అత్యాచార బాధితులను కలిసిన రిపోర్టర్ అనుభవాలు

ఫొటో సోర్స్, iStock
- రచయిత, ప్రియాంకా దూబే
- హోదా, బీబీసీ ప్రతినిధి
మీనా, సింధు, జ్యోతి, లావణ్య... వీళ్లంతా అప్పుడప్పుడూ నా కలలోకి వస్తుంటారు. రోడ్డు మీద వెళ్తుంటే కవిత, నీతూ, ప్రతిమా చెట్ల మధ్యలో నుంచి నన్ను తొంగి చూస్తున్నట్లు అనిపిస్తుంది. మా కాలనీ పార్కులో ఎవరైనా పిల్లలు ఆడుకోవడం కనిపిస్తే పింకీ, రితిక, సంగీత లాంటి పిల్లల అరుపులే నా చెవిలో వినిపిస్తాయి.
వీళ్లంతా గత ఎనిమిదేళ్లలో నా రిపోర్టింగ్ కెరీర్‌లో నేను కలిసిన మహిళలు, పిల్లలు. ఇక్కడ ఇచ్చినవి వాళ్ల అసలు పేర్లు కాదు. ఎందుకంటే, వాళ్లలో చాలామంది లైంగిక వేధింపుల బాధితులు. ఇంకొందరు బాధితుల దగ్గరి బంధువులు. వీళ్లతో పాటు మరెంతో మంది మహిళలు తమ జీవితంలో ఎదుర్కొన్న లైంగిక వేధింపులకు సంబంధించిన చేదు అనుభవాలను నాతో పంచుకున్నారు.
అలాంటి వాళ్లలో కొందరి అనుభవాలను నేను ఇటీవల రాసిన ‘నో నేషన్ ఫర్ విమెన్’ పుస్తకంలో పొందుపరిచాను. ఆ పుస్తకంలో మొత్తం 13 అధ్యాయాలున్నాయి. ఇన్నేళ్లుగా భారత్‌లో పెరుగుతున్న లైంగిక హింసను రిపోర్ట్ చేసిన నేను, ఇప్పటికీ ఆ అనుభవాలను కళ్లముందు నుంచి దూరం చేసుకోలేకపోతున్నాను. వాటినే ఆ పుస్తకంలో కళ్లకు కట్టాను.

ఏ రిపోర్టర్ అయినా సరే, ఒక కథనం చేసి అందులోని పాత్రలను, వారి కథలను అంత సులువుగా మరచిపోగలరా అన్నది నా సందేహం. ఎందుకంటే అవి మామూలు కథలు కాదు. ఉదాహరణకు... నాకు ఇప్పటికీ బుందేల్‌ఖండ్‌లోని ఒక కుగ్రామంలో కలిసిన ఫుల్ బాయి ముఖం బాగా గుర్తు. పద్నాలుగేళ్ల ఆమె కూతురుపై అత్యాచార యత్నం చేశాక, ఆ అమ్మాయిని తగలబెట్టేశారు. నాకు ఫుల్‌బాయి మాట్లాడిన బుందేలీ భాష అర్థం కాలేదు. కానీ మా కళ్లు మాట్లాడుకున్నాయి. ఆమె కళ్లలోని బాధ చాలా స్పష్టంగా కనిపించింది.
ఉన్నట్టుండీ ఫుల్‌బాయి ఇంట్లో దాచిన ఓ ఇత్తడి పళ్లెం తీసుకొచ్చింది. ‘నేను దీన్ని నా కూతురి పెళ్లి కోసం చాలా కష్టపడి కొన్నాను. కానీ, నా మోడీ(కూతురు)ని వాళ్లు తగలబెట్టేశారు. అత్యాచారం చేసి నిలువునా కాల్చేశారు’ అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఏడేళ్లు గడిచినా ఇంకా ఆ ఏడుపు నా చెవిలో మార్మోగుతోంది.
పశ్చిమ బెంగాల్‌లోని మరో దుర్ఘటన అది. ఒక అమ్మాయిపై అత్యాచారం చేసి ఆమెను ఉల్లిపాయ కోసినట్టు ముక్కలుముక్కలుగా కోసి ఓ కాలువలో పడేశారు. ఆమె తల్లి బాధ ఇంకా నా కళ్లలో మెదుల్తోంది.
