విశాఖ: అనాథ శవాన్ని మూడు కిలోమీటర్లు మోసుకెళ్లిన రాంబిల్లి ఎస్‌ఐ

అనాథ శవంతో పోలీసులు

ఫొటో సోర్స్, Rambilli PS, Visakhapatnam

ఫొటో క్యాప్షన్, అనాథ శవాన్ని మోసుకెళ్తున్న పోలీసులు
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

అనాథ శవాన్ని మూడు కిలోమీటర్లు మోసి మానవత్వం చాటుకున్నారు ఏపీ పోలీసులు.

విశాఖ జిల్లా రాంబిల్లి మండలంలోని సీతపాలెం సముద్ర తీరానికి గురువారం నాడు గుర్తు తెలియని మృతదేహం కొట్టుకొచ్చింది.

దీన్ని గుర్తించిన రాంబిల్లి రెవిన్యూ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.

దీంతో రాంబిల్లి ఎస్‌ఐ అరుణ్ కిరణ్ తన సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు.

డెడ్‌ బాడీ గురించి చుట్టు పక్కల గ్రామాల్లో ఆరా తీశారు.

శవాన్ని గుర్తించాలని చుట్టుపక్కల గ్రామాలకు సమాచారం ఇచ్చారు.

అనాథ శవంతో పోలీసులు

ఫొటో సోర్స్, Rambilli PS, Visakhapatnam

కానీ, మృతదేహాన్ని ఎవరూ గుర్తించలేకపోయారు.

దీంతో పోలీసులు దీన్ని అనాథ శవంగా భావించారు.

పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించాలని అనుకున్నారు.

ఎస్ఐ

ఫొటో సోర్స్, Rambilli PS, Visakhapatnam

స్థానికులను, మత్స్యకారులను సాయం అడిగారు.

కానీ సాయం చేయడానికి స్థానికులెవరూ ముందుకు రాలేదని, దాంతో మృతదేహాన్ని ఒక చాపలో చుట్టి తామే మోసుకుంటూ తీసుకెళ్లామని ఎస్ఐ అరుణ్ కిరణ్ బీబీసీతో చెప్పారు.

"చనిపోయి సుమారు మూడు రోజులు కావడంతో మృతదేహం కుళ్లిపోయి దాని నుంచి దుర్వాసన వస్తోంది. దాంతో బాడీని తీసుకెళ్లడానికి స్థానికులు సహకరించలేదు. అందుకే తామే అనాథ శవాన్ని మోసుకుంటూ తీసుకెళ్లాం" అని ఎస్సై అరుణ్ కిరణ్ బీబీసీకి చెప్పారు.

ఎస్‌ఐ అరుణ్ కిరణ్‌తో పాటు ఏఎస్ఐ దొర, హెడ్ కానిస్టేబుల్ మసేను, కానిస్టేబుల్ నర్సింగరావు, హోంగార్డ్ కొండబాబులు దాదాపు మూడు కిలోమీటర్ల దూరం శవాన్ని మోసుకుంటూ తీసుకెళ్లి ఎలమంచిలిలో ఉన్న ఆస్పత్రికి తరలించారు.

అనాథ మృతదేహానికి సాయం చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఎస్ఐ అరుణ్ కిరణ్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)