లతా మంగేష్కర్: శివాజీ పార్క్‌లో అభిమానులు, నేతల వీడ్కోలు మధ్య ముగిసిన అంత్యక్రియలు

కుటుంబ సభ్యులు, వేలాది మంది అభిమానులు, నేతల కన్నీటి వీడ్కోలు మధ్య లతా మంగేష్కర్ అంత్యక్రియలు ముగిశాయి.
ముంబయి శివాజీ పార్కులో ఆమె భౌతిక కాయానికి సైనిక వందనాలు, ప్రభుత్వ లాంఛనాలతో వీడ్కోలు పలికారు.
లత చితికి ఆమె చిన్న తమ్ముడు హృదయనాథ్ మంగేష్కర్ నిప్పంటించారు.
అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ లత భౌతిక కాయానికి నివాళులర్పించారు. లత సోదరి ఆశా భోంస్లే, ఇతర కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు.

ఫొటో సోర్స్, Twitter/Narendra Modi
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ నేత శరద్ పవార్, మహారాష్ట్రకు చెందిన అన్ని పార్టీల ముఖ్య నాయకులు, అమితా బచ్చన్ తదితర బాలీవుడ్ సినీ ప్రముఖులు, క్రికెటర్ సచిన్ తెందూల్కర్ తదితరులు ఆమెకు నివాళులర్పించారు.
ఇక దేశ విదేశీ ప్రముఖులు లత మృతికి సంతాపం ప్రకటించారు.
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆ దేశ మంత్రులు.. పాకిస్తాన్ క్రికెట్ కెప్టెన్ బాబర్ ఆజమ్, బంగ్లాదేశ్ నేతలు, నేపాల్ నేతలు సంతాపం తెలిపారు.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా ముఖ్య నేతలు, ఇతర ప్రముఖులు లత మృతికి సంతాపం ప్రకటించారు.
కోవిడ్ సోకినప్పటి నుంచి
'నైటింగేల్ ఆఫ్ బాలీవుడ్' అని పిలుచుకునే స్వర కోకిల లతా మంగేష్కర్ ఆదివారం 92 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు.
ఈ ఏడాది జనవరి ప్రారంభంలో కరోనా లక్షణాలతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరిన ఆమె ఆ తర్వాత మరింత తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.
శరీరంలోని పలు అవయవాలు పనిచేయకపోవడం వల్ల ఆమె తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

ఫొటో సోర్స్, NIYOGI BOOKS
లతా మంగేష్కర్ 1929 సెప్టెంబర్ 28న ఇండోర్‌లో జన్మించారు.
తొలుత చిత్రాల్లో నటించిన ఆమె.. ఆతర్వాత గాయకురాలిగా సంగీత ప్రపంచంలో శిఖర స్థాయికి చేరుకున్నారు. ఎన్నో అవార్డులను అందుకున్నారు.

ఫొటో సోర్స్, NIYOGI BOOKS
తన చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో కుటుంబ బాధ్యతను తీసుకున్నారు.
సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ ఆర్థికంగా కుటుంబానికి అండగా నిలిచారు. కానీ ఆమెకు నటనపై ఆసక్తి ఉండేది కాదు.
గాయనిగా రాణించాలనేది ఆమె కోరిక.

ఫొటో సోర్స్, NIYOGI BOOKS
అదే సమయంలో ఆమె సంగీత దర్శకుడు ఉస్తాద్ గులామ్ హైదర్ దృష్టిలో పడ్డారు.
ఆమె గానంలోని మాధుర్యానికి పరవశుడైన ఆయన, ఆమెను పలువురు డైరెక్టర్లకు పరిచయం చేశారు.
అప్పుడు 19 ఏళ్ల లతా మంగేష్కర్ గొంతు మరీ సన్నగా ఉందంటూ డైరెక్టర్లు పెదవి విరిచారు.

ఫొటో సోర్స్, NIYOGI BOOKS
''ఏదో ఒక రోజు నువ్వు చాలా పెద్ద గాయకురాలివి అవుతావు. ఇప్పుడు నిన్ను వద్దనుకున్న వాళ్లే రేపు నీకోసం పరిగెత్తుకు వస్తారు'' అని గులామ్ హైదర్ తనతో చెప్పినట్లు లతా మంగేష్కర్ ఒకానొక సందర్భంలో చెప్పారు.

