తెలంగాణ: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై సర్పంచ్ భర్త లైంగికదాడి, నిలదీసిన తల్లిదండ్రులను ఇంట్లో బంధించి తాళం - ప్రెస్ రివ్యూ

తెలంగాణలో ఆరేళ్ల బాలికపై ఒక గ్రామ సర్పంచి భర్త, అధికార పార్టీ నేత లైంగిక దాడికి పాల్పడటం ఉద్రిక్తతకు దారి తీసిందని ఈనాడు ఒక కథనం ప్రచురించింది.
ఆ కథనం ప్రకారం తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. బాధిత కుటుంబీకులు, పోలీసుల కథనం ప్రకారం ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఒక మహిళ ఆ గ్రామ సర్పంచి ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఆమె భర్త ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తూ రెండు రోజులకు ఓసారి ఇంటికి వస్తుంటారు. వీరికి ఓ కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.
రెండో తరగతి చదువుతున్న బాలిక గురువారం బడికి వెళ్లలేదు. చిన్నారి తల్లి విధులకు వెళ్తూ బాలికను సర్పంచి ఇంట్లో వదిలి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చాక్లెట్ ఆశ చూపి చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు సర్పంచి భర్త.
విధులు ముగించుకుని సాయంత్రం ఇంటికొచ్చిన మహిళ.. కుమార్తె అస్వస్థతకు గురైనట్లు గుర్తించి ఆరా తీశారు. జరిగిన దారుణాన్ని తెలుసుకుని భర్తకు సమాచారం ఇచ్చారు. అనంతరం ఇద్దరూ ఈ విషయమై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిని నిలదీశారు.
అతను తప్పు అంగీకరించకపోగా.. వారిని వాళ్ల ఇంట్లోనే బంధించి ఇంటికి తాళం వేశాడు. సమాచారం తెలుసుకున్న బంధువులు శుక్రవారం ఉదయాన్నే గ్రామానికి చేరుకుని తాళాలు పగులగొట్టి బాధితులను బయటకు తీసుకొచ్చారు.
పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించి పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడి కారుపై దాడి చేశారు.అనంతరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
బాధిత కుటుంబానికి మద్ధతుగా భారీ సంఖ్యలో జనం ప్రధాన రహదారిపై బైఠాయించారు. నిందితుడిని అరెస్ట్ చేయాలంటూ నినాదాలు చేశారు.

ఫొటో సోర్స్, fb/DDNewsLive
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు నిలిపేయండి- ఎన్జీటీ
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను నిలిపివేయాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశించిందంటూ ఆంధ్రజ్యోతి ఒక కథనం ప్రచురించింది.
ఆ కథనం ప్రకారం.. పర్యావరణ అనుమతులు పొందేవరకు ప్రాజెక్టుపై ముందుకు వెళ్లవద్దని స్పష్టం చేసింది. అనుమతుల్లేకుండా చేపడుతున్న ఈ ప్రాజెక్టును ఆపాలంటూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు రైతులు దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం విచారించిన ఎన్జీటీ న్యాయ సభ్యుడు జస్టిస్ కె.రామకృష్ణన్, సభ్య నిపుణుడు కె.సత్యగోపాల్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
''2016లో ట్రైబ్యునల్ ఇచ్చిన అనుమతుల మేరకు తాము తాగునీటి ప్రాజెక్టు పనులు మాత్రమే చేపడుతున్నామని తెలంగాణ ప్రభుత్వం అంటోంది.
తెలంగాణ ప్రభుత్వ హామీని ట్రైబ్యునల్ అంగీకరించినప్పటికీ.. తాగునీటికి ఎంత మేర జలాలు అవసరమవుతాయి? కేవలం తాగునీటికే ప్రాజెక్టు పరిమితమా? వంటి మెరిట్స్‌లోకి వెళ్లలేదు. ఈ కోణాల్లో విచారణ జరపడానికి మేము సంయుక్త కమిటీని నియమించాం. తాగునీటికి కేవలం 7.5 టీఎంసీల జలాలు మాత్రమే అవసరమైనప్పటికీ 90 టీఎంసీల సామర్థ్యంతో ఆరు రిజర్వాయర్లు నిర్మిస్తున్నారని, అందులో సాగునీటి పనులు కూడా ఉన్నాయని కమిటీ తేల్చింది.
తెలంగాణ ప్రభుత్వ వాదనను అంగీకరించి 90 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ల నిర్మాణానికి అనుమతిస్తే ఇక నీటి సరఫరాకు కెనాల్స్ తీయడం మినహా సాగునీటి అవసరాలకు ఏం మిగులుతుంది? అంతకుమించి ఏమీ ఉండదు'' అని మధ్యంతర ఉత్తర్వుల్లో ఎన్జీటీ పేర్కొంది.
ఒకవేళ ఇది తాగునీటి ప్రాజెక్టే అయితే, తాగునీటికి కేవలం 7.15 టీఎంసీల జలాలే అవసరమైనప్పుడు.. మిగిలిన 67.8 టీఎంసీల కోసం ఆరు రిజర్వాయర్ల అవసరం ఉండదని తెలిపింది.
తెలంగాణ ప్రభుత్వం చేసిన పలు ప్రాథమిక వాదనలను ఎన్జీటీ తోసిపుచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఈ ప్రాజెక్టు లేదని, దీనికి కేఆర్‌ఎంబీ అనుమతులు అవసరమని చేసిన వాదనపై విచారణ జరపడం ట్రైబ్యునల్ పరిధిలోకి రాదని స్పష్టం చేసింది.

