మాళవిక బన్సోద్: క్రీడలు, చదువు... రెండింటిలో దేన్నీ వదులుకోలేదు - BBC ISWOTY

మాళవిక

ఫొటో సోర్స్, ANIRBAN SEN

మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

చాలా మంది క్రీడలపై ఆసక్తి ఉన్నా, కుటుంబం నుంచి సరైన ప్రోత్సాహం లేక వాటిని వదిలేస్తారు. కానీ, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి మాళవిక బన్సోద్ పరిస్థితి మాత్రం ప్రత్యేకం.

ఆమె తల్లి, తండ్రి ఇద్దరూ దంత వైద్యులు. కూతురు క్రీడల్లో రాణించేందుకు తోడ్పడాలన్న ఉద్దేశంతో మాళవిక తల్లి ఏకంగా స్పోర్ట్స్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు.

మాళవికది మహారాష్ట్రలోని నాగ్‌పుర్. బాల్యం నుంచే ఆమెకు క్రీడలపై ఆసక్తి.

ఫిట్‌నెస్, మంచి ఎదుగుదల కోసం ఏదో ఒక క్రీడపై ప్రధానంగా దృష్టి పెట్టాలని మాళవికకు ఆమె తల్లిదండ్రులు సూచించారు. ఆమె బ్యాడ్మింటన్‌ను ఎంచుకున్నారు.

తల్లిదండ్రులు ఇద్దరూ ఆమెకు అండగా నిలిచారు. ఆమెకు అవసరమైన మౌలిక వసతులు కల్పించారు. అవసరమైన మానసిక సహకారం కూడా అందించారు.

క్రీడలు, చదువు... ఏ రెండింటిలో ఒకదాని కోసం మరొకదాన్ని త్యాగం చేసుకోవడం మాళవికకు ఇష్టం లేదు. దీంతో ఆమె బాగా కష్టపడాల్సి వచ్చింది.

పది, పన్నెండో తరగతిలో మాళవిక 90 శాతానికిపైగా మార్కులతో ఉత్తీర్ణురాలయ్యారు. మరోవైపు పరీక్షలు జరుగుతున్న సమయంలోనే ఆమె ఏడు అంతర్జాతీయ పతకాలు గెలిచారు.

మాళవిక

కుటుంబ ప్రోత్సాహం బాగా ఉన్నా, మాళవికకు సవాళ్లు తప్పలేదు.

ప్రాక్టీస్ చేసేందుకు ఆమెకు అందుబాటులో సింథటిక్ కోర్టులు లేవు. ఉన్నవాటిలో సరైన వెలుతురు ఉండేది కాదు.

కోచ్ వద్ద శిక్షణ తీసుకునేవారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో, ఆమెకు అవసరమైనంత శ్రద్ధ తీసుకుని నేర్పించేవారు దొరకలేదు.

మాళవిక సబ్‌జూనియర్, జూనియర్ స్థాయి పోటీల్లో ఆడుతున్నప్పుడు అంతర్జాతీయ ప్రయాణాలు ఖరీదైన వ్యవహారమన్న విషయం ఆమె తల్లిదండ్రులకు అర్థమైంది. ఆమెకు స్పాన్సర్‌ను వెతకడం చాలా కష్టమైంది.

మాళవిక

అండర్-13, అండర్-17 వయసు విభాగాల్లో రాష్ట్ర స్థాయిలో మాళవిక టైటిల్స్ సాధించారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పోటీల్లో మూడు బంగారు పతకాలు గెలిచారు. జాతీయ స్థాయి జూనియర్, సీనియర్ టోర్నీల్లో తొమ్మిది బంగారు పతకాలు సాధించారు.

2019లో మాల్దీవ్స్ ఇంటర్నేషనల్ ఫ్యూచర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీతో మాళవిక సీనియర్ స్థాయిలో అంతర్జాతీయ అరంగేట్రం చేశారు.

అక్కడ విజయం సాధించిన ఆమె ఆ తర్వాత వారానికే నేపాల్‌లో జరిగిన అన్నపూర్ణ పోస్ట్ ఇంటర్నేషనల్ సిరీస్‌లోనూ గెలిచారు.

అంతకుముందు జూనియర్, యూత్ స్థాయిల్లోనూ మాళవిక విజయాలు అందుకున్నారు.

ఏసియన్ స్కూల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్, సౌత్ ఏసియన్ అండర్-21 రీజనల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌ టోర్నీల్లో బంగారు పతకాలు గెలిచారు.

మాళవిక ప్రతిభను భారత ప్రభుత్వంతోపాటు వివిధ క్రీడా సంస్థలు కూడా గుర్తించాయి.

నాగ్ భూషణ్, ఖేలో ఇండియా టాలెంట్ డెవెలప్‌మెంట్ అథ్లెట్ రికగ్నిషన్, టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్) అథ్లెట్ లాంటి పురస్కారాలు, అవకాశాలు కూడా ఆమె అందుకున్నారు.

క్రీడలను విద్యావ్యవస్థతో అనుసంధానం చేయాల్సిన అవసరం చాలా ఉందని మాళవిక స్వానుభవంతో చెబుతున్నారు.

‘‘దేశానికి పతకాలు తేవాలనుకుంటున్న క్రీడాకారిణులు చదువుపరంగా నష్టపోకుండా విద్యావ్యవస్థలో తగిన మార్పులు అవసరం. చదువు, క్రీడల్లో ఏదో ఒకటే ఎంచుకోవాల్సిన పరిస్థితి ఉండకూడదు’’ అని ఆమె అంటున్నారు.

(మాళవిక బన్సోద్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూ ఈ కథనానికి ఆధారం)

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)