జూనియర్ ఎన్టీఆర్: నన్ను, రామ్‌చరణ్‌ను ఓటీటీలో కాదు... బిగ్ స్క్రీన్ మీదే చూడాలి - ప్రెస్ రివ్యూ

జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్

ఫొటో సోర్స్, Jr NTR/Twitter

కరోనా పాజిటివ్ రావడంతో హోం ఐసొలేషన్‌లో విశ్రాంతి తీసుకుంటున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ విశేషాలను పంచుకున్నారని ఈనాడు దిన పత్రిక చెప్పింది.

అక్టోబరు నెలలో 'ఆర్‌.ఆర్‌.ఆర్‌' విడుదలకి ఇప్పటికీ అవకాశం ఉందన్నారు ప్రముఖ కథానాయకుడు ఎన్టీఆర్‌.

ఆయన రామ్‌చరణ్‌తో కలిసి నటిస్తున్న చిత్రమిది. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. రెండో దశ కరోనా ఉద్ధృతితో ఈ సినిమా చిత్రీకరణకి మరోసారి బ్రేకులు పడ్డాయి.

ఇటీవల ఎన్టీఆర్‌ కూడా కొవిడ్‌ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన ఇంట్లోనే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ గడుపుతున్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ అంతర్జాతీయ ఆన్‌లైన్‌ మీడియాతో మాట్లాడారని ఈనాడు రాసింది.

ఎన్టీఆర్ చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే...

ఈ సినిమా కోసం నేను మరింత నిర్దుష్టమైన శారీరక రూపంతో కనిపించాల్సి వచ్చింది. అందుకోసం దాదాపు 18 నెలలపాటు తీవ్రమైన శిక్షణ తీసుకున్నా. ఈ సినిమాకి ముందు 71 కిలోలు ఉన్నా. దీని కోసం అదనంగా తొమ్మిది కిలోల కండరాల్ని పెంచాల్సి వచ్చింది.

సాంకేతికంగా 19 నెలల చిత్రీకరణ జరిగింది. ఊహించిన స్థాయిలో ఇది ప్రేక్షకుల ముందుకు రావడానికి ఆ సమయం అవసరమే. ఇందులో పోరాట ఘట్టాలు ప్రేక్షకుల్ని అబ్బురపరిచేలా ఉంటాయి.

ఈ సినిమాలోని పాత్రలకి సంబంధించిన కథల్ని ఇప్పుడు మా పిల్లలకి చెబుతున్నా. మన జ్ఞాపకాల ద్వారా ఆ పాత్రలు అలా జీవిస్తూ ఉంటాయి.

నేను, రామ్‌చరణ్‌ దీని కోసం కలిసి రావడం ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన ఆసక్తిని రేకెత్తించింది. 'ఆర్‌.ఆర్‌.ఆర్‌'ని ఓటీటీలో విడుదల చేయాలని మేమెప్పుడూ అనుకోలేదు.

సమష్టిగా, కలిసి పెద్ద తెరపై చూస్తూ ఆస్వాదించే సినిమాలు కొన్ని ఉంటాయి. 'ఆర్‌.ఆర్‌.ఆర్‌' అలాంటిదే. మేం సినిమా హాళ్ల పునః ప్రారంభం గురించి వేచి చూస్తాం. భారతీయ ప్రేక్షకులకు సినిమా అంటే ప్రాణం. వాళ్లు సినిమాలు చూడటానికి తిరిగి వస్తారని మాకు తెలుసు. ఆ నమ్మకం మాకు ఉంది.

'ఆర్‌.ఆర్‌.ఆర్‌' తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నా. అది పూర్తయ్యాక 'కె.జి.ఎఫ్‌' దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌తో కలిసి సినిమా చేస్తా.

కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కూడా 'ఆర్‌.ఆర్‌.ఆర్‌' తరహాలో భారతీయ భాషల్లో ప్రయాణించే చిత్రం అవుతుంది. పలు భాషల్లో విడుదలవుతుంది. ప్రస్తుతం స్క్రిప్ట్‌ పనులు జరుగుతున్నాయి.

నేను విధిని బలంగా నమ్ముతా. నటుడిగా కథలో భాగం కావాలని కోరుకునే వ్యక్తిని. దర్శకత్వం గురించి ఆలోచన లేదు.

