ప్రెస్‌రివ్యూ: రాజకీయాల్లోకి హీరో విశాల్!

విశాల్

ఫొటో సోర్స్, Getty Images

ఇటు రాజకీయ నాయకులు.. అటు నటులు. అందరి దృష్టి ఆ ఉప ఎన్నికపైనే. పట్టు నిలుపుకునేందుకు కొందరు.. పట్టు సాధించేందుకు మరికొందరు ఉప ఎన్నిక కదన రంగంలోకి దూకుతున్నారు. ఇప్పుడు హీరో విశాల్ కూడా వారికి జత కలిశారని ఆంధ్రజ్యోతి ఒక కథనం ప్రచురించింది. ఆ కథనం ప్రకారం..

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంతో ఆర్.కె.నగర్ ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తానని నటుడు విశాల్ ప్రకటించారు.

ఈ నెల 21న ఆర్.కె.నగర్ నియోజకవర్గంలో ఎన్నిక జరుగనుంది. స్వతంత్ర అభ్యర్థిగా సోమవారం నామినేషన్‌ దాఖలు చేయనున్నట్లు విశాల్ ప్రకటించారు.

విశాల్‌ నిర్ణయాన్ని యువత స్వాగతిస్తే, తమిళవాదులు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. యువత రాజకీయాల్లోకి రావాల్సిన సమయం ఇదేనని, ఆర్‌కేనగర్‌ ఉపఎన్నికలో విశాల్‌ పోటీచేయడాన్ని స్వాగతిస్తున్నానని దర్శకుడు సుందర్‌.సి పేర్కొన్నారు. ట్విట్టర్‌లో ప్రకటనలు చేస్తున్నవారికంటే ధైర్యంగా బరిలోకి దిగిన విశాల్‌ గట్స్‌కి శభాష్‌ అంటూ సామాజిక మాధ్యమాల్లో పలువురు ప్రశంసలు కురిపించారు.

అయితే, ఆర్‌కేనగర్‌లో తమిళులే పోటీ చేయాలని తమిళవాదులుగా పేరుతెచ్చుకున్న దర్శకులు సీమాన్‌, అమీర్‌ వ్యాఖ్యానించారు.

నారా లోకేష్

ఫొటో సోర్స్, facebook

2019 నాటికి 3 లక్షల ఉద్యోగాలు: నారా లోకేశ్

2019 నాటికి ఐటీలో లక్ష, ఎలక్ట్రానిక్స్‌ రంగంలో రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ మరోసారి స్పష్టం చేసినట్టు ఈనాడు ఓ కథనంలో పేర్కొంది.

చదువుకున్న ఏ ఒక్కరూ ఖాళీగా ఉండకూడదని, మొదట్లో ఏ ఉద్యోగం దొరికినా అందులో చేరిపోవాలని ఆయన సూచించారు.

ఆంధ్రప్రదేశ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఉద్యోగ మేళా ముగింపు కార్యక్రమం శనివారం విజయవాడలో జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేశ్ పాల్గొని ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు.

ఈ జాబ్‌ మేళాలో 1087 మందికి ఉద్యోగాలు వచ్చినట్లు ప్రభుత్వ ఐటీ సలహాదారు జేఏ చౌదరి వెల్లడించారు.

ప్రైవేట్ ఆఫీస్

ఫొటో సోర్స్, Getty Images

దివ్యాంగుల కోసం ఓ ఐటీ పార్కు

ప్రపంచంలోనే తొలిసారిగా దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఐటీ పార్కును నెలకొల్పాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆంధ్రజ్యోతి హైదరాబాద్ ఎడిషన్ ఓ కథనంలో పేర్కొంది.

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో అభివృద్ధి చేయనున్న ఈ పార్క్‌ కోసం ప్రభుత్వం 10 ఎకరాల భూమిని కేటాయించింది. దీనికోసం తెలంగాణ ప్రభుత్వం, దివ్యాంగులకు ఐటీ ఉద్యోగాలు కల్పిస్తున్న వింధ్యా ఈ-ఇన్ఫోమీడియా మధ్య శనివారం ఒప్పందం కుదిరింది.

