శ్రీదేవి సోడా సెంటర్: ‘సోకాల్డ్ సభ్య సమాజానికి చెంప దెబ్బ’

ఫొటో సోర్స్, facebook/sudheerbabu
- రచయిత, సరిత భూపతి
- హోదా, బీబీసీ కోసం
కరుణకుమార్ దర్శకత్వంలో ఈ వారం విడుదలైన ‘‘శ్రీదేవి సోడా సెంటర్’’లో సుధీర్ బాబు, ఆనంది హీరోహీరోయిన్లుగా నటించారు.
తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నేపథ్యంలో కథంతా నడుస్తుంది. అమలాపురంలో సూరిబాబు(సుధీర్ బాబు) ఓ మంచి ఎలక్ట్రీషియన్. జాతరలో లైటింగ్‌తో పాటు, అక్కడ సోడాలకొట్టు యజమాని సంజీవరావు (నరేశ్) కూతురు శ్రీదేవి (ఆనంది)కి లైటింగ్ కొడుతుంటాడు.
ఆ తర్వాత మెల్లగా ఇద్దరికి ప్రేమ కుదురుతుంది. వాళ్లిద్దరి ప్రేమకు చాలా మామూలుగా అడ్డొచ్చిన కులం ప్రాణాల మీదకు తెచ్చేంత చిచ్చు రేపుతుంది.
విలన్ పన్నాగాలు, హీరో మీద హత్య కేసులు, జైలు పాలవటం, కోర్టులు, హీరో జైలు నుంచి తిరిగిరావటం, ఆ తర్వాత ప్రేమకోసం వెంపర్లాడటం, అప్పటికీ హీరోయిన్ జీవితంలో జరగాల్సిన పరిణామాలు..వారి ప్రేమ పెద్దల్ని మెప్పిస్తుందా? ఈ కథ సుఖాంతమా? విషాదాంతమా? సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఫొటో సోర్స్, facebook/sudheerbabu
రొటీన్ కథలాగే అనిపించినా..
ఇది రొటీన్ అనాల్సిన కథా?
మెుదటగా పోకిరీలు ఏడిపిస్తుంటే, హీరో ఆపద్భాంధవుడిలా వచ్చి రక్షించాలి అని ఆడపిల్లలు ఎదురుచూడకుండా, అక్కడో ఫైట్ పెట్టి హీరోని వీరుడిగా చూపించాలని డైరెక్టర్లు అనుకోకుండా, అమ్మాయిలు తమని తాము రక్షించుకోగలరని నమ్మకం కలిగించటం, విలన్లను చితకబాదగలిగే ధైర్యంగలవాళ్లుగా చూపటం ఇప్పటి సినిమాల్లో మంచి మార్పు.
రెండోది..
ఇలాంటి సినిమాలు సమాజంలోని లోపాల్ని ఎత్తిచూపటం అభినందించదగ్గ విషయం.
కూతురు మీద ప్రేమను పరువుకు ముడిపెడుతూ, ఒక సన్నివేశంలో చితక్కొట్టాలన్నంత కోపం కూతురు మీద ఉన్నప్పటికి ఆడపిల్ల మీద చేయిచేసుకోవటం సభ్యత కాదన్నట్టుండే తండ్రి పాత్ర, కులం విషయంలో ఎలా తెగిస్తుందో కళ్లకు కడుతుంది.
కులం, పరువులాంటి సమాజపు చీడలు మనిషిని ఎంతగా దిగజారుస్తాయో చూపే ఈ పాత్ర నిజజీవితంలో ఆ మధ్య జరిగిన పరువు హత్యకేసులో నిందితుడు మారుతీరావును తలపిస్తుంది. ఆ తర్వాత పశ్చాత్తాపంతో ఆత్మహత్య చేసుకోవటం ఆ పాత్రకు మరింత దగ్గరగా అనిపిస్తుంది.

