధ్యాయులైన మరో ఇద్దరి ప్రకటనలను విడుదల చేసింది. జడ్జి కావెనా యేల్ యూనివర్సిటీలో ఉండగా తాగి స్పృహ తప్పటం కానీ, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించటం కానీ తాము ఎన్నడూ చూడలేదని క్రిస్ డడ్లీ, డాన్ మర్ఫీలు పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇదే అంశం మీద అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘నేను హైస్కూల్‌లో చదువుకున్నాను. నేను తాగలేదు కానీ చాలా మంది కుర్రాళ్లు తాగటం చూశాను. వాళ్లు హైస్కూల్లో ఉన్నారు. 16, 17 ఏళ్ల కుర్రాళ్లు. తాగుతారు.. పిచ్చి పనులు చేస్తారు. దానర్థం వాళ్లు తమ జీవితంలో ఏమీ కాకూడదనా?’’ అని ప్రశ్నించారు.
‘‘ఆయనను (కావెనా వాంగ్మూలం ఇవ్వటాన్ని) నేను చూశాను. ఆయన తనకు బీర్ అంటే ఇష్టమన్న నిజం చెప్పారు. నేను ఆశ్యర్యపోయాను. తాగినపుడు తను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పారు. చాలా ఏళ్ల కిందటి విషయాన్ని అద్భుతంగా చెప్పారు’’ అని ట్రంప్ కితాబిచ్చారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, గత 25, 30 ఏళ్లలో ఆయన వృత్తి జీవితంలో ఏం చేశారనే దాని గురించి ఎవరూ అడగలేదు. ఎటువంటి చెడ్డ రిపోర్టులూ లేవు. ఇక్కడున్న ప్రతి ఒక్కరి మీదా చెడ్డ నివేదికలు ఉన్నాయి. సెనేటర్లు కొందరు దేవతలేమీ కాదు’’ అంటూ కొన్ని ఆరోపణలు చేశారు.
‘మీరు దేవతలేం కాదు అని ఆరోపిస్తున్న సెనేటర్లు ఎవరో.. నిర్దిష్టంగా చెప్తారా’ అని ఒక విలేకరి ప్రశ్నించగా, ‘‘నో... నేను చెప్పను. అందరి లాగానే నేను కూడా పుస్తకం రాయటం కోసం దాచుకుంటాను. మీకు చెప్పను’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- ఇండోనేసియా సునామీ: 1200 దాటిన మృతుల సంఖ్య
- కువైట్ దౌత్యవేత్త పర్సు కొట్టేసిన పాకిస్తాన్ ఉన్నతాధికారి
- బీబీసీ పరిశోధన: కామెరూన్లో ఈ మహిళను చంపిన సైనికులను ఎలా కనుగొన్నామంటే...
- వీగర్ ముస్లింలు: చైనా మైనారిటీ శిబిరాల్లో నిర్బంధ హింస
- గాంధీజీ 150వ జయంతి: మహాత్ముడి గురించి ఆయన వారసులు ఏమంటున్నారు?
- 'సర్జికల్ స్ట్రయిక్స్'కు రెండేళ్ళు: కశ్మీర్లో హింస ఏమైనా తగ్గిందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








