భార్యను చంపాడు.. శవంతో సెల్ఫీ తీసుకున్నాడు: ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Ani
ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలో భార్యను చంపిన భర్త, ఆమె శవంతో సెల్ఫీ తీసుకున్నాడని, తర్వాత ఆత్మహత్య నాటకం ఆడాడని సాక్షి దినపత్రిక వార్తా కథనం ప్రచురించింది.
జల్సాలకు అడిగినంత డబ్బు ఇవ్వలేదన్న కారణంతోపాటు.. అనుమానం పెంచుకున్న ఓ శాడిస్టు.. కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా చంపేసిన ఘటన వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు పట్టణం సుందరయ్య కాలనీలో సంచలనం సృష్టించింది.
పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు.. జిల్లాలోని జమ్మలమడుగు పట్టణం వెంకటేశ్వరకాలనీకి చెందిన మంజుల (23)కు నాగరాజు అనే వ్యక్తితో గతంలో వివాహం జరిపించారు.
అయితే మనస్పర్థలతో నెల రోజుల్లోనే వారు విడిపోయారు. అనంతరం మంజుల జీవనోపాధి నిమిత్తం కువైట్‌కు వెళ్లి 8 నెలల క్రితం జమ్మలమడుగులోని పుట్టింటికి వచ్చింది.
ఈ సమయంలో కడపలోన తిలక్‌నగర్‌కు చెందిన దూరపు బంధువు మన్నూరు హరి మంజులను ప్రేమించానని, ఆమెతో వివాహం జరిపించాలని పట్టుబట్టి గతేడాది నవంబర్‌లో వివాహం చేసుకున్నాడు.
కడపలో కాపురముంటూ పెయింటింగ్ పని చేసుకునే హరి... మద్యానికి బానిసవ్వడంతో పాటు అనుమానంతో మంజులను వేధించసాగాడు.
ఇందుకు హరి తల్లి లక్ష్మి కూడా సహకరిస్తుండేది. అనుమానం ఓ వైపు.. డబ్బులు ఇవ్వడం లేదన్న కోపం మరో వైపు.. దీంతో మంజులను ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడని పత్రిక చెప్పింది.
ఈ క్రమంలో మూడు రోజుల క్రితమే కాపురాన్ని బద్వేలులోని సుందరయ్యకాలనీలోకి మార్చాడు.
శుక్రవారం రాత్రి భార్యతో గొడవకు దిగిన హరి శనివారం తెల్లవారుజామున 1 గంట సమయంలో ఆమెను అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి చంపేశాడని రాసింది.
ఆపై తాను కూడా ఎడమవైపు చాతీపై చిన్నపాటి గాయమయ్యేలా పొడుచుకుని ఆత్మహత్య నాటకానికి తెరలేపాడని సాక్షి కథనంలో చెప్పారు.
అంతటితో ఆగక భార్య మృతదేహం పక్కనే పడుకుని సెల్ఫీ తీసుకుని కుటుంబ సభ్యులకు, మిత్రులకు పంపించాడు.
తెల్లవారుజామున విషయం బయటకు పొక్కడంతో పోలీసులు వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
మృతురాలి తల్లి రామలక్షుమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారని పత్రిక వివరించింది.

ఫొటో సోర్స్, Getty Images
యువత మరణాలకు కారణం 'హ్యాపీ హైపోక్సియా'
ఏపీలో కరోనాకు గురైన యువత ఎక్కువగా చనిపోవడానికి కారణం హ్యాపీ హైపోక్సియా అని ఈనాడు దినపత్రిక ఒక వార్తా కథనం ప్రచురించింది.
కరోనా రెండో దశ యువతను ఎక్కువగా బలి తీసుకుంటోంది. స్వల్ప లక్షణాలే ఉండి అప్పటివరకు చూడటానికి ఆరోగ్యంగా, చలాకీగా ఉన్నవారూ ఒక్కసారిగా కుప్పకూలి చనిపోతున్నారు.
వీరిలో ఎక్కువ మంది మరణానికి కారణం 'హ్యాపీ హైపోక్సియా'! వైద్య పరిభాషలో 'సైలెంట్ హైపోక్సియా'గా కూడా పిలిచే ఈ లక్షణం నిజంగానే ఓ సైలెంట్ కిల్లర్.
ఆరోగ్యవంతులైన మనుషుల రక్తంలో ఆక్సిజన్ 95 శాతానికిపైగా ఉండాలి. అది తగ్గే కొద్దీ మెదడుకు అందే ఆక్సిజన్ శాతం తగ్గి క్రమంగా వివిధ అవయవాలపై ప్రభావం కనిపిస్తుంది.