దేశ, విదేశీ ఐటీ కంపెనీల అవసరాల మేరకు మూగ, బధిర, దృష్టిలోపం, శారీరక వైకల్యంతో బాధపడుతున్నవారికి శిక్షణ, నివాస సౌకర్యం, అన్నిరకాల వసతులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

టెస్టింగ్ చేస్తున్న వ్యక్తి చేతులు

ఫొటో సోర్స్, Getty Images

అమాయకుల ప్రాణాలు తీస్తున్న ఔషధ ప్రయోగాలు

తెలుగు రాష్ట్రాల్లో అమాయక ప్రజలపై ఔషధ ప్రయోగాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయంటూ సాక్షి తెలంగాణ ఎడిషన్ ఓ కథనాన్ని ప్రచురించింది..

దేశవ్యాప్తంగా 96 వేల ఔషధ కంపెనీలు ఉండగా.. అవి తయారు చేసే ఔషధాలను ప్రయోగించి చూసేందుకు 84 ప్రయోగ కేంద్రాలున్నాయి. ఇందులో మహారాష్ట్రలో 24, గుజరాత్‌లో 18, తెలంగాణలో 9 ప్రయోగ కేంద్రాలకు కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి ఉంది. మిగతా ప్రయోగ కేంద్రాలు పలు ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయి.

ఈ ప్రయోగ కేంద్రాలన్నీ డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ), ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌), డ్రగ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (డీసీవో) నిబంధనలను పాటించాలి.

ఫార్మా కంపెనీలు కొత్త ఔషధాన్ని అభివృద్ధి చేస్తున్నప్పుడు... తొలిదశలో ఆ ఔషధం పరిమాణం, తీవ్రత, సాంద్రత తదితర అంశాలపై ప్రయోగాలు చేస్తారు. ఇలా ప్రాథమికంగా సిద్ధం చేసిన ఔషధాన్ని రెండో దశలో ప్రయోగశాలలో జంతువుల (ముఖ్యంగా ఎలుకలు, గిన్నీ పిగ్స్‌)పై ప్రయోగిస్తారు. ఇందులో సంతృప్తికర ఫలితాలు వస్తే.. మూడో దశలో మనుషులపై ప్రయోగిస్తారు.

బ్లడ్‌బ్యాంకులే కీలకం

ప్రధానంగా బ్లడ్‌బ్యాంకుల నిర్వాహకుల సహకారంతో ఔషధ ప్రయోగాలకు వ్యక్తుల ఎంపిక, తరలింపు జరుగుతోందంటూ సాక్షి పత్రిక ప్రచురించింది. తరచూ రక్తదానం చేసిన వారిని గుర్తించి.. ఔషధ ప్రయోగాల కోసం ఎంచుకున్నట్లుగా వైద్యశాఖ అధికారుల పరిశీలనలో తేలినట్లు సమాచారం.

రక్తదానం కోసం వచ్చే వ్యక్తులతో మాట్లాడి.. ఔషధ ప్రయోగశాల కోసం తీసుకెళుతున్నారు. వ్యక్తుల ఎంపిక, ఎవరిని ఏ ప్రయోగశాలకు పంపాలనే సమాచారం, వారి ప్రయాణం అంతా వాట్సాప్‌ గ్రూపుల్లోనే జరుగుతోంది.

అయితే ప్రయోగాలకు సిద్ధమయ్యేవారి ఆరోగ్య పరిస్థితి, వయస్సు, ప్రయోగించే ఔషధానికి ఆ వ్యక్తుల శరీరం తట్టుకుంటుందా.. అన్న ప్రాథమిక అంశాలను పట్టించుకోకుండానే ప్రయోగాలు చేస్తుండడంతో పరిస్థితి విషమిస్తోందని ఆ కథనం పేర్కొంది.

మా ఇతర కథనాలు

వీడియో క్యాప్షన్, 'పద్మావతి'తో ఇంటర్వ్యూ

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)