ఉత్తర ప్రదేశ్‌లో మరో మైనర్ బాలికను అక్కడి ఇన్‌స్పెక్టరే తీసుకెళ్లాడు. ఆమెను రేప్ చేసి పోలీసు వాహనంలోనే ఆమె ఇంటి ముందు వదిలారు. ఆ ఘటన జరిగిన పది రోజులకు ఆ అమ్మాయి తండ్రి చనిపోయాడు. అది తలచుకుంటే నా ముఖం కోపంతో ఎరుపెక్కుతుంది.
త్రిపురలో ఘటన గుర్తొస్తే ఇప్పటికీ నాకు నిద్ర పట్టదు. ఒక యువతి ధైర్యం కూడదీసుకొని మారుమూల గిరిజన పల్లెలో స్థానిక పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమైంది. కానీ ఎన్నికలకు ముందు రోజు ఆమెను దారుణంగా రేప్ చేసి చంపేశారు. ఇలాంటివాళ్ల తల్లులందరి ఏడుపులు నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఈ బాధిత కుటుంబాలన్నీ చాలా ఏళ్లుగా వివిధ న్యాయస్థానాల్లో న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నాయి. కేసు వెనక్కు తీసుకోవాలనే బెదిరింపులు, రాజీకి రావాలనే ఒత్తిడి, సామాజిక బహిష్కరణ లాంటి ఎన్నో సమస్యలను వీళ్లు ఎదుర్కొంటున్నారు.
ఒక పక్క మనసును చివుక్కుమనిపించే వీరందరి కథలు నేనొక హారర్ కథనాల రిపోర్టర్‌ననే భావనను కలిగిస్తుంటే, వాళ్లు చేస్తున్న పోరాటం నాకు కొత్త ఉత్సాహాన్నిస్తోంది.
నాలాంటి ఓ చిన్న టౌన్ నుంచి వచ్చే మహిళా జర్నలిస్టులు తొలిసారి ఇలాంటి కథనాలను కవర్ చేయడానికి వెళ్లినప్పుడు వందల ఏళ్లుగా విస్తరించిన ఈ భూస్వామ్య వ్యవస్థను చూసి భావోద్వేగానికి లోనవుతుంటారు.
‘తన పని మిగిల్చే సమ్మోహన శక్తి నుంచి బయటపడగలిగే వ్యక్తే మంచి రిపోర్టర్’ అని ‘రాత్ కా రిపోర్టర్’ అనే పుస్తకంలో నిర్మల్ వర్మ అన్నారు. కానీ, ఆ పని మిగిల్చే యాతన గురించి మాత్రం ఆయన మాట్లాడలేదు.
ఆ యాతనను ఏ రిపోర్టర్ కూడా అంత సులువుగా బయటపెట్టలేరు. ఆ కథనాలు మిగిల్చిన కరుణ, పశ్చాత్తాపం, మానవతా వెలుగులు మాత్రం నన్నెప్పటికీ వదిలి వెళ్లవు.
ఇవి కూడా చదవండి
- బ్రెగ్జిట్: యురోపియన్ యూనియన్‌కు ‘విడాకులిస్తున్న’ బ్రిటన్... ఎందుకు? ఏమిటి? ఎలా?
- సెక్స్‌పై ఆసక్తి లేదా.. అది వ్యాధి లక్షణమా..
- నీళ్ళ లోపల చూడగలరు, చలికి వణకరు, ఎత్తులంటే ఏమాత్రం భయపడరు...
- ‘గాంధీ మహాత్ముడు కాదు, ఆయనకు ఆ అర్హత లేదు’: బీబీసీ ఇంటర్వ్యూలో బీఆర్ అంబేడ్కర్
- ఆన్లైన్లో అమ్మాయిలు.. ఈ ఒంటరితనానికి పరిష్కారమేంటి
- ఒక భార్య, ఇద్దరు భర్తలు... ఆమె జీవితమే ఒక సినిమా
- రోడ్డు వేసుకున్నారు... రాత మార్చుకున్నారు
- ఈజిప్ట్ సమాధిలో హిందూ దేవతల విగ్రహాలు దొరికాయా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