కరోనా సోకిన వారిలో ఊపిరితిత్తులు దెబ్బతింటే రక్తంలో ఆక్సిజన్ శాతం పడిపోతూ ఉంటుంది. అది 90కంటే తగ్గితే శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులేర్పడతాయి. ఆసుపత్రిలో చేరాల్సి ఉంటుంది.
కానీ ప్రస్తుతం కరోనా సోకిన కొందరిలో ఆక్సిజన్ శాతం పడిపోయినా.. శ్వాసలో ఎలాంటి ఇబ్బందులూ ఉండటం లేదు.
వీరిలో కొందరు ఏమాత్రం అలసటకు గురయ్యే పనిచేసినా అకస్మాత్తుగా కుప్పకూలి చనిపోతున్నారు. దీన్నే వైద్య పరిభాషలో హ్యాపీ హైపోక్సియా అంటున్నారు.
కరోనా మొదటి దశలో ఆక్సిజన్ 90 శాతంకంటే కొంచెం తగ్గినా రోగులకు ఈ విషయం తెలియక హ్యాపీగా తిరిగేస్తుంటే హ్యాపీ హైపోక్సియాగా పేర్కొనేవారు.
యువతలో సహజంగా రోగనిరోధకత, శారీరక ధారుఢ్యం ఎక్కువగా ఉంటున్నందున కొందరిలో ఆక్సిజన్ శాతం పడిపోయినా తెలియడం లేదని వైద్యులు వివరిస్తున్నారు. అప్పటికే అంతర్గతంగా చాలా నష్టం జరుగుతోందని చెబుతున్నారని ఈనాడు వివరించింది.

ఫొటో సోర్స్, FB/KISHAN REDDY GANGAPURAM
ఒకరు చనిపోతే, ఇంకొకరికి బెడ్: గాంధీలో పరిస్థితి
గాంధీ ఆస్పత్రిలో దయనీయ పరిస్థితి నెలకొందని ఒకరు చనిపోతేగానీ ఇంకొకరికి బెడ్ దొరికే పరిస్థితి లేదని ఆంధ్రజ్యోతి దినపత్రిక తన వార్తా కథనంలో చెప్పింది.
శుక్రవారం రాత్రి 6 గంటలకు రాచకొండ మల్లయ్య అనే వ్యక్తికి కరోనా సోకి తీవ్ర అస్వస్థతతో గాంధీ ఆస్పత్రిలోని క్యాజువాలిటీ వార్డుకు వచ్చారు.
ఆస్పత్రిలో మంచాలు, ఆక్సిజన్, వెంటిలేటర్ లేదని వైద్యులు చెప్పారు. అనంతరం ఆయన రాత్రి 11 గంటలదాకా ఆస్పత్రి బయట అంబులెన్స్‌లోనే ఉన్నారు.
చివరికి అర్ధరాత్రి 12 గంటలకు ఆరోగ్యశ్రీ వార్డులో అడ్మిట్ అయ్యారు. కొద్దిసేపటికి మూడో అంతస్తులో ఉన్న రోగుల్లో ఒకరు చనిపోతే ఆయన స్థానంలో రాచకొండ మల్లయ్యను వెంటిలేటర్‌పై ఉంచారు.
శనివారం తెల్లవారుజామున 4గంటలకు మల్లయ్యా చనిపోయారు. గాంధీ ఆస్పత్రిలో నెలకొన్న దయనీయ స్థితికి ఈ ఘటనే ఉదాహరణ అని ఆంధ్రజ్యోతి రాసింది.
జిల్లాల నుంచి ఈ పెద్దాస్పత్రికి రోగులు పోటెత్తుతుండటంతో అన్ని వార్డుల్లో బెడ్లు పూర్తిగా నిండిపోయాయి. క్యాజువాలిటీ వద్ద అంబులెన్స్‌లు క్యూ కడుతున్నాయి.
వైద్యుల కోసం రోగుల సహాయకులు చక్కర్లు కొడుతున్నారు. అడ్మిట్ చేసుకోండి సార్లూ అంటూ వైద్యులను రోగుల కుటుంబసభ్యులు, బంధువులు ప్రాధేయపడుతున్నారు.