భారతీయ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే కంటెంట్‌ని సృష్టించాలనే ఆలోచన మాత్రం ఉంది.

కోవాగ్జిన్

ఫొటో సోర్స్, Getty Images

పిల్లలపై కోవాగ్జిన్ ట్రయల్స్‌కు పచ్చజెండా

చిన్న పిల్లలపై కోవాగ్జిన్ ట్రయల్స్‌కు సీడీఎస్‌సీఓ సిఫారసు చేసిందంటూ ఆంధ్రజ్యోతి దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

కొవాగ్జిన్‌తో 2-18 ఏళ్లలోపు వారిపై రెండు, మూడోదశ ప్రయోగ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతులు ఇవ్వొచ్చంటూ కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీవో)కు చెందిన విషయ నిపుణుల కమిటీ (ఎస్‌ఈసీ) సిఫారసు చేసింది.

దీంతో ఈ విషయమై భారత్‌ బయోటెక్‌ సమర్పించిన దరఖాస్తుపై డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) ఆమోదముద్ర వేయడమే తరువాయి.

ఎయిమ్స్‌ పట్నా, ఎయిమ్స్‌ దిల్లీ, నాగ్‌పూర్‌లోని మెడిట్రినా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ సహా దేశంలోని వివిధ కేంద్రాల్లో 525 మందిపై టీకాను పరీక్షించనున్నట్లు సమాచారం.

కొవాగ్జిన్‌ సరఫరాపై కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన విమర్శలపై భారత్‌ బయోటెక్‌ బుధవారం ట్విటర్‌ వేదికగా స్పందించింది.

"మా కంపెనీలో పనిచేసే దాదాపు 50 మంది సిబ్బంది కొవిడ్‌ బారినపడ్డారు. అయినా ప్రజల కోసం, దేశం కోసం ప్రతిక్షణం పరితపిస్తున్నాం.

టీకా ఉత్పత్తి ప్రక్రియలో రాజీలేకుండా కష్టపడుతున్నాం. 18 రాష్ట్రాలకు ఎప్పటికప్పుడు కొవాగ్జిన్‌ డోసులను పంపుతున్నాం.

అయినా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మాకు దురుద్దేశాలను ఆపాదించే ప్రయత్నం చేయడం నిరుత్సాహపరిచే అంశమే'' అని భారత్‌ బయోటెక్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (జేఎండీ) సుచిత్ర ఎల్లా ఆవేదన వెళ్లగక్కారని ఆంధ్రజ్యోతి వివరించింది.

ఐసీఎంఆర్ ఆన్ లాక్ డౌన్

ఫొటో సోర్స్, ICMR/Twitter

పాజిటివిటీ 10 దాటితే లాక్ డౌన్: ఐసీఎంఆర్ చీఫ్

దేశంలో పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న 500కు పైగా జిల్లాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగడం మంచిదని ఐసీఎంఆర్ చీఫ్ అన్నట్లు సాక్షి కథనం ప్రచురించింది.

దేశంలో కోవిడ్‌ పరిస్థితి చక్కబడాలంటే పాజిటివిటీ రేటు 10% కంటే ఎక్కువగా ఉన్న జిల్లాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలను మరో 6 నుంచి 8 వారాల పాటు కొనసాగించాలని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) అధిపతి డాక్టర్‌ బలరామ్‌ భార్గవ్‌ అభిప్రాయపడ్డారు.

సుమారు 500 జిల్లాల్లో ప్రస్తుతం పాజిటివిటీ రేటు 10% పైన ఉందని, ఇందులో దిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాలు ఉన్నాయని భార్గవ్‌ తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రాలు విధించిన లాక్‌డౌన్‌ ఆంక్షలు ఎంతకాలం అవసరమనే విషయాన్ని డాక్టర్‌ భార్గవ్‌ వివరించారు.

అయితే వైరస్‌ సంక్రమణ ఉన్న జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10 నుంచి 5 శాతానికి వచ్చిన తర్వాతనే ఆంక్షలను సడలించాలని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో 5% పాజిటివిటీ రేటు వచ్చేందుకు దాదాపు 8 వారాలు పడుతుందన్నారు.

