నటుడు వివేక్ మృతి, ఆయన వయసు 59 ఏళ్లు

వివేక్

ఫొటో సోర్స్, VIVEK/TWITTER

తమిళ హాస్య నటుడు వివేక్ శనివారం ఉదయం చెన్నైలోని ఆస్పత్రిలో గుండెపోటుతో మృతి చెందారు. ఆయన వయసు 59 ఏళ్లు.

అయిదువందలకు పైగా చిత్రాల్లో నటించిన వివేక్ తమిళ ప్రేక్షకులకే కాదు, తెలుగువారికీ సుపరిచితుడే. శుక్రవారం ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. స్పృహ కోల్పోయిన వివేక్‌ను కుటుంబ సభ్యులు వెంటనే సిమ్స్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడే ఆయనకు చికిత్స జరిగింది.

వివేక్ భౌతిక కాయాన్ని విరుగంబాకంలోని ఆయన నివాసానికి తరలించారు.

" నటుడు వివేక్‌ను ఆయన కుటుంబ సభ్యులు నిన్న ఉదయం 11 గంటలకు ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ విభాగంలో చేర్పించారు. ఆయన స్పృహ కోల్పోయి ఉన్నారు. అప్పటికే ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండింది" అని సిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ విజయకుమార్ సోకన్ చెప్పారు.

వివేక్

ఫొటో సోర్స్, Vivek/Twitter

ఫొటో క్యాప్షన్, కమెడియన్ వివేక్

వ్యాక్సీన్ తీసుకున్న మరునాడే...

వివేక్ గురువారం నాడు చెన్నైలోని గవర్నమెంట్ హై స్పెషాలిటీ హాస్పిటల్‌లో కరోనా వ్యాక్సీన్ తీసుకున్నారు.

ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, "కరోనా వ్యాక్సీన్ విషయంలో కొంతమందికి భయాలున్నాయి. అలాంటి భయాలు ఏమీ అక్కర్లేదని చెప్పడానికే నేను ప్రభుత్వ ఆస్పత్రిలో టీకీ వేయించుకున్నాను" అని మీడియాతో అన్నారు.

వ్యాక్సీన్ ఇచ్చినందుకు ఆయన ఆరోగ్య శాఖ కార్యదర్శి జె. రాధాకృష్ణన్, హాస్పిటల్ డీన్ జయంతి, మరో ఇద్దరు డాక్టర్లకు ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ కూడా చేశారు.

టీకా తీసుకున్న మరునాడు ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. అయితే, ఆయనకు గుండెపోటు రావడానికి, వ్యాక్సీన్‌కు ఎలాంటి సంబంధం లేదని సిమ్స్ ఒక ప్రకటనలో తెలిపింది.

వివేక్

ఫొటో సోర్స్, Twitter

వివేక్ సినీ జీవితం

(బీబీసీ తమిళ్ ప్రతినిధి ప్రమీలా కృష్ణన్ అందించిన సమాచారం)

కోవిళ్‌పట్టిలో పుట్టిన వివేక్ సినిమాల్లో నటించాలనే కోరికతో చెన్నైకి వచ్చారు. 1980 నుంచి ఒక వైపు చదువుకుంటూ నాటకాలు వేశారు. ప్రముఖ దర్శకుడు బాలచందర్ 1987లో 'మనదిళ్ ఉరుది వేండం' చిత్రం ద్వారా వివేక్‌ను సినిమా రంగానికి పరిచయం చేసారు.

ఆ తరువాత వివేక్ మళ్లీ వెనుతిరిగి చూసుకోలేదు. హాస్య నటుడిగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. మొదట్లో కేవలం హాస్య నటుడిగా కనిపించిన వివేక్, 1990ల నుంచి హీరోల పక్కన స్నేహితుడి పాత్రల్లో కనిపించడం ప్రారంభించారు.

హాస్యం ద్వారా సామాజిక చైతన్యం పెంచవచ్చని వివేక్ అనేవారు. మూఢ నమ్మకాలు, జనాభా పెరుగుదల, అవినీతి, ఆడ శిశువుల హత్యలు, నగరాల్లో మురికివాడల ప్రజల కష్టాల గురించి ఆయన నవ్విస్తూనే సెటైర్లు వేసేవారు.

బాయ్స్, అపరిచితుడు, శివాజీ, సింగం వంటి చిత్రాలతో ఆయన తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యారు. ఆయన నాలుగు సార్లు తమిళనాడు ప్రభుత్వం నుంచి ఉత్తమ హాస్య నటుడు అవార్డులు అందుకున్నారు.

2009లో ఆయన పద్మశ్రీ పురస్కారాన్ని స్వీకరించారు. త్వరలో కమలహాసన్ తీస్తున్న 'ఇండియన్ 2' చిత్రంలో నటిస్తున్నానని వివేక్ ఇటీవలే ప్రకటించారు.

సినిమా హాస్యంపై చెరగని ముద్ర వేసిన వివేక్ మృతి పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. వారి కటుంబ సభ్యులకు సంతాప సందేశాలు పంపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)