మహారాష్ట్ర: గర్ల్స్ హాస్టల్లో అమ్మాయిల బట్టలు విప్పించి, డాన్స్ చేయించారనే ఆరోపణలు... ఏం జరిగింది?

జలగావ్ హాస్టల్

మహారాష్ట్ర, జలగావ్‌లోని ఒక ప్రభుత్వ గర్ల్స్ హాస్టల్లో అమ్మాయిలను బట్టలు విప్పించి మగవాళ్ల ముందు డాన్స్ చేసేలా బలవంతం చేశారని కొందరు సామాజిక కార్యకర్తలు ఆరోపించారు.

ఈ ఘటన గురించి సామాజిక కార్యకర్త ఫిరోజ్ పింజారీ బీబీసీతో మాట్లాడారు.

"మేం వేరే పనిమీద హాస్టల్‌కు వెళ్లాం. కానీ, అక్కడకు వెళ్లాక మాకీ విషయం తెలిసింది. బట్టల్లేకుండా డాన్స్ చేసేలా తమను బలవంతం చేశారని ఆ అమ్మాయిలు మాకు చెప్పారు. ఆ హాస్టల్‌లోకి వెళ్లడానికి అనుమతి ఇవ్వలేదు. కానీ మేం దూరం నుంచే వీడియో తీసి కలెక్టర్‌కు అప్పగించాం" అన్నారు.

జలగావ్ కలెక్టర్ అభిజిత్ రావుత్ ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు. అమ్మాయిలతో బట్టలు విప్పించి డాన్స్ చేస్తున్నారని ఏ వీడియోలో ఆరోపించారో, అది ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ వైరల్ వీడియో క్లిప్ బీబీసీ దగ్గర కూడా ఉంది.

ఈ వీడియోలో ఒక అమ్మాయి మెట్ల దగ్గర కిటికీలో నుంచి సామాజిక కార్యకర్తతో మాట్లాడుతూ కనిపిస్తుంది. కార్యకర్తతో "నా ముఖం చూపించకండి" అంటుంటారు. తర్వాత కార్యకర్త ఆమెతో "చూపించం, మీరు చెప్పండి, మీ సమస్యను మేం కలెక్టర్ దగ్గరకు తీసుకెళ్తాం" అంటుంటారు.

జలగావ్ హాస్టల్

హాస్టల్ నిర్వహణపై విమర్శలు

ఈ వీడియోలో బాలిక ముఖం కనిపించదు. కానీ, ఆమె మాటలు వినిపిస్తుంటాయి. "మమ్మల్ని దాదాపు బట్టలు లేకుండా డాన్స్ చేయాలని బలవంతం చేస్తున్నారు. మాకు ఎలాంటి తిండి పెడుతున్నారంటే, అది కూడా చెప్పుకోలేం. ప్రభుత్వం నుంచి సరుకులు తీసుకుంటున్నా, మాకు సరైన ఆహారం పెట్టడం లేదు. అమ్మయిల నుంచి డబ్బులు తీసుకుంటున్న వీళ్లు(హాస్టల్ నిర్వాహకులు) వాళ్ల బాయ్‌ఫ్రెండ్స్‌ను పిలిపిస్తుంటారు" అని ఆమె ఆరోపించారు.

ఈ వీడియోలో ఆ అమ్మాయి హాస్టల్ నిర్వహణ గురించి విమర్శలు గుప్పించారు.

మరోవైపు బాలికల నుంచి విమర్శలు రావడంపై ఈ మహిళా హాస్టల్ అధికారి రంజనా జోపే మీడియాతో మాట్లాడారు.

"హాస్టల్లో ఎలాంటి తప్పుడు పనులు జరగడం లేదు. వీడియోలో వైరల్ అయిన ఆ అమ్మాయి మానసిక స్థితి సరిగా లేదు. ఆమె ఇక్కడ గర్భవతులుగా ఉన్న అమ్మాయిలను కొట్టింది కూడా" అన్నారు.

