కోవిడ్-19: మోదీ ప్రభుత్వం మొదలు పెట్టిన పాజిటివ్ థింకింగ్ ప్రచారం లక్ష్యమేంటి... విమర్శకులు ఏమంటున్నారు?

కరోనా

ఫొటో సోర్స్, NARINDER NANU/AFP via Getty Images

    • రచయిత, వినీత్ ఖరే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కరోనావైరస్‌ మరణాల సంఖ్య తక్కువగా ఉందని అనుకుంటున్న సమయంలో భారతదేశంలో అధికారిక లెక్కల ప్రకారం మృతుల సంఖ్య మూడు లక్షలు దాటింది.

పరిస్థితులు మెరుగవుతున్నాయని భావిస్తున్న వేళలోనే ఆక్సిజన్ సమస్య, బెడ్ల కొరత, జనం రోడ్ల మీదే చనిపోవడం లాంటి దృశ్యాలు ఆందోళన కలిగించాయి.

మందులు, ఆక్సిజన్ కోసం బాధితులు బ్లాక్ మార్కెట్ వైపు పరుగులు పెట్టాల్సి వచ్చింది.

అనేక కుటుంబాలు ఆర్థికంగా కోలుకోలేనంతగా దెబ్బతిన్నాయి.

అంత్యక్రియలకు శవాలను భుజాల మీద మోసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కరోనా సెకండ్‌ వేవ్‌ను నరేంద్ర మోదీ ప్రభుత్వం సరిగా అంచనా వేయకపోవడం, యంత్రాంగాన్ని సిద్ధం చేయకపోవడం వల్లే ఇలాంటి ఘోరాలన్నీ జరిగాయంటూ ఆరోపణలు వినిపించాయి.

ప్రధాని మోదీపై విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం 'థింక్ పాజిటివ్' క్యాంపెయిన్‌ను మొదలు పెట్టింది.

ప్రజల్లో ప్రభుత్వం మీద పెరుగుతున్న అసంతృప్తిని తగ్గించడం, విమర్శల నుంచి ప్రజల దృష్టిని మరల్చడమే ఈ ప్రచారం లక్ష్యమా? విమర్శకులు, సమర్ధకులు ఏమంటున్నారు?

రాజకీయ ప్రయోజనం కోసమే మోదీ ప్రభుత్వం పాజటివిటీ ప్రచారం మొదలు పెట్టిందని పలువురు విమర్శిస్తున్నారు.

ఫొటో సోర్స్, UGC

ప్రచారం ప్రారంభం

’పాజిటివిటీ అన్‌ లిమిటెట్-వియ్ విల్ విన్‘ అనే పేరుతో ఏప్రిల్‌లో ఒక జూమ్ మీటింగ్ ద్వారా ఈ క్యాంపెయిన్ మొదలైంది.

ఇందులో అనేకమంది ప్రజలతోపాటు, పలు సంస్థలు, పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నారని కోవిడ్-19 రెస్పాన్స్ టీమ్ కన్వీనర్ జనరల్ (రిటైర్డ్) గుర్మీత్ సింగ్ చెప్పారు.

ఈ క్యాంపెయిన్‌లో భాగంగా సుమారు 100 చానెళ్లలో ఉపన్యాసాలు ప్రసారం చేశామని, 19 ఐసోలేషన్ కేంద్రాలు నిర్మించామని, ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేశామని, 3,500కు పైగా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించామని ఆయన వెల్లడించారు.

ఇందులో ఉపన్యాసాల ద్వారా పాజిటివిటీ గురించి మాట్లాడిన వారిలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, వ్యాపారవేత్త అజీమ్ ప్రేమ్‌జీ, ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్‌ లాంటి వారు ఉన్నారు.

''ఇది రాజకీయ ప్రేరేపిత ప్రచారం. ఇప్పటి వరకు జరిగింది ప్రజలు మరిచిపోవాలన్నది వారి లక్ష్యం'' అని ఆర్ఎస్ఎస్‌ చీఫ్ మోహన్ భగవత్‌ వ్యాఖ్యలకు సంబంధించిన ఒక న్యూస్ పేపర్ క్లిప్పింగ్‌ను ట్వీట్ చేస్తూ సీనియర్ జర్నలిస్ట్ సీమా చిష్తీ విమర్శించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ప్రెస్ అండ్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇచ్చే సమాచారంలో దేశంలో పరిస్థితులు మెరుగవుతున్నాయన్న అర్థం వచ్చేలా సందేశాలు ఉంటున్నాయని కొందరు విమర్శించారు.