ఆ వైద్యులేమో చేసేదేమీ లేక చేతులెత్తేస్తున్నారు. ఆస్పత్రిలో వెంటిలేటర్, ఆక్సిజన్ పెట్టిన రోగుల్లో ఎవరైనా చనిపోతేనో, డిశ్చార్జ్ అయితేనో తప్ప బయటివారిని చేర్చుకునే పరిస్థితి లేదు.
ఆస్పత్రిలో ప్రస్తుతం 1092రోగులు ఉన్నారు. వీరిలో 650 మంది వెంటిలేటర్ మీద 442 మంది ఆక్సిజన్ పడకల మీద ఉన్నారని ఆస్పత్ర కరోనా నోడల్ ఆఫీసర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి చెప్పారు.
కాగా సాయంత్రం ఐదు గంటల తర్వాత గాంధీ ఆస్పత్రికి రావొద్దని వైద్యులు చెబుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల్లోపు వస్తే అడ్మిషన్ విషయంలో కొంత మేలు జరుగుతుందని పేర్కొన్నట్లు ఆంధ్రజ్యోతి వివరించింది.

ఫొటో సోర్స్, Getty Images
పాజిటివ్ రిపోర్ట్ లేకున్నా ఆస్పత్రిలో అడ్మిషన్
కరోనా పాజిటివ్ రిపోర్ట్ లేకున్నా ఆస్పత్రిలో ఆడ్మిట్ చేసుకోవాలని కేంద్రం చెప్పినట్లు వెలుగు దినపత్రిక ఒక వార్తా కథనం ప్రచురించింది.
కరోనా రోగులు ఆస్పత్రుల్లో చేరేందుకు కరోనా పాజిటివ్ రిపోర్టు తప్పనిసరి కాదని, లక్షణాలుంటే చేర్చుకొని చికిత్స ఇవ్వాలని కేంద్రం చెప్పింది.
ఏ రాష్ట్రంలోనైనా ఇతర ప్రాంతాల రోగులకూ ఆక్సిజన్, మందులివ్వాలని పేర్కొంది. వేరే నగరం నుంచి వచ్చిన బాధితులు సరైన ఐడెంటిటీ కార్డు చూపించలేదని ఆస్పత్రుల్లో చేర్చుకోకుండా నిరాకరించొద్దు.
గుర్తింపు కార్డు లేకున్నా వేరే ప్రాంతాల వారిని చేర్చుకోవాలి. అన్ని ఆస్పత్రులు డిశ్చార్జ్ పాలసీని పాటించాలి.
రోగుల ఆరోగ్య పరిస్థితి ఆధారంగా ఆస్పత్రుల్లో చేర్చుకోవాలి. అంతగా హాస్పిటల్ అవసరం లేనివారిని డిశ్చార్జ్ చేయాలని కేంద్రం ఆదేశించినట్లు వెలుగు పత్రిక వివరించింది.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్ కరోనావైరస్ వేరియంట్ 1000 రెట్లు స్పీడా... అందుకే ఏపీ ప్రజలంటే ఇతర రాష్ట్రాలు భయపడుతున్నాయా
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- సైనోఫార్మ్: చైనా వ్యాక్సీన్ ఎమర్జెన్సీ వినియోగానికి డబ్ల్యూహెచ్‌వో ఆమోదం.. ఇప్పటికే కోట్ల మందికి పంపిణీ
- కరోనా వైరస్: పిల్లల్లో సులభంగా, వేగంగా వ్యాప్తి చెందుతున్న కొత్త వేరియంట్
- మహిళలు మితిమీరి వ్యాయామం చేస్తే సంతానోత్పత్తి సమస్యలు తప్పవా?
- కరోనావైరస్: జంతువుల నుంచి మనుషులకు సోకింది ఇలాగేనా? శాస్త్రవేత్తల ‘డిటెక్టివ్ కథ’
- కుంభమేళాను మీడియా ఎలా చూపిస్తోంది... తబ్లీగీ జమాత్ విషయంలో ఏం చేసింది?
- వాంతులు ఎందుకు వస్తాయి... ప్రయాణాల్లో కడుపు తిప్పినట్లు ఎందుకవుతుంది?
- కరోనా వైరస్ సర్వే: మన శరీరంలో యాంటీబాడీస్ ఉంటే వైరస్ మళ్లీ సోకదా?
- లవ్ జిహాద్: మతాంతర ప్రేమను భయపెడుతున్న భారత చట్టం
- టైటానిక్: ఆనాటి ప్రమాదం నుంచి తప్పించుకున్న ఆ ఆరుగురు చైనీయులు ఏమయ్యారు... జాతి వివక్ష వారిని వెంటాడిందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