ఫొటో సోర్స్, fb/Jyothi Kiran Sbp
'మున్సిపల్ అనుమతి తీసుకున్నాకే రియల్ వెంచర్లలో ప్లాట్లు, ఫ్లాట్లు విక్రయించాలి'
మున్సిపల్ అనుమతి తీసుకున్నాకే రియల్ వెంచర్లలో ప్లాట్లు, ఫ్లాట్లు విక్రయించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందంటూ సాక్షి ఒక కథనం రాసింది.
రెరా, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, ఇతర మున్సిపాలిటీల అనుమతులు లేకుండానే వెంచర్లలో ప్లాట్లు, అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు విక్రయిస్తున్నట్లు మున్సిపల్ శాఖ గుర్తించింది. దీనికి సంబంధించి శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. అనుమతులు లేని ప్రాజెక్టుల్లో కొనుగోళ్లు/బుకింగ్‌లు చేయవద్దని సూచించింది.
ఏదైనా ఫ్లాటును, బిల్డప్ ఏరియాను కొనే ముందు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, రెరా అనుమతుల వివరాలను ఆయా కార్యాలయాల్లో పరిశీలించాలని, ఆన్‌లైన్‌లోనూ వివరాలు లభిస్తాయని వెల్లడించింది.
స్థానిక సంస్థల నుంచి భవన నిర్మాణ అనుమతులు పొందకుండా, రెరా రిజిస్ట్రేషన్ లేకుండానే.. ప్రీలాంచ్/ప్రీసేల్ ఆఫర్ల పేరిట ఫ్లాట్లను, బిల్టప్ ఏరియాను విక్రయించొద్దని మున్సిపల్ శాఖ స్పష్టం చేసింది. ఆఫర్ల పేరిట పత్రికలు, చానళ్లలో ప్రకటనలు ఇవ్వడం, సోషల్ మీడియాలో ప్రచారం చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు పేర్కొంది.

ఫొటో సోర్స్, REUTERS/CHALINEE THIRASUPA
అరటిపండ్ల లోడ్‌తో గంజాయి అక్రమ రవాణా
హైదరాబాద్‌లో మరో డ్రగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారంటూ వెలుగు దినపత్రిక ఒక కథనం రాసింది.
ఆ కథనం ప్రకారం.. అరటి పండ్ల లోడ్‌లో గంజాయి తరలిస్తున్న ముఠాను ఎల్బీనగర్ SOT పోలీసులు పట్టుకున్నారు.
మొత్తం 110 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు రాచకొండ సీపీ మహేష్ భగవత్. దీని విలువ 18 లక్షల వరకు ఉంటుందని చెప్పారు.
విశాఖ నుంచి హైదరాబాద్ మీదుగా నాగ్‌పూర్‌కు రవాణా చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేయగా మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- COP26: 'మా ఉనికి, మనుగడ ప్రమాదంలో ఉన్నాయి...' వాతావరణ మార్పులపై యువతుల ఆందోళన
- పళ్లు రెండు నిమిషాలు తోముకుంటే చాలా? సైన్స్ ఏం చెబుతోంది?
- టీ20 ప్రపంచకప్: సిక్సర్లతో విరుచుకుపడ్డ ఆసిఫ్ అలీ, 5 వికెట్లతో అఫ్గాన్‌పై పాక్ విజయం
- చైనా కొత్త సరిహద్దు చట్టంపై భారత్ అభ్యంతరాలు.. డ్రాగన్ స్పందన ఏంటి?
- పాకిస్తాన్‌కు సహాయం చేస్తే సౌదీ అరేబియాకు ఏంటి లాభం?
- పునీత్ రాజ్‌కుమార్ మృతి... మాస్ సినిమాలతో ‘శాండల్‌వుడ్ ‘పవర్ స్టార్’గా ఎదిగిన కన్నడ నటుడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