కోలుకునే వారి సంఖ్య పెరుగుతోందని, రికవరీ రేటు ఎక్కువగా ఉందని, ఇన్ని లక్షలమంది వ్యాక్సీన్ పొందారంటూ ఇస్తున్న సమాచారం అందులో భాగమని వారు అంటున్నారు.

''ఇది ఒకరకమైన ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్. ఇందులో గణాంకాలను తగ్గించి చూపుతారు'' అన్నారు సీమా చిష్తీ.

ఆక్సిజన్ సిలిండర్లు, ఐసీయూ బెడ్లు దొరక్క సామాన్యులు చాలా ఇబ్బంది పడ్డారు.

ఫొటో సోర్స్, MONEY SHARMA/GETTY IMAGES

మోదీ ఇమేజ్‌‌పై వామపక్షాల విమర్శలు

''నరేంద్ర మోదీ ప్రభుత్వ లక్షణం ఏంటంటే, ఒక సంక్షోభాన్ని సమాచారం, ఇమేజ్ మేనేజ్‌మెంట్ అనే ఆయుధాలతోనే ఎదుర్కోవాలని ప్రయత్నిస్తుంది'' అని కమ్యూనికేషన్ కన్సల్టెంట్ దిలీప్ చెరియన్ బీబీసీతో అన్నారు.

అదే సమయంలో కరోనా ఇంత పెద్ద సమస్యగా మారుతుందని ఎవరూ ఊహించలేదని బీజేపీ అధికార ప్రతినిధి సుదేశ్ వర్మ వ్యాఖ్యానించారు.

''మనం పూర్తి విశ్వాసంతో ఉన్నప్పుడే మహమ్మారి మీద పోరాడగలుగుతాం'' అన్నారాయన.

''వైరస్ ఈజ్ యువర్ ఎనిమి, నాట్ ప్రైమ్ మినిస్టర్ మోదీ'' అంటూ 'ది డైలీ గార్డియన్' పత్రికలో ప్రచురితమైన కథనం చాలా చర్చనీయాంశమైంది.

కరోనావైరస్ విషయంలో ప్రతిపక్షాలు వదంతులు, భయాలు వ్యాపింపజేస్తున్నాయని ఈ వ్యాసంలో విమర్శించారు.

''వామపక్ష పార్టీలు మోదీ ప్రభుత్వాన్ని కించ పరచాలని కోరుకుంటాయి. వారు బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని సహించ లేరు'' అని బీజేపీ అధికార ప్రతినిధి సుదేశ్ వర్మ అన్నారు.

ప్రభుత్వ ఆందోళనకు కారణం ఏంటి?

మోదీ రేటింగ్ పడిపోయిందని ఇటీవల చేసిన సర్వేలలో తేలిందని రాయిటర్స్ వార్త సంస్థ వెల్లడించింది.

ఎవరైనా చనిపోతే హాస్పిటల్ బెడ్ దొరుకుతుందేమోనని ఎదురు చూసిన సందర్భాలున్నాయని కొందరు చెప్పారు.

ఫొటో సోర్స్, DIPAYAN BOSE/SOPA IMAGES/LIGHTROCKET VIA GETTY IMA

'ఎవరైనా చనిపోతే తమకు బెడ్ దొరుకుతుందని ఎదురు చూస్తూ కూర్చున్నారు'

కరోనా కారణంగా తమ వారిని కోల్పోయిన వారు ఏమంటున్నారు? ఈ విషయం తెలుసుకోవడానికి కరోనా సెకండ్ వేవ్‌కు కేంద్రంగా మారిన ఉత్తర్‌ప్రదేశ్‌‌కు వెళ్లాం.

అడ్వకేట్ ఆదిత్య రాఘవ్ కున్వర్‌పూర్‌లో నివసిస్తుంటారు. ప్రస్తుతం ఆయన గ్రామంలో పరిస్థితి కొంత చక్కబడినా, అక్కడ 15-16 మంది కరోనా కారణంగా మరణించారు.

