అబార్షన్‌కు చట్టబద్ధత బిల్లును వ్యతిరేకించిన అర్జెంటీనా పార్లమెంట్

ఫొటో సోర్స్, Getty Images
గర్భం ధరించిన తర్వాత 14 వారాల్లో చేసే అబార్షన్లకు చట్టబద్దత కల్పించాలని కోరుతూ ప్రతిపాదించిన బిల్లును అర్జెంటీనా సెనెటర్లు తిరస్కరించారు.
ప్రస్తుతం అర్జెంటీనాలో అబార్షన్ చట్టవిరుద్ధం. కేవలం అత్యాచార సంఘటనల్లో లేదా గర్భం ధరించిన మహిళ ప్రాణానికి ఏదైనా ప్రమాదం ఉంటేనో అబార్షన్ చేయొచ్చు.
ఓటింగ్ జరుగుతున్నప్పుడు అబార్షన్‌కు అనుకూల, వ్యతిరేక ఉద్యమాలు, నిరసన ప్రదర్శనలు చేస్తున్న ప్రజలు పార్లమెంట్ బయట ఎదురుచూశారు. రాత్రి బాగా పొద్దుపోయినప్పటికీ మహిళలంతా రోడ్లపైనే నిలబడి ఫలితం పట్ల ఆసక్తి కనబర్చారు.
2005లో తొలిసారి అబార్షన్లకు చట్టబద్ధత కల్పించాలనే బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అనంతరం ఇప్పటికి ఏడుసార్లు బిల్లుల్ని పెట్టారు.
తాజాగా బుధవారం పెట్టిన బిల్లుపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. అనంతరం ఈ బిల్లుకు అనుకూలంగా 31 మంది సెనెటర్లు ఓట్లు వేయగా, 38 మంది సెనెటర్లు అబార్షన్లకు చట్టబద్ధతను వ్యతిరేకిస్తూ ఓట్లేశారు.
దీంతో, మళ్లీ ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలంటే ఏడాది ఆగాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Reuters
కాగా, బిల్లును పార్లమెంటు తిరస్కరించటంతో అబార్షన్లకు చట్టబద్ధత కల్పించే అంశాన్ని వ్యతిరేకిస్తున్న వారంతా ఆనందం వెలిబుచ్చారు. ‘‘అర్జెంటీనా కుటుంబ విలువల్ని ప్రతిబింబించే దేశం అని ఈ ఓటింగ్ రుజువు చేసింది’’ అని అబార్షన్ వ్యతిరేక ఉద్యమ కార్యకర్తలు రాయిటర్స్ వార్తా సంస్థతో అన్నారు.
పార్లమెంటులో బిల్లు తిరస్కరణకు గురి కావటంతో అబార్షన్లకు చట్టబద్ధత కోరుతున్న మహిళలంతా కన్నీరుమున్నీరయ్యారు. ఆకుపచ్చ దుస్తులు, గుడ్డలు ధరించి గత కొద్ది రోజులుగా ఉద్యమానికి మద్దతు తెలుపుతున్న వీరంతా పార్లమెంటు ఫలితం వెలువడిన తర్వాత ఒకరినొకరు ఓదార్చుకుంటూ కనిపించారు.
అబార్షన్లకు చట్టబద్ధత కల్పించాలని చాలా సంవత్సరాలుగా అర్జెంటీనాలో ఉద్యమం జరుగుతోంది. ఈ బిల్లును పరిశీలించేందుకు దేశాధ్యక్షుడు మారికో మాక్రి పార్లమెంటు సమావేశాలకు పిలుపునివ్వటంతో అబార్షన్ల అనుకూల ఉద్యమకారుల ప్రయత్నాలకు ఊపొచ్చింది. కానీ, పార్లమెంటులో మెజార్టీ సెనెటర్లు మద్దతు ఇవ్వకపోవటంతో బిల్లు వీగిపోయింది.
జూన్ నెలలో ఈ బిల్లుకు దిగువ సభ స్వల్ప మెజార్టీ తేడాతో ఆమోదం తెలిపింది. అప్పుడు కూడా సభలో దాదాపు 24 గంటల పాటు చర్చ జరిగింది. వేలాది మంది మహిళలు పార్లమెంటు బయటే నిలబడి రాత్రింబవళ్లు జాగరణ చేసి, ఫలితం కోసం ఎదురుచూశారు.
మొత్తం 26 లాటిన్ అమెరికా దేశాల్లో ఉరుగ్వే, క్యూబా దేశాలు మాత్రమే అబార్షన్లను పూర్తి చట్టబద్ధం చేశాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Getty Images
ఇవి కూడా చదవండి:
- అర్జెంటీనా: అబార్షన్ హక్కు కోసం పోరాడుతున్న మహిళలు
- ఐర్లాండ్: ‘అబార్షన్లపై ఉద్యమానికి భారతీయ మహిళ మరణమే కారణం’
- ఐర్లాండ్ అబార్షన్ రెఫరెండం: ఆమె ప్రాణాలు కోల్పోయింది.. ఈమె చరిత్ర తిరగరాసింది
- సూర్యుడు సరిగ్గా మీ ఎదురుగా ఉదయించడం ఎప్పుడైనా చూశారా?
- ఇచట పెళ్లి కొడుకుల్ని అద్దెకివ్వబడును!
- చెర్రీ: హైదరాబాద్‌లో పుట్టిన అతి చిన్న పసిపాప.. ప్రిమెచ్యూర్ బేబీల జీవితాలకు కొత్త ఆశ
- న్యూజిలాండ్: ప్రసూతి సెలవు ముగించుకుని పనిలో చేరిన ప్రధానమంత్రి
- #HerChoice: పెళ్లి కాకుండానే తల్లిగా ఉండాలనుకున్నాను!
- పీరియడ్స్ సమయంలో సెక్స్ తప్పా? ఒప్పా?
- నెదర్లాండ్స్: గర్భిణులకు వయాగ్రా, 11 మంది శిశువులు మృతి
- సెరెనా విలియమ్స్: నిరుడు గర్భవతిగా ఒక ఫైనల్లో.. నేడు అమ్మగా మరో ఫైనల్లో
- యూట్యూబ్ వీడియోలు చూసి కాన్పు, గర్భిణి మరణం: ఇంటి దగ్గర ప్రసవం మంచిదేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









