Vishal on Political Entry: 'ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రావట్లేదు.. చంద్రబాబుపై కుప్పంలో పోటీ చేయట్లేదు'

ఫొటో సోర్స్, facebook/VishalKOfficial
తాను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రావట్లేదని సినీ నటుడు విశాల్ ప్రకటించారు.
తమిళ సినిమా కోలీవుడ్ హీరో అయిన విశాల్ సినిమాలు తెలుగులో కూడా విడుదల అవుతుంటాయి. ఆయనకు తెలుగులోనూ అభిమానులు ఉన్నారు.
గత కొద్ది రోజులుగా హీరో విశాల్ రాజకీయాల్లోకి వస్తున్నారని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ఆయన వివరణ ఇస్తూ ఒక ట్వీట్ చేశారు.

‘‘నేను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నానని, కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాననే రూమర్లు నాకు వినిపించాయి. వీటిని నేను ఖండిస్తున్నాను. వీటి గురించి నాకు ఏమాత్రం తెలీదు. నన్ను ఎవ్వరూ సంప్రదించలేదు కూడా. ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా నాకు తెలియదు. సినిమాలు.. సినిమాలే నా జీవితం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం కానీ, చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా పోటీ చేసే ఉద్దేశం కానీ లేదు’’ అని విశాల్ ప్రకటించారు.

ఫొటో సోర్స్, facebook/VishalKOfficial
విశాల్ కృష్ణారెడ్డి..
విశాల్ పూర్తి పేరు విశాల్ కృష్ణారెడ్డి. సినీ నిర్మాత జీకే రెడ్డి కుమారుడు.
తమిళంలో చెల్లమే (తెలుగులో ప్రేమ చదరంగం) సినిమాతో 2004లో వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాతి సంవత్సరం విడుదలైన పందెంకోడి సినిమాతో పేరు తెచ్చుకున్నారు.
విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పేరిట సొంతంగా సినిమాలు తీస్తుంటారు.
నడిగర్ సంఘంగా పేరొందిన దక్షిణ భారత కళాకారుల సంఘం ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ 2015లో పెద్ద ఎత్తున ప్రచారం చేసిన విశాల్ అప్పట్లో నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2017లో తమిళ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
జయలలిత మరణానంతరం 2017లో ఆర్‌కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు విశాల్ సిద్ధమయ్యారు. కానీ, ఆయన నామినేషన్‌ను ఎన్నికల సంఘం తిరస్కరించింది. తన నామినేషన్ పత్రాలను తిరస్కరించడంతో ప్రజాస్వామ్యం చనిపోయింది అంటూ అప్పట్లో ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై ఆయన హైకోర్టును కూడా ఆశ్రయించారు.
యువత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే మార్పు వస్తుందని తాను నమ్ముతుంటానని ఆయన పలుమార్లు ఇంటర్వ్యూల్లో చెప్పారు. డబ్బులు తీసుకోకుండా ఓటు వేసేలా ఓటర్లను చైతన్యం చేస్తానని అప్పట్లో ఆయన చెప్పారు.
ఒక మంచి విషయం జరుగుతుంది అని తాను నమ్మితే అది సినీ పరిశ్రమ అయినా, వేరే ఏదైనా తాను బరిలోకి దిగుతానని, ఎవ్వరితోనైనా తలపడతానని 2016లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఇంటర్వ్యూలో విశాల్ చెప్పారు.
‘‘విశాల్ రెడ్డి, విశాల్ రెడ్డి అని అనేవారు. పలు రకాలుగా విమర్శలు చేశారు. నేను ఎక్కడినుంచి వచ్చాను, ఎక్కడ పుట్టాను? అనేవి నేను పట్టించుకోను. ఏం చేస్తున్నాను అనేదే ముఖ్యం’’ అని విశాల్ అన్నారు. అప్పట్లో ఆయన నడిగర్ సంఘం ఎన్నికల ప్రధాన కార్యదర్శిగా పోటీ చేసి, గెలుపొందారు.
‘‘ఇప్పట్లో రాజకీయాల్లోకి రావాలని లేదు. రాజకీయాల ద్వారానే మంచి చేయాలి అని ఏమీ లేదు. కాకపోతే అక్కడ డబ్బులు ఎక్కువ ఉంటాయి. అధికారం ఉంటుంది. ఎక్కువ చేయడానికి ఆస్కారం ఉంటుంది. నేను నా ట్రస్ట్ ద్వారా అమ్మాయిల చదువుపై దృష్టిపెట్టాను’’ అని విశాల్ ఆ ఇంటర్వ్యూలో తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: ఉడుత ఎక్కితే హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగిపడతాయా? ఐదుగురు సజీవ దహనం వెనుక అసలు కారణాలేంటి?
- ఔరంగాబాద్, ఉస్మానాబాద్ల పేర్లు ఎందుకు మార్చారు? హైదరాబాద్ నిజాంకు ఈ పేర్లతో సంబంధం ఏమిటి?
- డేటా సేకరణలో భారత్ చరిత్ర ఏంటి... ఇప్పుడు గణాంకాల వ్యవస్థ కుప్పకూలే స్థితిలో ఉందా?
- క్రిప్టో కరెన్సీ పేరుతో రూ. 31,000 కోట్లు మోసం చేసిన అమెరికాస్ మోస్ట్ వాంటెడ్ మహిళ
- ఉన్నత చదువులకు ప్రపంచంలోని టాప్-10 'స్టూడెంట్స్ ఫ్రెండ్లీ' నగరాలివే...
- పులి, ఎలుగుబంట్లు, ఏనుగులు... ఊళ్ళ మీద ఎందుకు పడతాయి... అవి ఎదురైతే ఏం చేయాలి?
- పక్కా కమర్షియల్ సినిమా రివ్యూ: హంగులు ఎక్కువ... విషయం తక్కువ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