ఫొటో సోర్స్, LATA CALENDER
'మజ్‌బూర్' చిత్రంలో లతా పాడిన పాటలు విన్న కమాల్ ఆమ్‌రోహి.. 'మహల్' చిత్రంలో ఆమెకు అవకాశాన్నిచ్చారు.
ఆ సినిమాలో ఆమె పాడిన 'ఆయేగా ఆనే వాలా' పాట శ్రోతల మదిని దోచింది. దీనితర్వాత ఇక ఆమె వెనుదిరిగి చూసే సందర్భమే రాలేదు.

ఫొటో సోర్స్, TWITTER / @ MANGESHKARLATA
లతా గొంతులో 'యే మేరే వతన్ కే లోగోం' పాట విన్న తర్వాత జవహార్ లాల్ నెహ్రూ కన్నీళ్లను ఆపుకోలేకపోయారట.
ఆ పాట పాడిన అనంతరం నెహ్రూను లతా కలిశారు. ఈ సందర్భంగా 'మీరు నన్ను ఏడిపించేశారు' అని పేర్కొన్న నెహ్రూ ఆప్యాయంగా లతను హత్తుకున్నారు.

ఫొటో సోర్స్, VIDYA SUBRAMANIAN/HINDUSTAN TIMES VIA GETTY IMAGES
లతా మంగేష్కర్ సోదరి ఆశా భోంస్లే.. గజల్, శాస్త్రీయ సంగీతం ఇలా అన్ని రకాల పాటలు పాడతారు.
చాలామంది ఆమెను బహుముఖ గాయనిగా భావిస్తారు. ఈ అంశంపై చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది.

ఫొటో సోర్స్, PTI
లతా మంగేష్కర్‌ను 1989లో దాదా సాహెబ్ పాల్కే పురస్కారం, 2001లో భారతరత్న అవార్డులతో ప్రభుత్వం సత్కరించింది.

ఫొటో సోర్స్, Getty Images
సీఐడీ కార్యక్రమంలోని నటుడు శివాజీ సాటమ్‌పై సరదాగా పిస్టల్‌ను ఎక్కుపెట్టిన లతా మంగేష్కర్.
అంతిమ యాత్ర
స్వర కోకిల లతా మంగేష్కర్‌కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతున్నాయి.
లతా నివాసం 'ప్రభు కుంజ్'లో ఆదివారం మధ్యాహ్నం 12: 15 నుంచి 12:30 వరకు ఆమె పార్థివ దేహాన్ని ఉంచారు.

ఫొటో సోర్స్, Twitter/narendramodi
ఆమెకు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ అధికారులు శ్రద్ధాంజలి ఘటించారు.
ప్రధాని నరేంద్ర మోదీ ముంబయి చేరుకుని లతా మంగేష్కర్‌కు నివాళులర్పించారు.

శివాజీ పార్క్‌లో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.
లతా మంగేష్కర్ మృతికి నివాళిగా మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారం సెలవుదినంగా ప్రకటించింది.
మరోవైపు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం లతామంగేష్కర్‌కు నివాళిగా 15 రోజుల పాటు ఆమె పాటలను ప్రధాన కూడళ్లు, బహిరంగ ప్రదేశాలలో వినిపించాలని నిర్ణయించింది.
ఇవి కూడా చదవండి:
- 'శవం అంటేనే భయపడేదాన్ని... ఇప్పుడు చితి పక్కనే కూర్చుని పూజలు చేస్తున్నా'- మహిళా జంగం దేవర కథ
- షేక్ రషీద్: టీమిండియాను చాంపియన్‌గా నిలిపిన 17 ఏళ్ల తెలుగు కుర్రాడి కథ
- వరుసగా రెండు సిక్స్‌లు కొట్టి.. ఐదోసారి అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు
- గాలిచొరబడకుండా సీల్ చేసిన బబుల్.. లోపల జీవితం ఎలా ఉందంటే..
- 600 రోజులుగా జూమ్‌లోనే పాఠాలు, 4 కోట్ల మంది చిన్నారుల భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం పడనుంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