ఫొటో సోర్స్, facebook/sudheerbabu
ఆకట్టుకున్న అంశాలు
ధైర్యంగల హీరోయిన్ పాత్ర, పాత్రకు తగిన హావభావాలతో (కొన్నిసార్లు ఎక్కువనిపించినప్పటికీ) హీరోయిన్ తండ్రిగా నరేశ్ పాత్ర, హీరో ఫ్రెండ్ గా సత్యం రాజేశ్ పాత్రలు నటనతో మెప్పించాయి.
సమాజంలోని రకరకాల జబ్బులను సటిల్ గా, చెంపదెబ్బ కొట్టినట్టుగా చెప్పాలంటే మలయాళం సినిమాలే అని నమ్మే ప్రేక్షకులు, కాస్త తెలుగు సినిమాల మీద కూడా ఆశ పెట్టుకోవచ్చు అనిపించేలా ఉంది.
హీరోయిన్ తరం మారిందంటూ తండ్రితో మాట్లాడే డైలాగులు బాగున్నాయి. "సూరి మంచివాడు నాన్నా" అని కూతురు చెప్తే, నాకు తెలుసమ్మా అని తండ్రి మనస్ఫూర్తిగా అంగీకరించినప్పటికీ, వాళ్ళ పెళ్ళికి ఒప్పుకోలేకపోవటానికి కారణం నిక్కచ్చిగా సమాజం ఇట్లా అనుకుంటుంది అని భయపడిన తండ్రి పాత్ర.. సోకాల్డ్ సభ్యసమాజానికి చెంపదెబ్బ.

ఫొటో సోర్స్, facebook/sudheerbabu
అన్నీ పాత్రల గోదావరి యాస సహజంగా ఉంది.
జానపదాలకు కాస్త మేకప్ వేస్తే మళ్లీ జనాదరణ పొందుతున్న ఈ సమయంలో " మందులోడా ఓరి మాయలోడా" పాట కూడా అదే బాటలో మాస్ ఆడియన్స్‌ను అలరిస్తుంది.
మణిశర్మ సంగీతం మెప్పించింది. అజయ్, రఘుబాబు, హర్షవర్థన్, సప్తగిరి, రోహిణి తదితరులు వారి పాత్ర మేరకు బాగా నటించారు.
సాధారణ ఎలక్ట్రీషియన్ పాత్రకు సిక్స్ ప్యాక్ అవసరం లేకపోయినా, కండల్లో కష్టం, గతంతో పోలిస్తే నటనస్థాయిని పెంచిన సుధీర్ బాబు ఆకట్టుకున్నారు.
కొన్ని సీన్లు ముందే ఊహించేలా ఉన్నప్పటికీ, ఈ సినిమాకు క్లైమాక్స్ ప్రాణంపోసింది. ఓవరాల్‌గా శ్రీదేవి గోలిసోడా బాగానే పేలిందని చెప్పవచ్చు.
ఇవి కూడా చదవండి:
- 'నగ్నంగా ఆరుబయట స్నానం చేయమన్నారు, మొదట్లో సిగ్గుపడ్డాను కానీ అదే ఎంతో మేలు చేసింది’
- జపనీయులకు ఇష్టమైన తెలుగు సినిమా ఇదే
- హిరోషిమా, నాగాసాకి: అణుబాంబు నేలను తాకినప్పుడు ఏం జరిగింది
- టోక్యో ఒలింపిక్స్: జపాన్ వారికి నాణేలపై ఉన్న మోజు మాటల్లో చెప్పలేం
- ఒలింపిక్స్ పోటీలలో ఆటగాళ్లు నగ్నంగా పాల్గొనే ప్రాచీన గ్రీకు సంప్రదాయం మళ్లీ వస్తుందా?
- అఫ్గానిస్తాన్: 'ఓటమి ఎరుగని' పంజ్‌షీర్ లోయ కథ
- కరీమ్ లాలా: ఈ ముంబయి మాఫియా డాన్‌ను ఇందిరా గాంధీ ఎందుకు కలిశారు?
- గాంధీ బ్రహ్మచర్య ప్రయోగాల గురించి మనూ గాంధీ డైరీల్లో ఏముంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








