తెలంగాణ: కోవిడ్ టాస్క్‌ ఫోర్స్ తొలి సమావేశం తరువాత కేటీఆర్ ఏమన్నారు...

కేటీఆర్

ఫొటో సోర్స్, Telangana I&PR

ఫొటో క్యాప్షన్, కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణ కోసం మంత్రి కె. తారకరామారావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ తొలి సమావేశం ఈ రోజు సచివాలయంలో జరిగింది. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సమావేశం అనంతరం మంత్రి కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, హోం ఐసోలేషన్‌లో ఉన్న వారికి ప్రభుత్వం ఇస్తున్న మందుల విషయంలో ఎలాంటి కొరత లేదని, ఇంటింటి సర్వే భారీ స్థాయిలో చేస్తూ అవసరమైన వారికి మెడికల్ కిట్స్ ఇస్తున్నామని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 60 లక్షల ఇళ్ల సర్వే పూర్తి చేసి 2.1 లక్షల కిట్లు ఇచ్చామని కేటీఆర్ తెలిపారు.

కేటీఆర్ ఇంకా ఏమన్నారు...

  • రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులలో బెడ్స్ సంఖ్య భారీగా పెంచాం.
  • రాష్ట్రంలో రెమిడెసివిర్ ఇంజక్షన్లు 1.5 లక్షల దాకా ఉన్నాయి. అదనపు ఇంజక్షన్ల సరఫరాకు ఉత్పత్తి సంస్థలతో మాట్లాడుతున్నాం.
  • అరుదుగా ఉపయోగిస్తున్న టోలిసిజుమాబ్ వంటి ఇతర మందుల సరఫరా మీద కూడా దృష్టి కేంద్రీకరించాం.
  • బ్లాక్ ఫంగస్ విషయంలో కూడా ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. దీనికి కావలసిన మందులను కూడా సమీకరించే ప్రయత్నం చేస్తున్నాం.
  • ఆక్సిజన్ డిమాండ్, సరఫరా వివరాలు తీసుకున్నాం. ఆక్సిజన్ ఆడిట్ కూడా చేస్తాం.
  • కోవిడ్ హెల్ప్ లైన్ నంబర్ రాష్ట్రానికంతటికీ ఒకటే ఉండేలా చూడాలని సూచించాం.
  • రాష్ట్రంలో 45 ఏళ్లకు పైబడిన వారి జనాభా 92 లక్షలు. వీరిలో 38 లక్షల మంది ఇప్పటికే మొదటి డోసు తీసుకున్నారు. మొత్తంగా 10 లక్షల జనాభా పూర్తిగా వ్యాక్సీన్ తీసుకున్నారు.
  • వ్యాక్సీన్ పంపిణీకి చర్యలు ప్రారంభించాం.
  • టాస్క్ ఫోర్స్ సమావేశాలు ఇకపై వరసగా కొనసాగుతాయి. ఒక సమగ్ర కార్యాచరణ దిశగా యంత్రాంగాన్ని నడిపించే ప్రయత్నం చేస్తాయి.
తెలంగాణలో కోవిడ్ కేసులు

ఫొటో సోర్స్, Telangana I&PR

ఫొటో క్యాప్షన్, తెలంగాణలో కోవిడ్ కేసులు

తెలంగాణలో 4,723 కొత్త కేసులు

బుధవారం సాయంత్రం విడుదల చేసిన అధికారిక బులెటిన్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 4,723 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 31 మంది చనిపోయారు. దీంతో మొత్తంగా కోవిడ్ మరణాల సంఖ్య 2,834కు చేరింది.

కొత్తగా 5,695 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తంగా 5,11,711 మంది కోవిడ్ బారిన పడగా, 4,49,744 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.

హర్షవర్ధన్

ఫొటో సోర్స్, Getty Images

తెలంగాణలో కోవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది

కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ బుధవారం వివిధ రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. ప్రగతి భవన్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి హరీశ్ రావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి తెలంగాణలో కోవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోందని అన్నారు.

రాష్ట్రానికి కావలసిన ఆక్సిజన్, ఇతర అత్యవసర మందుల కోటాను పెంచి సత్వరమే అందించాలని హరీశ్ రావు కేంద్ర మంత్రిని కోరారు. తెలంగాణకు కేటాయించిన 450 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కోటాను 600 మెట్రిక్ టన్నులకు పెంచాలని అన్నారు.

అలాగే, తెలంగాణకు పొరుగు రాష్ట్రాల నుంచి కోవిడ్ చికిత్స కోసం వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని, అది దృష్టిలో పెట్టుకుని కేంద్ర సహకారం పెంచాలని చెప్పిన హరీశ్ రావు, "మొదటి డోసు కోసం 96 లక్షల టీకాలు, సెకండ్ డోసు పూర్తి చేయడం కోసం 33 లక్షల టీకాలు, మొత్తం 1.29 లక్షల టీకాల అవసరం తెలంగాణకు ఉందని గుర్తు చేశారు. ఈ నెలాఖరుకల్లా 10 లక్షల కోవిషీల్డ్, 3 లక్షల కోవాగ్జిన్ టీకాలు తెలంగాణకు అత్యవసరం" అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)