దిల్లీ విషయాన్ని ఉదహరిస్తూ గతంలో దేశ రాజధానిలో పాజిటివిటీ రేటు 35 శాతానికి చేరుకుందని, కానీ ఇప్పుడు అది 17 శాతానికి పడిపోయిందని ఆయన అన్నారు.

ఉన్నపళంగా దిల్లీలో లాక్‌డౌన్‌ ఆంక్షలను ఎత్తేస్తే అది మరో విపత్తుకు కారణమౌతుందని ఆయన తెలిపారని సాక్షి వివరించింది.

ఆవిరి పట్టడం

అతిగా ఆవిరి పడితే అనర్థం: వైద్యులు

అతిగా ఆవిరి పట్టడం వల్ల కూడా దుష్ఫలితాలు వస్తాయని వైద్యులు చెబుతున్నట్లు నమస్తే తెలంగాణ దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

శృతిమించితే ఏదీ మంచిది కాదు. కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు అతిగా ఆవిరి పట్టడం వల్ల కూడా దుష్ఫలితాలు వస్తాయని ఉస్మానియా జనరల్‌ మెడిసిన్‌ విభాగానికి చెందిన డాక్టర్‌ ప్రతిభా లక్ష్మి స్పష్టం చేశారు.

కరోనా పాజిటివ్‌ వచ్చిన వారిలో 90 శాతం మందికి స్వల్ప లక్షణాలతోనే వ్యాధి తగ్గిపోతుందన్నారు. మిగిలిన 10 శాతం మందిలో ఇతర వ్యాధులు, అనారోగ్య సమస్యల వల్ల కొవిడ్‌ తీవ్రత అధికంగా ఉంటుందని చెప్పారు.

ఇలాంటి వారంతా దవాఖానకు వెళ్లాల్సి ఉంటుందని, అంతేతప్ప ఆవిరి పీల్చడం, కషాయం, వేడి నీళ్లు తాగడం వల్ల ప్రయోజనమేమీ ఉండదని తెలిపారు.

మనలో రోగ నిరోధకశక్తి బలంగా ఉంటే శరీరంలో ప్రవేశించిన 9 రోజులకే కరోనా వైరస్‌ అంతరించిపోతుందని డాక్టర్‌ లక్ష్మి పేర్కొన్నారు.

ముక్కు దిబ్బడ ఎక్కువగా ఉన్నవారు మాత్రమే రెండ్రోజులపాటు ఉదయం 5 నిమిషాలు ఆవిరిపట్టాలని డాక్టర్‌ ప్రతిభాలక్ష్మి అన్నారు.

అది కూడా కేవలం నీటితోనే ఆవిరి పట్టాలని.. కర్పూరం, ఆయిల్‌ బేస్ట్‌ (గ్రీన్‌ కలర్‌ ట్యాబ్లెట్లు) మందులు వినియోగించరాదని స్పష్టంచేశారు.

ఆవిరి పట్టడం వల్ల కరోనా రాదని, రోజూ ఆవిరి పడితే కరోనా తగ్గిపోతుందని భావించడం సరికాదన్నారు.

నిజానికి ఆవిరి వల్ల కరోనాపై ఎలాంటి ప్రభావం ఉండదని, పైపెచ్చు వేడి ఆవిరి వల్ల మన ముక్కులోని సున్నితమైన మ్యూకస్‌ పొరతోపాటు దానిపై ఉండే సీలియా పాడైపోయి వైరస్‌ త్వరగా లోపలికి వెళ్తుందని తెలిపారు.

అలాగే ఆవిరి పట్టేటప్పుడు నీటిలో పసుపు, కర్పూరం లాంటి పదార్ధాలను కలపడం వల్ల ఆక్సిజన్‌ శాతం పెరుగుతుందన్న అభిప్రాయంలోనూ వాస్తవం లేదన్నారు.

పసుపు, కర్పూరంతో ఆవిరి పట్టడం వల్ల కండ్లు మంట పుట్టడంతోపాటు ఉబ్బసం, ఊపిరితిత్తుల్లో సమస్యలున్నవారికి ఇబ్బందులు మరింత పెరుగుతాయని డాక్టర్‌ ప్రతిభా లక్ష్మి తెలిపారని నమస్తే తెలంగాణ వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)