వీడియో రికార్డింగ్ బయటికి రావడంతో సామాజిక కార్యకర్తలు హాస్టల్‌కు రావడానికి తాము అనుమతించలేదని కూడా రంజనా జోపే చెప్పారు.

"మాకు ఈ సమాచారం అందగానే హాస్టల్‌కు వెళ్లాం. ఆ అమ్మాయితో మాట్లాడాం. ఆమె భద్రతకు ఎలాంటి ప్రమాదం లేదు. కలెక్టర్ ఈ ఘటనపై దర్యాప్తు కమిటీని వేశారు" అని జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి విజయ్ సింగ్ పరదేశీ అన్నారు.

జలగావ్ హాస్టల్

ఫొటో సోర్స్, GOPAL SHOONYA/BBC

కలెక్టర్‌కు ఫిర్యాదు

జలగావ్ సామాజిక కార్యకర్త ఫరీద్ ఖాన్ ఈ ఘటనపై బీబీసీతో మాట్లాడారు.

"మంగళవారం సాయంత్రం మేం దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం. మేం ఆ హాస్టల్‌కు వెళ్లి, బయటకు వస్తున్నప్పుడు బాలిక మమ్మల్ని పిలిచి తన బాధలు చెప్పుకుంది. చాలా మంది అమ్మాయిల బాయ్‌ఫ్రెండ్స్ రాత్రిళ్లు ఆ హాస్టల్లోనే ఉంటారని కూడా ఆమె చెప్పింది. మేం దీనిపై వీలైనంత త్వరగా దర్యాప్తు చేయాలని కోరుతున్నాం" అన్నారు.

జలగావ్‌క చెందిన మంగళా సోన్‌వాలే అనే మరో సామాజిక కార్యకర్త హాస్టల్లో ఉన్న అమ్మాయి మానసిక స్థితి సరిగా లేదనడాన్ని ప్రశ్నించారు.

"ఒక అమ్మాయి మానసిక స్థితి సరిగా ఉండకపోవచ్చు. కానీ, అక్కడ మిగతా బాలికల పరిస్థితి ఎలా ఉంది. హాస్టల్ సెకండ్ ఫ్లోర్ నుంచి ఆమె ఒక్కరే మాట్లాడలేదు, తనతోపాటూ మిగతా బాలికలు కూడా అదే ఫిర్యాదు చేశారు" అన్నారు.

ఈ వీడియో వైరల్ కావడంతో ఈ ఘటనపై చాల మంది స్పందిస్తున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో కూడా దీనిపై జోరుగా చర్చ నడిచింది.

విపక్ష నేత దేవేంద్ర ఫడణవీస్ అసెంబ్లీలో ఈ ఘటనపై మాట్లాడారు.

"ఈ ఘటన గురించి సమాచారం అందింది. తర్వాత, వీడియో కూడా బయటికొచ్చింది. ఈ కేసులో పోలీసులు అమ్మాయిలను బట్టల్లేకుండా డాన్స్ చేసేలా బలవంతం చేస్తున్నారు. మనం ఈ మొత్తం అంశంలో సున్నితత్వాన్ని చూడాల్సిన అవసరం ఉంది. ఈ కేసులో నిందితులను వీలైనంత త్వరగా అరెస్ట్ చేయాలి" అన్నారు.

ఇదే అంశంపై రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి యశోమతి ఠాకూర్ కూడా మాట్లాడారు.

"జలగావ్ ఘటనను అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు. అది చాలా తీవ్రమైన విషయం. హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ సభలో దీనిపై దర్యాప్తుకు ఆదేశించారు. నేను కూడా స్వయంగా దీనిపై దృష్టి పెడుతున్నా. ఆరోపణలు నిజమని తేలితే, దోషులపై కఠిన చర్యల తీసుకుంటాం. ఎవరినీ వదలం. విచారణ పూర్తిగా నిష్పక్షపాతంగా జరుగుతుంది" అన్నారు.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)