కోవిడ్19: పార్టీ కార్యాలయాలను కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చిన సీపీఎం... మిగిలిన పార్టీలు ఏం చేస్తున్నాయంటే..

- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)కి చెందిన పలు కార్యాలయాలు ప్రస్తుతం కోవిడ్ ఐసోలేషన్ సెంటర్లుగా మారాయి. ఆ పార్టీకి చెందిన అనుబంధ సంఘాలు, వివిధ ట్రస్టుల ఆధ్వర్యంలో వాటిని నిర్వహిస్తున్నారు.
ఇప్పటికే ఆయా కేంద్రాలలో బెడ్స్ ఏర్పాటు చేశారు. ఆక్సిజన్ అందుబాటులో ఉంచారు. పౌష్టికాహారం అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితి పరిశీలించేందుకు వైద్యులను అందుబాటులో ఉంచారు.
పార్టీ కార్యకర్తలను వలంటీర్లుగా నియమించి సేవలు కొనసాగిస్తున్నారు.
ఏపీలో 400 బెడ్స్ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం నుంచి అరకు వరకు 15 కేంద్రాల్లో సీపీఎం వీటిని నిర్వహిస్తోంది. ఐసోలేషన్ కేంద్రాల్లో రాష్ట్రవ్యాప్తంగా 400 బెడ్స్ సిద్ధం చేశామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య భవనం, విశాఖలోని నండూరి ప్రసాదరావు భవనం, అనంతపురంలోని సింగమనేని నారాయణ స్మారక కేంద్రం వంటి సీపీఎం కార్యాలయాలను ఇప్పుడు కోవిడ్ బాధితులకు కేటాయించారు.
కోవిడ్ కేంద్రాల నిర్వహణకు పలువురు సహకారం అందిస్తున్నారని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు బీబీసీకి చెప్పారు.
''మొదటి వేవ్ సందర్భంలో కొన్నిచోట్ల కోవిడ్ బాధితులకు అండగా ఉండే ప్రయత్నం చేశాం. అనేక మందికి ప్రభుత్వ వైద్యం అందుబాటులో లేకపోవడం, ప్రైవేటు ఆసుపత్రుల ఫీజులు భారంగా మారడంతో వారికి తోడ్పాటు అందించాలని నిర్ణయించాం. ముందు మా పార్టీ కార్యకర్తల కోసం అనుకున్నప్పటికీ చివరకు అనేక మంది సాధారణ ప్రజలకు ఈ కోవిడ్ ఐసోలేషన్ కేంద్రాల్లో ఊరట లభించింది. విజయవాడలో 50 బెడ్స్‌తో ఐసోలేషన్ కేంద్రం తెరిచాం. 200 మందికి పైగా కరోనా బాధితులు ఉపశమనం పొందారు. సుందరయ్య స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో మరో 50 బెడ్స్ ఏర్పాటు చేశాం'' అని మధు వివరించారు.

వైద్యుల తోడ్పాటు కూడా..
కోవిడ్ ఐసోలేషన్ కేంద్రాల్లో ఉన్న వారికి అన్ని రకాలుగా సహకారం అందిస్తూ వారు త్వరగా కోలుకునే ప్రయత్నం చేస్తున్నామని సీపీఎం నేత సీహెచ్ నర్సింగ రావు తెలిపారు.
విశాఖ జగదాంబ సెంటర్‌లోని సీపీఎం కార్యాలయంలో 40 మంది కరోనా బాధితులు ఉన్నారు. కరోనా రోగులకు ఐసోలేషన్ సదుపాయం సిద్ధం చేశామని ఆయన వివరించారు.
''మా ఐసోలేషన్ కేంద్రాల నిర్వహణకు అనేక మంది సాయం అందిస్తున్నారు. ముఖ్యంగా వైద్యుల సహకారం కీలకం. చాలామంది డాక్టర్లు తాము ఎంత బిజీగా ఉన్నా, రెండు పూటలా మా సెంటర్లలోని వారికి అవసరమైన ఆరోగ్య సలహాలు అందిస్తున్నారు'' అని నర్సింగరావు వెల్లడించారు.

సేవలు స్వచ్ఛందమే
రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ(ఎం) ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాలలో సుమారు 100 మంది పనిచేస్తున్నారు.
ఆహారం సిద్ధం చేసి బాధితులకు అందించడం దగ్గరి నుంచి అవసరమైన అన్ని పనులను కార్యకర్తలు చేస్తున్నారు.
పల్స్ రేట్, బీపీ వంటివి ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ సకాలంలో మందులు అందించేందుకు వైద్య విద్యార్థులు కూడా స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నారు.
''పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా తోడ్పాటు అందిస్తున్నారు. ఆహారం విషయంలో రాజీపడకుండా సమయానికి అన్నింటినీ సిద్ధం చేసి అందిస్తున్నాం. వ్యాయామం, యోగా, మానసిక ఉల్లాసం కలిగించేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాం. ఒత్తిడి నుంచి అందరిని దూరం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి'' అని విజయవాడ ఐసోలేషన్ సెంటర్ నిర్వాహకులు, ఎంబీవీకే కార్యదర్శి పిన్నమనేని మురళీకృష్ణ బీబీసీకి చెప్పారు.

హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం మొదలుకుని..
తెలంగాణా జిల్లాల్లో కూడా ఈ ప్రయత్నం జరుగుతోంది.
మొదట హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇది మంచి ఫలితాలను ఇచ్చిందని నిర్వాహకులు అంటున్నారు.
ప్రస్తుతం ఖమ్మం, నల్గొండ, వరంగల్ సహా అనేక జిల్లాల్లో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు సీపీఎం తెలంగాణ రాష్ట్ర నాయకుడు బి. వెంకట్ బీబీసీకి తెలిపారు.
''సామాన్యులు, ఇరుకు ఇళ్లలో నివసించే వారు ఐసోలేషన్‌లో ఉండడానికి సతమతం అవుతున్న సమయంలో మా కేంద్రాలు బాగా ఉపయోగపడ్డాయి. వందల మంది కోలుకున్నారు. అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నాం. నిర్వహణ విషయంలో రాజీలేకుండా ప్రజలకు భరోసా కల్పించే ప్రయత్నంలో ఉన్నాం'' అని బి. వెంకట్ వివరించారు.

'మేము కోలుకోవడానికి అక్కడ చూపిన ఆదరణ కూడా కారణమే'
''నాకు, నా భార్యకు కరోనా సోకింది. ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాలంటే భయం వేసింది. వడ్డేశ్వరంలోని సుందరయ్య స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రానికి వెళ్లాం. మాకు ఎప్పటికప్పుడు వైద్యులు పరీక్షలు చేసేవారు. మంచి ఆహారం అందించారు. ఉదయం, సాయంత్రం వ్యాయామం చేసేందుకు ఏర్పాట్లున్నాయి. ఇవన్నీ కలిసి మేము త్వరగా కోలుకోవడానికి సాయం చేశాయి'' అని రాజేశ్ అనే కళాకారుడు బీబీసీతో అన్నారు.
ఆక్సిజన్ ఏర్పాటు ..
దేశ, విదేశాల్లోని పలువురు ఈ ఐసోలేషన్ కేంద్రాలకు సహాయం అందిస్తున్నారు.
ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల ఏర్పాటు కూడా జరుగుతోంది.
రోగి ఆక్సిజన్ స్థాయిల్లో హెచ్చుతగ్గులు వచ్చినప్పుడు మెడికల్ ఆక్సిజన్ అందుబాటులో ఉంటే మరింత ఉపశమనం కలుగుతుందని ఐసోలేషన్ కేంద్రాల నిర్వహణలో ఉన్న క్రాంతి అన్నారు. దాతల తోడ్పాటు వల్లే ఈ కేంద్రాల నిర్వహణ సులువుగా చేయగలుగుతున్నామని ఆయన చెప్పారు.

మిగిలిన పార్టీలు ఏం చేస్తున్నాయి..
ఏపీలో ఇతర రాజకీయ పార్టీలు కూడా కోవిడ్ బాధితులను ఆదుకునేందుకు కొంత ప్రయత్నం చేస్తున్నాయి.
విపక్ష టీడీపీ ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా సమయంలో సేవా కార్యక్రమాలకు పిలుపునిచ్చింది.
రాష్ట్రంలోని కుప్పం, పాలకొల్లు, రేపల్లె, టెక్కలి ఆసుపత్రులలో ఆక్సిజన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
సీపీఐ కూడా పలుచోట్ల కరోనా సహాయక కార్యక్రమాలు చేపట్టింది.
వైసీపీ, బీజేపీ సహా వివిధ పార్టీల నేతలు కూడా సొంతంగా కొన్ని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి.
వివిధ ప్రాంతాల్లో ప్రజలకు తోడ్పాటునందించే పనిలో పలువురు నేతలు, కార్యకర్తలు పాలుపంచుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- లాక్ డౌన్ చరిత్ర ఏంటి... 400 ఏళ్ల కిందట రోమ్‌లో ఎందుకు విధించారు?
- జెరూసలేంపై అమెరికాకు జోర్డాన్ హెచ్చరిక
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- ఈజిప్ట్‌లో బయటపడిన 3000 ఏళ్ల నాటి పురాతన ‘బంగారు నగరం’
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- భారత్‌లో కోవిడ్ వ్యాక్సీన్ కొరత, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గందరగోళం... ఈ పరిస్థితికి కారణమేంటి?
- జెరూసలెం వివాదం: ఇజ్రాయెల్ కాల్పుల్లో 58 మంది పాలస్తీనీయుల మృతి
- సినోఫార్మ్: చైనా వ్యాక్సీన్ ఎమర్జెన్సీ వినియోగానికి డబ్ల్యూహెచ్‌వో ఆమోదం
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