పాజిటివిటీ పేరుతో ప్రభుత్వం చేస్తున్న ప్రచారంపై ఆయన ఆగ్రహంగా ఉన్నారు.

''తన రాజకీయ ప్రయోజనాలు కాపాడుకోవడానికి మనిషి బాధలను ఒక జోక్‌గా ప్రచారం చేస్తున్నారు. వాళ్ల బలహీనత రోజు రోజుకు పెరుగుతోంది'' అని ఆదిత్య రాఘవ్ అన్నారు.

కరోనా మహమ్మారి సెకండ్‌ వేవ్ ఉత్తర్‌ ప్రదేశ్, బిహార్ రాష్ట్రాలలోని గ్రామీణ ప్రాంతాల్లో చాలా విధ్వంసం సృష్టించింది.

''ఇంటింటికి తిరిగి టెస్టులు చేయకుండానే కోవిడ్ తగ్గుతోందని ప్రభుత్వం ఎలా చెబుతుంది'' అని రాఘవ్ ప్రశ్నించారు.

ఆదిత్య రాఘవ్ భార్య ఇటీవల కరోనా బారిన పడ్డారు. కొన్ని వందల రూపాయలకు వచ్చే ఆక్సిజన్ సిలిండర్ రెగ్యులేటర్‌ను ఆయన రూ.5 వేలు పెట్టి కొనాల్సి వచ్చింది.

‘‘ఎవరైనా చచ్చిపోతారేమో, తమకు బెడ్ దొరుకుతుందని సామాన్యులు ఆసుపత్రుల ముందు ఎదురు చూస్తూ కూర్చున్నారు. కోవిడ్ మనుషులను ఘోరమైన స్థితిలోకి నెట్టింది’’ అని రాఘవ్ వాపోయారు.

ఆదిత్య రాఘవ్ గ్రామానికే చెందిన రింకూ శర్మ అనే రైతు హఠాత్తుగా అనారోగ్యం పాలయ్యారు.

ఆక్సిజన్ సిలిండర్ కోసం ఆయన రూ.70 వేలు చెల్లించేందుకు సిద్ధపడ్డారు. కానీ సిలిండర్ దొరక లేదు. చివరకు ఆయన ప్రాణాలు పోయాయి.

కొన్నిసార్లు పాజిటివ్ దృక్పథం అవసరమేనని కొందరు మోదీ ప్రభుత్వ ప్రచారాన్ని సమర్ధిస్తున్నారు.

ఫొటో సోర్స్, RITESH SHUKLA

''కష్ట సమయంలో పాజిటివ్ థింకింగ్ అవసరమే''

కరోనా కాలంలో ప్రభుత్వాల పని తీరుపై భిన్న స్వరాలు కూడా వినిపిస్తున్నాయి.

కొందరు పాజిటివిటీ క్యాంపెయిన్‌పై విమర్శలు చేయగా మరికొందరు కష్ట సమయంలో ఇలాంటి దృక్పథం అవసరమని అన్నారు.

ప్రముఖ శాస్త్రీయ సంగీత గాయకుడు రాజన్ మిశ్రా వెంటిలేటర్ దొరకని కారణంతో ఇటీవల మరణించారు.

తండ్రికి ఆక్సిజన్ సిలిండర్ కోసం హాస్పిటల్ పార్కింగ్ స్థలంలో గంటల తరబడి ఎదురు చూసిన విషయాన్ని ఆయన కుమారుడు రితేశ్ మిశ్రా గుర్తు చేసుకున్నారు.

అప్పటికే రాజన్ మిశ్రాకు రెండుసార్లు గుండెపోటు కూడా వచ్చింది. మూడోసారి హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఆయన తట్టుకోలేకపోయారు.

''ఆక్సిజన్ కోసం ఎంతోమంది హాస్పిటల్ పార్కింగ్‌లో పడిగాపులు పడ్డారు. సమస్య వచ్చినప్పుడు మనం బ్లేమ్ గేమ్ ఆడ కూడదు'' అన్నారు రితేశ్ మిశ్రా.

పండిట్ రాజన్ మిశ్రాకు నివాళిగా ప్రభుత్వం ఒక కోవిడ్ ఆసుపత్రికి ఆయన పేరు పెట్టింది.

‘ఇది మా నాన్నకు నివాళి‘ అని రితేశ్ మిశ్రా అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)